ఆత్మలు పరవశించే వాక్యాలు

గోపాల్ కవిత్వంలో కళ్ళు వింటాయి.చెవులు చూస్తాయి. దృశ్యాన్ని శబ్దంగానూ,శబ్దాన్ని దృశ్యంగానూ చేయగల నేర్పు వున్న  కవి గోపాల్.

     కవిత్వంలో పూలకు,కవులకు విడదీయరాని బంధమేదో ఉంది. ప్రకృతి సౌందర్యాన్నో,ప్రేయసి రూపాన్నో,ఒక జీవిత సత్యాన్నో చెప్పడానికీ పూలను ఒక అద్భుత మాధ్యమంగా కవులు వాడుకోవడం సహజం. అట్లాగే చెట్లకు, వాటి ఆకులకు, కవులకు కూడా ఒక అందమైన బంధం ఉంది.

తమ కవిత్వంలో కవులు చెట్లను జీవిత తత్వానికీ ప్రతీకలుగా చేసుకుంటారు. ఆకుల్లో చిగురాకుల్ని కొత్త ఆశలకు, సరికొత్త ఆరంభాలకు ప్రతీకలుగా చేస్తుంటారు,రాలిపోయే ఆకుల్ని వృద్ధాప్యానికీ, వైరాగ్యానికీ,జీవిత ముగింపుకు ప్రతీకలుగా కవులు తమ కవిత్వంలో వాడుతుంటారు.

నదులు కవుల దృష్టిలో  కేవలం నీటి ప్రవాహాలు మాత్రమే కాదు.జీవన చైతన్యానికీ,సంస్కృతికీ,మానవ భావోద్వేగాలకు సజీవ ప్రతీకలు. భూమి లేక మట్టి కవుల దృష్టిలో ఒక జడ పదార్థం కాదు. ఒక సజీవమైన శక్తిగా, ఓర్పు సహనాలకు మారు పేరుగా,మాతృమూర్తిగా కవులు ఊహలు చేస్తున్నారు.తాత్విక కోణం ఉన్నకొందరు కవుల ఊహలో భూమి లేదా మట్టి మార్పుకు సంకేతం.

ఈ పూలని,చెట్లని,ఆకుల్ని,నదుల్ని,మట్టిని కొందరు కవులు కావ్యవస్తువులుగా చేసుకుని కావ్యాలే రాశారు.మరి కొందరు కవులు వీటిని తమ కవితల్లో అభివ్యక్తిని నిత్యనూతనం చేసే ప్రతీకలుగానో,అందమైన భావచిత్రాలుగానో మార్చుకొని కవితలు రాశారు.

ఎందరో కవులు కేవలం ప్రతీకలుగా వాడుతున్న పై వాటిని కొందరు కవులు వైవిధ్య దృష్టితో డొంకతిరుగుడుతనంతో కళాత్మక అభివ్యక్తితో మనిషిని శుభ్రపరిచే మిణుగురులాంటి గొప్ప కవితగా మార్చి నిలబెడతారు.అట్లాంటి ఒక మంచి కవితను 14 జూన్ 2026 సాక్షి ఫన్ డే ఆదివారం అనుబంధంలో చదివాను.

ఆ కవిత పేరు “ ఆత్మలు చప్పట్లు కొట్టే వాక్యాలు”. ఈ కవిత రాసింది డాక్టర్ సుంకర గోపాల్. మనల్ని ఆవరించుకున్న చరా చర ప్రకృతిలోని ప్రతీకల లోపలి పొరల్లోని నిగూఢతను చిత్రించిన కవిత ఇది.పూలలోని మకరందాన్ని తేనేటీగ మోసుకెళ్ళి తీయని తేనేగా మార్చినట్లు కవి గోపాల్ ప్రతీకల్లోని మార్మికతను లోకాన్ని ఇంకొన్నాళ్లు సజీవత్వం చేసే అమృతంగా మారుస్తున్నాడు ఈ కవితలో.

 గోపాల్ వర్తమాన తెలుగు సాహిత్యంలో ప్రముఖ యువకవి, ప్రముఖ విమర్శకుడు. కవిత్వ సారాన్ని పిల్లన గ్రోవిలా ఊదే ఈ విమర్శకుడు. “ మా నాయన పాట” తో మొదలై “ నీటి కుండ లాంటి మనిషి” తో తన కవిత్వ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నమంచి కవి.

ప్రముఖ కవి రాధేయ శిష్య త్రయంలో ఒకడైన గోపాల్ పద్యాన్ని ప్రసవించే స్వరపేటిక. గాల్లో ఊరేగుతున్న పద్యాన్ని గుప్పిట పట్టి దాన్ని విప్పి చెప్పి చదువరుల గుండెల్లో దాన్ని సజీవం చేయగల వక్తృత్వం ఈతని నేర్పు. గోపాల్ డి.ఆర్.జి ప్రభుత్వ కళాశాల ,తాడేపల్లి లో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. వివిధ పత్రికల్లో సాహిత్యంలోని విభిన్న అంశాలను తార్కికంగా ఆలోచనాత్మక వ్యాసాలుగా రాసిన ప్రతిభ గోపాల్ ది.

ప్రతీకల్ని పఠితలు నివ్వెరపోయే వైవిధ్యమైన దృష్టితో చూసే కవి గోపాల్. చెప్పాలనుకున్న దాన్ని డొంకతిరుగుడు తనంతో కప్పి చెప్పే కవిత్వ భాష గోపాల్ ది. కవి కవిత్వ వాక్యాలు తియ్యని చినుకులు అనే భావాన్ని గోపాల్ ఎట్లా చెబుతున్నాడంటే… పూల గురించి పరిమళ భరిత వాక్యం రాస్తే, ఆ వాక్యాన్ని తేనేటీగ మోసుకెళ్ళి తియ్యని చినుకులుగా రాల్చిందని డొంకతిరుగుడుగా చెబుతున్నాడు.పూల మకరందాన్ని తాగడం తేనేటీగ లక్షణం.కవి పూల మీద రాసిన వాక్యం సౌరభాన్నే వెదజల్లేది మాత్రమే కాదు,మాధుర్యమైనది కూడా అని చెప్పడం కవి ఉద్దేశ్యం కావొచ్చు.

చెట్ల కింద రాలిన ఆకులు కుప్పలుగా పడి ఉంటాయి.రాలిన ఆకుల్ని పక్షులు గూళ్ళల్లో మెత్తదనం కొసం వాటిని తీసుకెళ్ళి పరచుకుంటాయి. ఉదయాన్నే ఆహారం కోసం రెక్కలల్లారుస్తూ ఎగిరిపోయినప్పుడు ఆ రెక్కల గాలికి ఆ ఎండి రాలిన ఆకులు కూడా కొన్ని ఎగిరి పోతాయి.ఈ దృశాన్ని గోపాల్ కవిత్వ వాక్యాలు చేస్తూ ఒక గొప్ప భావ చిత్రాన్ని గీశాడు.రెక్కల తాకిడికీ ఎగిరిపోతున్న ఎండిన ఆకులు గాలికీ ఊపిరి పోస్తున్నాయనే అద్భుతమైన ఊహను చేశాడు గోపాల్.ఇట్లా ఊహ చేయడమే కదా కవిత్వం.

నది కూడా కవులకు ప్రతీకే.నది గురించి తడి ఉన్న వాక్యాలు ప్రవహింపజేస్తున్నా అంటున్నాడు కవి.ఆ వాక్యాలు కిరణాలై వాలి సూర్యుణ్ణి బతికిస్తున్నాయని చెబుతున్నాడు ఈ కవి.నదిలోని తడి ఆవిరై సూర్యుణ్ణి చేరి తిరిగి ప్రాణాధారమైన వర్షంగా కురిసి సూర్యున్ని సజీవం చేస్తున్నాయన్నది కవి భావనేమో?కవి వాక్యాలు ఆర్ద్రత కలిగి చెప్పడం కవి హృదయమేమో?

భూమి తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతున్నదనేది శాస్త్రీయ అంశం.ఈ అంశాన్ని కవిత్వంలోకి ఈ కవి ఎట్లా పొదిగాడో చూస్తే విస్మయమే.తిరుగుతూ ఉండే భూమికి నాలుగు వాక్యాలు కానుక చేశాడట. అందువల్ల భూమి పగలు రాత్రి పనిచేస్తూ మట్టికీ జీవం పోసిందట.ఒక అద్భుత ఊహను శాస్త్రీయ అంశం ప్రాతిపదికగా నిర్మించడం కవి అభివ్యక్తి మెరుపే.

కవి ‘ఇప్పుడిప్పుడే ఆత్మలు చప్పట్లు కొట్టే వాక్యాలు రాస్తున్నాను’ – అని అంటున్నప్పటికీ,ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా కవిత్వ ప్రియుల ఆత్మలు అభినందించే వాక్యాలే రాస్తున్నాడు.పట్టకంలోనుంచి ఒక రంగు కాంతి కిరణం ప్రవహిస్తే ఏడు రంగులుగా విచ్ఛిన్నమైనట్లు గోపాల్ వాక్యం పాఠకుడి హృదిలో అనేక ఊహల్ని గీస్తుంది. అందుకే ఇంకొన్నాళ్ళు గోపాల్ వాక్యాల ఆయువుతో కవిత్వలోకం సజీవమౌతూ  ఉంటుంది.

అమృతానికీ టాగోర్ ఇచ్చిన నిర్వచనం గొప్పది.దానికి రూపం లేదన్నాడు,పరిమితి లేదన్నాడు ఆ విశ్వకవి.”జల జల ప్రవహించే సెలయేటిలో /కన్నుల పండువుగా పుష్పించే చెట్ల గుంపులో “ అమృతం దొరుకుతుందంటాడు టాగోర్. అందుకేనేమో గోపాల్ పూల గురించి రాసిన పరిమళ భరితమైన వాక్యం, చెట్ల గురించి ఎండిన ఆకులు పోగుపడినట్లు కుప్పలుగా పోసిన పదాలు, నది గురించి తడి ఉన్న వాక్యాలు, భూమికి కానుక చేసిన నాలుగక్షరాలు అమృతత్వంతో ఉండి లోకాన్ని ఇంకొన్నాళ్ళు నిర్జీవం కాకుండా చేయగలవనే ఆశాభావాన్ని కవిత్వం చేసినట్టున్నాడు.

గోపాల్ కవిత్వంలో కళ్ళు వింటాయి.చెవులు చూస్తాయి. దృశ్యాన్ని శబ్దంగానూ,శబ్దాన్ని దృశ్యంగానూ చేయగల నేర్పు వున్న  కవి గోపాల్.ఈ కవితలో ఆత్మలు అంటే ఆత్మలు కాదు.కవిత్వ ప్రియులైన చదువరులు. వాళ్ళు ఆత్మ సంతృప్తిగా అనుభూతి చెందగలరని ఈ కవి మార్మికంగా చెప్పాడు.మంచి కవిత రాసిన గోపాల్ కు అభినందనలు.

 

ఆత్మలు చప్పట్లు కొట్టే వాక్యాలు

 

పూల గురించి పరిమళ భరితమైన వాక్యం రాశాను

వాక్యాన్ని తేనేటీగ మోసుకెళ్ళి తియ్యని చినుకులుగా రాల్చింది.

చెట్ల గురించి ఎండిన ఆకులు పోగుపడినట్లు పదాలు కుప్పలు పోశాను

పక్షులు గూట్లో పెట్టుకొని రెక్కలతో ఉదయాన్నే మోసుకెళ్ళి గాలికి ఊపిరి పోస్తున్నాయ్

నది గురించి తడి ఉన్న వాక్యాలు ప్రవహింప జేస్తున్నా

తెలియందేముంది కిరణాలు వాలి సూర్యుడిని బతికిస్తున్నాయ్

తిరుగుతూ ఉండే భూమికి నాలుగక్షరాలు కానుక చేశాను

పగలు రాత్రి పనిచేస్తూ మట్టికి జీవం పోస్తోంది

ఇప్పుడిప్పుడే ఆత్మలు చప్పట్లు కొట్టే వాక్యాలు రాస్తున్నాను

లోకం ఇంకొన్నాళ్ళు నా వాక్యాల ఆయువుతో సజీవమవుతుంది.

*

రాజారామ్ తూముచర్ల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన కవిత్వానికి అద్భుతమైన వ్యాఖ్యానం సార్ కవిత్వ రహస్యం తెలిసిన విమర్శకులు మీరు గోపాల్ గారికి నీకు శుభాకాంక్షలు సార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.