దొస్తోయేవస్కీ మొదటి రచన. మహా రచయితల మొదటి రచన ఏ మాత్రం ప్రధమ రచనలా అనిపించదు. దొస్తోయవస్కీ వంటి రచయిత రచనలు చాలామంది చదవకపోయినా ఆయన గొప్పతనం విని ఉంటారు. నేనూ అలాంటి వారిలో ఒకడినే. ఆ ప్రభావం వలన మొదటి రచనే గొప్ప రచన అనడం లేదు. ఆ రచన చదివాక అంటున్న మాట.
రష్యన్ సాహిత్యంలో మొట్టమొదటి సామాజిక నవలిక పేద జనం అన్న మాట వినగానే ప్రేమ్ చంద్ మొదటి రచన “అస్రార్-ఎ-మాబిద్” (హిందీలో దేవస్థాన్ రహస్య) అంటే “దేవుడి ప్రపంచ రహస్యాలు” గుర్తొచ్చింది. ప్రేమ్చంద్ 1903 – 1905 మధ్య ఈ కథలు రాసాడు. ఆ కథలన్నీ దేవుడి గుళ్ళలో పూజారులు దేవుని పేరిట
కొనసాగిస్తున్న లంచగొండితనం, పేద స్త్రీల ఉత్పీడనం గురించి రాసినవి. అంతవరకు ఊహాలోకంలో, కల్పనల్లో తిరుగాడుతున్న హిందీ సాహిత్యాన్ని ప్రేమ్చంద్ నేలమీదకు తీసుకొచ్చాడు. సరిగ్గా దొస్తోయవస్కీ పేద జనం నవలికకి ముందు రష్యన్ సాహిత్యం చాలామటుకు మత గ్రంథాల చుట్టూ తిరుగుతుండేది.
పేద జనం లేఖల రూపంలో రచించిన మొదటి నవల. (Epistolary novel) వుప్పల లక్ష్మణరావు గారి స్వీయ రచనల్లో మొదటిది ఆఖరిదీ కూడా లేఖల రూపంలో నాలుగు భాగాలుగా రాసిన నవల “అతడు-ఆమె”. రష్యన్ సాహిత్యం నుంచి ఎన్నో గొప్ప పుస్తకాలను అనువదించిన లక్ష్మణరావు గారికి పేద జనం నవలిక బహుశా ఒక ప్రేరణ అనిపిస్తుంది.
ఈ నవలికలో నాయకుడు మకార్ దేవుష్కిన్ అంతకు ముందు రష్యన్ సాహిత్యంలో తరచు దర్శనమిచ్చే ధీరోదాత్త యువకుడు కాదు. కేవలం పేదరికంలో మగ్గిపోతున్న ఒక సామాన్య గుమాస్తా. ఏ అందం లేని ఒక సాధారణ వ్యక్తి. నాయకురాలు వారెంకా దొబ్రొస్యలోవా కూడా ఒక సామాన్య గుమాస్తా మాత్రమే. జీవితంలో పేదరికాన్ని, కష్టాలని అనుభవించిన స్త్రీ. ఇరువురి మధ్యా సుమారు ఆరు నెలల పాటు ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తాయి. ఆ ఉత్రరాలలో అత్యధిక భాగం మకార్ దేవుష్కిన్ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, ధనిక పేద జనుల మధ్య ఆర్థిక తారతమ్యాల పట్ల వెలిబుచ్చిన కోపం. ఆ దుర్భర పేదరికం కలిగించే మానసిక వేదన తత్ఫలితంగా కలిగే సంఘర్షణ అతడి ఉత్తరాలలో ప్రతిఫలిస్తుంది. పూర్తిగా నవలిక దొస్తోయవస్కీ ఆత్మచరిత్ర అనడం సరికాదు కానీ ప్రధాన పాత్ర మకార్ పేదరికంలో పడిన కష్టాలు, మధ్య సేవనం నుండి బయటపడేందుకు చేసిన ప్రయత్నం వంటి ఘటనలు రచయిత జీవితంలో స్వయంగా జరిగినవే.
మనస్తత్వ శాస్త్ర కోణంలో నవలను విశ్లేషించాలంటే ప్రధాన పాత్ర మకర్ దేవుష్కిన్ తన జీవిత విధానం, పేదరికం, ధరించే దుస్తులు కలిగించే ఆత్మన్యూనతా భావం నుంచి పైకొచ్చే ప్రయత్నంలోనే నాయకురాలు వర్వరా దొబ్రొస్యోలోవాకు ఒక్కోసారి తన ఆర్థిక తాహతుకు మించి సహాయం చేయటానికి కారణం.
దేవుష్కిన్ తన ఇరుగు పొరుగు వారంటే పడే భయం, కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు, అధికారులు అంటే ఉండే భయం చిత్రణ, చిన్న ఘటనలకే అతడు పడే ఆందోళన నవలలో అత్యంత శక్తిమంతంగా చిత్రించాడు దొస్తోయవస్కీ. అందువలనే అతని రచనల గురించి ఫ్రెడరిక్ నీషే “I learnt psychology from Dostoevsky” అన్నాడు.
ప్రధాన పాత్ర దేవుష్కిన్ తన పరిస్థితుల దృష్ట్యా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నా అది అతన్ని పూర్తిగా కృంగదీయదు. ఆ పరిస్థితులలోనే సకారాత్మక సాహిత్యం పట్ల అతడి అభిరుచి, పొరుగువారి కష్టాల పట్ల సహానుభూతి, ప్రకృతి పట్ల ఆరాధన మిగిలి ఉంటుంది. రష్యన్ రచయిత , మ్యూజికాలజిస్ట్ గ్రిగరీ కోగన్ నవల గురించి “సంతోషాన్ని అనుభవించేందుకూ ఆత్మగౌరవాన్ని కలిగి ఉండేందుకూ పేద జనానికి గల హక్కును దొస్తోయవస్కీ నవల రూఢి చేసింది” అంటాడు. దొస్తోయవస్కీ సాహిత్య అధ్యయనానికి పేదజనం నవలిక మొదటి మెట్టు.
చాలా కాలం క్రితం సోవియట్ యూనియన్ రాదుగ ప్రచురణల్లో వెలువడిన ఈ నవలని సాహితీ ప్రచురణలు సంస్థ పునః ప్రచురించి నేటి సాహిత్య ప్రియులకు దగ్గర చేసింది. నిడమర్తి ఉమారాజేశ్వర్రావు గారి అనువాద సరళి పుస్తకం మొదలుపెడితే త్వరగా ముగించేలా ప్రేరేపిస్తుంది.
*
పేద జనం : నవలిక: దొస్తోయేవ్స్కీ : తెలుగు సేత : నిడమర్తి ఉమారాజేశ్వర్రావు : సాహితీ ప్రచురణలు : వెల 150/- : ప్రతులకు: 8121098500, 0866-2436642








Add comment