అంత సినిమా లేదు!!

చిన్నపిల్లలు ముదుర్లుగా చూపించడమే ఒక కమర్షియల్ వికృతం. ఇప్పుడు ఆ మెట్టు కూడా దాటేసి – వాళ్ళ మధ్యలో ప్రేమ చరిత్ర కూడా రాసి, వాళ్ళలో ‘ సెక్సువల్ ఓరియెంటేషన్ ‘ ను గొప్పగా చూపించేంత స్థాయికి వెళ్తున్నాం.

“There either is or is not, that’s the way things are. The colour of the day. The way it felt to be a child. The saltwater on your sunburnt legs. Sometimes the water is yellow, sometimes it’s red. But what colour it may be in memory, depends on the day. I’m not going to tell you the story the way it happened. I’m going to tell it the way I remember it. “- Alfonso Cuaron ( Director of Movies “ Gravity “ )

“ కథ ఏలా జరిగిందో కాదు కథ ఎలా గుర్తుండాలో చెప్పాలి”  అన్నది ఈ ప్రఖ్యాత దర్శకుడి మాటలు. సినిమా చూస్తే సినిమా ఎలా గడిచిందో కాదు , సినిమాను  ప్రేక్షకులు  ఏ కోణంలో గుర్తుంచుకునేలా చేసింది అన్నది ముఖ్యం.

ఇది పూర్తి స్థాయి రివ్యూ కాదు. కాబట్టి ప్రతి టెక్నికాలిటీని ఇందులో టచ్ చేయడం లేదు. “ కేరాఫ్ కంచర పాలెం “  సినిమా ఒక మూడు విభిన్న కథలను చివర్లొ ఒక చోట కనెక్ట్ చేసి ముగించే స్టైల్ లో వచ్చిన సినిమా. ఈ ఫాం లో “ఆ..” ” మనమంతా..” లాంటి సినిమాలు ఇది వరకే వచ్చాయి. స్టైల్ లో నవ్యత్వం లేదు. కాకపొతే,  మూడు కథలూ ప్రేమ కథలే. తర్వాత ప్రతి కథలోనూ దేవుడు, మతం ప్రేమకు పనికి రానివే అనే మెసేజ్ ప్రకటించబడుతూ ఉంటుంది.

ఎనిమిదేళ్ల పిల్లోడు ఇంకో ఎనిమిదేళ్ళ చిన్న అమ్మాయితో “ ప్రేమలో “ పడ్తాడు. తర్వాత ఒక యువకుడు ఇంకో అమ్మాయితో లవ్ లో పడతాడు. ఆ తర్వాత కొద్దిగా మధ్య వయస్సు దగ్గిర పడుతున్నప్పుడు ఇంకో లవ్ లో పడుతాడు. విసిగి వేసారిన ఆ వ్యక్తి 49 వయసులో మళ్ళీ ప్రేమ పుట్టి పెళ్ళి చేసుకుంటాడు. ఇదీ ఎండ్- టు – ఎండ్  అన్ని వయసుల్లో ప్రేమ సంగతులు చెప్పే సినిమా అన్న మాట. చివర్లో మొదటి రాత్రి భర్తను అడుగుతుంది ” నీవెందుకు ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోలేదు. ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా  ” అని. నాకు చిన్నప్పట్నుండి ఇన్ని ప్రేమ కథలున్నాయి అని ఏకరువు పెడుతూ నిస్సారంగా చెప్పి ముగిస్తాడు సినిమా.

ఈ ప్రేమ కథలు అన్నప్పుడు – ప్రేమ అన్నది ఏ వయస్సు నుండి మొదలౌతుంది ? ప్రేమ కు ఉన్న మొదటి prerequisite మనిషికి తనకో sexual identity ఉందనే చైతన్యం రావాలి. Children specialists కాని psychologists  గాని ఇది సాదారణంగా 5-6 వయసు మద్యలో కలుగుతుంది అని చెప్తారు. ఐతే opposite sex ను ఆకర్షించడం అది instinctive అవ్వచ్చు. కానీ ఈ ఆకర్షించడానికి ప్రేమలో పడ్డం అని పేరు పెట్టి చిన్న పిల్లల మధ్య ఒక ముప్పావు గంట సినిమా నడిపేయడం చాలా విచిత్రంగా కొంత వికృతంగా నడుస్తుంది.

ముందుగా ఇది అర్థం చేసుకోవాలంటే ఒక సామాజిక సందర్భం మనం చూడాలి. గత 5 సంవత్సరాలలో చిన్న పిల్లలపై గేంగ్ రేప్ లు విపరీతంగా పెరిగాయి. ఇది సాధారణ అబ్యూజ్ స్థాయి నుండి  రేప్ స్థాయి దాటి మూకుమ్మడిగా రేప్ చేసే స్థాయికి వెళ్ళింది. అసిఫా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ఈ మధ్య కాలం లోనే ఇండియాలో చిన్న పిల్లలపై రేప్ లు 80 శాతం పెరిగాయి. అసిఫాలో అమాయకత్వం కాక ఒక ఆపోజిట్ సెక్స్ ను చూడగలిగే దుర్మార్గత్వం ఒక్క రోజులొ ప్రబల లేదు. మనం ఈ విషయాన్ని జాగర్తగా అర్థం చేసుకోవాలి. అమ్మాయిలపైన గేంగ్ రేప్ లు రిచ్ క్లాస్ లో జరగడం అరుదుగా ఉంది. అవి ముఖ్యంగా దిగువ స్థాయి వర్గాల్లోనే జరుగుతున్నాయి. వాచ్ మెన్ అనో, కేబ్ డ్రైవర్ అనొ – ఇలా ముద్దాయిలు ఉంటున్నారు. మన దేశం లో విపరీతమైన అభివృద్ధి , విపరీతమైన వెనుకబాటు రెండూ ఒకేసారి కాపురం చేస్తున్నాయి. విపరీతమైన అభివృద్ధి వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం, అభివృద్ధిని అందుకోలేక పోయిన వెనుకబడిన వర్గాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఇంటర్ నెట్ దిగువ వర్గానికి మాయ ప్రపంచాన్ని సృష్తీంచి ఇచ్చింది. అందులో పోర్న్ వేరు, నిజం జీవితం వేరు అనే విషయాన్ని తెలుసుకునే  ఙానం, చైతన్యం కలిగేలోపు దుర్మార్గాలు గడిచి పోతున్నాయి. అందునా ముఖ్యంగా – చిన్న పిల్లలపై జరిగే ఘాతుకాలు మరీ విపరీతం కావడమే కాకుండా ఘోరమైన స్థాయిలోకెల్తున్నాయి.

మనం ఏ సామాజిక సందర్భం లో సినిమాలు చూస్తున్నాము  అన్నది క్లుప్తంగా చూసాము. తర్వాత చూడవలసింది పేట్రేగిపోతున్న Paedepholic crime tendencies . ఎందుకు బాల్య లైంగికత ఒక sexual urge ను తీర్చబడ్డానికి ఒక పద్దతిగా perpetrators చూడగల్గుతున్నారు ? వీళ్ళకు మనిషి maturity తో సంబంధం లేదు. అయితే ఎదుటి మనిషి  ‘ ఆడది ‘ అనే కనీస చైతన్యం కూడ కలిగి ఉండవల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు పేట్రేగి పోతున్న ఈ సమాజం లో ఏ మాత్రం ‘ ఆడ వగలు ‘ కలిగి ఉన్న ఆడది అంటే అదో మగతనం ను ఇన్వైట్ చేసే అంశం అవుతుంది. లేదా సవాలు చేసే అంశం అన్నా అవుతుంది.

ఈ సినిమా లో – చిన్న అమ్మాయి అందునా ఎనిమిదేళ్ళ అమ్మాయి ఓరకంట చూస్తూ ఒక అబ్బాయికి హొయలు పోతున్నట్టు అనిపిస్తుంది. ఆ చిన్న అబ్బాయి కున్న పైత్యం చూసి ఆ చిన్న అమ్మాయి చిన్న సైజ్ జాణ లా ( సినిమా చూడని వాళ్ళకు  ఈ సాధారణ లోకరీతిగా మాట్లాడితే కాని అర్థం కాదు ఈ సీరియస్ నెస్. ఈ సందర్భం లో రచయిత భాష ను మన్నించమని విన్నపం  ) మూతి తిప్పుతూ ఉంటుంది అన్న మాట. ఆ అబ్బాయి పక్కన ఇంకో చెంచాలా ఎనిమిదేళ్ళ  అబ్బాయి ఉంటాడు . వాడు ” ఒరేయ్ నీ గుంట వస్తుంది రా ” అనడం లాంటి డైలాగ్ లు చాల నార్మల్ గా అందులో పెద్ద విపరీతం లేదా హేయం ఏమీ లేదు అన్నట్టు సాగిపోతుంది. డైరెక్టర్ అతని సమర్థకులు దీన్ని ” బాల్య చాపల్యం ” అని సున్నితంగా గ్లామరైజ్ చేయాలని చూస్తారు. ” ఏం చిన్న పిల్లలో సెక్స్ కోరికలుండవా ? ఆ మాత్రం చాపల్యం ఉండదా ? ” అని ఈ Paedophilic encouragement ను సమర్థించాలని చూస్తారు.

చిన్నపిల్లలు ముదుర్లుగా చూపించడమే ఒక కమర్షియల్ వికృతం. ఇప్పుడు ఆ మెట్టు కూడా దాటేసి – వాళ్ళ మధ్యలో ప్రేమ చరిత్ర కూడా రాసి, వాళ్ళలో ‘ సెక్సువల్ ఓరియెంటేషన్ ‘ ను గొప్పగా చూపించేంత స్థాయికి వెల్తున్నాము మనం. ” సీత రామ కల్యాణం ” ” రెండు రెళ్ళు ఆరు ” ” రంగూన్ రౌడీ” లాంటి సినిమాలలో చిన్న పిల్లల మధ్య ఒక తెలీని అనుబంధం ఉంది అని మాత్రం  abstract గా చూపించి పెద్దయ్యాక వాళ్ళ లవ్ స్టొరీ ని కంటిన్యూ చేసిన Directors  ఉన్నారు. కాని ఏకంగా చిన్నపుడే ప్రేమ కథలు పెట్టి మళ్ళీ దానికో భగ్న ప్రేమను నింపి ఆ పిల్లోడు మానసికంగా కృంగిపోయి ( అంటే చిన్న సైజ్ దేవదాసు లా అన్న మాట) దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం. ఇవన్నీ విలన్ కేరక్టర్ చేయదు. హీరో కేరక్టర్ చేస్తుంది . ఇది విలన్ కేరక్టర్ చేస్తే దుర్మార్గం అయ్యేది. సైడ్ కేరక్టర్ చేస్తే కామెడీనో , లెదా ప్రధాన కథకు చిన్న పిట్టకథలనో మిగిలిపోయేది. కాపోతే ముప్పావు గంట Protagonist lead characters మధ్య ఈ ఇతివృత్తం నడపడం తో ఈ పిల్లల మధ్య ఉన్న ‘సెక్సువాలిటీ’ ఒక Normalcy ని సంతరించుకుంది . అంటే పిల్లల కున్న ‘ sexual feelings ‘ కాని ‘ రొమాంటిక్ ఫీలింగ్స్ ‘ కాని ఇవన్ని సర్వ సాధారణమే అందులో హీరో పడిపోయి దెబ్బ తిన్నాడు అన్నట్టు మనం చూడాల్సిన పరిస్థితి.

దేశం లో ఒక అసహ్యకరమైన సందర్భం చూడకుండా  Paedophilic crime బేసిస్ అర్థం చేసుకోకుండా లీడ్ కేరక్టర్ తో చిన్నపిల్లల్లో ఇలా సెక్సువాలిటీ కి ప్రాధాన్యత కల్పించి దీన్ని నార్మలైజ్ చేసే ప్రయత్నమే ఇందులొ అతి గర్హ నీయం. ఈ మొత్తం ఇతివృత్తాన్ని చిన్నపిల్లలకు చూపించి ” ఒరేయ్ నాన్న ! ఇదంత కామన్ రా . నీవు కూడ ఏ అమ్మయికన్నా లైన్ వేసుకోవచ్చు ” అని చెప్పాలని చూడాలా ? చిన్న అమ్మాయి జాణలా మూతి తిప్పుతుంటే ” హబ్బ ఏం తిప్పిందిరా “ అని మనం అనుకోవాలా లేపోతే ” ఎంతైనా ఎంత గడుసైన ఆడది చూడు ” అనుకోవాలా ? ఇది ఏదో బాల్య చాపల్యం అని కొంత మంది సమర్థింప జూస్తున్నారు. ‘ బాల్య చాపల్యం ‘ మీద ముప్పావు గంట serious సినిమా నడిపి, పిల్లలతో ముదురు పనులు చేపించి ఇదేదో బాల్య చాపల్యం అని ఎలా అనుకుంటాము ? పాత సినిమాలలో లా abstract గా వదిలేసి ఉంటే అలా అనుకునే అవకాశం ఉండేది. పిల్ల హీరో వెళ్ళి ఒకటే ఎమోషనల్ దుఖం ( ఇక్కడ మనకు దుఖం – పాపం పిల్లోడి లవ్ దెబ్బ తినిందని !! ) చూపించి బాల్య చాపల్యం అని సమర్థింపజూడ్డం పూర్తిగా అసమర్థనీయం. బాల్య చాపల్యం పేరుతొ అక్షరాల ఒక ఫుల్ లెంగ్త్  భగ్న ప్రేమ కథను నడుపుతారా ? అది ప్రేమ అని చివర్లో హీరో చెబితే ” ఒహో పాలు కారే వయసు నుండీ పాపం ప్రేమలో ఎన్ని దెబ్బలు తిన్నాడు అని మనం ” చెంపలు తుడుచుకోవాలా ?

పిల్లలలో అమాయకత్వం కాదు వాళ్లలొ ఉన్న సెక్సువాలిటీ ని నార్మలైజ్ చేసి చూడాలి అని మనకు సందేశమిచ్చే ఈ డైరెక్టర్ ఖచ్చితంగా కమర్షియల్ వల్గారిటీ హద్దులు దాటాడు. Sexuality of girl child  అన్నది Girl child ను కాపాడ్డానికా ? ఒక అడుగు వెనక్కు వేసి సగటు విలువలను దిగజార్చడానికా ? ప్రగతి శీలత పేరుతో కామన్ సెన్స్ కు తిలోదకాలు ఇస్తున్నారు . ఇది విశ్లేషించడానికి ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ కాదు కావాల్సింది. నీకు నాకు ఈ సమాజం లో గర్ల్ చైల్డ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాము, ఎలాంటి వాతావరణం వాళ్ల చుట్టు కల్పించబడాలని కోరుకుంటున్నాము, వాళ్ళలో ఉండే ఒక అమాయకత్వాన్ని మనం ఎంత రాజీ లేకుండ ప్రొటెక్టివ్ గా నిలబడదల్చుకున్నాము అనే సెన్సిటివిటీ కావాలి. ఈ విషయం లో ఈ సినిమా చాలా ఘోరంగా సగటు విలువను వెనక్కు తీసుకెళ్ళింది.

ఈ చిన్న పిల్లల ప్రేమ కథలేంది ? వాళ్ళ కథ సుఖాంతం కావాలని కోరుకోవాలా దుఖాంతం కావాలని కోరుకోవాలా ? సుఖాంతం కావాలని కోరుకుంటే – What next ? పెళ్ళా ? సెక్సా ? సంసారమా ? అర్థం లేని ఇతివృత్తాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అది విశ్లేషించాలని పూనుకున్నప్పుడు ఇలా అర్థం లేని ప్రశ్నలతోనే మనం ఎండ్ అవ్వాల్సి వస్తుంది. ఒక చిన్న అమ్మాయి లేత మొహంతో జాణలా మూతి తిప్పుతున్నప్పుడు మనస్సు కలుక్కుమంటుంది.  ప్రేక్షకుల్లో ఎవడో ఈల వేస్తాడు. ప్రేక్షకుల మొహంలో ” అబ్బా దొంగ మొహం ది …ఎలా జాణతనం చూపిస్తుంది చూడు ” అని మెదిలేలా చేస్తుంటే , మనం చూస్తున్నది లేత పిల్లలలని మరిపించే దర్శకుడు Paedophilic crime గురించి సెన్సిటివిటీ పూర్తిగా పోయింది. మన ఇంట్లో మగ పిల్లాడు ఈ లీడ్ కేరక్టర్ రోల్ చూసి ఇన్స్పైర్ అవ్వాలా ? కాదని లీడ్ రోల్ ను deny చేస్తే అప్పుడు హీరోకు సినిమాలో విలువే లేదు . దానితో ఇక సినిమాకు మీనింగ్ లేదు.

చిన్న పీల్లలో సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి….వాటికి ఒక ప్రాధాన్యత ఉంటుంది అనే కాన్సెప్టే జుగుప్సాకరంగా ఉంటుంది. అది ఈ సినిమా చేస్తుంది. ఆ చిన్న అమ్మాయికి ఎనిమిదేళ్ళ పిల్లోడు లైన్ వేస్తే ( ఇంతకంటే గొప్ప ఫీలింగ్ కలుగదు మనకు డైరెక్టర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ లో. ఎందుకంటే ఆ అమ్మయి ప్రేక్షకుల దృష్టిలో ఒక ” గుంటది” మాత్రమే ) , మరి 20 ఏళ్ళ యువకుడు కూడా ట్రై చేయొచ్చా ? ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని మన ప్రగతిశీలవాదం చెప్తుంది కాబట్టి, ఎదుటి వ్యక్తిలో ప్రేమ కలిగేంత చైతన్య స్థాయి ఉన్నప్పుడు 20 ఏళ్ళు వాడైనా ప్రయత్నించొచ్చు , 60 ఏళ్ళ వాడైనా ప్రయత్నించొచ్చు అన్న మాట. ఇది ఈ ప్రేమ కథ సారాంశం లో ఉన్న దుర్మార్గత్వం. చిన్న పిల్లల మధ్య ఉండే లైంగికతను నార్మలైజ్ చేయడం వలన దర్శకుడు దారి వేస్తున్న సంస్కృతి ఇది అన్న మాట. We must be highly protective and highly sensitive about girl child అన్నది ఏ టికెట్ కౌంటర్ లో వదిలేసి ఈ సినిమా చూడాల్సిందే ! అసిఫా “ రేప్ కాబడిన చిన్న పిల్ల “ అనే స్థాయి నుండి అసిఫా “ రేప్ చెయబడిన ఆడపిల్ల “ దగ్గరకు దిగజార్చాలిక.

ఈ paedophilic encouragement సంగతి ప్రధానంగా కలిచి వేసే విషయం అయితే – సినిమాలో ఉండే మిగతా గొప్ప తనం చూద్దాం.

హీరో యవ్వనం లో ప్రేమించే అమ్మాయి ముస్లిం యువతి. ఆమే వేరే మతం అబ్బయితో ప్రేమలో పడ్డాక , మత మౌఢ్యం కలిగిన ముస్లిం యువకులు వచ్చి ” నీవు ముస్లిం యువతివి కదా ” అని ప్రశ్నిస్తారు. చివరికి ఆమె చావునెదుర్కోవాల్సి వస్తుంది. పాయింట్ ఏంటంటే – అన్ని సినిమాల్లో ముస్లిములు బ్యాగు నిండా మత మౌఢ్యం పెట్టుకుని తిరుగుతుంటారు. ఇదే కాదు ఏ సినిమా అయినా అంతే. మత మౌఢ్యం అంటే – ముస్లిములను పెట్టి చూప్సితే గాని effectiveness రాదు అన్నమాట. ఏం ‘ లవ్ జిహాద్ ‘  చేయమన్న హిందుత్వ వాదులను చూపిస్తే మత మౌఢ్యం చూపించినట్టు అవ్వదా ? ఇక మతం వలన హింసకు గురి కాబడితే అది ఒక్క ముస్లిముల వల్లనే అవ్వాలా ? ఇది ఈ సినిమా లో ఉండే గొప్ప ప్రగతి శీలత.

తర్వాత, 49 ఏళ్ళ వ్యక్తిని తన 42 ఏళ్ళ అమ్మను లేపుకుపొమ్మని 20 ఏళ్ళ కూతురు రెచ్చగొడుతుంది. అది సినిమాలో ఇంకో హైలైట్. పైగా ( కాబోయే ) నాన్నతో ” నీవు మగాడివి కాదా ” అన్నట్టు చాలెంజ్ చేస్తుంది . ఇది చూసి మనం ” హాహా ఈ మాత్రం తిరుగుబాటు ప్రొవొకేటివ్ ధోరణి ఉండాలి కూతుర్లు ” అనుకుని అలాంటి కూతురు తన తల్లి దండ్రులతో ముదుర్ డైలాగ్ లు కొట్టాలని ఉపవాస ప్రార్థనలు చేయాలిక.

ఇంకా చెప్పుకోవాల్సింది  – సినిమాలో బ్రాహ్మణ పాత్రలు. రెండొ లవ్ స్టొరీలో బ్రాహ్మణ తండ్రి తన కూతుర్ని క్రిస్టియన్ అయిన హీరో ను చేసుకోవద్దు అని వాళ్ల ప్రేమను భగ్నం చేస్తే , హీరో తన మెడలో సిలువను తెంచేసుకోవడం. ఎవడి మీద కోపం ఎవరి మీద బలవంతంగా చూపాడెందుకో అర్థం అవ్వదు. క్రైస్తవ దేవుడు కూడా ప్రేమకు పనికి రాడు అని చెప్పాలనుకుంటే ఇక ఏ రీజన్ దొరక్క బలవంతంగా ఇరికించేయడం ఇందులో ఒక ఫూలిష్ అటెంప్ట్. మన హీరోకు ఎప్పుడు ఒక పేద పూజారి బ్రాహ్మణ మితృడు తోడుగా ఉండడం ఒక రొటీన్ మెజారిటేరియనిస్ట్ దృక్పథం.

ఈ సినిమా లో ప్రగతి శీలత లేదు. దర్శక విలువలు లేవు. అలాని మనం నెమరువేసుకోగలిగే పాటలన్నా లేవు. ఒక్కో సారి బేక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే , సన్నివేశం ఏంటో కంఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది

ఇక చిన్న టెక్నికాలిటీస్ కు వద్దాం. ఈ సినిమా మొత్తం  ఏదో షార్ట్ ఫిల్మ్స్ అన్ని కలిపి డ్రామ తీసినట్టు ఉంటుంది తప్ప, గొప్ప టేకింగ్ ఉందని కాని, మెచ్యూర్డ్ అప్రోచ్ ఉందని కాని, నవ్యత ఉందని కాని చెప్పడానికి దాఖలాలేం లేవు. కొన్ని సీన్ లు నాటకం చూసినట్టు ఉంటాయి.

ఈ సినిమా మొత్తానికి ఒకే అద్భుతం – 42 ఏళ్ళ వితంతువు ఒరియా స్త్రీ. ఈ కేరక్టర్ చాల సహజంగా మల్చబడ్డది. కేరెక్టర్ ఎంపిక  కూడా ఎంతో హత్తుకునేలా ఉంది.

అయితే అదొక్క అద్భుతం కోసం చిన్న పిల్లల పట్ల ఉండాల్సిన ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ ను పక్కన బెట్టి, డ్రామా లాంటి సీన్ లు చూసి మొకం మొకం చూసుకుని, మైనారిటీలను అందరిలా కించ పరిచే సీన్ లు చూసి ఆనందించలేక ఏడ్వలేక సినిమా చూస్తూ మూడు గంటలు గడపడం అంటే నావల్ల కాదు. ఇంకెవరికీ ఆ బాధ అవద్దు. మనకుండే సగటు విలువలకు ఒక ఊహా రేఖ ఉంటే, దాని కంటే అతి కింద స్థాయిలో ఉండే సినిమా ఇది.

నాగరికత అన్నది ప్రధానంగా మనుష్యులు సంఘటితంగా పెంచి పోషించిన గుణాల వల్ల వస్తుంది. దానికి భూమిక – ఎన్నో విలువలను ఎన్నో తరాలు కూడగట్టుకుంటూ రావడం వలన జరుగుతుంది. ప్రతి తరం తన అభివృద్ధిలో భాగంగా కొత్త విలువలు కూడగట్టుకుంటుంది. అదే మనుష్య సంస్కృతిగా మిగిలిపోతుంది. ఈ కొత్త విలువలు నీకూ నాకూ తెలిసి ఒక్క రోజులో ఏర్పడవు. ఒక్కో మెట్టు కూర్చుకుంటూ పోయినప్పుడు జరుగుతుంది. కొన్ని సార్లు కొన్ని మెట్లు కూలగొట్టి అదే ప్రగతి అని తప్పటడుగులు వేసిన మనుష్య లోకం ఎప్పుడో ఒక  రోజు సరిద్దిద్దుకుంటుంది . కాని అది పడగొట్టినప్పుడే సరిద్దిదుకోవాలి  అని తెలపడమే క్రియాశీలత. అదిలేకపోతే ఏదో ఉత్పాతం జరిగినప్పుడు జరిగేది కౄరమైన హింసాత్మకమైన ఆత్మ విమర్శ !

కేవలం సురేష్ ప్రాడక్షన్ చేతిలో ఉండడం వలన సినిమా హాళ్ళు దొరికాయి. ప్రేక్షకులకు చూద్దామనే initial interest వచ్చింది. సురేష్ ప్రాడక్షన్ తీసింది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసి మనం కూడ ఏదో ఒక అనుచర వర్గం లో చేరిపోవాలనుకుని పెద్ద దర్శకులు ప్రొమోట్ చేయడం – ఇవన్నీ దీని హైప్ కు దారి తీసాయి గాని ..ఈ సినిమాకు అంత సినిమా లేదు !….ఉత్తిగ కాదు ..ఖచ్చితంగా !

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Avatar

విక్టర్ విజయ్ కుమార్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అయ్యో! ఇలా రాసేశేరంటండి – అన్ని చోట్లా ఈ సినిమా గురించి చదివి ఇంకా చూద్దామనుకుంటూ వుండగానే ఇది చదివేశాను. అదీ కాక “అ!” దెబ్బ నాకు బాగా తగిలింది – నడివేసవిలో వడదెబ్బలా. అప్పట్నుంచి సినిమాల విషయంలో look before you leap అనేది నా సినీ-మంత్రం. ఇప్పటికి నా సినిమా-వీక్షణ కార్యక్రమం వాయిదా 🙂

 • మీ రివ్యూలో సోషలిజం కన్నా ఫ్యూడలిజ భావజాలం ఎక్కువ కనిపిస్తుంది. కమర్షియల్ సినిమా కథని ఇలా ఓపెన్ గా చెప్పాడు అసలు ఏమీ బాగోలేదు. సినిమా చూసే ప్రేక్షకుడికి కథ మొత్తం తెలిసిపోయేలా రాయడానికి ఇది కథ, నవల కాదు. మీ దృష్టితో అందరి దృష్టి ఎందుకులా పాడు చేయడం. “పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి” మీది అందరూ ఎలా పాటిస్తారు.

  • Thank you మీ ఫీడ్ బేక్ లో ఒపీనియన్ కన్నా ఇంప్రెషన్ ఎక్కువ కనిపిస్తుంది. Impressions can be subjected to discussion. కాబట్టి lets leave it like this. All the best !

 • మీ విమర్శ చాలా సమంజసంగా ఉంది .
  ఇలాంటి సినిమాలు జనాలు చూస్తున్నందుకు విచారం కలుగుతుంది .

 • I did not felt the way VK garu expressed whilst establishing relationship between child characters. Broadly it is all about underdogs and impressively captures the nativity. It can be categorised under realism. A bit of documentary style in the film format is an established style which I think the director managed well to syncranise. Of course there would be many aspects to look critically to improve the story telling more better way considering the commercial aspects. Do not stop to see the film. Go as an independent viewer.

 • ఈ వ్యాసానికి పెట్టిన శీర్షిక చూస్తేనే ఇది చాలా బయాస్డ్ అభిప్రాయం అని అర్థమై చదవాలనిపించక చివరి పేరాకి వచ్చి చూస్తే రచయిత చేసిన అభియోగం కనిపించింది. అది చదివాక నాకర్థమైంది విజయ్ కుమార్ గారి బాధ. ఆయన ఈ సినిమాని ముందే చూసి తనే అందరికంటే ముందు శభాష్ అని, సురేష్ ప్రొడక్షన్స్ వారి అనుచర వర్గంలో చేరి ఉండాలనే తపన ఎక్కువ కనిపిస్తోంది.

  • హ హ….అంటేఈ రచనలోని సారం కరెక్ట్ గా దట్టించాననే విషయం తెలియజేసారు. కృతఙతలు ! బాగుంది…రచన మీద చాతకాపోతే కనీసం రచయిత మీదైనా సరిగ్గా బాణం గురి పెట్టాలి కదా ? నా బేక్ గ్రౌండ్ తెలిసినట్టు లేదు మీకు. కనుక్కోండి ! తర్వాత బాణాలు వదలండి ! More importantly, you must understand the genesis of cultural base for Padepholic crimes in a society. I encoruage you not to be complascent with a small bits and pieces of satisfaction in life.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు