ఆ ఆకాశం నీ ఉనికి  కదూ!!

న్మత్త కెరటమొకటి

ఒడ్డు మీంచి నన్ను

సముద్రంలోకి లాక్కెళ్ళింది,

ఊపిరాడలేదు,

ముంచి, తేల్చి

నలిపి, ప్రాణాల్ని కుదిపి

ఒక్క విసురుతో ఒడ్డున పడేసింది

నీరు నీ  జ్ఞాపకమా !!

 

తేరుకున్నానో లేదో సుడిగాలి

చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసి

ఎక్కడో విసిరేసి వెళ్ళింది

ఈ గాలి నీ స్మరణ కదూ !!

 

ఉన్నచోట ఉన్నట్టుగా

నిట్టనిలువున లోలోపలే

ఉవ్వెత్తున ఎగిసిపడుతూ

వేదనొకటి దహిస్తోంది చూడు

ఈ అగ్ని నీ ఆనవాలు కదూ !!

 

నా చుట్టూ నిండుగా పరుచుకొని

నన్ను ఆవరించుకొని కూడా

ఎన్నడూ అంటక, ఎంతకీ అందక

నా దుఃఖాన్ని హెచ్చవేస్తున్న

ఆ ఆకాశం నీ ఉనికి  కదూ !!

 

ఎప్పుడెప్పుడు ఈ నేల

భళ్ళున తెరుచుకుని

‘నన్ను దాచుకుంటుందా’ అని

ఎదురుచూస్తున్నానురా,

ఇంతకీ నేను నిల్చున్న

ఈ భూమి నీ హృదయమే కదూ !!

*

 

 అతడి కథ 

 

ఆమె కంటికి కనిపించనంత

 

పిలుపు  వినిపించనంత

ఉత్తరాలకు ఆచూకీ తెలీనంత

 

అంతంటే..

అంత దూరం వచ్చేశాడు

 

తనని చుట్టుముట్టిన ఆమె జ్ఞాపకాలను విసిరేశాడు

 

అతని హృదయంపై ఆమె రాసుకున్న

ఆశల అక్షరాలన్నీ చెరిపేశాడు

 

ఆమెని తెలిసినవారు తనకసలే  తెలియనట్టు

మొహం చాటేశాడు

 

చివరికి ఆమె పిలిచే తన పేరు మార్చుకున్నాడు  !!

 

ఇంకా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని

తడిమి తడిమి చూసుకొని తుడిచేశాడు

 

నిజానికి,

సరిగ్గా చెరిపానా లేదా అనుకుంటూ

యేళ్ళ తరబడి ఆమెని తనలో

మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా దిద్దుకుంటున్నాడు !!

 

ఆమె వాకిట్లో తన గుండెని

పోగొట్టుకున్నానని తెలుసుకోలేక,

గతకాలపు నీడల చెర నుంచి విడివడి రాలేక

‘అతడు’  ఇంకెన్నాళ్లు నలిగిపోతాడో మరి !!

*

చిత్రం: సత్యా బిరుదరాజు 

రేఖా జ్యోతి

రేఖా జ్యోతి

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సరిగ్గా చెరిపానా లేదా అనుకుంటూ

    యేళ్ళ తరబడి ఆమెని తనలో

    మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా దిద్దుకుంటున్నాడు…
    కదా.

  • పాంచభౌతిక మైన అస్థిత్వానికీ,హృదయగతమైన ప్రేమకీ లింకులా ఉన్నాయి రెండూను!

  • చాలా బాగున్నాయండి. పంచభూతాల సాక్షిగా ప్రేమోన్మత్తత ఆవరించడం, దూరం పారిపోతున్నా అనుకుంటూ అనుక్షణం తన తలపుల్లో, తీసివేతల్లో ఆమెనే చూసుకోడం. సుపర్బ్.

  • మొదటి కవిత చాలాసార్లు చదివానండీ, చాలా తీవ్రత ఉంది. రెండోది అలలు లేని నది లాగా ప్లైన్ పెయిన్. చదువుతుంటే అతని మొహం కనిపిస్తోంది దీనంగా. బావున్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు