ముస్లిం కథ పట్ల ‘సైలెన్స్’ ఎప్పటిదాకా?

ఈమధ్య జరిగిన కథాసంగమాల్లో ముస్లిం కథ ప్రస్తావన ఉండకపోవడం కూడా ఆశ్చర్యకరం. కొందరు విశ్వమానవ రూపమెత్తడం నిర్దిష్టత ఆవశ్యకతను అర్ధం చేసుకోలేకపోవడమే! ఇతర బాధిత వాదాల గురించి చర్చ చేయడం పట్ల లేని అభ్యంతరం ముస్లింవాదానికొచ్చేసరికి పుట్టుకురావడంలోనే తేడా ఉంది. అందుకని ముస్లింవాదం పట్ల సైలెన్స్ పాటించడం గమనించొచ్చు. 

ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్న ముస్లింవాద కథలు తెలుగు కథా సాహిత్యానికి గొప్ప వెలుగు ప్రసాదించాయి. ముస్లింల పట్ల ముస్లిమేతరులను పెద్దఎత్తున సెన్సిటైజ్‌ చేయడంలో సఫలమయ్యాయి.

ఒక మతం మరో మతంపై ఆధిపత్యం చెలాయించడాన్ని ముస్లింవాదులు ప్రశ్నించారు. అలాగే తమ మతంలోని వెనుకబాటుతనాలనూ ఎండగట్టారు. 85 శాతం మంది ముస్లిమేతరులకు తమ మధ్యే ఉన్న 15 శాతం ముస్లిం సమూహపు ప్రత్యేక సమస్యలు, అభద్రతాభావం, వివక్ష, అణచివేతలను పట్టి చూపాయి. తద్వారా తమ మధ్యే మరోలోకంలా బతుకీడుస్తున్న ముస్లిం జీవితాలను కళ్ళకు కట్టాయి.

మొత్తంగా దాదాపు 200 కథల దాకా ముస్లింవాద కథలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఇవాళ తెలుగు విమర్శకులు ముస్లింవాద కథ పట్ల వివక్ష చూపిస్తున్నారు. పర్సెంటేజీల్లో తేడాతో తమలో దాగిన హిందూత్వ అంశ వారిని ముస్లింవాద కథ పట్ల వివక్ష చూపేలా చేస్తుందని భావించవచ్చు. ఈ పరిస్థితి మారాలని, తెలుగు సాహిత్యానికి అదనపు అందం, అదనపు చేర్పు అయిన ముస్లింవాద కథ పట్ల మరింత ప్రేమ చూపాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా గుర్తించాలి. కథా సంకలనాల్లో ముస్లింలు అసలు కనిపించని స్థితి ఇంకా కొనసాగడం విషాదం. చారిత్రక తప్పిదం.

ఈమధ్య జరిగిన కథాసంగమాల్లో ముస్లిం కథ ప్రస్తావన ఉండకపోవడం కూడా ఆశ్చర్యకరం. కొందరు విశ్వమానవ రూపమెత్తడం నిర్దిష్టత ఆవశ్యకతను అర్ధం చేసుకోలేకపోవడమే! ఇతర బాధిత వాదాల గురించి చర్చ చేయడం పట్ల లేని అభ్యంతరం ముస్లింవాదానికొచ్చేసరికి పుట్టుకురావడంలోనే తేడా ఉంది. అందుకని ముస్లింవాదం పట్ల సైలెన్స్ పాటించడం గమనించొచ్చు.

ఈ సైలెన్స్ కి కారణం- ముస్లిం రచయితల్లోనే కొందరు అందరివాళ్ళం అనిపించుకోడానికి ఎక్కువగా పాకులాడడం (ముస్లిం జీవితాలు రాయడం వల్ల అందరి వాళ్ళు కాకుండేమీ పోరు కదా!); సగం హృదయం ముస్లింల నుంచి వేరు పడడం; విమర్శకులు ముస్లిం కథల గురించి మాట్లాడకపోయినా పర్లేదు అనుకోడం; మాట్లాడితేనే హిందూత్వ అంశ ఉన్నవాళ్లకు కంటవుతామనుకోడం; సాహిత్య ‘సంస్థా’నాధిపతులు, అవార్డుల విషయంలో ముస్లిం సాహిత్యం గురించి మాట్లాడడం పెద్దగా అవసరం లేకపోవడం; ముస్లిం సాహిత్యకారులెవరూ ముస్లిం సాహిత్యాన్ని గురించి మాట్లాడితేనే ప్రసన్నం అవుతారన్న చింత లేకపోవడం, అసలు ఆ స్థాయిలో ఉండకపోవడం; ముస్లిం సాహిత్యాన్ని గురించి మాట్లాడవలసిన అవసరం ఉందని మన తల నెరిసిన ముస్లిం పెద్దలు మాట్లాడకపోవడం; హిందూత్వ ప్రమాదం పెరిగిపోతున్న ఈ సమయంలో ముస్లిం కథ ఆవశ్యకతను గుర్తెరగకపోవడం; ఇలాంటివెన్నో విషయాలు ముస్లిం కథ ప్రాముఖ్యతను గుర్తించడం లేదు. ఈ పాయింట్స్ ని సూక్ష్మంగా తరచిచూస్తే ఒక దేశంలో అత్యంత బాధితులైన జాతి సాహిత్యం పరిస్థితి ఏంటో సమజవుతుంది!

బహుజనులతో తమ అనుబంధాలను, రక్తసంబంధాన్ని ముస్లిం కథ రికార్డు చేయాల్సి ఉంది. ముస్లింలలోని ఛాందసత్వాన్ని, సంస్కరణవాదాన్ని మరింతగా రాయాల్సిన అవసరముంది. హిందూత్వ దాష్టీకం మీద కథలు వెలువడాల్సి ఉంది. ఇంకా ముస్లిం స్త్రీల జీవితాల్లోని, దూదేకుల, ఇతర ఉప సమూహాల జీవితాల్లోని అనేక పార్శ్వాలు రికార్డ్ కావలసి ఉంది.

*

 

స్కైబాబ

స్కైబాబ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

పాఠకుల అభిప్రాయాలు