అంతరించిపోయిన కళ!

మధ్యాన్నం నీళ్ళు పట్టుకుంటుంటే కాంతమ్మ చేతుల్ని మెలితిప్పేసింది. ఇప్పుడేమో ఆ చేతుల్లోనే మల్లెపూలను ప్రేమగా పెట్టింది. ఇద్దరి చేతులు  మల్లెపూల వాసనతో పరిమళించాయి.

మే నెల ఎండలు మండిపోతున్నాయి. నాలుగు  మాడవీధుల్లోని తారు రోడ్డు కరిగిపోయి ఎండకు పొగుకక్కుతావుండాది. ఆ తారురోడ్డు మీద నీటికుంటలు (ఎండమావు) ఏర్పడి, నీళ్ళు వున్నట్టు భలే కనికట్టు చేస్తున్నాయి. ఆ నీటికుంట దగ్గరికి పొయ్యేసరికి అక్కడ నీళ్ళువుండేవికావు. మా పిలకాయకి అది భలే విచిత్రంగా వుండేది.

గోగర్భం డ్యామ్‌లోని నీళ్ళు అడుగంటిపోయినాయి. ఆ సంవత్సరం కొండమీద నీటి ఎద్దడి ఏర్పడింది.

కొండకు వచ్చే యాత్రికులు నీటికి కటకటలాడిపోతున్నారు. స్వామివారి కోనేరు ఎండిపోయింది. బురదమట్టి ఎండిపోయి నెర్రలు  చీలిపోయింది. ఆ మట్టిలో, చిల్లర పైసలు  దొరుకుతాయని బిక్షగాళ్ళు మట్టిని లోడుతున్నారు. కోనేరు నీటితో నిండుగా వున్నప్పుడు యాత్రికులు చిల్లర నీళ్ళల్లోకి విసురుతారు. ఆ డబ్బు అలాగే నీళ్ళ అడుగుకు వెళ్ళిపోయి, బురదలో వుండిపోతుంది. ఆపైసల్ని ఇప్పుడు లోడుకుంటున్నారు.

నాలుగు మాడవీధుల్లో నాలుగు కొళాయిులున్నాయి. అవి వుండూరోళ్ళ కోసం ఏర్పాటుచేసిన కొళాయిలు. మామూలుగానైతే కొళాయిని తిప్పితే ఇరవై నాలుగు  గంటలు  నీళ్ళు వస్తానేవుండేవి. ఇప్పుడు నీటి ఎద్దడికాబట్టి రోజుకి ఒక పూటే నీళ్ళు వదులుతున్నారు. మా పడమర మాడవీధిలోని కొళాయి దగ్గరైతే వంతుల వారిగా ప్లాస్టిక్‌ బకెట్స్‌, చెంబులు, ఇనపడబ్బాలు, తప్పేళాలు  క్యూలో పెట్టుండారు. కొండకు వచ్చిన యాత్రికులు  దేవుడి దర్శనం కోసం క్యూలో నిలబడినట్టు, ఈ వస్తువులన్నీ నీళ్ళకోసం నిలబడి వున్నాయి.

కొళాయి ముందున్న వాటిని చూస్తుంటే, బుల్లిబుల్లి పెట్టెలున్న రైలు  ప్లాట్‌ఫామ్‌ మీద ఆగివున్నట్టు చూడ ముచ్చటగా వుంది.

తారురోడ్డు మీద నీటికుంటల్ని వెంటాడుతూ, ఆడుకుంటున్న మాకు కొళాయిలో నుండి గ్యాస్‌ రావటం వినిపించింది.

‘‘రేయ్‌ మచ్చా… నీళ్ళు వస్తున్నట్టుండాయిరా!’’ అన్నాను. నేను ఆ మాట అనడమే ఆలస్యం కులశేఖర్‌గాడు పరిగెత్తుకుంటా ఇంట్లోకి పొయ్యి వాళ్ళమ్మకు చెప్పేసినాడు. తిరిగి చూస్తే నా చుట్టూ ఒక్క పిల్లగాడులేడు. అందరూ లోపలికిపొయ్యి వాళ్ళ వాళ్ళ అమ్మకు నీళ్ళు వస్తున్న విషయం చెప్పేసారు. నేను పొయ్యి మా ఇడ్లీ అవ్వకు చెప్పాను.

అందరికంటే ముందు కులశేఖర్‌ గాడి వాళ్ళమ్మ మా వసంతఅత్త రెండు బిందెలు  పట్టుకుని పరిగెత్తుకుంటూ కొళాయి దగ్గరకు వచ్చేసింది. ఆమెకు కొంచెం నోరు జాస్తి. వస్తూవస్తూనే బిందెని కొళాయి కింద పెట్టేసింది.

కొళాయిలోనుంచి కొంచెం గ్యాస్‌, కొంచెం నీళ్ళు వస్తున్నాయి. ఇంతలో సుబ్బారెడ్డి సందులోనుంచి నల్లదారాలు  అమ్మే అరవాయన పెళ్ళాం కరుత్తమ్మ బింద పట్టుకొని వచ్చింది. గుడిలో అర్చకుడిగా పనిచేసే పట్టాభి వాళ్ళ భార్య పుట్టమ్మ, నారద మందిరం కృష్ణమ్మ. పిఠాపురం సత్రంలోనుంచి కొంతమంది ఆడవాళ్ళు, ఇలా ఒక్కరొక్కరే పొగపెడితే బొక్కల్లోంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చిన ఎలకల్లా  ఆడంగులంతా కొళాయిదగ్గర గుమికూడిపోయినారు.

అందరూ యుద్ధానికి మోహరించిన సైనికుల్లా చేతుల్లో బిందెలు పట్టుకుని రెడీగా వున్నారు. నీళ్ళ కోసం యుద్ధం చెయ్యటానికి! యుద్ధంలో కూడా అన్ని వ్యూహాలు  పన్నరు. ఆడవాళ్ళు నీళ్ళకోసం పన్నే వ్యూహాలు  భలే రంజుగా వుంటాయి.

వస్తా వస్తానే అరవాయన పెళ్ళాం కరుత్తమ్మ, మా వసంతఅత్త పెట్టిన బిందెను, ఆమె బిందెతో పక్కకు నెట్టేసి కొళాయి కింద బిందె పెట్టింది.

‘‘ఒసేయ్‌ అరవదాన.. ఇత్తడి బిందెతో కొట్టానంటే నీ ముఖం సొట్టపడుతుంది’’ అని ఆ బిందెను కాలితో ఒక తన్నుతన్ని బిందెపెట్టింది మా వసంతఅత్త.

‘‘మొదలు మొదలే నేనుదా అకా పెట్టాను వంతు. నువ్వు వంతు పెట్టింది పత్తుమనిషి అవత. మొదలు మొదలే నీ పడితే ఎప్పిడి అకా?’’ అని వచ్చీరాని తొగులో అడిగింది.

‘‘నువ్వు మొదట వంతుపెడితే, నేను మొదట వచ్చి బిందెని కొళాయి కింద పెట్టాను. నీళ్ళు కింద వృధాగా పోతావుండాయి. నన్ను పట్టుకోని. నువ్వు మళ్ళీ పట్టుకుందువుకాని’ అని కసురుకుంది. కరుత్తమ్మ కొంచెం వెనక్కి తగ్గింది. మా వసంతఅత్త ఒక బిందె నీళ్ళు పట్టుకుని, వెంటనే ఇంకో బిందెను కూడా కొళాయి కిందపెట్టింది. అదిచూసి ఆడవాళ్ళను తోసుకొని రోషంగా ముందుకొచ్చింది. కొత్తగా పెళ్ళయ్యి కాపురానికి వచ్చిన పుత్తూరుకాంతమ్మ.

‘‘ఏమ్మా ఈ అన్యాయము? నీది పదో వంతు. ఒక బిందె పట్టుకో చాదా! నీ వంతు వచ్చినప్పుడు ఇంకో బిందె పట్టుకో!’’ అని రోషంగా అనింది. ‘‘నాకు చెప్పేదానికి నువ్వు ఎవురే! కొత్తగా కాపురానికి వచ్చిన నా సవతు కూడా నీతులు  చెప్పేదే!’’ అని అనేసింది.

‘‘మోవ్‌… మాట మంచిగా రాని. మాపుత్తూరులో ఇంత అన్యాయంగా నీళ్ళుపడితే. చేతులు  ఇరిచేసి పుత్తూరు కట్టుకట్టేస్తారు” అని కోపంగా చేతుతో బిందెని తోసెయ్యబోయింది.

మా వసంతఅత్త, ఆ కాంతమ్మ చేతులు  పట్టుకొని మెలితిప్పేసింది. ఎవర్నీ రానీకుండా బిందెకు అడ్డంగా నిబడిరది. రెండు బిందెలు  నీళ్ళు పట్టుకొని ఆ సంకన ఒక బిందె, ఈ సంకన ఒక బిందె ఎత్తుకొని వెళ్ళిపోయింది.

ఆడవాళ్ళకు ఓపిక నశించింది. అంతవరకు ఒద్దికగా వరుసక్రమంలో వంతు పెట్టుకున్న వస్తువులన్నీ చెల్లా చెదరైపోయినాయి. ఒకర్ని ఒకరు తోసుకుంటూ, ఒకర్ని ఒకరు దొబ్బుకుంటూ అడ్డదిడ్డంగా నీళ్ళు పట్టుకోవటం మొదలు  పెట్టారు.

ఈ గొడవనంతా చూస్తూ దూరంగా నిలబడి వుంది పట్టాభి భార్య పుట్టమ్మ. వాళ్ళు బాపనోళ్ళు. వాళ్ళకి మడి ఆచారాలు  వుంటాయి. అంటు వుంటుంది. మనలాగా ఎలాపడితే అలా నీళ్ళు పట్టుకోరు.

‘‘ఏమ్మా… మీరు అలా మీద మీదపడితే నేను నీళ్ళు ఎలా పట్టుకునేది? అసలే నేను మడిలో వున్నాను. అంటు తగిలితే నేను మళ్ళీ స్నానం చెయ్యాలి” అని అడిగింది పుట్టమ్మ.

పుట్టమ్మ అప్పుడే స్నానం చేసింది. తడిసిన జుత్తుని టవల్‌తోపాటూ ముడివేసుకుంది. వొళ్ళంతా పసుపుపూసుకుని స్నానం చేసినట్టువుంది. పచ్చి పసుపుకొమ్ములా కళగా వుంది. నుదిటిమీద పావలా కాసంత ఎర్రటి బొట్టు, చెవుల్లో ఎర్రాళ్ళ కమ్ము, రెండుముక్కుల్లోన ఎర్రరాళ్ళ ముక్కుపుడక  పెట్టుకునింది. పచ్చగల్లు వచ్చిన కాంచీపురం నేతచీరని కుంచె పోసుకుని కట్టుకునింది. ఆమెను చూస్తే ఒక పవిత్రమైన భావన కలుగుతోంది.

ఆమెను చూసి దూరంగా జరిగి దారి వదిలారు. ఆమె రెండు రాగిబిందెలతో నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది. గుమ్మందగ్గర పుట్టమ్మ వాళ్ళఅత్త ఆ రాగి బిందె మీద పసుపునీళ్ళు చల్లింది. అప్పుడు ఆ బిందెల్ని లోపలికి పట్టుకెళ్ళింది పుట్టమ్మ.

గొల్ల  సందులో నుంచి పెద్దపెద్ద అంగు వేసుకుంటా, రెండు చేతుల్లోనా రెండు ఇత్తడిబిందెలు  పట్టుకొని వచ్చింది, గొల్ల కృష్ణయ్య పెళ్ళాం రాధమ్మ. కొళాయి దగ్గరకు రాగానే ఆమె నడకలో మార్పు వచ్చింది. కుడి కాలు  బొటనవేలికి  కట్టుకట్టి వుంది. ఆ కట్టు అట్టకట్టుకుపోయి నల్లగా  మాసిపోయి వుండాది. కొళాయి దగ్గరకి రాగానే కుంటుతూ వచ్చింది. గాయం తాలూకు  నొప్పిని ముఖంలో నటిస్తూ అడిగింది రాధమ్మ.

‘‘అబ్బా… నొప్పి సలుపుతావుండాది. అడుగుతీసి అడుగు వెయ్యలేకపోతు న్నాను. ఈ గుంపులో ఎట్టమ్మా నీళ్ళు పట్టుకునేది?’’ అని యాక్షన్‌ చేసింది రాధమ్మ.

‘‘ఏమైంది వదినా..?’’ అని అడిగింది నారదమందిరం కృష్ణమ్మ. దిగవకు పొయ్యి (తిరుపతికి) కూతురు దగ్గర వారంరోజులుండి  ఈరోజే కొండకొచ్చింది కృష్ణమ్మ.

‘‘పాలు పిండతావుంటే ఆవు బొటనేలు  తొక్కేసింది కృష్ణమ్మా!’’ అని చెప్పింది రాధమ్మ.

‘‘అయ్యో…’’ అని దీర్గం తీసింది కృష్ణమ్మ.

‘‘ఆవు తొక్కి ఐదు రోజులైవుండాది. ఇంగా నొప్పి తగ్గలేదా అకా..!’’ అని అడిగింది. పిఠాపురం సత్రం పద్మావతమ్మ.

‘‘అంటే నేను నీళ్ళకోసం యాక్సను చేస్తావుండానే గుడిసెటిదానా? నేను యాక్సను చెయ్యడానికి సూరికాంతాన్ని, ఛాయాదేవిని కాదమ్మా!’’ అని గుమ్మడికాయ దొంగ అంటే, భుజాలు  తడుముకున్నట్టు చెప్పింది రాధమ్మ.

‘‘మ్మేయ్‌ ఈశ్వరీ. కట్టు తడవకూడదు. రెండు బిందెలు  నీళ్ళు పట్టి ఇయ్యి” అని ఆర్డర్‌ వేసింది, మా ఇడ్లీ అవ్వకు ఆమె మా ఇడ్లీఅవ్వ మంచి స్నేహితురాళ్ళు. ఆ గుంపులో దూరి రెండుబిందొ నీళ్ళు పట్టిచ్చింది. ఇంకొకటి చంకలోనూ, ఒకటి భుజంమీద పెట్టుకొని కొంతదూరం కుంటుతూ వెళ్ళి, ఆ తర్వాత పెద్ద పెద్ద అంగు వేసుకుంటూ వెళ్ళిపోయింది గొల్ల కృష్ణయ్య పెళ్ళాం రాధమ్మ.

కొత్తగా కాపురానికి వచ్చిన పుత్తూరు కాంతమ్మ ఎట్లయితేనేమి, కష్టపడి చిన్నపాటి యుద్ధం చేసి రెండు బిందె నీళ్ళు పట్టుకునింది.

వొళ్ళంతా తడిసిపోయింది. ఆ తడిసిన బట్టల్లో ఆమె నవయవ్వనం, ఇంకా విచ్చుకోని మల్లెమొగ్గలా బిగుతుగా వుంది.

ఇంతలో ఆమె భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె చేతుల్లో నుంచి ఒక బిందెని తీసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు  లేవు. ఒకర్ని చూసి ఒకరు సిగ్గు పడుతున్నారు. ఇంకా వాళ్ళు మధుపర్కాల్లోనే వున్నట్టు చూపుతోనే మాట్లాడు కుంటున్నారు. శరీర భాషతోనే సంభాషించుకుంటున్నారు. కొత్త దంపతులు  కదా! వాళ్ళ అనుభూతులు  ఇప్పుడిప్పుడే మెత్తమెత్తగా మల్లెపువ్వుల్లా నలుగుతూ, నలుగుతున్న కొద్దీ మత్తుమత్తుగా పరిమళిస్తున్నాయి.

అలా ఒక యుద్ధమే జరిగింది. ఎవరి వ్యూహాలూ  వాళ్ళవి. ఎవరి ఎత్తుకు పై ఎత్తు వాళ్ళవి. అందరూ నీళ్ళు పట్టుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. యుద్ధం ముగిసిన తరువాత తలతెగిన మొండాలు, రక్తసిక్తమైన శవాల గుట్టలు  గుట్టలు  పడివున్నట్టు, అంతవరకు వంతు వారిగా వరుసక్రమం పెట్టివున్న వస్తువులు  కొళాయి దగ్గర చెల్లాచెదురుగా పడివున్నాయి.

*

            ఆరోజు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్న వేళ నెత్తిన మల్లెపూలబుట్ట పెట్టుకుని, మంగాపురం దగ్గరున్న పెరుమాళ్‌ పల్లెనుంచి వచ్చాడు పేట శ్రీరాములు. ఆయనది పూల వ్యాపారం. రోజూ పెరుమాళ్‌ పల్లె నుంచి శ్రీవారి మెట్లెక్కి వచ్చి, కొండమీద పూలమ్ముకొని, మళ్ళీ కొండదిగి వెళ్ళిపోతాడు. ఆయన రంగు కారు నలుపు. ఎప్పుడూ తెల్లని  జుబ్బా, పైజామా వేసుకుంటాడు. నలుపూ తెలుపూ  కలిసి పోయి వెండి గిన్నెలా మెరిసిపోతుంటాడు.

ఆయా సీజన్స్‌లో పూసే పూలతో, ఆయన నెత్తిమీద పెట్టుకున్న పూలబుట్ట ఎప్పుడూ పరిమళిస్తూ వుంటుంది.

‘‘పూలమ్మా పూలూ! మల్లెపూలమ్మా మల్లెపూలూ!’’ అంటూ రాగయుక్తంగా పలుకుతూ, మా పడమర మాడవీధిలోకి అడుగుపెట్టాడు.

ఆయన గొంతువిని ఇళ్ళల్లోని ఆడోళ్ళందరూ వీధిలోకి వచ్చేసారు. ఆ పూల ఆయన్ని చుట్టుముట్టేసారు. మధ్యాన్నం కొళాయి దగ్గర నీటి యుద్ధం చేసుకున్న ఆడోళ్ళందరూ ఉన్నారు.

‘‘అయ్యో… వుండండమ్మా మీద పడిపోకండి. అందరికీ పూలు  ఇస్తాను. ఓపిగ్గా తీసుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.

‘‘అనా… ఒకమూర పూలు  ఇవ్వు” అని అడిగింది కొత్తగా కాపురానికి వచ్చిన పుత్తూరు కాంతమ్మ. అది వినింది మా వసంతఅత్త.

‘‘కొత్తగా పెళ్ళైయ్యింది. మూర పూలు ఏం సరిపోతాయి? రెండు మూరలు  తీసుకో! ఇంకో మూరకి నేను డబ్బు ఇస్తాను కాని.’’ అని రెండు మూర్ల పూలు  కొని కాంతమ్మ చేతుల్లో పెట్టింది మా వసంతఅత్త.

మధ్యాన్నం నీళ్ళు పట్టుకుంటుంటే కాంతమ్మ చేతుల్ని మెలితిప్పేసింది. ఇప్పుడేమో ఆ చేతుల్లోనే మల్లెపూలను ప్రేమగా పెట్టింది. ఇద్దరి చేతులు  మల్లెపూల వాసనతో పరిమళించాయి.

గుళ్ళో అర్చకుడు పట్టాభి భార్య పుట్టమ్మ గబగబా ఇంట్లో నుంచి వచ్చింది.  మూడు మూర్ల పూలు  తీసుకుంది. పుట్టమ్మకు పూలు  అంటే భలే ఆశ! మల్లెపూలను చేతుల్లోకి తీసుకుంటూనే వాసన చూసింది. అక్కడికక్కడే మూరమల్లెపూలు  తెంపి కొప్పుకు చుట్టేసుకుంది. నీళ్ళకున్న అంటు పూలకు లేదు. ఆ నల్లని కొప్పులో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి మల్లెపూలు.

గొల్ల కృష్ణయ్య పెళ్ళాం రాధమ్మ మల్లెపూల  ఆయన్ని చూసి పరిగెత్తుకుంటా వచ్చింది. ఆమె కాలినొప్పి ఏమైందో ఎవరూ పట్టించు కోలేదు. ఆమెది, మా ఇడ్లీ అవ్వది ఒకే వయసు. ఇద్దరి తలలు  తెల్లగా  పండిపోయినాయి. అయినా మల్లెపూల మీద ఆశ చావలేదు. చెరో మూరపూలు  కొనుక్కుని ఒకరి జడలో ఇంకొరు మల్లెపూలు  పెట్టుకున్నారు. వాళ్ళ స్నేహం మరింతగా పరిమళించింది.

ఆడవాళ్ళందరూ సౌందర్యాత్మకంగా వుంటారు. వాళ్ళ మాటలు, చేతలు  కళాత్మకంగా వుంటాయి. బుట్టలోంచి వొలికిపోయిన మల్లెపువ్వుల్లా, ఆ పూలబుట్ట చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళందరూ పరిమళిస్తున్నారు.

            (ఈ కథని డాక్టర్‌ హోసూరు వసంత్‌ గారికి కానుకగా ఇస్తున్నాను)

 

గోపిని కరుణాకర్

గోపిని కరుణాకర్

తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సర్, recalling మై ఓల్డెన్ డేస్ అఫ్ తిరుమల అఫ్ ౧౯౮౬, మీ నేటివ్ అఫ్ తిరుమల బట్ నౌ ….. ఎస్పెషల్లీ విత్ వెస్ట్ మాడ స్ట్రీట్, మైసూర్ చౌల్టీ అండ్ other places

  • ముగింపు అద్భుతం కరుణాకర్. అర్ధాలే వేరులే అనిపించారు. నిజంగా మేజిక్ చేశారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు