ఆమె మెహెంది వెనక కన్నీళ్లు!

ఒక రచన ఎలా పుడుతుంది? అది నలుగురిలోకీ వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రతిస్పందనని అందుకుంటుంది? ఈ ప్రశ్నలకు కొందరు కవులూ రచయితల సమాధానాల పరంపర ఈ “అక్షరాల వెనక” శీర్షికలో!

“మెహబూబ్ కీ మెహెంది” అనేది హైదరబాదులో వున్న ఒక ప్రముఖ ప్రాంతం. నిజాం కాలం నాటి నుండి ప్రముఖమైన ఏరియా అది. ఎంత గొప్ప కవితాత్మకత వుందా పేరులో! నిజమే వాళ్ళు విటుల కోర్కెల్ని పండించే గోరింటాకు వంటి వారు. సెక్స్ వర్కర్స్ కి, ముజ్రా ఖవ్వాలీ కళాకారులకి నిజాం నవాబు కేటాయించిన ప్రాంతం అది.

అది నగరంలోని ముఖ్య కట్టడాలైన సిటీ కాలేజి, హైకోర్ట్, సాలార్జంగ్ మ్యూజియం పరిసర ప్రాంతాల్లో వుంటుంది. కాలక్రమంలో రియల్ ఎస్టేట్ వేల్యూ బాగా పెరిగింది. 1990లో ఎంతోమంది కన్నుబడింది ఆ ప్రాంతం మీద.  1989 ప్రాంతంలో అక్కడేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించటానికి ప్లాన్ చేసిన పెద్దల ప్రోద్భలంతో ప్రభుత్వం వారినక్కడినుండి ఖాళీ చేయించటానికి చేయని ప్రయత్నం లేదు. విపరీతమైన పోలీసు దాడులు, లాఠీ చార్జీలు, విటుల్ని రానివ్వక పోవటం. ఇలా అన్ని రకాలుగా వారిని వేధించారు. కొన్నాళ్లపాటు రోజూ పేపర్లలో వచ్చేది. మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు వారి మీద దమనకాండను ఖండించి వారి పోరాటానికి మద్దతు పలికాయి. వాళ్ళు ధర్నాలు చేసారు. అరెస్టయ్యారు.  ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు.  ఆ సమయంలోనే కొన్ని ప్రజాసంఘాల వారందరూ కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసారు. నేను ఏపీసీఎల్సీ నుండి ఆ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడిగా వెళ్ళాను.

ఆ ఏరియాకి వెళ్లే దారులన్నింటి మొదట్లో పోలీసులు పికెట్లు పెట్టారు.  మేం వాళ్లతో ఎలాగో వాదించి లోపలికి వెళ్లాం.  అక్కడ శరీరం శిధిలమై రోడ్ల మీద దేకుతున్న వృద్ధులైన మాజీ సెక్స్ వర్కర్స్, ఇంకా యుక్త వయసు రాకుండానే వృత్తిలోకి దింపబడ్డ పిల్లలు కనిపించారు. వొళ్ళంతా మచ్చలు పడ్డ సుఖరోగ బాధిత స్త్రీలు కనిపించారు. అక్కడే కొంత భాగం “ముజ్రా ఖవ్వాలీ” కళాకారులు కూడా వుంటారు.  వారు సెక్స్ వర్కర్స్ కాదు. గొప్పవారి ఈలల్లో గానాబజాన చేస్తారు.  సెక్స్ వర్కర్స్ తో మాట్లాతుండగానే వారి ఇళ్లల్లోంచి వాయిద్యాలతో కూడిన ఖవ్వాలీ పాటల ప్రాక్టీస్ వినిపించింది.

నేనెప్పుడూ చూడని సామాజిక విషాద కోణం అది. వారి ఇళ్ళల్లోకి వెళ్లాం. మాట్లాడాము. ఒకళ్ళింట్లో ఒక పెద్దామె నాతో మాట్లాడుతూ నా భుజం మీద చేయి వేసి “బిడ్డా! మేం భూమికి భారమైతే మాకింత విషమిచ్చి చంపున్రి” అన్నది. నిర్ఘాంతపోయాను.  ఆ మాటలు కలచివేసాయి.  సమాజం ఇంత దుర్మార్గంగా, క్రూరంగా ఎందుకుండాలి అనిపించింది. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకున్నాను. పాతకాలపు ఇళ్లు అవన్నీ.  అతి తక్కువ జీవన ప్రమాణం వారిది.  వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి సెక్స్ వర్కర్ డ్యూటీ వేయటానికి వచ్చినవాళ్లూ వున్నారు వారిలో. తెల్లటి మెటల్ రోడ్లు, మిద్దెలు లేదా పెంకుటిళ్లు, ఉయాలల్లో పసిబిడ్డలు, నులకమంచాలు, కుండలు, సత్తుగిన్నెలు, ఏవో పాతకాలపు నాటి ఫోటోలు వేలాడే వెలిసిపోయిన రంగుల గోడలు….అంతా ఏదో వేరే ప్రపంచంలా అనిపించింది.  ఆ తరువాత ఆ ఏరియా నుండి బైటికొచ్చాక మెహబూబ్ హోటల్లో చాయి తాగటానికి వెళ్ళాం. అంతకు మునుపు వాళ్ళ ఏరియాలో మాతో మాట్లాడిన ఒకామె అదే హోటల్ కి వచ్చి విటుడిని మాట్లాడుకొని పోయింది. ఆమె మమ్మల్ని చూసినా అసలు పట్టించుకోలేదు. మొత్తం మీద ఈ ఆందోళనల కారణంగా ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఆ స్త్రీల మీద ఏవో కేసులు పెట్టి వదిలేసింది.

నా జ్ఞాపకాల్లో మరో విషాద సన్నివేశం కూడా వుంది. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆబిడ్స్ సెంటర్లో మా అఫీసు (పులారెడ్డి బిల్డింగ్) కింద వున్న ఇరానీ హోటల్లో వాళ్ళమ్మతో కలిసి లంగా జాకెట్టుతో వచ్చే ఒక పదమూడు, పద్నాలుగేళ్ళ అమ్మాయిని చూసే వాడిని. వాళ్ళమ్మ ఎండిపోయిన చర్మంతో పాలిపోయినట్లుండేది. చూడగానే అర్ధం అయ్యేది. అక్కడున్న ఎవరితోనో మాట్లాడి, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆ తరువాత కొన్నాళ్లకి ఆ టీనేజ్ అమ్మాయి చీర కట్టుకొని వాచ్చేది. రెండు మూడేళ్ళలో ఆ అమ్మాయి పెద్ద పొట్టతో అక్కడ అడుక్కోవటమూ చూసాను. ఆ అమ్మాయిని చూసి మా కొలీగ్ “చూసారా? జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుందా అమ్మాయి. చేసిన పాపానికి ఫలితం ఈ జన్మలో అనుభవించక తప్పదు” అన్నాడు.  కర్మ సిద్ధాంతం ఎంతటి అవకాశవాదాన్ని, తప్పుడు సూత్రీకరనల్ని, పలాయనవాదాన్ని మప్పుతుందో అర్ధమైంది.  నిజంగా తప్పు ఆ అమ్మాయి మీదకి తోసేయగలమా? ఆమె విషాదానికి మనందరి సామూహిక వైఫల్యమూ, సామాజిక వైరుధ్యాలు కారణం కాదా?

చాలా పరిమిత స్థాయిలో అయినా నేనూ ఒక పౌరహక్కుల కార్యకర్తగా మెహబూబ్ కి మెహెందీ స్త్రీల పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన నేను ఆ తరువాత నేను “మెహబూబ్ కి మెహెందీ” అన్న పేరుతోనే కవిత రాసాను.  అప్పటికే వారి పోరాటం మీద తెలుగులో అనేక కవితలొచ్చాయి.  ముఖ్యంగా ఓల్గా, ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల వంటి కవులు గొప్ప కవిత్వం రాసారు.  వాళ్లు రాసారని నేను రాయలేదు కానీ ఎంతో కాలం నుండి గూడు కట్టుకున్న దుఖం ఒక రాత్రి కవితగా బద్దలైంది.

ఈ కవిత 11.5.1990 ఆంధ్రజ్యోతి వారపత్రికలో “ఈవారం కవిత” శీర్షిక కింద ప్రింట్ కాగా చేకూరి రామారావు గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో తన “చేరాతలు” శీర్షికలో 17, జూన్, 1990న పరామర్శించారు.  అది ప్రింట్ అయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి.  ఆయనకి నా చిరునామా తెలియదు.  ఆంధ్రజ్యోతి ఆఫీసుకి ఫోన్ చేసి నా అడ్రెస్ తీసుకొని ఒక ఉత్తరం రాసారు.  ఆ ఉత్తరంలో ఆయన అరణ్యకృష్ణ అని సంబోధించకుండా “చి.శ్రీనివాస కృష్ణమూర్తికి” అంటూ మొదలెట్టారు.  ఇలా తాను ఈ కవిత మీద “చేరాతలు” వ్యాసం రాసి ఆంధ్రజ్యోతికి పంపానని వీలుంటే ఓ.యు.కి వచ్చి కలవమని, నా ఫోటో ఆంధ్రజ్యోతిలో ఇమ్మని రాసారు.   ఆ తరువాత ఆయన్ని కలిసాను.  తన వ్యాసానికి ఆయన “అరణ్యకృష్ణ కవిత్వంలో సాధించిన అదనపు విలువలు” అనే హెడ్డింగ్ పెట్టడం చాలా రోజులపాటు నాకో గొప్ప విస్మయంగా అనిపించేది.

నేను తెలుగే కాదు, ఏ భాష కవిత్వాన్ని కూడా పెద్దగా చదివింది లేదు.  కవిత్వం మీద పిచ్చి ప్రేమ కూడా లేదు.  పాతికేళ్ల వయసులో కవిత్వం మొదలెట్టాను.  అప్పటికి నేను అసలు కవిత్వాన్ని ఫాలో అయేవాడిని కాను.  1988లో మొదటి కవిత అనుకోకుండానే రాసాను. ఒకసారి రాయటం మొదలయ్యాకనే కవిత్వం గురించి విపరీతంగా ఆలోచించటం మొదలెట్టాను. నేనూ వెలిచేటి రాజీవ్ కవిత్వం గురించే తెగ మాట్లాడుకునే వాళ్లం.  తను గొప్ప అధ్యయన శీలి.  నాకో గొప్ప విమర్శ వనరు.  అయినా ఏదో అపనమ్మకం నా మీద నాకు. కవిత్వం ఎలా రాయాలని అనుకున్నానో అలాగే రాయగలుగుతున్నా అనే నమ్మకాన్ని నాకు చేరా గారే ఇచ్చారు.  “తీసుకున్న వస్తువుని ఏ గందరగోళం లేకుండా, స్పష్టమైన ప్రతీకల ద్వారా, కొత్త పోలికల ద్వార కవిత్వం చేసేసాడు.  పోలికల్లో మెలికలు తిరగనక్కర్లేదనీ, ప్రతీకల్ని ఎవరికీ అందనంత దూరంలో వుంచనక్కర్లేదనీ ఈ కవితతో ౠజువు చేయటం అరణ్యకృష్ణ సాధించిన అదనపు విలువలు” అని రాసారాయన.  ఈ వాక్యాలే నాకు ఎంతో బలాన్నిచ్చాయి.  ఎందుకంటే కవిత్వం సీరియస్ గా రాయటం మొదలయ్యాక నేను ఇలాగే రాయాలనుకున్నా.  ఈ రోజుకీ ఇదే పంథాలో వెళ్తున్నా.

ఈ సందర్భంగా మీతో మరో విషయం పంచుకోవాలనిపిస్తున్నది.  నా మొదటి కవిత్వ సంపుటి “నెత్తురోడుతున్న పదచిత్రం”లో వున్న 30 కవితల్లో ఆత్మాశ్రయ ధోరణిలో రాసుకున్న నాలుగైదు కవితలు మినహాయిస్తే, అత్యధిక కవితలు ప్రజల కడగండ్లని, వారి పోరాట్ల్ని దగ్గరగా చూసి రాసినవే.  ఆ సంపుటిలో వున్న కవిత్వమంతా ఒక ఫీల్డ్ రిపోర్ట్ అని గర్వంగా చెప్పగలను.

ఇంక కవిత చదవండి.

మెహబూబ్ కీ మెహెందీ

-అరణ్య కృష్ణ

 

ఎందరికో శరీరాన్ని అతికించి

కండరాల్తో కండరాల్ని ముడేసి

తెగేంతవరకు మీటబడ్డ ఫిడేలు తీగెల్లా నరాల్ని తెంపుకొని

ఆమె అరిగిపోయిన ఆవయవాల సమూహానికి

బట్టలు తొడిగినట్లుంటుంది

 

వంతెన పక్కన వీధి దీపం క్రీనీడల్లో

అనుభూతుల పక్షులెగిరిపోయిన ఆమె దేహం

ఎండిపోయిన చెట్టులా కదులుతుంటుంది

ఒక దరహాసం ఆసక్తి కనబడని

గోడకి వేలాడుతున్న బూజు పట్టిన పాత ఫోటో ఫ్రేం లాంటి

ముఖానికి పౌడరద్ది లిప్ స్టిక్ పూసి

ఆర్తి లేని స్పర్శ కోసం ఆహ్వానిస్తుంది

 

అద్దె సైకిల్ ని నడిపినట్లు

ఆమెను రెస్టారెంటుకో సినిమాహాలుకో తిప్పొచ్చు

మడతమంచాల లాడ్జింగుల్లోనో

బ్రహ్మచారి గదుల్లోనో

చలివేంద్రంలో మంచినీళ్ళు తాగినంత ఆత్రంగా

శరీరదాహాన్ని ఆమెతో తీర్చుకోవచ్చు

 

అంతా బహిరంగమైన జీవితం లో ఆమె ఒంటరి

 

పంజరానికి అలవాటు పడ్డ చిలకలా

తిరిగి పంజరానికే చేరుకుంటుంది

ఆ పంజరాల వీధిలో ఏ క్రీస్తూ నడవడు

లాఠీల నుండి

మర్యాదస్తులు విసిరే రాళ్ళనుండి

ఆమెని రక్షించడానికి

ఆ వీధిలో బాల్యానికి

అమ్మా నాన్న ఆటలు తెలియవు

ఆ పంజరాల్లో

ఉయ్యాలకి మంచానికీ వయసులో వ్యత్యాసం తక్కువ

 

ఏ జుగుప్సకి పులకింతకి గురికాని ఆమె శరీరం

ఆమెది కాదు

ఎవడైనా బ్రహ్మజెముడు పొదలా మీద పడి

ఆమెని గోరింటాకులా రాసుకొని

కోర్కెపండిన తర్వాత

ఎండు గోరింటాకులా దులుపుకుంటాడు

ఆమె ఆకలినీ అవసరాన్నీ అలంకరణల్తో కలగలిపి

శరీరాన్ని మళ్ళీ తడి గోరింటాకు చేస్తుంది

 

బ్లాటింగ్ కాగితం లా మురికి రోగాల్ని పీల్చి పీల్చి

గరుకుగా ఎండిపోయి

పిడకలు రాలిన గోడలమీద మరకల్లాంటి మచ్చలతో

శరీరం శిధిలమైనప్పుడు

ఆమె పంజరం నుండి కూడా గెంటబడుతుంది

 

‘ముజ్రా ఖవాలీ’ కళాత్మక గాన నేపధ్యం లో

గోరింటాకు పండిన అరచేయిలాంటి నెత్తుటి నోటితో

ఆమె ఆ వీధిలోనే కృశించిపోతుంది

 

ఆ వీధి ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది

 

(“ఆంధ్రజ్యోతి వీక్లీ” 11.5.1990)

*

చిత్రం: అక్బర్ 

అరణ్య కృష్ణ

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • గత స్మృతులను నెమరేసుకుంటూ.. నాటి చేరాతల ను గుర్తు చేసారు. మెహబూబ్ కి మెహందీ ని నాడు చదివిన పాఠకుల్లో ఒకడిని

 • ఇప్పటికీ ఇది నిజమే. కవిత చదివాక హృదిని మెలిపెట్టింది.

 • ఆ వీథి ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది.

  పంజరానికి అలవాటు పడ్డ చిలుకలా

  కాంటెంపరరీ సత్యాలు

  సీరామ్

 • ఒక కదిలించే కవిత వెనుక కదిలించిన ఒక సందర్భం ఖచ్చితంగా ఉంటుంది ఆ సందర్భాలను బట్టే ఏర్పడిన అనుభవాలను బట్టి కవిత లోతు పెరుగుతుంది అరణ్య కృష్ణ గారి కవిత్వంలో స్త్రీల సమస్యలను వారి దెబ్బతిన్న మనోభావాలను చాలా చక్కగా చాలా కవితల్లో చూపించారు

 • కృష్ణ గారూ, ఈ కవిత నేపధ్యాన్ని తెలిపారు. ఎలా ,ఎందుకు ఈ కవిత సృజించింది మీ మనసులొ! వారి జీవితాలకు ప్రతిబింబం ఈ కవిత! ప్రతిరూపం ఈ కవిత! ఎంతసేపూ ఒక్క చేతి చప్పుడునే నిందించె మనస్తత్వం.ప్రభుత్వం , మనం ఎంత బాధ్యులం!! మీకు అభినందనలు కృష్ణ గారు !!

 • “అక్షరాల వెనుక” ఎంతటి ఆర్థృత ఉంటుందో ఎలాంటి అనుభవాలు ఉండొచ్చో.. ఈ శీర్షిక వర్తమాన కలాలు తప్పనిసరిగా చదవాల్సినది.
  అరణ్య కృష్ణ సర్ మీ కవిత్వం లో వాస్తవికత, సహజత్వం నాకు నచ్చుతాయి. ఈ కవిత వెనుక కథ ను ఇంత వివరంగా తెలుసుకోగలిగాం. Thank you to the whole team 💐

 • A very painful truth. We selectively exclude these painful facts and live in our own fantasy ! Thank you for the Kaviha

 • ఆమె ఆ వీధి లొనే కృశించి పోతుంది
  ఆ వీధి ఇంకా ఇంకా విస్తరిస్తుంటుంది
  👏👏👏👏👏

 • ఒక కవిత వెనుక ఎంత వేదన ఉంటదో ఈ శీర్షిక చూపెడుతుంది.1990నాటి హైదరాబాద్ వీథుల్లో వేశ్యల జీవితాన్ని చూపించారు అన్నా. మంచాలకు ,ఉయ్యాలకు తారతమ్యం లేదన్న వాక్యం మెలిపెట్టింది గుండెలను.

 • మనసుని పట్టి మెలిపెట్టిన కవిత…
  కవి అరణ్య కృష్ణ సార్ కవిత్వపు నడక…పాఠకుణ్ణి వాక్యాలవెంట పరిగెత్తిస్తుంది…అందుకే సార్ కవిత్వం నాకు ఇష్టం…ఇక ఈ శీర్షిక కింది ఆనాటి ఈ కవిత సందర్భ,సంబంధిత విషయాలు చదువుకోవడం…ఆలోచనాత్మకంగా ఉంది…కవితలో ఆఖరివాక్యం వెంటాడుతూ ఉంటుంది ఏ పాఠకుణ్ణి అయినా….సారంగకు ధన్యవాదాలు.

 • …… గోరింటాకులా రాసుకొని……..
  ఎండు గోరింటాకులా దులుపుకుంటాడు….

  So touching….. Great lines sir.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు