ఆగిపోయింది అగ్రవర్ణ సాహిత్యమే…!!

మార్చి 10న పసునూరి రవీందర్ కవిత్వం ‘‘ఒంటరి యుద్ధభూమి’’ఆవిష్కరణ

యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పసునూరి రవీందర్ తన కవితా సంపుటి ‘‘ఒంటరి యుద్ధభూమి’’ని ప్రకటిస్తున్నాడు. నిజానికి ఇది దేశాల మధ్య యుద్ధంతో సంబంధం లేనిది. అస్తిత్వ ఉద్యమాల వెలుగులో అందివచ్చిన స్రుజనకారుడు పసునూరి. కథకునిగా తన శక్తిని నిరూపించుకున్నవాడు. ‘‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’’ కథా సంపుటి ద్వారా ఆధునిక కాలాన కులరక్కసి విక్రుత రూపాన్ని ఒడిసి పట్టుకున్నవాడు. కథలకంటే ముందే కవిగా మొదలైనవాడు. కథా సంపుటిని ముందు ప్రచురించడంతో కథకునిగా గుర్తింపును పొందాడు. ఇప్పుడిక తన మొదటి కవితా సంపుటిని మన ముందుకు తెస్తున్నాడు. తొలుసూరు సంతానమంటే ఎవ్వరికైనా ప్రత్యేకమే. మరి తన కవితా నేపథ్యాన్ని గురించి కవి, జర్నలిస్ట్ శ్రీనివాస్ సాహి చేసిన ఇంటర్వ్యూ సారంగ పాఠకుల కోసం….

‘‘ఒంటరి యుద్ధభూమి’’ నేపథ్యం గురించి చెప్పండి?

దశాబ్దంన్నర కాలంగా నేను రాసుకున్న కవిత్వమిది. ఊపిరి సలుపనివ్వని ఉద్యమాలు, న్యాయంగా దక్కాల్సిన దాని కోసం పోరాటాలు, మరెన్నో దగాపడ్డ ప్రజల ఆకాంక్షలు నన్ను కవిగా మలిచాయి. ఒక సామాజిక కార్యకర్తగా ఒకవైపు పోరాడుతున్న సమయంలోనే మరోవైపు సాహిత్యకారుడిగా నేను రాయాల్సిన ఆవశ్యకత ముందుకొచ్చింది. అట్లా ప్రపంచం తలతప్పి చూసేట్లు చేసిన ప్రాదేశిక ఉద్యమం, ఇంకా దళితులుగా మా మీద కొనసాగుతున్న దుర్మార్గాలు నన్ను రాసేలా చేశాయి. పాటైన, కవితైనా, కథైనా, పరిశోధనైనా సామాజిక బాధ్యతతోనే అనుకున్నవాణ్ణి. అందుకే నా వంతుగా బహుజన జాతుల విముక్తి కోసం రాస్తున్నాను. తెలుగు సమాజంలో గడిచిన రెండు దశాబ్దాల కాలం కీలకమైంది. ఈ కాలమే నా చేత ఈ కవిత్వం రాయించింది. అదే ఇప్పుడు ‘‘ఒంటరి యుద్ధభూమి’’గా తీసుకువచ్చాను.

1990 నుంచి రెండు దశాబ్దాలు ఉధృతంగా సాగిన దళిత సాహిత్యం ఆ తరువాత నెమ్మదించిందన్న విమర్శ వుంది. సరిగ్గా ఇదే కాలంలో మీరు కవిగా కథకుడిగా బలమైన వ్యక్తీకరణతో ముందుకొచ్చారు.. దళిత సాహిత్యం నెమ్మదించిందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా..? ఏకీభవిస్తే దానికి మీరు అనుకుంటున్న కారణాలేంటి?

కుల అణిచివేత ఉన్నన్నినాళ్లు దళిత ప్రతిఘటనా సాహిత్యం ఉంటుంది. దళిత సాహిత్యం ఆగిపోయింది, లేదా దాని పనైపోయింది అని కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్ చేసింది దుష్ర్పచారం మాత్రమే. ఈ దేశ సాంస్క్రుతిక పోరాటాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. గౌతమ బుద్ధుని నుండి కాన్షీరాం వరకు అనేక సాంస్క్రుతిక ఉద్యమాలు జరిగాయి. వాటిల్లో ఎంతో సాహిత్యం వచ్చింది. మహాత్మ పూలే, కబీరు, తుకారాం, బసవేశ్వరుడు, పోతులూరి వీరబ్రహ్మం, గుర్రం జాషువా వీరంతా ఎంతో విలువైన సాహిత్యాన్ని స్రుజించారు. ఈ చరిత్ర తెలియని వారు అలా దళిత సాహిత్యం ఆగిపోయిందని నిందలు వేశారు. నిజానికి దళిత సాహిత్యం గతంలో కంటే మరింత విస్త్రుతంగా వెలువడుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో బలమైన బహుజన కవులు నిరంతరం రాస్తున్నారు. పత్రికల్లో స్పేస్ దొరకని బహుజన కవులంతా ఇవాళ సోషల్ మీడియా వేదికగా రాస్తున్నారు. ఇప్పటిదాకా చాతుర్వర్ణ కులవ్యవస్థను కాపాడేందుకే అగ్రవర్ణాలు రాశారు. సాహిత్యంలో కూడా ప్రశ్నించే గొంతులు పెరిగాయి. దీంతో వర్ణాశ్రమధర్మ ప్రబోధ సాహిత్యానికి కాలం చెల్లింది. అట్లా ఇప్పుడు అగ్రవర్ణ సాహిత్యమే ఆగిపోయింది. ఇప్పుడు రాస్తున్నదంతా ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలే. రానున్నది బహుజన సాహిత్య యుగమే.

దళిత సాహిత్యంలోనూ స్త్రీలను పితృస్వామ్య వికృతి చట్రంలోనే బంధించి చూసే పద్ధతి ఉంది. ఇది దళిత సాహిత్యం స్త్రీకి తక్కువ గుర్తింపునివ్వడం కాదా?.. దళిత స్త్రీలే దళిత స్త్రీవాదం వినిపించాలన్న వాదనకు ఇది బలం చేకూర్చినట్టే కదా?

దళిత పురుషులు కుల పీడితులు. దళిత స్త్రీలు… కులం, పురుషాధిపత్య పీడితులు. రెండు రకాలైన అణిచివేతను అనుభవిస్తున్నవారు. అందుకే ఈ దేశంలో దళిత స్త్రీలను మించిన బాధితులు లేరు. దళిత పురుషుల్లో మానసిక పరివర్తన రావాల్సి ఉంది. అయితే మిగిలిన పురుషుల కంటే దళిత పురుషునిలో సమానత్వ ధోరణి ఉంటుంది. ఇది వ్యవస్థీక్రుతం కావాల్సి ఉంది. పని చేసే దగ్గర యిద్దరూ సమానమే అయినపుడు గౌరవంలో కూడా సమానతను పొందాలి. నేను ఈ పుస్తకానికి పెట్టుకున్న శీర్షిక కూడా మా అమ్మ మీద రాసుకున్న కవిత నుండే స్వీకరించాను. దళితులది మాత్రు స్వామిక పద్ధతి. కొన్నిసార్లు మాత్రం అలవాటైన మూసలో పిత్రుస్వామ్య వ్యక్తీకరణ జరుగుతున్నది. ఇది మారాలి. దళిత వేదనను దళితులు మాత్రమే పవర్ ఫుల్ గా ఎలా చెప్పగలరో, దళిత స్త్రీల అణిచివేత తాలూకు పీడనను కూడా దళిత స్త్రీలే బలంగా చెప్పగలరు.

చాలా సందర్భాల్లో మీ కవిత్వం ఆవేశపూరితంగా గోసను వ్యక్తం చేసేదిగా సాగింది.. అస్పృశ్యత తాలూకు కొత్త రూపాన్ని అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథల్లో చర్చించినట్టే.. ఒంటరి యుద్ధభూమి కవితా సంకలనంలోనూ అస్పృశ్యత కొత్త రూపాన్ని కొన్నిచోట్ల వస్తువుగా తీసుకున్నారు. ఉద్యమ కవిత్వం నినాద ప్రాయంగా ఉంటుందనే విమర్శ గురించి మీరేమంటారు?

అవును ఉద్యమ అవసరాలు అలాంటి వాతావరణాన్ని కల్పిస్తాయి. అలాగని మొత్తం ఉద్యమ కవిత్వాన్ని ఒకే గాటన కట్టి తీర్పులివ్వడం కూడా సబబు కాదు. ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కన్న సాహిత్యానికి వేరే లక్ష్యం ఏముంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. కానీ, ఉద్యమ కవిత్వాన్ని సాధారణ కాలపు విమర్శ సూత్రాలతో కొలవడం సరికాదు. అది ప్రజలను ఏ మేరకు కదిలించింది, లేదా ప్రజల ఆకాంక్షలను ఎంత వరకు తాత్విక గాఢతతో అద్ధం పట్టిందనేదే ముఖ్యం. ఇక ఆవేశపూరితమైన గోసను నేను ధిక్కారమనే అనుకుంటాను. అరవయేండ్ల ఆకలి మంటల వేదనను పలికించేటపుడు కన్నీళ్లతో పాటు, ఆ కన్నీళ్లకు కారణమైన పరిస్థితుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది.

తెలంగాణ ఉద్యమం.. దళిత సాహిత్యం ఈ రెండూ ప్రత్యేక అస్తిత్వాలు. రెండింటిలోనూ మీదైన పాత్ర ఉంది. కవిగా, కథకుడిగా తెలంగాణ అస్థిత్వం నుంచి దళిత సాహిత్యాన్ని ఏ ప్రామాణిక దృక్పథంతో చూస్తారు?.. ఇంతకుముందు దళిత సాహిత్యం కులవృత్తి, రిజర్వేషన్లు, సామాజిక వివక్ష, దాడులు, వంటి వాటిపై చైతన్యం చేసే బాధ్యతను మోసింది.. ఈ తరం కవిగా ఇప్పుడు దళిత సాహిత్యం దేనిపై ఎక్కువ చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది..

గడిచిన వందేళ్లలో తెలంగాణ దళితులకు అందివచ్చిన అభివ్రుద్ధి అంతంత మాత్రమే. వెట్టిచాకిరిలో నలిగిపోయింది దళితులే, ఉద్యమాల్లో ప్రాణాలు సైతం త్యాగం చేసిందీ దళితులే. అన్ని రకాలుగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ఈ సమూహం నుండి ఎంతో సాహిత్యం రావాల్సి ఉండే. కానీ, మనువాదం, తెలంగాణ అగ్రవర్ణ భూస్వామ్యం దళితులను చదువుకోనివ్వలేదు. ఇక చదువుకున్న తొలితరం దళిత సాహిత్యకారులకు ఉండే నిరంతర మానసిక సంఘర్షణ వారిని కుదరుగా ఉండనివ్వలేదు. ముఖ్యంగా రాసుకోనివ్వలేదు. దళితోద్యమం ఉధ్రుతంగా వస్తున్న రోజుల నుండి తెలంగాణ నుండి బోయ జంగయ్య, మాస్టార్జీ, ఎండ్లూరి సుధాకర్, వేముల ఎల్లయ్య, గ్యార యాదయ్య వంటి కవుల నుండి ఇప్పటి నా తరం వరకు విలువైన సాహిత్య స్రుజన జరిగింది. కాకుంటే దానిని ఈ ప్రధాన స్రవంతి అనుకునే బ్రాహ్మణీయ వ్యవస్థ పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదు. అందుకే దళిత సాహిత్యాన్ని అంబేద్కరైట్ ద్రుక్పథం నుండి చూడాలి. ఇక ఇప్పుడు రాయడానికి దళిత కవుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆహార అప్రజాస్వామికత నుంచి కులాంతర వివాహాల పేరుతో దళితుల హత్య వరకు దళిత కవులను కుదిపేస్తున్న ఎన్నో వేదనలు కళ్ల ముందే ఉన్నాయి. వీటిని కాదని దళితులు రాసే పరిస్థితి లేదు.

ఆధునికత తీసుకొచ్చిన సాంకేతిక పదజాలాన్ని  ఒంటరి యుద్ధభూమి’లో కవితా నుడికారంగా బలంగా ప్రయోగించారు. చాలామంది మోటుగా భావించే  దళిత భాషకు ఆధునిక నుడికారం కొత్త అభివ్యక్తిని ఇచ్చినట్టయింది. కవిత్వం రాయడానికి ముందే శైలిని నిర్ణయించుకుంటారా?.. లేక ఎంచుకున్న వస్తువుపైనే దాని సార్ధక శైలి ఆధారపడి ఉంటుందా?

ప్రపంచ వ్యాప్తంగా భాషా రాజకీయాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆధిపత్య జాతులు అల్ప సంఖ్యాక జాతుల మీద తమ భాషలను బలవంతంగా రుద్దాయి. అందుకు తెలంగాణ కూడా మినహాయింపేమీ కాదు. అందుకే కెన్యన్ రచయిత గూగీ ‘‘భాష యిద్దరి మధ్య సంబంధాన్ని నెలకొల్పడమే కాదు, తెగ్గొడుతుంది కూడా’’ అని అంటారు. అగ్రవర్ణాలకు దళితుల భాష మోటుగానే ఉంటుంది. కానీ, దళితులదే జీవభాష. ఈ భాష మీద కనిపించని ఆంక్షలు కొనసాగుతున్నాయి. వేముల ఎల్లయ్య వంటి దళిత రచయితలు వాటిని లెక్కపెట్టకుండా రాస్తూనే ఉన్నారు. ఇక నా వరకు వచ్చే సరికి ఈ ఆధునిక తరానికి కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా భాష కావాలి అనుకున్నాను. చాలా షార్ప్ గా చెప్తే తప్ప వారికి చేరదు. శత్రువు కార్పోరేటీకరణ చెందుతున్నాడు. అందుకే ఈ పుస్తకంలో ఓ చోట నేను ‘‘వెలివాడ నా వెంట నడిచే నెట్ వర్క్, కులం నన్ను వీడని వైఫై’’ అన్నాను.

 

-ఇంటర్వ్యూ : శ్రీనివాస్ సాహి  కవి, పాత్రికేయుడు

శ్రీనివాస్ సాహి

3 comments

Leave a Reply to కందుకూరి శ్రీనివాస్, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కందుకూరి శ్రీనివాస్, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ says:

    ఇంటర్వ్యూ చిన్నగా ఉన్నా చాలా పెద్ద పెద్ద విషయాలు వెలుగులోకి తెచ్చారు..
    అవును ఆగిపోయింది అగ్రవర్ణ సాహిత్యమే 100కి 100 శాతం…ఇది నిజం..
    ఎవరు కాదన్నా అవునన్నా..
    అణచివేతలు, అస్పృశ్యతల పై నా యుద్ధం కొనసాగుతూనే వుంటుంది..అన్న టువంటి అన్న గారి మాటలు అద్భుతం…
    ఇంకొకటి అన్నగారు చెప్పినట్లు..ఇవాళ్టి కాలంలో ఆవేశపూరితంగా, గోసను వెళ్లగక్కే విధంగా రంగరిస్తేనే అర్థం అవుతుంది నేటి సమాజానికి, లోకానికి…

    చాలా బాగుంది సార్ ఇంటర్వ్యూ…

    కవి, జర్నలిస్ట్ శ్రీనివాస్ సాహి గారికి, ఆధునిక యుద్ధనౌక పసునూరి రవీందర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు…

    ఇట్లు..
    కందుకూరి శ్రీనివాస్
    99టీవీ
    సీనియర్ డెస్క్ జర్నలిస్ట్
    9666103570

  • అవును, ఆగిపోయింది అగ్రవర్ణ సాహిత్యమే. కానీ, జరగాల్సింది ఆగటం కాదు, చంపాలి, అది బ్రతికుండకూడదు.

  • అన్నా! రవీందర్ , నువ్వు దళిత ధిక్కార స్వరానివి…. లక్షల గొంతుల ప్రతినిధివి….నీ వాదన జనామోదం… నీ కవిత్వం కోటి మెదళ్ళ కు జ్ఞానోదయం….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు