అంతర్జాతీయ వలస దుఃఖం

పెద్దింటి కథల్లో ఇదొక కన్నీటి చెలిమె.

వాళ తెలంగాణ కథకు నిఖార్సైన చిరునామా పెద్దింటి అశోక్ కుమార్. కరువును ఎరువుగా వాడుకొని ఎదిగిన రచయిత. వలసను ఇరుసుగా చేసుకొని మనిషి దుఃఖాన్ని వలపోసిన కథకుడు. ప్రపంచీకరణ కడుపుతో ఉండి ప్రసవించిన రచయిత పెద్దింటి అశోక్ కుమార్. పెద్దింటి పేరు చెప్పగానే ఒక ‘మాయిముంత’, ‘జుమ్మేకి రాత్ మే’,       ‘ఆ ఇల్లు మూతవడ్డది’,  ‘ప్లాసెంట’, ‘ఆకలి’, ‘కాగుబొత్త’, ‘ఊటబాయి’… ఇలా ఎన్నో కథలు సగటు తెలుగు పాఠకుని మనో ఫలకంపై వచ్చి వాలుతాయి. తెలంగాణ మట్టిని తవ్వి మైలపడిన జీవితాలనెన్నింటినో నెత్తికెత్తుకున్న బహుజన కథకుడు పెద్దింటి. ఇప్పటికే పెద్దింటి కలం నుండి సుమారు 200 కథలు, 6 నవలలు వెలువడ్డాయి. ఈయన రాసిన ‘జిగిరి’ నవల 2006లో America Telugu Association (ATA) నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. ఈ నవల ఇప్పటికి 12 ఇతర భాషల్లోకి అనువదింపబడింది. పెద్దింటి రాసిన ఏ కథైనా ఏదో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, గాఢమైన అనుభూతిని మిగులుస్తుంది. అందుకే కథా ప్రపంచంలోని ప్రతీ అవార్డూ పెద్దింటిని వరించింది. తెలంగాణ జీవితానికి ఉపనదిలా సాగిపోయే పెద్దింటి కథలన్నీ బతుకు పోరాటాన్ని కన్నీటి పాయలతో చూపించేవే. అలాంటి ఒక కన్నీటి పాయ ప్రాణం ఖరీదు వంద ఒంటెలు. ఈ కథ 2 జూలై 2013 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.

భూమ్మీద ఆదిమ మానవుడు ఆహారం కోసం వేట మొదలు పెట్టినప్పటి నుండే వలస ప్రారంభమైంది. ఇది కొనసాగీ కొనసాగి పారిశ్రామిక విప్లవం తరువాత స్వరూపం మార్చుకొని ప్రపంచమంతా విస్తరించింది. బుద్ధిజీవి ఎవడైనా పొట్ట కూటి కోసమో, మెరుగైన జీవిక కోసమో వలస పోవడం తప్పు కాదు. అలా రెండు వేరువేరు దేశాల నుంచి పని కోసం మరో దేశం పోయిన ఇద్దరు యువకులు జీవితపు పెనుగులాటలో ఒకరి ప్రాణాన్ని తీసి నేరస్తులుగా మిగిలిన కథ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’. నిజానికి ఇదొక అంతర్జాతీయ వలస బతుకుల కథ. ఇలాంటి కథలు తెలుగులో చాలా తక్కువ వచ్చాయనే చెప్పాలి.

సావిత్రిది త్యాగాల కుటుంబం. ఉద్యమాల వారసత్వం. సావిత్రి తండ్రి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు. ‘సంగం’తో జత కూడి ఎంతో మంది దొరలను, భూస్వాములను గ్రామాల నుండి పట్టణాలకు తరిమి కొట్టినవాడు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ దొరలు, భూస్వాములే రూమీ  టోపీలు పెట్టుకొని కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మళ్ళీ గ్రామాలకు వచ్చి నాయకులుగా చలామణి అయ్యారు. సావిత్రి తండ్రిలాంటి పోరాట వీరులను పగబట్టి ఊర్లో నుండి వెళ్లగొట్టారు. పట్నంలో రిక్షా తొక్కుకుంటూ చివరికి సావిత్రి తండ్రి ఆకలి చావు చచ్చాడు. సావిత్రి భర్త ‘భూమి-భుక్తి-విముక్తి’ పోరాటంలో నాయకుడు.

నిర్బంధం పెరిగి భర్త నక్సలైట్లలో కలుస్తానంటే వద్దే వద్దని బలవంతంగా బొంబాయి పంపుతుంది. ఎక్కడి నుండో భర్త రాసిన చివరి ఉత్తరం “సహచరి లాల్ సలామ్… నిన్ను చూడాలని ఉన్నా ఊరికి రాలేని పరిస్థితి. బొంబాయి వచ్చినా పోలీసులు నన్ను వదులలేదు. ఓ పెద్ద తలకాయను పట్టిస్తేనో, ఓ రెండు తుపాకులు పట్టుకొస్తేనో తప్ప బతకనియ్యమంటున్నారు. ఉద్యమానికి ద్రోహం చేయలేను కదా! మృత్యువు నీడలా వెంటాడుతుంది. నిన్ను కలిశాక అన్ని విషయాలు చెప్పుకుందాం. చిన్నోడు జాగ్రత్త.” ఉత్తరం, ఎన్ కౌంటర్ వార్తా రెండూ ఒకేసారి అందాయి. బొంబాయిలో ఉన్న భర్త ఊరు పక్కన పెద్ద గుట్టల మీద శవమై తేలాడు. మొదట సావిత్రి తండ్రిని భర్తలో చూసుకుంది. ఇప్పుడు భర్తను కొడుకులో చూసుకుంది. కానీ ఇప్పుడు కొడుకు మళ్ళీ పాత గాయాన్ని గెలికాడు.

అవి నక్సలైట్లతో చర్చల పేరుతో ప్రభుత్వం గ్రామాల మీద పడగ నీడ పరిచిన రోజులు. ఊర్లన్నీ మరోసారి ఎరుపెక్కాయి. ఒకనాటి రాత్రి సావిత్రి కొడుకు నాగరాజు “అమ్మా…  మంచి అవకాశం. ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రే లక్షాధికారులం అయిపోవచ్చు. ఉద్యోగం కూడా ఇస్తామంటున్నారు. మనకు చాలా సింపుల్. ఒక ఇద్దరిని  పట్టిద్దాం. జస్ట్ ఒక ఫోన్ కాల్ అంతే” రహస్యంగా సావిత్రి చెవిలో అంటుంటే సావిత్రి ఆశ్చర్య పోయింది. “నిన్ను అనాలో నీ తరాన్ని అనాలో లేక ఒక నిస్సార తరాన్ని తయారు చేసినందుకు వ్యవస్థను అనాలో తెలుస్తలేదురా.. ఎవరి కడుపున పుట్టినవో తెలుసునా?” అని యాష్టపడింది. కాని నాగరాజులో ఏ మార్పూ లేదు. డబ్బు కోసం ఏ పనైనా చేసేటట్టు తయారవుతున్నాడు. ఇక లాభం లేదని నయానో భయానో నచ్చజెప్పి దుబాయ్ పంపిస్తుంది.

సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ నాగరాజు దుబాయిలో తెలుగువాళ్లందరికి తలలో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ నాగరాజు ప్రత్యక్షమయ్యి సమస్యను పరిష్కరిస్తుంటాడు. ఇదిలా ఉంటే శ్రీలంకలో తమిళ పులుల వేట కొనసాగుతుంటుంది. ఓ వ్యక్తి ఉద్యమంలో ఉంటాడు. ఆయన భార్య ఈ వేటలో తన కొడుకులు ఎక్కడ బలవుతారోనని భయపడి తన ఇద్దరు కొడుకులను నచ్చజెప్పి దుబాయి పంపిస్తుంది. ఇక్కడ ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆకలికి  తాళలేక ఒక రాత్రి మబ్బు ముసుగులో బియ్యం గోదాంలోకి దొంగతనానికి వెళ్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉన్న నాగరాజుతో పెనుగులాట జరుగుతుంది. చివరికి ఆ గొడవలో నాగరాజును ఆ ఇద్దరు అన్నదమ్ములు చంపేస్తారు. కోర్టు వీరికి ఉరి శిక్ష వేస్తుంది. దుబాయి షరియత్ చట్టాల ప్రకారం కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం. అయితే హత్య కేసుల్లో ఒక వెసులుబాటు ఉంది. చనిపోయిన వ్యక్తి కుటుంబం క్షమా బిక్ష పెడితే చంపిన వ్యక్తిని ఉరి తీయకుండా వదిలిపెడుతారు. దానికి అతను ఈ కుటుంబానికి వంద ఒంటెలు ‘దియా’ (చనిపోయిన మనిషికి ఇచ్చే నష్టపరిహారం) ఇవ్వాలి. ఒకప్పుడు అరబ్బులకు ఒంటెలే బతుకు గదా! అందుకే లెక్క ఒంటెల సంఖ్యతో ముడిపడింది. ఇప్పుడు ఒంటెల సంఖ్య తగ్గిపోయింది  కాబట్టి వంద ఒంటెలకు సమానమైన డబ్బును ఇవ్వాలి.

తన కొడుకులను ఎలాగైనా కాపాడుకోవాలని శ్రీలంక నుండి దుబాయి వస్తుంది ఆ ఇద్దరు కొడుకుల తల్లి. పోయినోడు ఎలాగూ రాడు కనీసం డబ్బులు వచ్చినా జీవితం బాగుపడుతుందని నాగరాజు దోస్త్ చంద్రం క్షమాభిక్షకు ఏర్పాట్లు చేయడంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కు క్షమాభిక్ష లెటర్ ఇప్పిద్దామని ఊర్లో ఉన్న సావిత్రి దగ్గరికి వస్తాడు. సావిత్రి కొడుకు మీద రంధితో పుట్టెడు దుఃఖంలో మునిగి ఉంటుంది. తన కొడుకును చంపిన ఆ మూర్ఖులకు ఉరి శిక్ష పడి తీరాల్సిందేనని మనసులో రగిలి పోతుంది. పెద్దమ్మా! నువ్వు లెటర్ ఇవ్వక పోతే నేనే నీ తరపున లెటర్ ఇస్తానని చంద్రం అనడంతో ఎందుకురా! నేనే కోర్టుకు వచ్చి చెప్తా పద అని కనీసం కొడుకు శవాన్నైనా చూడలేక పోయిన. వాడున్న తావు నైనా చూస్తానని సావిత్రి కూడా దుబాయి బయలుదేరుతుంది. కానీ మనసులో మాత్రం ఆ పాపపు సొమ్ము నాకెందుకు, నా కొడుకు చావును అమ్ముకుంటనా కోర్టులో ‘కసాస్’ (చంపేయండి) అంట. ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు ఉరి శిక్ష పడి తీరాల్సిందే చంద్రంకు తెలియనివ్వ అనుకుంటుంది.

దుబాయి చేరుకొని తన కొడుకున్న రేకుల షెడ్డులో పడుకుంటుంది. ఆ రాత్రి బయటెవరో రేకులను బరబరా గీకిన చప్పుడు విని పక్కన పడుకున్న చంద్రంను లేపాలని ప్రయత్నిస్తుంది. అప్పటికే చంద్రం లేచి  “అవి అంతే పెద్దమ్మా! ఎడారి ఎలుకలు.. బల్లులు… పంది పిల్లల్లెక్క ఉంటై. మందలు మందలు తిరుగుతయి. అదీగాక ఈ క్యాంపు ఊరికి దూరంగా ఎడారిలో ఉంది. ఏ పురుగు  ముట్టినా కష్టమే. దవాఖానకు పోయేసరికి ప్రాణాలు పోతయి. గోడ అవతల అవి. ఇవుతల మేము. రాత్రంతా చావు బతుకుల పోరాటమే.” అంటాడు. సావిత్రి గుండె మరింత బరువెక్కుతుంది.

చంద్రం, అతని స్నేహితులు కొందరు, సావిత్రి కలిసి భారమైన మనసుతో కోర్టుకు చేరుకుంటారు. పెద్దమ్మా! లోపలికి ఎవరినీ రానీయరు. మన తరపున ఒకరిని, వాళ్ళ తరపున ఒకరిని ఇద్దరినే రానిస్తారు. నువ్వు లోపలికి పోయి జడ్జి అడిగినపుడు ‘ఇన్నా తానాజిల్’ (క్షమిస్తున్నా) అను. పొరపాటున ‘కసాస్’ అంటివా మనం చేసిందంతా బూడిదిల పోసిన పన్నీరే అయితది అని పోలీసులు లోపలికి పిలిస్తే లోపలికి పోతాడు చంద్రం. కోర్టంతా నిశ్శబ్దం. మధ్యాహ్నపు ఎండ భుసలు కొడుతుంటుంది. కోర్టు వరండాలో ఒకామె కుప్ప పోసిన శోకంలా కూర్చుని ఉంది. ఆమెను తన కొడుకును చంపిన వాళ్ళ తల్లిగా పోల్చుకుంటుంది సావిత్రి. ఆమె మీది ఆంధ్ర కదా! మాది సిరిలంక అని అదో రకమైన యాసలో పరిచయం చేసుకొని “నాదు భర్తాలుడు పోరాటంలో అజ్ఞాతవాసిగా వెళ్ళి ఉంటే గవుర్నమెంటు తలకు పాతిక లక్షల వెల కట్టి ఉండారమ్మా! నా భర్త ఎలాగూ బయటపడలేడు కనీస మాత్రం పిల్లలనైనా బతికించుకుందామని అక్కడ తావు లేక ఇక్కడికి పంపి ఉండినాను. కాని కాలం కల్సి వచ్చిలేదు… సంపింది నా కొడుకులు కాదు. సచ్చి ఉంది నీ కొడుకు కాదు. వీరిని ఇక్కడకు రప్పించి చేతులకు రగతం అంటకుండా హత్యలు చేయించి ఉండారే… ఆ రణబందులు వేరుగా ఉన్నారు. అది గుర్తించి చూడు…” అని ఆమె కంటికేడు ధారలతో ఏడుస్తూ చెప్పింది. సావిత్రి ఆమె దుఃఖంలో తనను తాను చూసుకుంది. మళ్ళీ ఆ యువకుల తల్లే “నా పిల్లలు ఈ ఎడారి రాజ్యంలో ఉరి చావు చచ్చి ఉండాకంటే అక్కడకు వెళ్ళి ప్రజల కోసం చచ్చి ఉండుడు మేలనుకున్నాను. రెండు పులుల కోసరం ఒక పులిని చంపాలనుకున్నాను. అందుకోసరమేనమ్మా.. వీరి తండ్రిని నగదు రొక్కముకు మిలటరీకి నేనే పట్టిచ్చి ఉండాను. ఈ రొక్కం ఇదే… నా బిడ్డల పాణాలు దానం చేసి ఉండమ్మా ” అని ఇరువయైదు లక్షల డబ్బు మూటను చేతికిచ్చి వేడుకుంటుంది. నిన్నటి నుండి గడ్డగట్టుకుని పోయిన సావిత్రి నరనరాల్లోని దుఃఖం రోదనగా మారింది. అప్పటి దాకా కచ్చితంగా ‘కసాస్ కసాస్’ అంటానని అనుకున్న సావిత్రి “నాకు నయా పైసా వద్దు, నీ బిడ్డలను దానం చెయ్యను. రెండు పులులను దానం చేస్తాను” అని కోర్టులో ‘తానాజిల్’ చెప్పడానికి లోపలికి పోతుంది.

తెలంగాణ ప్రజల పోరాట మనస్తత్వాన్ని పట్టి చూపే కథ ఇది. తరాలు మారినా వారిలోని పోరాట స్వభావం మాసిపోదని నిరూపించిన కథ. అంతే  కాదు ప్రజల పరంగా ఆలోచించే, పోరాడే వీరులు ఏ దేశంలోనైనా ఒక్కటే అని చూపిన కథ. కథకుడు ఎక్కడా జోక్యం కల్పించుకోడు. కథ జీవితమంత స్వచ్చంగా పరిమళిస్తుంది. ఒకనాడు తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్ళినా గర్భ శోకంతో కునారిల్లే కొన్ని వందల మంది సావిత్రులు కనిపించేవారు. ఊర్లన్నీ ఎప్పుడూ ఏదో ఒక గాయంతో మసలిపోతుండేవి. మూతి మీద మీసం మొలిచిన యువకులందరూ పోలీసుల దృష్టిలో నక్సలైట్లే. ఒక వైపు కరువు తరుముతుంటే, మరో వైపు పోలీసుల నిర్బంధం పెరిగిపోయి వయసు పోరగాండ్లు ఎందరో ఏ దారీ లేక ఎడారి దేశాలకు వలస పోయి నరకప్రాయమైన జీవితాన్ని గడిపేవారు.

“పెళ్ళైన నెలకే వలస వచ్చిన రాములు, వస్త వస్తనని కూతురు పెళ్ళికి కూడా రాని లింగం, తండ్రి చావును కూడా చూడని రాయమల్లు, పదేండ్ల నుండి పత్తా దొరకని అంజయ్య, కాలు విరిగినా ఇంటికి పోని పెంటయ్యలు” ఎంతో మంది సముద్రమంత బాధను కడుపులో పెట్టుకొని గల్ఫ్ దేశాల్లో సాయం అందించే చేయి కోసం మూగగా ఎదురు చూస్తుంటారు. కుటుంబ భారాన్ని వీపు మీద మోస్తూ ఎడారి ఓడలాగా భారంగా కదులుతుంటారు. ఈ చిత్రాన్నంతా అరేబియన్ ఏడారంతటి సహజంగా వర్ణిస్తాడు రచయిత. మూడు తరాల తెలంగాణ పోరాటాన్ని, దాని స్వరూపాన్ని గొప్పగా పట్టుకున్న కథ. ఏవో శక్తులు తరిమికొడితే బతుకుదెరువు కోసం తాత హైదారాబాద్ పోతాడు. తండ్రి బొంబాయి పోతాడు. మనవడు దుబాయి పోతాడు. కాని అంతిమంగా ఎవరూ బతికి బట్ట కట్టరు.

1940 నుంచి 1990 వరకు జరిగిన ఉద్యమాల రూపం, పారిపోయిన దొరలు నాయకులుగా, వ్యాపారులుగా మారి గ్రామాల్లోకి వచ్చిన తీరును తెలుపుతుందీ కథ. కథంతా తెలంగాణ తెలుగులో సాగిపోతూ ఒక వాగును తలపిస్తుంది. శ్రీలంక తల్లి మాట్లాడే స్లాంగ్ ను పట్టుకోవడంలో, మౌఖిక కథా శిల్పంలో కథను నడపడంలో రచయిత విజయం సాధించాడు. శ్రీలంకలోని తమిళులకు, తెలంగాణలోని నక్సలైట్లకు సారూప్యత చెప్పి పోరాటం ప్రజల పరం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తాడు కథకుడు. పెద్దింటి కథల్లో ఇదొక కన్నీటి చెలిమె. అంతర్జాతీయ వలస దుఃఖపు ఊటబాయి. కథంతా పూర్తయిన తరువాత ఒక ఇసుక తుఫాను మన గుండెను కమ్మేస్తుంది. దేహంలోని నీరంతా ఆవిరైనట్లు మన మనసంతా తడారిపోయిన ఆకులాగా ముడుచుకుపోతుంది. కథంతా నిండిపోయిన దుఃఖమేదో మన రక్తంలోకి ఇంకి పోయి మనం కూడా ఒక ఎడారి ఒంటెలాగా మిగిలిపోతాం.

                                                                     *

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

10 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీధర్ గారూ… చాలా అద్భుతమైన సమీక్ష. దీన్ని నేను చదవలేదు. కానీ మీ పరిచయమే నన్ను కుదిపేసింది. -ప్రభు

  • .పెద్దింటి అశోక్ కుమార్ గారి కధలను వివరంగా చేసిన ఈ సమీక్షా చాలా బావుంది. తెలంగాణలో మంచి రచయితల్లో వారొకరు.

  • అద్భుతమైన స మీక్ష.

    ఎడారి బతుకులు ఎక్కడ చూసినా ఉంటాయి అని తెలిపే పెద్దింటి కథను సమర్థవంతంగా శ్రీధర్ అన్న విశ్లేషించారు.

    ఇద్దరి కీ అభినందనలు.

  • పెద్దింటి అశోక్ కుమార్ గారి కథాలను నవలలను నేరుగా మనసుకు అందేలా సమీక్ష చేసిప వెల్దండి గారికి కృతజ్ఞతలు

  • పెద్దింటి అశోకన్నను చక్కగా పరిచయం చేశారు. కథా విమర్శనం అలవోకగా సాగింది.
    వెల్దండి శ్రీధర్ గారు
    మాదండిగ రాస్తుండ్రు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు