అక్షరానికి  అనువాద  గవాక్షం  ఎల్.ఆర్. స్వామి

తల్లి  కైరళి నుంచి, తెలుగు తల్లికి మల్లెపూల దండలు తెచ్చి అలంకరించారు స్వామి.

వ్యాపారం అన్ని రంగాలలో ఇంతింతై  అంతింతై  పెరిగి ప్రపంచీకరణ తెల్లారి లేస్తే లాభాల  వేటకు బయలుదేరే   ఆధునిక ఆది మానవుల  సమాజం గా మనల్ని మార్చి  వేస్తున్న కాలం ఇది.  దేశాలు ఏమైనా సరే, ఏక ధృవ స్వభావాన్ని అన్నిరంగాలలో విస్తృతం గా పటిష్టం చేయడం దీని ఆచరణ దారి.  దీన్ని ఎరుక గలిగిన మానవ సమాజం ఎదుర్కొనడం జరిగేది బహుళత్వ ప్రతిష్టాపనలతోనే. ప్రపంచీకరణ కు ప్రత్యామ్నాయం అంతర్జాతీయత. దీన్ని సాధించే క్రమంలో భారత దేశం వంటి దేశాలు, ముందుగా అంతర్రాష్ట్రీయతను వివిధ భాషలు మాట్లాడే కోట్ల మంది ప్రజలకు అనుభవం లోకి తేవాలి. అందుకు ఉత్తమమైన మార్గం సాహిత్యం. భారతీయ భాషలలోని సాహిత్యాన్ని, ముఖ్యంగా భారతీయులందరికీ అంద  జేయడం అన్నది ప్రధాన కర్తవ్యం గా  మన సాహిత్య అకాడెమీ ఈ పనిలో ప్రపంచలో కెల్లా  పెద్ద సంస్థగా పని చేస్తున్నది.

ఇలా అనువాద ముఖ  చిత్రం సృజన సంపన్నంగా వున్న వర్తమానంలో ఉత్తర  భారత దేశపు ఏక రూప  సంస్కృతి తో పోలిస్తే, దక్షిణ భారత దేశంలో నాలుగు భాషలు ఎంతో విభిన్నమైన సాంస్కృతిక, భాషా, సామాజిక నేపథ్యాలు  కలిగి వున్నాయి. దీన్ని అందిపుచ్చుకుని, మన అంతర్రాష్ట్రీయతను అక్షరాల రూపంలో పెంపొందిస్తున వారిలో లక్ష్మణయ్యర్ రామస్వామి ఒకరు.మూడు  దశాబ్దాల నిరంతర సాహిత్య కృషి ద్వారా, తెలుగు  కథా  రంగంలో ఖ్యాతి పొందడమే కాక,   తమిళ మ, మలయాళ  భాషల నుంచి ఇరవై నాలుగు  పుస్తకాలు  తెలుగు లోనికి, తెలుగు నుంచి  పదిహేను పుస్తకాలు మలయాళంలోనికి  అనువాదం చేశారు. ఈ అనువాదాలలో  దక్షిణ  భారతీయ సాహిత్య వేత్తలుగా సుప్రసిద్ధులైన వారి రచనలు ఉన్నాయి.

ఎల్. ఆర్ స్వామి గా  చిరపరిచిత రచయిత అయిన ఈయనకు, తమిళునిగా జననం, మలయాళ భాషలో విద్యాభ్యాసం,  ఉద్యోగ రీత్యా, తెలుగు దేశాన స్థిర నివాసం, తెలుగు పడుచు తో వివాహం, విశాఖలో దశాబ్దాల  జీవనం అన్నిటి ఫల స్వరూపం, వారిలో క్రమేపీ రచన దిశగా ఆసక్తి పెరిగి, తెలుగులో కథలు రాయడంతో మొదలైన సాహిత్య జీవితం, ఇవాళ, వారిని ఒక ప్రముఖ తెలుగు కథకులుగా, రూపొందించింది.  అంతే కాక భాషా సమాజాల మధ్య బంధం బలపడేలా, తనకున్న బహు భాషా పరిచయాల్ని, అనువాద కళ  గా మలుచుకుని, స్వామి,   ముఖ్య అనువాదకులు  గా  ఎదిగి, తెలుగు, తమిళ  మలయాళ సాహిత్యాలలో ఆదాన  ప్రదానాన్ని విస్తృతం చేయగలిగారు.

తల్లి  కైరళి నుంచి, తెలుగు తల్లికి మల్లెపూల దండలు తెచ్చి అలంకరించారు స్వామి.  ఇది, సాహిత్య అకాడెమీ అప్పగించిన  “మలయాళ జానపద గీతాలు” అనువాదం తో మొదలైంది. మూలంలో డా. అయ్యప్ప పణిక్కర్ సంకలనం చేసిన ఈ జానపదుల పాటలను ఆసక్తి దాయకం గా తెలుగు చేయగలిగారు స్వామి.  కె. సచ్చిదానందన్ కవిత్వం  తెలుగు లోకి “శరీరం ఒక నగరం” పేరిట,  ఇ.ఏం.ఎస్. నంబూదిరిపాద్ కు సహచరులూ, స్నేహితులూ అయిన  అక్కిత్తమ్ అచ్చ్తన్ నంబూదిరి ప్రామాణిక రచనగా ఆత్మ విమర్శ ను,  హింసాత్మక ఉద్యమ ధోరణులని దర్శిస్తూ రాసిన “ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం” (దీర్ఘ కవిత) ఆ రచన కు  అర్ధ శతాబ్ది సందర్భంగా తెలుగుసేత, తొలి మలయాళ కథ తో మొదలై ఆ కథా సాహిత్య పరిణామాలను క్రమ పరిచయం గౌరవిస్తూ  చేసేవి గా వున్న వర్తమాన కథకుల కథల దాకా  “కథా కేరళం” పేరిట తీసుకువచ్చారు. ప్రముఖ  మలయాళ రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్  ఛైర్మన్ గా సేవలు అందించిన  సేతు నవల (అడయాళంగల్ ) “ముద్రలు” పేరిట అనువాదం చేశారు.

రామనున్ని నవల  సూఫి చెప్పిన కథ, సేతు నవల  పాండవపురం, తొలి మలయాళ గిరిజన రచయిత  నారాయణ్ నవల కొండ దొరసాని, కథా వారధి గా మరికొన్ని మలయాళ కథానికల  సంకలనం, శ్రీ నారాయణ గురు జీవితం కృషి పై మోనోగ్రాఫ్, వారు చేసిన కొన్ని ముఖ్యమైన  మలయాళం  నుంచి తెలుగు అనువాదాలు.  తమిళం నుంచి, ప్రసిద్ధ రచయిత  ఆర్. నటరాజన్   వ్యంగ్య కథానికల సంకలనం “ఆటవిక రాజ్యం” అనువాదానికి గాను, తమిళ సాహిత్య లోకం, మదురై లో నల్లి-థిస్సై  ఎట్టుమ్  పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.  మలయాళ దేశం నుంచి అక్షయ ఫౌండేషన్, తామే విశాఖ వచ్చి  స్వామి  అనువాద సేవలను గౌరవిస్తూ అవార్డు ప్రదానం చేశారు.  తెలుగు సాహిత్య లోకం  ప్రభాసాంబ పురస్కారం, డా. పరచూరి  రాజారామ్ పురస్కారం, పురిపండా  పురస్కారం వంటివి అందచేసి వీరి విశిష్టతకు పెద్ద పీట వేసింది. కేరళ లో వార్షిక ఎలుత్తచ్చన్ సాహిత్య సమారోహాలలో  పలు సార్లు పాల్గొని తెలుగు సాహిత్యపు తీరు తెన్నులను ఆ సాహిత్య లోకానికి స్వామి పరిచయం చేశారు.  వీరి రచనలు ప్రచురించిన  వారిలో, సాహిత్య అకాడెమీ, విశాలాంధ్ర,  ద్రావిడ విశ్వవిద్యాలయం  శ్రీ నారాయణ గురు ట్రస్ట్, పాలపిట్ట బుక్స్, మొజాయిక్  ప్రచురణలు, కేరళ లోని డి. సి  బుక్స్ మొదలగు  ప్రచురణ సంస్థలు ఉన్నాయి. చినుకు సాహిత్య పత్రికలో,  తన అర్ధాంగి స్మృత్యర్ధం, కథల పోటీ ని కూడా ఏటేటా స్వామి స్పాన్సర్ చేసి, తెలుగు కథ  అభివృద్ధి కి ఒక ప్రాయోజకుడిగా సైతం  పాటు పడ్డారు.

ఇక తెలుగు నుంచి  మలయాళానికి  జరిగిన అనువాదాల పరంపర గురజాడ  కథల నుంచీ మొదలై వర్తమాన  సాహిత్యకారులైన సలీం, ఎన్. గోపి, కేతు విశ్వనాథ రెడ్డి. కె. శివారెడ్డి, పాపినేని శివశంకర్, మందరపు  హైమవతి మొదలగు వారి కథలు, నవలలూ, కవిత్వానువాదాలుగా  కేరళ సాహిత్యలోకం లోకి ప్రవేశించింది. శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ను తెలుగు నుంచి మలయాళంలోకి సాహిత్య అకాడెమీ కోసం అనువాదం చేశారు. చాసో కథలను కూడా మలయాళ పాఠకులకు అంద చేశారు.వీరి కథా సాహిత్య కృషి లో తన భాగం గా, కథా స్వామ్యం, గోదావరి స్టేషన్, కథాకాశం,అలగా అలగా  ( కథా  సంపుటం) గా  తన రచనలను అందచేశారు. కమలా దాస్, తగళి  శివశంకర్ పిళ్లై,   సేతు, సంతోష్ ఎచ్చికానమ్  మొదలగు మలయాళ కథకుల రచనలను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేశారు.

సాహిత్య అకాడెమీ వీరికి గల రెండు భాషల  ప్రావీణ్యాన్ని, మరింత గా ఉపయుక్తం చేసుకునేందుకు, మలయాళం-తెలుగు నిఘంటు నిర్మాణం కూడా ఒక బాధ్యత గా ఇటీవల అప్పగించడం జరిగింది. తెలుగు కథకి నూరేళ్ళు పండుగలో భాగంగా ప్రచురితమైన   ప్రాతినిధ్య  కథా సంకలనాలలో, సంకలన కర్తలు  స్వామి రాసిన  కథ ను ఆ ఎంపిక లో చేర్చి  ఈ రచయిత  కథల వాసిని గుర్తించారు. దక్షిణ భారత  భాషల సాహిత్య తులనాత్మక  సదస్సుల్లో , ఇతర  సెమినార్లలో పాల్గొని పాత్ర సమర్పణ చేశారు.

తమిళ  క్లాసికల్ సెంటర్ ఇటీవల  తనకు  అప్పగించిన, ప్రాచీన  సంగ సాహిత్యం తెలుగులోకి అనువాదం చేసే పని విజయవంతంగా  పూర్తి చేశారు. మూడువేల పైచిలుకు సంగ సాహిత్యం పేరిట ఎందరో అజ్ఞాత కవుల అనుభవ రాశిగా, ఇది ప్రపంచ సాహిత్యంలోనే గుర్తింపు పొందిన సామాన్య జనుల సారస్వతం. ఈ అనువాదం, తెలుగు సాహిత్యానికి ఎంతో అవసరం కూడా.  ద్రావిడ భాషల వికాసం, పోలికలు, విభిన్నతలు, తులనాత్మకంగా  ముందు  తరాలు చూసేందుకు కూడా ఈ సాహిత్యం ఉపకరిస్తుంది. ఈ అనువాద కృషికి గాను, తమిళ్ నాడు ప్రభుత్వం, 19.2.2019న, తమ భాషా సాహిత్య రాశి అనువాద వారధులుగా   నిలిచిన పది మంది  సాహితీ అనువాదకులను  సమ్మానించింది. ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చేతులమీదుగా, ప్రభుత్వ ముఖ్యులు, విశిష్ట  సాహితీ వేత్తల  సమక్షంలో లక్ష రూపాయల నగదు తో బాటు, ఉన్నత స్థాయిలో జరిగిన  సత్కారాన్ని స్వీకరించిన  వారిలో స్వామి కూడా ఒకరు.

తెలుగు మలయాళ సాహిత్య సేతువు గా స్వామి పరిణామం తో  పోల్చగలిగిన  సమీప గత విశేషం ఏమంటే,   అలనాడు తెనాలిలో, హోటెల్ లో  బీద  పనివాడు గా  వుంటూ “శారద” పేరిట కథలు  రాసిన  నటరాజన్, తరువాత మనకు తెలిసిన వారు ఇలా రెండు లేదా మించిన  సంస్కృతుల మేళవింపు గల రచయిత  స్వామి మాత్రమే. అయితే శారద, కథలు మాత్రమే రాశారు. అనువాదాలు చేయలేదు.  స్వామి అనువాద కృషి ఫలితంగా   భిన్నత్వంలో ఏకత్వంగా, భారత భారతికి మరింత శోభాయమానంగా,    దక్షిణ భారత  భాషల సాహిత్యానుబంధాలు మరింతగా ధృఢ పడేలా వారి కృషి, కొనసాగాలని, వారు మరిన్ని గౌరవాలను పొందాలని ఆశిద్దాము.

*

 

రామతీర్థ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు