ఆధునిక తెలుగు కవిత్వం తెలుగులో అనేక రూపాలలో అసంఖ్యాక విషయాలను వ్యక్తీకరించే వెసలుబాటునిచ్చింది. స్థూలంగా చూసినప్పుడు ఆధునిక కవిత్వంలో భాగాలైన అస్థిత్వ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవ్య కవిత్వం, భావ కవిత్వం, దిగంబర కవిత్వం, పైగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, అధివాస్తవిక కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీ వాద కవిత్వం యిలా అనేక పాయలుగా కవిత్వం పరిఢవిల్లుతోంది. యిలా వివిధ పాయలుగా వస్తున్న కవిత్వంలో రూప సంబంధమైన వైవిధ్యం కొంతే ఉన్నప్పటికీ వస్తువు వ్యక్తీకరణ విషయాలలో చాలా వైవిధ్య భరితమైన కవిత్వం వస్తూనే ఉంది.
కవిత్వమెప్పుడూ సమకాలీన సంక్షోభాలనూ మానసిక సంఘర్షణలనూ ప్రతిబింబించే ప్రక్రియగానే చూడడం తెలుగునాట అభ్యుదయవాద వ్యక్తీకరణతో మొదలై సుమారు ఇరవయ్యో శతాబ్దపు చివరిదాకా కొనసాగింది. నూతన ఆర్ధిక పారిశ్రామిక సాంకేతిక విధానాల నేపథ్యంలో అంతకుముందున్న ధోరణి కొంత పలచబడడంతోపాటు వ్యక్తీకరణలో వచ్చిన నవ్యత ఇరవై ఒకటవ శతాబ్దపు కవిత్వ లక్షణం అయింది.
ఇరవయ్యోశతాబ్దపు మలి అర్ధభాగంలో కవులుగా తమ ప్రయాణం ప్రారంభించిన వారిలో కొందరు ఇరవై ఒకటవ శతాబ్దపు వొరవడిని అందుకోవడంతోపాటు వారి దృష్టికోణాన్నీ అభివ్యక్తినీ మెరుగు పరచుకున్నారు. సమాజ చలనం పట్లా సంక్షోభాలపట్లా తమ స్పందనను నూతన అభివ్యక్తితో ప్రకటిస్తున్నారు.
తెలుగు ఆధునిక కవిత్వంలోని అభివ్యక్తికి ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య కవిత్వం తోడ్పడితే, ఈ శతాబ్దంలో వస్తున్న కవిత్వం మునపటి ప్రభావాలతోపాటు ఈ శతాబ్దపు సంక్లిష్టతనూ సంతరించుకుంది. విషయ విశదీకరణలో అంతర్ దృష్టినీ మెరుగుపరచుకుంది.
ఈ శతాబ్దపు తెలుగు కవితలో సామాజిక పరిణామాలపై ప్రకటనలూ నిరసనలూ సంఘీభావాలతోపాటు ఆత్మిక విశ్లేషణలూ ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.
ఒక ఇటీవలి కవి శ్రీసుధ మోదుగు రాసిన ఈ కవితను చూడండి.
‘వారు’
“అనుకోకుండా ఎదురవుతారు
అప్పటికి చుక్కలు అందంగా ఉంటాయని సూరీడు వెలుగు ఇస్తాడని
యింకా ఎన్నో అద్భుతమైన ఊహాగానాలు చేస్తుంటావు
వాళ్ళు నీ కాళ్ళకింద భూమిని జరిపేస్తారు
ఆకాశంలో ఏమీ లేదని తేల్చేస్తారు
నీ చేతుల్లో పూలను విసిరి కొడతారు
బోసిపోయిన నలుదిక్కుల ఖాళీ ప్రపంచాన్ని చూపిస్తారు
అప్పటికీ ఆవేశంగా దుఃఖంగా సముద్రమని పక్షులని
ప్రేమలని తాపత్రయ పడతావా
వారు సముద్రాన్ని వెలేసి పక్షుల్లా ఎగిరి ప్రేమలపై నడిచి
నిన్ను ఒకానొక సూదిమోనపై నిలబెట్టి వెళ్ళిపోతారు”
వ్యక్తిపూజ సహజమైన సమాజంలో చివరి పరిణామాన్నీ, ‘నిన్నూ’ (వ్యక్తిని) ‘సూదిమోనపై నిలబెట్టి’ వెళ్ళిపోయే వైనాన్నీ ఈ కవి ఎలా చెప్పారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ‘సముద్రం’ ‘ప్రేమలూ’ ‘అద్భుతమైన ఊహాగానాలు’ ‘ఖాళీ ప్రపంచం’ లాంటి పదాలు పదాలు మాత్రమే కావనీ కవి ప్రతీకాత్మకంగా ప్రయోగించిన అస్త్రాలనీ కొంచం పరిశీలించగల వారెవరికైనా అర్థమవుతుంది. ఈ కవితలో కవి ప్రతీకాత్మకంగా వెలిబుచ్చిన భావం ‘నమ్మకం’ వలన ఒనగూడే పలితం అని ప్రతీకాత్మకంగా కాక వాచ్యంగా చెబితే అది ఒక కవిత్వపు అభివ్యక్తి కాలేదు.
ఇప్పటి కవి మునపటి ప్రతీకలనూ, జీవిత అనుభవాలనూ సమాజ పరిణామాలనూ మనిషి పోకడలనూ కలగలిపి అందించిన కవిత ఈ తరం కవుల ఆలోచనలకు ఒక మచ్చుతునక. ఈ కవిత తన ముఖపుస్తక గోడపై కవి ఈ సంవత్సరం నవంబర్ పదకొండున ప్రకటించారు.
ఇటీవల ఒక ప్రతిఘటనా పోరాటంలో పాల్గొంటున్న ఒక ఆదివాసీ మరణం పట్ల పెద్ద సంఖ్యలో స్పందన రావడం చూశాం. స్మృతి కవిత్వమూ అలాగే ప్రకటితమైంది. ఈ సందర్భంలో ఇరవయ్యో శతాబ్దపు చివరి దశాబ్దాలలో కవి సౌదా రాసిన ఒక కవితలోని ఒక పాదం గుర్తొచ్చింది.”స్మృతిగీతాలనేం రాస్తావు సందేహపు మృతిగీతాలను రాయి” అంటూ ఒక సందేహాస్పద మరణంపై రాసిన స్మృతి గీతం అది.
పైన పేర్కొన్న ఆదివాసీ మరణం పట్ల సౌదా సమకాలికుడైన కవి అఫ్సర్ రాసిన ఈ క్రింది కవిత ఇప్పటి కవిత్వపు లోతులను తెలియజేస్తుంది.
“నేల కనే కల”
‘నువ్వు యేనాడూ అడవి కళ్ళల్లోకో
నేల పగుళ్ళలోకో చూసి వుండవు కాబట్టి
ఈ విషాదం నీకు కొత్త
శరీరాన్ని వుండచుట్టి పారేసే
రాజ్యమా నీకు కొత్త
నేలకి దూరంగా నిలబడ్డం అలవాటై
యింకా ఈ నీటి చెమ్మ
నిన్ను తాకడమే లేదుగానీ
అడుగుపడ్డచోట సముద్రమే ఇక్కడ
ఎప్పుడూ ఆకాశాన్ని అంటిపెట్టుకుని
తిరుగుతూ ఉంటావ్ కాబట్టి
అడవి తల మీద వాలిన ఖడ్గ సమూహాలు
నువ్వు చూడనే లేదుగానీ
జెండా అయిన ప్రతి తలా తెగిపోయింది యిక్కడ
ఎంతరాగం తీసినా నీ ఏడుపు పాట
కన్నతల్లుల శోకంలో వొక్క అరనీటి చుక్క కాదు.
అడవి వూళ్ళోకొస్తుంది
అడవి నేలని ముద్దాడుతుంది
నేలకు తెలుసు తన సూర్య కవచం ఏమిటో’
ఒక విషాదాన్ని కవితగా చేయగల కవులు మనకు కొత్తగాదుగానీ స్మృతిగీతాన్ని ప్రతీకలతో ప్రకటించగల నేర్పు ఎంతగా కవికి ఉపయోగపడిందో ఈ కవితద్వారా తెలుసుకోవచ్చు. అడవి, నీటిచెమ్మ, సముద్రం, ఖడ్గ సమూహాలు, జెండా, కన్న తల్లి, అడవి ఊళ్ళోకి రావడం, యిక్కడ ప్రతీక కానిది ఏమిటి? ఒక విషాదాన్ని వివరించడానికి కవి తన పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించుకున్న తీరు యువ కవులకు ఒక నమూనా.
ఈ కవితను చూసినప్పుడు నాకు మాక్బెత్ రాజ్యాన్ని చుట్టుముట్టిన బిర్నాం అడవి గుర్తొచ్చింది. అడవినుండి ఉద్యమం ఊళ్ళోకి వస్తుందో లేదోగానీ అడవి తనకోసం తానే ఊళ్ళోకి వస్తుందనే కవి వూహ ఈ స్మృతి గీతానికి ఒక ఆశావహ ముగింపునూ ఇచ్చింది.
*







మంచి విశ్లేషణ sir. అభినందనలు