అడయార్ కధలు

వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .

మద్రాసు మహానగరాన్ని చూస్తే ఆశ్చర్యంగా వుండేది . ఒక్కో సారి రోడ్ దాటాలంటే 10 నిమిషాలు పట్టేది . పైగా ప్రవాహంలా వాహనాలు వెళ్తూనే వుండడం చూట్టం నాకు అదే మొదలు. మన విశాఖపట్నం ఎంత పల్లెటూరో కదా మద్రాస్ తో పోలిస్తే అనిపించింది . ఇప్పుడున్న హైదరాబాద్ లాగా అంతూదరీ లేని మహానగరంలా కనిపించింది .
జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయం అది . గతంలో తెలుగుసినిమా పరిశ్రమ కూడా ఇక్కడే… పైగా ఒకప్పుడు తెలుగువాళ్ల కీ ఇదే రాజధాని కావడంతో అప్పట్లో అందరూ తెలుగు బాగానే మాట్లాడేవారు .

ఇక పారశివ ఇంటినుంచి హోటల్ కి బస మార్చాం .
అడయార్ కేన్సర్ ఆస్పత్రి చుట్టుపక్కలవున్న వాళ్లంతా ఒక్కో గదీ బాత్రూంలతో అద్దెలకి కూడా ఇస్తారని అక్కడున్న కొందరు చెప్పారు .
కానీ అక్కడకి వెళ్లి చూశాకా జైలుగదిలా వుండే ఆ గదిలో చచ్చినా వుండలేనన్నాను .
దగ్గరలోనే హోటెల్ గది తీసుకుని హాస్పటల్ కి వెళ్లి వస్తున్నాం .
ఆ రోజు నా రిపోర్టులు అన్నీ తీసుకుని లోపలకి అడుగుపెట్టాను .

అది రీసెర్చ్ ఇన్స్టిటూట్ కావడం మూలానేమో అక్కడి డాక్టర్ల బృందానికి నేనొక పేషంట్లాగా కాక వాళ్ల పరిశోధనకు వాడుకునే స్పెసిమన్ లాగా కనిపిస్తున్నానని అనిపించింది .
వాళ్లు మాట్లాడుకునేది వింటే అప్పటివరకూ లేని భయమేదో ఆవరించింది.
” రిపోర్ట్ లో సస్పెక్టెడ్ సెల్ అని వుంది పైగా ట్యూమర్ చూస్తే సార్కోమా అనిపిస్తుంది ” అన్నాడు డాక్టర్ పరమేశన్ , ” నా వుద్దేశం కీమో థెరపీలు ఇవ్వాలి ” అన్నాడాయన చేతిలో పెన్ను తిప్పుతూ !
” నాదృష్టిలో అది అనవసరం ” అంది డాక్టర్ జయ . ” సార్కోమా అని రిపోర్టు రాలేదు కాబట్టి ట్యూమర్ బయాప్సీ తీద్దాం ఆ రిపోర్ట్ బట్టి ట్రేట్మెంట్ మొదలెడదాం ” అంది. మిగతావాళ్లూ ఆమెతో ఏకీభవించడంతో బయాప్సీ చేయాలని నిర్ణయించారు .
పోన్లే కీమో అక్కరలేకుండానే బయాప్సీలో ఏమీ లేదనే స్పష్టత వస్తే బాగుండుననుకున్నా . కీమో థెరపీ గురించి చాలామంది అప్పటికే చెప్పడం అక్కడ అందరూ జుట్టు , చివరకు కనుబొమలతో సహా వూడిపోయి తిరగడం చూశా .

“ఎల్లుండే బయాప్సీ ” అన్నాను బయటకు వచ్చి .
మనం వైజాగ్లో చేయించి తెచ్చిన రిపోర్ట్ ఇవ్వలేదా అన్న మా ఆయనతో ” అది పనికి రాదట రెడ్డొచ్చె మొదలాడు ” అన్నాను బాధతో కూడిన చిరాకు తో .
” సర్లే పద ! అన్నట్టు దయాళన్ , కళ ఇక్కడే వున్నారు కదా ! ఒకసారి ఫోన్ చేసి సాయంత్రం కాసేపు వెళ్దాం ” అంటూ ఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి ఫోన్ చేశాం .
కళ వాళ్ల అమ్మ ఫోన్ ఎత్తి ” యారు పేస్ రింగ్లే ” అంది .
కళ ఫ్రెండ్ వైజాగ్ అన్నాను .
కళ మేమూ ఏడాది పాటు పక్క పక్క ఇళ్లల్లో వుండేవాళ్లం .

దయాళన్ వూరు ఆరణి , కళ ది మద్రాస్ సి.ఐ టీ నగర్ . ఏడాది పిల్లతో వచ్చారు. దయాళన్ దీ నాదీ ఒకే పుట్టిన రోజు . ” మీరు నా తంగచ్చి ” అనేవాడు .
తరవాత ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వెళ్లి మద్రాస్ లో కుటుంబాన్ని పెట్టి దయాళన్ షిప్పుల్లో పనికి ఇటలీ వెళ్లాడని ఒకసారి ఫోన్ చేసినప్పుడు కళ చెప్పింది . ఇక మళ్లీ ఇప్పుడే మాటలు .
కళ వాళ్ల అడ్రెస్ చెప్పడంతో సాయంత్రం వెళ్లాం. దయాళన్ ఇంటిదగ్గరే వున్నాడు . మూడేసినెలలు సెలవుపైన వస్తాడట . జరిగింది విని భార్యాభర్తలు కంగారు పడ్డారు .
బయాప్సీకి పూర్తి ఎనస్థీషియా ఇస్తామన్నారు కాబట్టి మధ్యాన్నం నుంచి మా ఇంటికి వచ్చి వుండి వెళ్లొచ్చు అన్నాడు దయాళన్ .
” ఎందుకు హోటల్ కి వెళ్లిపోతాం ” అని మా ఆయన అన్నాడు .

” నాకు ఇక్కడికి రావాలని వుంది వీళ్లంతా వున్నారు… నాకు బాగుంటుంది “” అన్నాను .
మర్నాడు దయాళన్ హాస్పటల్ కి వచ్చి నేను లోపలికి వెళ్తే మా ఆయనతో పాటు బయట వున్నాడు .
ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి బయాప్సీ చేశారు. సర్రున కత్తితో కోసినట్టు నొప్పి… అమ్మో ! నాకు వీళ్లు ఇచ్చిన మత్తు ఎక్కలేదో ఏంటో కత్తితో కోసేస్తున్నారనుకొంటూ మూత పడుతున్న కళ్లను బలవంతంగా తెరిచాను .

అప్పటికే వార్డ్ బాయ్ నన్ను స్టెచ్చర్ మీద రూంకి తీసుకెళ్తున్నాడు . ఆ అచేతనావస్థలో మామూలుగా తీసుకెళ్తున్నా ఒక వందమైళ్ల వేగంతో వెళ్తున్న ఫీలింగ్ .
మంచం మీద వేసి వెళ్లి పోయాకా నిశ్శబ్దంగా వున్న ఆ వార్డులో నేనో ఏకాకిని. రెప్పల చాటు నుంచి కిందకి జారుతున్న కన్నీళ్లు … తుడిచేవారేరీ !
అమ్మ కావాలి. అమ్మ చల్లటి చేత్తో నా కళ్లు తుడవాలి . అమ్మా ! అమ్మా అని ఏడుస్తున్నాను .
నా గొంతు విని నర్స్ వచ్చింది . మా అమ్మ అన్నాను . నీకు పిల్లలున్నారా అనడిగింది . ఇద్దరు అన్నాను .

” నువ్వే అమ్మవి , చిన్న పిల్లవి ” కాదు అంది విసుగ్గా . ఈలోగా డాక్టర్ వచ్చింది. డాక్టర్ ఒక వేళ బయాప్సీలో మెలిగ్నన్సీ వున్నట్టు వస్తే ఏం చేస్తారు అనడిగాను . ” ఏముంది కయ్యి తియ్యాలి ” అంది కఠినంగా .
షాక్ తగిలినట్టు అరిచాను ” ఏంటి చెయ్యి తీసేస్తారా ? అని . కానీ ఆమె అప్పటికే వెళ్లి పోతోంది . మళ్లీ మగత కమ్మేసింది . మధ్యాన్నానికి పూర్తిగా మెలకువ వచ్చింది .
బయటకు తీసుకొచ్చి మా ఆయనకి అప్పచెప్పారు .
దయాళన్ ” తంగచ్చీ ఎలాగుంది ” అడగగానే …” మీరు మళ్లీ ఇండియా వచ్చేసరికి నేను వుండను ” అని చేతులు పట్టుకుని ఏడ్చేశాను.
” ఏమీ కాదు పదండి ఇంటికెళ్దాం ” అని మమ్మల్ని ఆటో ఎక్కించి వెనకాల స్కూటర్ వేసుకుని వచ్చాడు .

కళ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లింది . ఇంత బేలగా ఎందుకుంటున్నానో నాకే తెలియడంలా , డాక్టర్ చెయ్యి తీసేస్తాం అన్న మాటలే గింగురుమంటున్నాయి .
కళ వాళ్ల అమ్మమ్మ , అమ్మ కాఫీ ఇచ్చి పక్కనే కూర్చున్నారు . అమ్మ వీపు మీద నిమిరింది . మా అమ్మ చెయ్యిలా మెత్తగా ఓదార్చింది .
వాళ్ల అమ్మమ్మ నా దగ్గరే కూర్చుని ఎంతో ధైర్యం చెప్పింది . సాయంత్రం ఆవిరి మీద వుడికించిన సేమ్యాలాంటి వంటకం, పల్చగా వున్న కూరతో పెట్టారు .
తమిళులు బియ్యప్పిండి తో చేసే అపం అస్వస్థతగా వున్న వాళ్లకి తేలిగ్గా జీర్ణమవుతుందని పెడతారంట .
రాత్రి వాళ్ల ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు అందరూ ఆటో వరకూ వచ్చి ఎక్కించారు .

దయాళన్ అన్నాడు ” మీరు ఎంతో ధైర్యవంతులని ఎప్పుడూ కళ దగ్గర మెచ్చుకునే వాడిని, మీరు ఆ ధైర్యం పోగొట్టుకోవద్దు అన్నాడు .
అలాగే బ్రదర్ అన్నాను అప్రయత్నంగా. ఆటో కదిలింది . మలుపుతిరిగే. వరకూ వాళ్లనే చూశాను .

అప్పుడనిపించింది నా కుటుంబం చాలా పెద్దదని . ఎక్కడికి వెళ్లినా కష్టంలో అది నా వెనకే వుంటుందని.

*

షర్మిలా కోనేరు

షర్మిలా కోనేరు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు