అసమాన అనసూయ గారూ -నేనూ-1

తెలుగు నాట జానపద, భావ గీత, లలిత సంగీత ప్రక్రియలకి ఆద్యురాలు “కళా ప్రపూర్ణ”, ‘అసమాన అనసూయ” డా. అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు మొన్నటి మార్చ్ 23, 2019 నాడు తన 99వ ఏట వాషింగ్టన్ D.C లో ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు, మనవలు, మనవరాళ్ళ మధ్య సునాయాస మరణం పొందారు. ఆమె గురించి తెలిసిన వారికి మరి కొంతా, తెలియని వారికి క్లుప్తంగానూ, తెలిసీ తెలియని వారికి స్పష్టత కోసమే కాక ఆ మహా మనీషితో నా జీవిత కాల వ్యక్తిగత అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆత్మీయ అశ్రు నివాళి అర్పించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.

ఆమె నిర్యాణంతో తెలుగు సంగీతానికి ఒకటా, రెండా ..ఏకంగా తొమ్మిది దశాబ్దాల సేవలు అందించిన ఆ తరం అంతరించింది. 1930 దశకంలో కామెడీ పాటలు గా పిలవబడిన జానపద గేయాలకి తన తొమ్మిదవ ఏటనే “అయ్యో కొయ్యోడ” అనే గ్రామఫోన్ రికార్డు విడుదల చేసి, సంగీత సభలలో ఎలుగెత్తి పాడి జాన పద గేయాలకి సభా గౌరవం దక్కించిన తొలి గాయని అనసూయ గారు. మన పల్లెలలో పచ్చటి పొలాలలో “నో మీన మల్లాల” అని పాడుకోడానికీ, “మొక్క జొన్న తోటలో” విహరించడానికీ, “రామనాసందనాలో” అని ఎలుగెత్తి పాడదానికీ, “అన్నాడె వస్తనన్నాడె” అని ప్రియుడి మీద బెంగ పెట్టుకోడానికీ, “నక్కలోళ్ళ సినదాన్ని” గా వగలు పోడానికీ, “ఎద్దు బండి మీద గడ్డిలో కూచుని బండి పాట” పాడుకోడానికీ, “తర్లీ వచ్చే పెళ్లి కుమారిత పల్లకి” లో పులకించిపోడానికీ….కొన్ని వందల స్వచ్చమైన తెలుగు పాటలే. సొంత నేల మీద బంక మట్టి లో పుట్టిన మాణిక్యాలు. వాటిని కనిపెట్టిందీ, పెంచి పోషించిందీ, కష్టపడి కాపాడిందీ, పదిమందికీ పంచి ఇచ్చిందీ, నిలబెట్టిందీ అన్నీ అనసూయమ్మ గారే.

అసలే బాల మేధావి, పైగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలు కూడా కాబట్టి ఆయన వ్రాసిన “దిగిరాను, దిగిరాను, భువి నుండి దివికి” మొదలైన అసంఖ్యాక కవితలకీ, రాయప్రోలు, నండూరి, బసవరాజు అప్పారావు మొదలైన భావ కవులు, శ్రీశ్రీ లాంటి అభ్యుదయ కవుల కవితలకి బాణీలు కట్టి, సభల్లో పాడి ‘భూమి మీదకి దించిన’ తొలి గాయనీ మణి అనసూయ గారు. ఆనాడు ఆ గేయాలని లలిత శాస్త్రీయం అనీ, భావ గీతాలు అనీ పిలవగా ఈ నాడు వాటికి లలిత సంగీతం అనే స్పష్టమైన రూపం స్థిరపడింది. ఇక 1935 లోనే దేవులపల్లి వారి ‘జయ జయ ప్రియ భారత”, “హే భారత జననీ”, “ప్రాభాత ప్రాంగణాన మ్రోగేను నగారా” లాంటి అనేక దేశభక్తీ గేయాలకి అసమానమైన స్వర కల్పన చేసి ఎలుగెత్తి పాడిన మహా గాయని అనసూయ గారు. అన్నింటిలోను ఆమె సహా గాయని చెల్లెలు సీత.

సీతా -అనసూయలుగా వారిద్దరూ యావత్ తెలుగు దేశాన్ని అనేక దశాబ్దాల పాటు ఉర్రూత లూగించారు. ఈ నాటి వారు నమ్మక పోవచ్చు కానీ 1930 నుంచి సుమారు 1980 దాకా తెలుగు నాట పాట కచేరీలు రెండే రెండు రకాలు. ఒకటి శాస్త్రీయ సంగీతం. రెండు సీతా -అనసూయ ల లలిత, జానపద సంగీత కచేరీ. ఒక సారి మా ఊళ్లో జరిగిన తన కచేరీలో బాల మురళి ముందు వరసలో తనకెంతో ఆత్మీయురాలైన అనసూయ గారిని చూసి శ్రోతలతో “నాకు ఈ అనసూయ అంటే భలే అసూయ. కోపం. ఎందుకంటే మద్రాసులో ఎప్పుడు నా కచేరీ పెట్టినా సరిగ్గా ఎదురుగుండా హాల్ లో అనసూయ కచేరీ కూడా పెట్టేవారు. దాంతో జనం అంతా అక్కడికే పోయే వారు. నా హాలు ఖాళీగా ఉండేది” అని తన అభిమానాన్ని చాటుకున్నారు బాల మురళి. ఆ రోజు అనసూయ గారి పక్కన కూచున్నది నేనే.

ఇక నా స్వగతానికి వస్తే…

అప్పడు ఆమె వయసు 25:…1955 వ సంవత్సరం…కొంచెం అటూ ఇటూగా…

……నాకు ఇంచుమించు పదేళ్ళప్పుడు ….ఎప్పటిలాగే ఆ రోజు కూడా స్కూల్ అయిపోయాక మా కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో క్రికెట్ ఆడేసుకుని ఇంటికొచ్చేద్దాం అనుకుంటుంటే మా గ్రౌండ్స్ కి అవతల పక్క పెద్ద పందిరి లో ఏదో కార్యక్రమం అవుతుంటే అదేదో చూద్దాం అని వెళ్లి మా ముఠా అందరం వేదికకీ, ముందు వరస కుర్చీలకీ మధ్య వేసిన చాపల మీద కూచున్నాం. ఇంతలో ఎవరో వేదిక మీద మైక్ దగ్గరకి వచ్చి, ఇప్పుడు ప్రార్ధనా గీతంతో కార్యక్రమం మొదలవుతుంది అని ప్రకటించారు. అంతే…ఇద్దరు సౌందర్యరాశులు, నొక్కుల జుట్టూ, మెరిసే కళ్లూ, ఆ రోజుల్లో అపురూపం అయిన లిప్ స్టిక్కూ, కట్టుకున్న చీరా, జాకెట్టూ, వేసుకున్న గాజులూ, పెట్టుకున్న జుంకాలు, తొడుక్కున్న జోళ్లూ ..ఒకటేమిటి మొత్తం అంతా మేచింగ్ ఆహార్యం తో వేదిక మీదకి వచ్చారు. అందులో ఒకావిడ హార్మోనియం ముందు పెట్టుకుని “జయ జయ ప్రియ భారత” అని గళం విప్పగానే మాకే కాక, కుర్చీలలో కూచున్న పెద్దలూ, వెనకాల నుంచున్న సుమారు వెయ్యి మంది పి.ఆర్. కాలేజ్ కుర్రాళ్ళు..ఇలా అందరికీ ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ గళం అనసూయ గారిది. పక్క స్వరం సీత గారిది. వారిద్దరినీ నేను చూడడం అదే మొదటి సారి…..మరొక ఇరవై ఏళ్ల దాకా అదొక్క సారే వాళ్ళని చూడడం. అప్పుడు నా వెనకాల కుర్చీలో కూచున్న ఒక రింగు రింగుల జుట్టు ఉన్నాయనే ఆ పాట వ్రాశారు అనీ….ఆయన పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారూ అనీ…ఆ నాటి కార్యక్రమం ఆయన మా పి.ఆర్. కాలేజ్ లో మొదలు పెట్టిన సాంస్కృతిక వారోత్సవాల పరంపరలో అదే మొదటిదో, రెండోదో అనీ…. నాకు అప్పుడు తెలియదు. అప్పటి నా అజ్ఞానాన్ని ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తుంది.

ఆ తర్వాత సీత-అనసూయలు గంట పైగా కచేరీ చేసి కుర్రకారుని ఉర్రూతలూపేశారు. కానీ ఈ నాటి లాగా స్టేజ్ మీదకి వచ్చి ఎవరూ స్టెప్పులు వేసిన జ్ఞాపకం లేదు. అప్పుడు ఆమె వయసు 25. ఆ రోజుల్లో వాళ్ళిద్దరి పాటలూ రేడియో లో మారుమోగి పోయేవి. పొద్దున్న బాలాంత్రపు రజనీ కాంత రావు భక్తిరంజని తర్వాత సీత-అనసూయ ల లలిత సంగీతం ప్రోగ్రాం అర గంటో, గంటో ఉండేది. ఆ విధంగా వాళ్ళ పాటల తోటే పెరిగాం మా తరం.

అప్పుడు ఆమె వయసు 57….అది 1977,

మే నెలాఖరు. న్యూయార్క్ నగరం. మళ్ళీ అదే ఇరవై ఏళ్ల క్రిందటి అనుభవం. అమెరికాలో జరిగిన మొట్ట మొదటి తెలుగు సమావేశం. ఆ జాతీయ సమావేశానికి ఇండియా నుంచి ఆహ్వానించబడిన ఏకైక కళాకారులు – ఇంకెవరూ..అనసూయ గారూ, సీత గారూ… రాజకీయ నాయకులు, సినీ తారలు లేనే లేరు. హ్యూస్టన్ నుంచి నేనూ, అనిల్ కుమార్, రత్న పాప, దువ్వూరి సూరి ప్రత్యేక ప్రతినిధులం. సీతా అనసూయ లని ఆహ్వానించి రప్పించడానికి మేమే కారణం. ఎందుకంటే మా రత్నపాప అనసూయ గారి పెద్ద కుమార్తె, అప్పటికే ప్రపంచ ప్రసిద్ద నర్తకి. అనిల్ కుమార్ ఆమె భర్త. మొదటి రోజు సాయంత్రమే మా హ్యూస్టన్ బృందం సమర్పించిన రెండు కార్యక్రమాలు. అందులో ఒకటి నేనే వ్రాసిన “తాండ్ర పాపారాయుడు” బుర్ర కథ – సూరీ, అనిలూ, నేనూ చెప్పాం….అమెరికాలో మొదటి బుర్ర కథ. ఆ తర్వాత ..సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం లాగానే .. ఇద్దరు సౌందర్యరాశులు, నొక్కుల జుట్టూ, మెరిసే కళ్లూ, ఆ రోజుల్లో అపురూపం అయిన లిప్ స్టిక్కూ, కట్టుకున్న చీరా, జాకెట్టూ, వేసుకున్న గాజులూ, పెట్టుకున్న జుంకాలు, తొడుక్కున్న జోళ్లూ ..ఒకటేమిటి మొత్తం అంతా మేచింగ్ ఆహార్యం తో వేదిక మీదకి వచ్చారు. కానీ ఈ సారి అనసూయ గారు హార్మోనియం ముందు వేసుకుని…”ఓ.ఓ..ఆలాపన….అది వినగానే అమెరికాలో ఆ నాటి రెండు వేల మందీ తప్పట్ల మధ్యలో…..రత్న పాప కాశ పోసి కట్టుకున్న గళ్ళ పసుపు కోక చుట్టి పల్లె పడుచు వేషంలో రంగ ప్రవేశం…. “మొక్క జొన్న తోటలో, ..” అని గొంతెత్తి అనసూయ గారూ, సీత గారూ పాడుతూ ఉండగా దానికి రత్న పాప అద్భుతమైన హావభావాలతో చేసిన నృత్యం ..నాకు ఆ పది నిముషాలూ ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టే కనపడుతుంది. తెలుగు జానపదానికి అమెరికాలో అది నాందీ ప్రస్తావన…అనసూయ గారు స్వయంగా పాడుతూ ఉండగా ఆ పాటే కాదు, ఎన్నెన్నో జానపద గేయాలకి పాప నాట్యం చూసిన అతి కొద్ది అదృష్టవంతులలో నేనూ ఒకడిని. న్యూ యార్క్ లో సీత-అనసూయ ల కచేరీ, పాప నృత్యం.. నభూతో న భవిష్యత్….మా బుర్ర కథ కూడాను…

ఇక న్యూ యార్క్ నుంచి అందరం హ్యూస్టన్ వచ్చాక….అప్పటికి ఇంకా బ్రహ్మచారినే అయిన నేను ఇంచు మించు రోజూ అనసూయ గారి దర్శనం చేసుకునే వాడిని. ఇంకా అన్యాయంగా నా వన్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కి భోజనానికి పిలిస్తే ఆవిడా, సీత గారూ వచ్చేవారు. ఎందుకంటే నాదీ కాకినాడ కాబట్టి ఆవిడకి ఆ కబుర్లు చెప్పడం భలే ఇష్టం కాబట్టి నా మీద ఎనలేని అభిమానం పెంచుకున్నారు. ఆ కబుర్లలోంచి పుట్టిన ఒక గొప్ప ఆలోచన నాకూ, అనిల్ కీ వచ్చింది. ఇంకేముందీ…అనసూయ -సీత గార్ల చేత ”మన పల్లె పదాలు” అనే గ్రామఫోన్ రికార్డ్ తయారు అయింది. నాకు తెలిసీ అమెరికాలో తయారు అయిన మొట్ట మొదటిది అయిన ఆ గ్రామఫోన్ రికార్డు ఫోటో ఇక్కడ పెట్టాను. అందులో పాడిన స్థానిక గాయనీ గాయకుల పేర్లలో నా పేరు కూడా ఉంటుంది కానీ ఇక్కడ అనసూయ గారి హాస్యోక్తి చెప్పి తప్పు ఒప్పేసుకోవాలి. అంటే…ఆ ఆల్బం తయారీకి పెట్టుబడి నాదే కాబట్టి నేనూ పాడతాను అనసూయమ్మ గారూ…అని నేను అడిగాను. “సరే, ఈ పల్లవి పాడు” అని ఆవిడ అడగడం, నేను పాడడం, ఆవిడ వినడం….ఆరు నూరైనా మైక్ కి ఇరవై అడుగుల దూరంలో తప్ప నేను కూచోకుండానూ, ఏదో హాయ్, కోయ్ లాంటి కోరస్ పదాలు మాత్రమే పాడేటట్టు జాగ్రత్త పడ్డారు. ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లంకె లో ఆ రికార్డు వినవచ్చును. కానీ ఆవిడ బిజీగా ఉన్నప్పుడు నేను మటుకు మైక్ దగ్గరకి అంచెలంచెలుగా వెళ్ళి పాడేశాను అనుకోండి. అది వేరే సంగతి. అందుకే నా గొంతు కోరస్ లో వినపడుతుంది.

ehttps://www.youtube.com/watch?v=ls9FXBHuX-s&feature=youtu.be

ఆ తరువాత అమెరికాలో వాళ్ళ కార్యక్రమాలు చికాగో లోనూ, ఇతర చోట్లా ఏర్పాటు చేసి, నేను కూడా వెళ్ళి ఆనందించే వాడిని. బ్రహ్మచారిని కదా!

ఆ తర్వాతి సంవత్సరం ..అంటే 1978 ఏప్రిల్ లో ఒక తమాషా జరిగింది. అంటే నాకు పెళ్లి అయింది. అవగానే మా ఆవిడ వీసా కోసం ఇద్దరం మద్రాసు వెళ్ళాం. వీసా పని అవగానే వెతుక్కుంటూ అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళాం. చెప్పాపెట్టకుండా వచ్చిన మా ఇద్దరినీ చూసి ఆవిడ ముందు నిర్ఘాంత పోయారు. అయితే తక్షణం “చెప్పా పెట్టకుండా పెళ్ళి చేసుకున్నావా? ముందు చెప్తే నేను వచ్చి పాడుదును కదా” అని కోప్పడ్డారు. మమ్మల్ని కూచోబెట్టి, హార్మోనియం తెచ్చుకుని “సీర కట్టూకోని సిలకలా గున్నావు, రయిక తొడుగూ కోని రంభ లా గున్నావు” అని ఆవిడ మా ఆవిడ ని చూస్తూ పాడగానే ఇంకే ముందీ….ఆ కొత్త పెళ్ళికూతురు సిగ్గుతో మెలికలు తిరిగి పోయింది. అంతే కాదు గబ గబా ఇంట్లోకి వెళ్లి ఓ పట్టు చీరా, జాకెట్ గుడ్డా, లోపలి గోడ మీద ఉన్న ఒక అజంతా బొమ్మ పెయింటింగూ మా చేతిలో బహుమతిగా పెట్టి మమ్మల్ని ఆశీర్వదించారు సహజ సిద్ధమైన అభిమానానికి మారుపేరు అయిన అనసూయ గారు. రెండేళ్ళ తర్వాత మా తమ్ముడి పెళ్లి అయినప్పుడు ముందే చెప్పి కాకినాడలో మా ఇంట్లో పెద్ద పందిరి, వేదిక ఏర్పాటు చేసి, ఊరి పెద్దలందరినీ పిలిచి సీత-అనసూయ ల పాట కచేరీ ఏర్పాటు చేశాను. “చాలా కాలం తర్వాత మళ్ళీ కాకినాడలో పాడించావయ్యా “ అని దానికి ఆవిడ ఎంతగానో పొంగి పోయారు.

 

ఆ తరువాత అచిరకాలం లోనే అనసూయ గారు అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. హ్యూస్టన్ లో ఉన్న పెద్ద కుమార్తె రత్న పాప, పెద్ద కొడుకు కృష్ణ గిరి (డుంబు), కాలిఫోర్నియాలో ఉన్న రెండో కొడుకు నిహార్ (బబ్లు), వాషింగ్టన్ DC ప్రాంతంలో ఉన్న మూడో కూతురు కమల ..ఇలా ఒక్కో చోట కొన్నేసి నెలలు, మధ్యే మధ్యే మద్రాసులో ఉన్న రెండో కూతురు చిన సీత దగ్గరకి వెళ్ళడం , ఎక్కడికి వెళ్ళినా వయస్సుతో నిమిత్తం లేకుండా సంగీత వ్యాపకాలతో, పిల్లలకీ, పెద్దలకీ జానపద, లలిత గేయాలని నేర్పి పాడించేవారు అనసూయ గారు. ఎక్కడికి వెళ్ళినా అగ్ర తాంబూలం ఆవిడకే.

అనసూయ గారు ఇండియాలో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు రచించారు. వాటిల్లో అందరూ పాడుకోడానికి వీలుగా స్వరాలు వాటికి తగ్గ తాళ నియమాలతో ఆమె రచించిన జానపద గేయాలు, భావ గీతాలు, ఇంటింటి పాటలు, సంవాదాల పాటలు, పండుగలు, పూజల పాటలు మొదలైన 8 పుస్తకాలు ఎంతో ఆదరణ పొందాయి. సంగీతం నోటేషన్స్ తో పాటల పుస్తకాలు వ్రాసే పద్దతి తెలుగు నాట ప్రవేశ పెట్టింది అనసూయ గారే. అవన్నీ ఆవిడకి 70 ఏళ్ల వయసు ముందు వ్రాసినవే.

అప్పుడు ఆమె వయసు 76:…అంటే 1996 లో…

(మిగతా వచ్చే సంచికలో)

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు