విషాద మేఘానికి జరీ అంచు ప్రేమ

కధగా రాయదగిన ఒక అంశం తన మనసులో పడగానే ఆయన కథ  రాయరు. కొన్నాళ్ల పాటు ఆ అంశంతో ఆయన మానసికంగా సంభాషణ జరుపుతారు. ఆ పాత్రలతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటారు. ఆలా ఆ బంధానికి ఒక పరిపూర్ణత వచ్చాక అక్షరాల ద్వారా వాటి కష్ట సుఖాలను, ప్రవర్తనల తీరు తెన్నులను పాఠకుడి ముందు ఉంచుతారు. మామిడి పండ్లు ఆర మగ్గినట్టు, కథ  సుబ్బరామయ్య గారి మనసులో ఆర మగ్గుతుంది. అందుకే ఆ కధలు అన్నీ వంకపెట్ట వీలు లేకుండా ఉంటాయి. 

మొన్న మునిపల్లె రాజు గారు , నిన్న బాలాంత్రపు రజనీకాంత రావు గారు, ఇవాళ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు.  ఒక తరం కనుమరుగై పోతున్నది. ఒక తరం అనుసరించిన, ఆచరించిన జీవన విలువలు మరుగున పడిపోతున్నవి. సుబ్బరామయ్య గారు లేని లోటు తీర్చలేనిది. ముఖ్యంగా తెలుగు కధకి. కథకి నిలువెత్తు రూపం సుబ్బరామయ్య గారు.

పెద్దిభొట్లని  కథా శ్రీశ్రీ అన్నారు కొందరు. కానీ ఆయన శ్రీశ్రీ లా ఒక భావజాలానికి నిబద్ధుడు కాలేదు. జీవితం అందునా మధ్య తరగతి జీవితం, దాని అనేకానేక పరాన్ముఖ కోణాలతో  సహా ఆయన  కథలకు ముడిసరుకు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ళ క్రితం  ఈ రచయితకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రచయిత నిజాయితీకి  నిబద్ధుడు అన్నారు. ఆ వ్యాఖ్యకి జీవితాంతం కట్టుబడి వున్నారు సుబ్బరామయ్య.

“ఎవరి జీవన దృక్పథమూ, సాహిత్య వ్యాసంగమూ, జంటగా శృతి లయలై దార్శనికతను రూపు దిద్దుకుంటాయో, ఏ రచయితకు మానవాదర్శం  మీద, మానవ సామర్ధ్యం పట్ల గౌరవమూ అకుంఠిత  విశ్వాసమూ వుంటాయో, ఏ కథకుడు అన్ని విధాలా వితండ వాదనలకు, తర్క కుతర్కాలకు నినాద పూరిత సిద్ధాంతాలకు అతీతంగా మానవతనే మహామంత్రంగా రచనా యజ్ఞం చేస్తాడో అతడి సృజనను కాలం కుదిపి వేయదు. చెరిపి వేయదు ” అంటారు మరొక కథా  రచయిత మునిపల్లె రాజు గారు. అటువంటి రచయితలను తెలుగులో ఒక పదిమందిని ఎంపిక చేస్తే మొదటి స్థానంలో ఉండేవారు సుబ్బరామయ్య. జీవితం లోని విషాదం ఒక మానవీయ స్పందన అనుకుంటే అలాంటి మానవీయ స్పందనలని తన కథావరణం నిండా వెన్నెలలా పరచినవాడు సుబ్బరామయ్య.

చలం పేరు చెప్పగానే ఒక పువ్వు పూసింది, శ్రీపాద పేరు చెప్పగానే వడ్ల గింజలు గుర్తుకు వచ్చినట్టు , బుచ్చిబాబు పేరు చెప్పగానే నన్ను గురించి కథ  రాయవూ గుర్తుకువచ్చినట్టు సుబ్బరామయ్య గారి పేరు చెప్పగానే నీళ్లు గుర్తుకువస్తుంది. ఇంగువ  గుర్తుకు వస్తుంది. ప్రపంచీకరణ నేపధ్యం లో విశ్వమంతా ఒక గ్రామం అయిందని మనం చాలా గర్వంగా అనుకుంటాము కానీ, ఇప్పటికీ నీళ్లు పుష్కలంగా లభించే కోస్తా ప్రాంతాలవారి ప్రవర్తనకీ, నీటి చుక్క కోసం మొహం వాచే ప్రాంతాలవారి ప్రవర్తనకీ  చాలా తేడా ఉంటుంది. ఈ అంతరాన్ని నీళ్లు కథలో  సుబ్బరామయ్య గారు బలంగా పట్టుకున్నారు. కోస్తా ప్రాంతాల నదీ హారతులకు, నీటి కరవు ప్రాంతాల గంగ జాతరలకు చాలా తేడా వుంది. నీటి కరువు ప్రాంతం నుండి కోస్తా ప్రాంతానికి వచ్చిన ఒక యువకుడు  తన జీవితంలో ఎప్పుడూ చూడని, కనీసం  కలలో కూడా ఊహించలేని నీళ్లను చూసినప్పుడు అతడిలో కలిగిన మానసిక, ఆత్మిక సంచలనాన్ని అద్భుతంగా పట్టుకున్న కథ  నీళ్లు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఒక నియో రిచ్ క్లాస్ కొత్తగా వేళ్లూనుకుంది. స్వతంత్ర భారతదేశంలోని మొదటి, రెండు దశాబ్దాల కాలంలో స్వాతంత్ర్య ఫలాలను ఒడిసిపట్టుకుని ఒక పట్టణ  ప్రాంతపు నియో రిచ్ క్లాస్ ఆవిర్భవించింది. తొలి  నాటి సోషలిస్టు ఆదర్శాలకు, క్రమంగా తిలోదకాలు వదులుతూ ఆ నియో రిచ్ క్లాస్ సమాజం మీద తన పట్టును బిగించుకుంటున్న కాలం. ఆ సమయంలో ఉధృతంగా కధలు రాసిన పెద్దిభొట్ల నియో రిచ్ క్లాస్ కి ఎదగలేక, క్రింది తరగతికి దిగలేక  మధన పడుతున్న వర్గాలను త్రిశంకు వర్గం కాయిన్ చేశారు . రాజకీయాలకు, రౌడీయిజాన్ని కలగలిపితే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో త్రిశంకు వర్గం లో శివుడు పాత్రధారి చదరంగం పోటీలలో ఓడిపోవడం ద్వారా దృశ్యమానం చేస్తారు సుబ్బరామయ్య.

కధగా రాయదగిన ఒక అంశం తన మనసులో పడగానే ఆయన కథ  రాయరు. కొన్నాళ్ల పాటు ఆ అంశంతో ఆయన మానసికంగా సంభాషణ జరుపుతారు. ఆ పాత్రలతో ఒక అనుబంధం ఏర్పరచుకుంటారు. ఆలా ఆ బంధానికి ఒక పరిపూర్ణత వచ్చాక అక్షరాల ద్వారా వాటి కష్ట సుఖాలను, ప్రవర్తనల తీరు తెన్నులను పాఠకుడి ముందు ఉంచుతారు. మామిడి పండ్లు ఆర మగ్గినట్టు, కథ  సుబ్బరామయ్య గారి మనసులో ఆర మగ్గుతుంది. అందుకే ఆ కధలు అన్నీ వంకపెట్ట వీలు లేకుండా ఉంటాయి.

పెద్దిభొట్ల కధలన్నిటిలోకి నాకు బాగా నచ్చే కథ  కోదండం గారి కల. రైల్వే స్కూల్ లో డ్రిల్ల్ మాస్టారు గా పనిచేసే కోదండ గారు ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం లో నిప్పుకోడి చూస్తారు. పరుగులో  వాడి వేగం ఆయనను అబ్బుర పరుస్తుంది. వాడు ఒక మెరుపులా మెరిసి మాయమై పోతాడు. అప్పటినుండీ వాడు ఎప్పుడు దొరుకుతాడా అని అన్వేషిస్తుంటారు కోదండం గారు. కధలో లీనమయ్యే మనం కూడా వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తాం. పూర్ణ మదః పూర్ణ మిదం అంటూ సాగే భారతీయ శాంతి మంత్రం లో శూన్యంలో నుండి శూన్యాన్ని తీసివేసినా, శూన్యాన్ని శూన్యానికి కలిపినా, శూన్యాన్ని శూన్యం తో హెచ్చవేసినా, భాగించినా శూన్యమే మిగులుతుంది అనే అర్ధం వుంది. నిప్పుకోడి శూన్యం లాంటి జీవితం లో కోదండం గారు ఎదో కలపాలి అనుకున్నారు. అది శూన్యమే అయి చివరకు శూన్యమే మిగిలింది. నిజమే మధ్యతరగతి జీవితంలో శూన్యానిదే పెద్ద పాత్ర.

మన చుట్టూ ఉండి, మనం పట్టించుకోని విస్మృత అంశాలను సుబ్బరామయ్య గారు ప్రముఖంగా పట్టించుకుంటారు. వాటిని ఆయన కరుణ రసాత్మక దృష్టి తో వీక్షిస్తారు. వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఋషి వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ పెద్దిభొట్ల కధలు. కరుణ ఆయన కథల  ఆత్మ. కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగు వారి జీవనంలోని ఎత్తు పల్లాలను, ఉత్థాన పతనాలను  అక్షరబద్దం చేశారు. కోటిగాడు, చింపిరి , నిప్పుకోడి, బుజ్జమ్మ, శివుడు ఆయన కథానాయకులు.

జీవితంలోని విషాదాన్నితప్పిస్తే ఉత్సవ సౌరభాన్ని సుబ్బరామయ్య చూడడు అని సరదాగా భమిడిపాటి జగన్నాధరావుగారు వ్యాఖ్యానించారు. కానీ జీవితం లో ఎదో ఒక సంతోషం కలిగితే దాని వెన్నంటి ఒక విషాదం తరుముకొస్తుందని ఆయన కధలు సోదాహరణంగా వివరిస్తాయి. శని దేవత పదధ్వనులు అన్న ఆయన కథ   మన మనసును దుఃఖోద్వేగంతో ఉండ లా చుట్టి విసరివేస్తుంది. ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చి ఆశించిన దాన్ని ఎదో ఇవ్వకుండా వెళ్ళిపోతే, అలా వెళ్లిపోవడం కూడా కేవలం మన కారణం గానే అయితే దాన్ని మించిన దుఃఖం మరెక్కడ  ఉంటుంది?

అతడొక అద్భుతమైన గాయకుడు. జీవితం కొట్టిన  దెబ్బలకు మూర్ఛపోయి చరమాంకంలో బతుకు బరువుగా గడుపుతుంటాడు. వృద్ధాప్యానికి తోడు బ్రహ్మ చెవుడు కూడా అతడికి తోడు. రవీందర్ అని తనకు పరిచయమైన  బ్యాంకు ఉద్యోగి ద్వారా, తాను  పాడగా ఒక గ్రామఫోన్ కంపెనీ రికార్డ్ చేసిన పాతకాలం రికార్డ్  ఒకటి ఉందని తెలుసుకుని అది వినాలని ఆశ పడతాడు. చివరకు అతి ప్రయాస మీద రవీందర్ ఆ రికార్డ్ తీసుకుని వచ్చి ఆ పాతకాలపు ఆ పాతమధురాన్ని  వినిపించడానికి ప్రయత్నం చేస్తే , తీరా రికార్డ్  వినే  సమయానికి హియరింగ్ ఎయిడ్ లో ఛార్జింగ్ అయిపోతుంది. శని దేవత పద ధ్వనులు వినపడక పోయినా ఫరవాలేదు కదా!

జీవితంలో మనం ఎప్పుడూ దేనికోసమో ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూపు ఎందుకో ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనకు తెలియదు. నిజానికి ఎదురుచూపులోనే ఒక విషాదం వుంది. ఆ విషాదాన్ని పెద్దిభొట్ల చాలా సులువుగా పట్టుకున్నారు. చాలా అందంగా పట్టుకున్నారు ఆ విషాదాన్ని అపురూపంగా బట్వాడా చేశారు. విషాదం మాటున ఆయన పాఠకుడికి సరఫరా చేసింది జీవితం పట్ల ప్రేమని. కరుణ జీవ లక్షణమన్నది నా నమ్మకం. అందులో కూడా గాఢమైన డైనమిజం వుంది అన్నారు ఒక ఇంటర్వ్యూలో. ఈ డైనమిజం లేక పోతే ఆయన పూర్ణాహుతి లాంటి కథ  రాయలేరు.

మన మానవ సంబంధాలు బహు బలహీనమైనవి. వాటికంటూ రంగూ రుచీ  వాసన ఉండటం బహు అరుదు అని పెద్దిభొట్ల కధలు చెపుతాయి. పెద్దిభొట్ల ఒక్కొక్క కథ  గురించీ ఎంతైనా రాయవచ్చు.

మల్లాది వెంకట కృష్ణ మూర్తి లిటిల్ రాస్కెల్ అనే నవలలో కథా  నాయక నీరజ సీరియస్ గా చదువుకుంటూ ఉంటుంది. భర్త ఎదో చెప్పబోతే ఆమె విసుక్కుని నన్ను డిస్టర్బ్  చేయకండి నా అభిమాన రచయత కథ  చదువుతున్నాను అంటుంది. భర్త ఉడుక్కుని ఎవరా అభిమాన రచయిత అని అడుగుతాడు. ఆమె వెంటనే ” పెద్దిభొట్ల సుబ్బరామయ్య ” అంటుంది.

ఇది కావడానికి నవలలో సన్నివేశమే అయినా అక్కడ వున్నది నీరజ కాదు మల్లాది వెంకట కృష్ణ మూర్తి అని నాకు అనిపించింది.

మరి, పెద్దిభొట్ల రచయితల రచయిత!

*

పెద్దిభొట్ల ఫోటో: దండమూడి సీతారాం 

 

వంశీ కృష్ణ

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏదైని ఒక కథ చదివితే…..అది బాగా మనసును కుదిపేస్తే….ఇది కథే కదా! మనకు మనం సర్దిచెప్పుకుంటాం.
    కథకి జీవితమంతటి విశాలతనూ…విలువనూ..అందించి..ఏం రాసినా…ఇది కథ కాదు సుమా!అని ,అనకుండా ఉండలేని నిబద్ద రచయిత ఇక లేరని అంటుంటే…
    ఎలా నిబాయించుకునేది.

  • ఓ గొప్ప కథకుడిని తెలుగు కథ కోల్పోయింది.

  • వంశీ కృష్ణ గారూ ..
    మీ ఆత్మీయ నివాళి – పెద్దిభొట్ల వారి ( రచనల) పై మీకున్న మమకారాన్ని తెలిపింది. మొన్న మునిపల్లె రాజు గారు , నిన్న బాలాంత్రపు రజనీకాంత రావు గారు, ఈమధ్యనే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు .. యద్దనపూడి గారు. నిజమే , మీరన్నట్టుగా ఒక తరం అనుసరించిన, ఆచరించిన జీవన విలువలు మరుగున పడిపోతున్నవి. కాలగమనంలో ఇవన్నీ తప్పవేమో ! అందుకు మనమందరం సంసిద్ధంగా ఉండాల్సిందే కదా!!

  • గొప్ప నివాళి!
    పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథలు నాకు చాలా ఇష్టం. జీవితం పట్ల ఒక నిబద్ధత ఉన్న రచయిత. ‘ సంతోషం వెనక ఒక విషాదం దాగి ఉంటుంది ‘ ఒక మూడ నమ్మకం మాత్రమే! ఇది చాలా మంది నమ్ము తారు కూడా! ఈ నమ్మకం వల్ల కనీస సంతోషాన్ని కూడా ఇష్ట పడని వారు కూడా ఉంటారు. పాపం! అల్పసంతోషులు.

  • నిజాయితీకి నిబద్ధుడుగా జీవితాంతం కట్టుబడి ఉన్న కథా శ్రీశ్రీ, జీవితం లోని విషాదాలని మానవీయ స్పందనలుగా, జీవ విషాదం మాటున దాగిఉన్నది జీవితం పట్ల ప్రేమని, కరుణని తన కథావరణం నిండా వెన్నెలలా పరచిన రచయితల రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పట్ల ఆత్మీయ నివాళిని అర్పించిన వంశీ కృష్ణ గారూ .. వినమ్రపూర్వకంగా చేతులుజోడిస్తున్నా పెద్దిభొట్ల గారికి.

    త్రిపుర గారికి, పెద్దిభొట్ల గారికి జీవితాంతమూ ఆప్త మిత్రులు, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాధరావుగారు తన మిత్రుడుతో ఉన్న దశాబ్దాల సానిత్యాన్ని పాఠకులతో పంచుకోలేని అశక్తతతో ఉన్నానని విచారం వెలిబుచ్చారు. అలాగే తమ ఆత్మీయ బంధాన్ని తలపోసుకున్నవారు మరొకరు … సాహితీలోకపు సత్తెకాలపుమనీషి శ్రీ రామడుగు రాధాకృష్ణమూర్తి గారు.

    బెజవాడ పి. సత్యోతక్కయ్య గారు, పెద్దలు ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు, ఖాదర్ మొహియుద్దీన్ గారు, మధురాంతకం రాజారామ్ గారబ్బాయి నరేంద్ర గార్లు ఆంధ్రజ్యోతి వివిధ సాహితీ సంచికలో ( 21-May-2018 ) సమర్పించిన ఆత్మీయ నివాళులు నలుగురి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు భమిడిపాటి జగన్నాధరావుగారు.

    http://epaper.andhrajyothy.com/1665718/Andhra-Pradesh/21.05.2018#page/4/1

    ( తహీరో గారూ, ఒక తరం అనుసరించిన, ఆచరించిన జీవన విలువలు మరుగున పడిపోకుండా మళ్ళీ కలం ఝళిపించగలవాడు, సవ్యచాచి మా గొరుసన్న )

  • నిజాయితీకి నిబద్ధుడుగా జీవితాంతం కట్టుబడి ఉన్న కథా శ్రీశ్రీ, జీవితం లోని విషాదాలని మానవీయ స్పందనలుగా, జీవ విషాదం మాటున దాగిఉన్న జీవితం పట్ల ప్రేమని, కరుణని తన కథావరణం నిండా వెన్నెలలా పరచిన రచయితల రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పట్ల ఆత్మీయ నివాళిని అర్పించిన వంశీ కృష్ణ గారూ .. వినమ్రపూర్వకంగా చేతులుజోడిస్తున్నా పెద్దిభొట్ల గారికి.
    త్రిపుర గారికి, పెద్దిభొట్ల గారికి జీవితాంతమూ ఆప్త మిత్రులు, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాధరావుగారు తన మిత్రుడుతో ఉన్న దశాబ్దాల సానిత్యాన్ని పాఠకులతో పంచుకోలేని అశక్తతతో ఉన్నానని విచారం వెలిబుచ్చారు. అలాగే తమ ఆత్మీయ బంధాన్ని తలపోసుకున్నవారు మరొకరు … సాహితీలోకపు సత్తెకాలపుమనీషి శ్రీ రామడుగు రాధాకృష్ణమూర్తి గారు.

    బెజవాడ పి. సత్యోతక్కయ్య గారు, పెద్దలు ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు, ఖాదర్ మొహియుద్దీన్ గారు, మధురాంతకం రాజారామ్ గారబ్బాయి నరేంద్ర గార్లు ఆంధ్రజ్యోతి వివిధ సాహితీ సంచికలో ( 21-May-2018 ) సమర్పించిన ఆత్మీయ నివాళులు నలుగురి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు భమిడిపాటి జగన్నాధరావుగారు.

    http://epaper.andhrajyothy.com/1665718/Andhra-Pradesh/21.05.2018#page/4/1

    ( తహీరో గారూ, ఒక తరం అనుసరించిన, ఆచరించిన జీవన విలువలు మరుగున పడిపోకుండా మళ్ళీ కలం ఝళిపించగలవాడు, సవ్యచాచి మా గొరుసన్న )

  • ప్రపంచ స్థాయి కథకుల మొదటి వరసలో నిలబడ దగ్గ కథకులాయన. నా అదృష్ట వశాత్తూ ఆయనతో నాలుగైదు నెలల క్రితం ఫోన్ లో మాట్లాడగలిగాను. “మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడండమ్మా”,అన్నారాయన.
    “చెప్పుల జత” అంత గొప్ప కథ నేనింతవరకూ చదవలేదనే అనుకుంటాను.

  • బాగా రాసారు. మనమొక గొప్ప రచయితను కోల్పోయాం

  • చాలా బాగా రాసారు.గొప్ప కథకుడిని కోల్పోవడం బాధాకరం

  • చాలా మంచి విశ్లేషణ చేశారు వంశీ. పెద్దిభొట్ల కథలతో పరిచయం లేని వారు ఇకనైనా ఆ కథల్ని చడువుతారు. అభినందనలు.

  • ఏడాది పాటు వారు చెప్పగా పాఠాలు చెప్పగా విని నేర్చుకోవడం నాకు కలిగిన అదృష్టం. వారి కోరిక, శనిదేవత పదధ్వనులు, ఇంగువ కథలకు దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది. కంటి వరకు వచ్చింది చూడలేకపోవటం, చెవులు వరకు వచ్చింది వినలేకపోవటం, తెలుసుకోవాలన్నది తెలిసినంతలోనే తిరిగిరాని దూరాలకు పోవటం. దూరమైపోయిన మా మాస్టారికి నివాళి????

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు