దగ్గరగా మనం ఉన్నదెప్పుడు?

 దూరంగానే ఉండు

నీకూ నాకూ మధ్య నేడు దూరం అవసరం

దగ్గరగా మనం ఉన్నదెప్పుడు

దగ్గరగా ఉంటూమనలో దగ్గరతనం ఏది

నన్ను నువ్వూ నిన్ను నేను ఆడిపోసుకుంటూనే ఉంటాంగా…

నా ఆలోచనలు నీవు తెలుసుకోవు

నీ అంచనాలకు నేనెప్పటికీ తగను

నీవు నిర్మించుకున్న అందమైన వనంలో

నాకే చోటులేదు

నా చుట్టూ ఆవరణం నీకెప్పుడూ గిట్టదు

అయినా కలిసే ఉంటున్నాం

ఉంటున్నట్లుగా నటిస్తున్నాం

కలిసి ఉంటూనే అప్పుడప్పుడూ

అవసరానికి కలిసి అడుగేస్తాం

మిన్ను విరిగి మీద పడే పరిస్థితి రాగానే

నువ్వు నాకెంత దగ్గరో

నేను నీకెంత చేరువో తెలుస్తుంది..

అదిగో ఆ సమయం వచ్చేసింది

మనిషి జీవితం ఎంత విచిత్రం

అవతల ప్రాణాలు పోతున్నా

తన ప్రాణం కానంతవరకూ అంతా నవ్వులాటే

ఏది నమ్మాలో ఏది కాదో తెలియని పుకార్లు

పరిహాసాలు  కట్టుకథలు కావలిసినన్ని

కళ్ళముందు పోతున్న సాటిమనిషి ప్రాణంతో మనకు పనిలేదు

మనవారికేదైనా అయితేనే  నీకుసృహ

ఇప్పుడిక నీదాకా వచ్చేసింది

నీ ప్రాణం పై మమకారం తేల్చేసుకో

మనుషులు మమతలు అనుబంధాలు

ఏమున్నాయిక

కులం , మతం ,  బీదా, గొప్పా

పట్టుకువేలాడుతూ..

ఇప్పటికైనా దూరంగా ఉండు

నిశ్శబ్దం వేసే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కో..

మట్టిగూటిలో పురుగులా ముడుచుకో

అదృష్టం బాగుంటే బయటకొచ్చాక రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకవవుతావు..

ఎల్లలు లేకుండా హాయిగా ఎగురుతావు

మూతిముడుచుకున్నావా నీలో నిన్ను జయించలేకపోయావా

ఈ దూరం నిన్ను నిలువునా ముంచేస్తుంది

కానరానిలోకానికి  కానుకనిస్తూ…
*

సమ్మెట విజయ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు