రుద్రభూమిపై రక్త కేతనం- శప్తభూమి

శప్తభూమి నవల ముగించిన తరువాత ప్రధానంగా తలెత్తే ప్రశ్న- సీమలోనే ఎందుకని అంత హింస? ఎందుకని అంత అనైతికత? ఎందుకంత తీవ్రమైన రక్తపాతం? రాయల సీమ మినహా, ఏ ఇతర ప్రాంతంలోని నాయకులనైనా తీసుకోండి. చాలా- చాలా అంటే చాలా ఉదాత్తంగా ఉంటారు.

ది పిశాచులతో నిటలేక్షణుండు

గజ్జెగదలించి యాడురంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ

నవని పాలించు భస్మ సింహాసనంబు (జాషువా)

బండి నారాయణ స్వామి రాయలసీమ చారిత్రక నవల ‘శప్తభూమి’ పూర్తి చేసిన వెంటనే జాషువా స్మశాన వాటిక పద్యాలు మది రంగస్థలంలో ఖంగున మోగాయి. సీమ నేలపై కన్నులు తెరిచిన మందభాగ్యులే కాదు, మహా వీరులు సైతం ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడి ప్రవృత్తికి ఎదురితిరిగి నిలిచినవారు లేరా అని ఆశ్చర్యం కలిగింది. అయితే, వీరిది ‘చలనంబు లేని శయనంబు’ కాదు, రక్తం వారబోస్తూ సాగే ప్రళయంబు.

క్రీ.శ. 1775వ సంవత్సరంలో నవల ప్రారంభమవుతుంది. అనంతపురం కేంద్రంగా ప్రధాన కథ సాగినా, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భాగమవుతూ ఉంటాయి. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం-ఆ కుదురులోంచి చెదిరిపోయి ఎన్నెన్నో చిన్నాచితకా రాజ్యాలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ, ఎవరికి బలముంటే, అవకాశముంటే –వారే అధికారం చేపట్టిన సందర్భం. అలా పెత్తనం చేసినవారిలో దళిత బహుజనులు కూడా వుంటారు. పెత్తనం కాపాడుకోవడం కోసం రక్తపుటేరులు పారించడంలో అందరిదీ ఒకే తీరు.

ఎంతో శ్రమపడి సేకరించిన చారిత్రక ఆధారాలతో స్వామి ఆవిష్కరించిన ఈ ‘శప్త భూమి’లో సిద్ధరామప్పనాయుడు, కరిహుళి బసవప్ప, దళవాయి సుబ్బరాయుడు, బ్రౌన్, మాడల కందప్ప వంటి వారు నిజంగా ఆ కాలంలో జీవించినవారు. మిగిలిన అనేక పాత్రలకు అప్పటి సంఘటనల ఆధారంగా స్వామి ప్రాణం పోశారు. ఈ పాత్రల ప్రవర్తన, ఎదుగుదల లాజిక్ కు అందవు. అలాని, అవేమీ నేల విడిచి సాము చేయవు. అలా అనిపించకపోవడానికి స్వామి ఎంచుకున్న భాష, రచనా శైలి చాలా దోహదం చేశాయి. అంతకుమించి, అవి వాస్తవంలోంచి ప్రాణం పోసుకున్న పాత్రలు కావడం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఒక దశాబ్ద కాలంలో విభిన్న శ్రేణులకు ప్రాతినిధ్యం వహించినవారి జీవితాలను, అతి తక్కువ సమాచారంతో ఆవిష్కరించడంలో వుండే సమస్యను వేగవం తమైన కథాగమనంతో అధిగమంచారు రచయిత. అలాగే, పరిణామక్రమంలో కొన్ని పాత్ర లలో వచ్చే మార్పు చదువరిలో ఉద్విగ్న విషాదాలను కలిగిస్తుందనడంలో సందేహంలేదు.

ఇమ్మడమ్మ, బిల్లే ఎల్లప్ప, కోడె నీలడు, అనంతయ్య శ్రేష్టి, ఆయన కూతురు, హండే రాజు సిద్ధరామప్పనాయుడు, దళవాయి సుబ్బరాయుడు, రామోజీ ప్రగడ, నాగప్ప ప్రగడ, వీరనారాయణ రెడ్డి, తిమ్మప్ప నాయుడు, హరియక్క, బాలకొండ బీరప్ప, ఉజ్జినమ్మ, పద్మసాని, నాగసాని, మున్నారు దాస్, కంబళి శరభడు, నిడమాడస్వామి.. అనేకానేక కల్పిత పాత్రలు. ఆ పాత్రల ఆవేశకావేశాలు, ఉద్వేగఉల్లాసాలు, సంతోషాలు సమస్యలు, నడవడికలు, మాటతీరు, అంతర్మథనాలు- పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వర్తమాన రాయల సీమ చిత్రానికి రేఖా మాత్రపు ప్రతినిధులుగా నిలుస్తాయి.

ఆ కాలంలో కొనసాగిన సతీసహగమనం, బసివిని వంటి ఆచారాలు, సంతలు, పరసల తీరుతెన్నులు, పూజలు, మొక్కుబడులు, పండుగలు, పెళ్లిళ్లు, ఆయా కులాల ఆచార వ్యవహారాలు, పన్నులు సుంకాలు, పెళ్లి పన్ను, లంజకట్నం, చేను మాన్యాలు, అమరనాయకులు, కుల పురాణాలు, కుటుంబ చరిత్రలు, హేయమైన శిక్షలు, అత్యాచారాలు, అక్రమాలు, గాలి దేవరలు, వీరగల్లులు.. అన్నీ పాఠకుడిని తీసుకెళ్లి ఆ కాలంలో నిలబెడతాయి.

ఏ స్థాయిలోనివారు అధికారం చేపట్టినా, దళిత అణచివేత మాత్రం మామూలే. ఏపాటి చిన్న తప్పు చేసినా దళితుల తలలు తెగిపడాల్సిందే. పంచాయతీ తీర్పులకు తలొగ్గి కూతుర్లను బసివినిలుగా ఊరికి అప్పగించవలసిందే. పెళ్లయిన కొత్త దళిత జంటలు బోడి గుళ్లు చేయించుకోవాల్సిందే. ఎదురుతిరిగినవారిని కోట బయటకు తరిమేయాల్సిందే.

ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కథువాలో ఓ గుడిలో జరిగిన ఘటన అందరినీ కదిలించివేసింది. అయితే, అప్పట్లోనే నాగప్ప ప్రగడ ఇటువంటి అరాచకాలకు పాల్పడ తాడు. పిల్లలు లేని స్త్రీలను పూజల పేరిట ఆహ్వానించి నాలుగు రోజులపాటు వారికి మత్తు ఇచ్చి దారుణానికి ఒడిగడతాడు. ఐదో రోజు ఎటువంటి మత్తు మూలికలు ఇవ్వకుండానే వారిని వశపరుచుకుంటాడు.

శప్తభూమి నవల ముగించిన తరువాత ప్రధానంగా తలెత్తే ప్రశ్న- సీమలోనే ఎందుకని అంత హింస? ఎందుకని అంత అనైతికత? ఎందుకంత తీవ్రమైన రక్తపాతం? రాయల సీమ మినహా, ఏ ఇతర ప్రాంతంలోని నాయకులనైనా తీసుకోండి. చాలా- చాలా అంటే చాలా ఉదాత్తంగా ఉంటారు. ‘పువ్వు పుట్టగానే పరిమళించినట్టు’ తల్లి ఒడి నుంచే వారిలోని సద్గుణాలన్నీ మహత్తరంగా వర్ణించబడతాయి. ఉగ్గుపాల నుంచి ఊపిరి ఒదిలే వరకూ ఆ మహా నాయకులంతా సర్వ సామాన్యమైన ఎటువంటి మానవ బలహీనతలనూ కలిగి ఉండరు. ఇక అవలక్షణాల ఊసే ఉండదు. అల్లూరి సీతారామరాజు,  ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవిలాంటివారి గురించి ఒక్కటంటే ఒక్కటి-ఇప్పటి సామాజిక నైతిక విలువల ప్రకారం తప్పుగా అనిపించే-చెడు ఘటన వినివుండం, చదివి వుండం.

సీమ నేల అందుకు భిన్నం. చెరువుకు కావలి కాయనందుకు తలల నరికివేత, తప్పు చేసినందుకు కాలు, చెయ్యి తీసేయడం, గుడ్లు పెరికెయ్యడం వంటి శిక్షలు. ఇక అత్యాచారాలకైతే కొదవే లేదు. కండ బలం, అధికారం, అవకాశం కలిసొస్తే చాలు-కనిపించిన స్త్రీనల్లా అనుభవించడమే. కోటల్లో, గాదె కొట్టాల్లో చెరచబడిన రైతు స్త్రీలకు అంతేలేదు. అత్యాచారాల్లో కుల వివక్షే కాదు, వావి వరసలు కూడా ఉండవు. వీరనారాయణ రెడ్డి, ఆయన కొడుకు ఒకే గొల్ల స్త్రీపై అనేకసార్లు అత్యాచారాలకు పాల్పడతారు. ఈ వ్యవహారం వీరనారాయణరెడ్డి భార్యకు కూడా తెలుసు. కూతురు వయసైనా లేని పిల్లను అనుభవించ డానికి పోతున్న మగనికి స్వయానా భార్యే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ స్నానం చేయిస్తుంది. అన్న చనిపోగానే వదినను వశబర్చుకుంటాడు మరిది. కొడుకు చనిపోతే సౌందర్యవతి అయిన కోడలితో ప్రతిష్ట దెబ్బతింటుందని నిప్పుల్లో తోయిస్తాడు తండ్రి. ఇలా చెప్పుకుంటూ పోతే.. అత్యంత హేయమైన ఘటనలెన్నో.

హరియక్క రణం కుడుపు, ఎల్లప్ప జెట్టీ వీరమండపం ఎక్కడం హింసకు పరాకాష్టగా చెప్పదగిన ఘటనలు. తన తండ్రిని చంపిన పెమ్మసాని తిమ్మప్పనాయుడితో మల్లయుద్దా నికి సిద్ధపడుతుంది. అంతేకాదు ‘ద్వంద్వ యుద్ధం జయాపజయాలతో ముగిసిపోకూడదు. అందుకని ఎవరం ఓడిపోతే వారిని గెలిచినవారికి ఒప్పజెప్పవలసినది. రణంకుడుపు జరపడానికి అనుమతించవలసి నది’అని కోరుతుంది హరియక్క.

రణంకుడుపు అంటే-ఓడిపోయిన పెమ్మసాని తిమ్మప్పనాయుడి గొంతును హరియక్క పరపరా కోస్తుంది. మొండెం నుంచి ఎగజిమ్మిన నెత్తురును గిన్నెలోకి ఒడిసి పడతారు. చర్మం అంతా చెక్కేసి తిమ్మప్ప తలను పొయ్యి మాదిరి చేసి, గిన్నెలోని రక్తాన్ని అందులోపోసి.. ఆ రక్తమే ఎసరుగా అన్నం వండుతారు. బట్టలు విప్పి నగ్నంగా తయారైన హరియక్క వంటి నిండా బూడిద పూసుకుని రణం కూడు పాత్రను నెత్తిపెట్టుకుని ఊరు చుట్టూ దిశమొలతో తిరుగుతూ కోబలి.. కోబలి.. అని అరుస్తుంది. చివరికి కులదైవమైన కొల్హాపురమ్మకు దాన్ని సమర్పించుకుంటుంది.

హరియక్కది ప్రతీకారేచ్ఛ అయితే, ఎల్లప్పజెట్టిది ప్రభు భక్తి. గొర్రెలు కాసుకునే తనను చెరువులోపల్లె అమరనాయకుడిని చేసిన అనంతపురం సంస్థానం దొర హండే సిద్ధరామప్ప నాయుడి కోసం వీరశిరోమంటపం ఎక్కుతాడు ఎల్లప్ప.

వీరమంటపం ఎక్కడం అంటే.. ప్రాణాలతో ఉండగానే ఒక్కో అంగాన్నీ కోసుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామికి అర్పించుకోవడం. గండ కత్తెరతో కత్తిరించుకుంటూ.. కుడికాలును తూర్పు దిశకు, ఎడమ కాలును పశ్చిమ దిశకు, ఎడమ చేయిని ఉత్తర దిశకు, కుడి చేయి దక్షిణ దిశకు అర్పించుకుంటాడు. తర్వాత శైవాగమ మంత్ర దీక్షా నిర్వహకుడు ఎల్లప్ప కుడి కన్నును పెకలించి ఆగ్నేయ దిశకు, ఎడమ కన్నును పెకలించి నైరుతి దిశకు, పొట్టను చీల్చి రెండు అంగాలను వాయువ్య, ఈశాన్య దిశలకు అర్పిస్తాడు. అప్పటికీ ప్రాణాలతో వున్న ఎల్లప్ప జెట్టీ నుంచి మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. చివరగా గొంతు కోసి.. ఆ భీకర క్రతువును ముగిస్తారు. ఇంత తీవ్రమైన బలిదానం తర్వాత కూడా ప్రకృతి అక్కడి కరువు నేలపై కనికరం చూపకపోవడం అసలు విషాదాంతం.

‘తెలంగాణ భాష, యాస, చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలు పునరుజ్జీవనం పొందు తున్న సందర్భంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది.ఈ దశలోనే రాయల సీమ కోసం ఏదో చేయాలని, ఏదో రాయాలని చేతులు పిసిక్కుంటూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోనే రాయలసీమ చారిత్రక నవల రాయడానికి బీజం పడింది’ అని చెప్పుకొస్తారు బండి నారాయణ స్వామి. అయితే, పునరుజ్జీవం సమయంలో తెలంగాణపై వ్యతిరేకత లేదా చెడు అభిప్రాయం కలిగించే ఏ అంశమూ వెలుగులోకి రాలేదు. పైగా అప్పటికే తెలంగాణవారి భాష, యాసలపై వున్న వ్యతిరేకతను చెరిపేసే ప్రయత్నం చేశారు. తాము ఎందులోనూ, ఎవరికీ తీసిపోమని-కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణకు తనదైన ఒక ప్రత్యేక భూమిక ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేశారు.

సీమ కోసం ఏదో చేయాలని తపించిన స్వామి ‘శప్తభూమి’ లో రాయలసీమపై సదభి ప్రాయం కలిగించే అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు. చారిత్రక ఆధారాలతో సాగిన నవలా రచనలో ఇంత హింస చోటు చేసుకుందంటే-అది వాస్తవమని విశ్వసించాల్సిందేగా? కేవలం కరువు కాటకాలు మాత్రమే ఈ భయంకరమైన హింసకు కారణమని అనుకోలేం.  ఘోరమైన హింస, సాటి మనిషిపట్ల దయ, జాలి లేకపోవడం, నైతికంగా ఎంతకైనా దిగ జారడం వంటివి సీమపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయి? కళలు, సాహిత్యం, సాంస్కృతిక పరిరక్షణ వంటి అంశాలు కాగడాలు పెట్టి వెదికినా కనిపించవు. సరే,  అందుకు రచయిత ఎంచుకున్న కథా కాలమే కారణం అనుకుందాం. ఆ కథా కాలంలోనే అయినా, మనుషుల మధ్య కనీస మానవత్వపు విలువలు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, త్యాగం అనేవి మచ్చకైనా ఉండివుండవా? ఆ కథాకాలంలో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? పరిసరప్రాంతాల్లో లేని భయంకరమైన హింస ఇక్కడే ఎందుకు నెలకొంది? లేక ఇతర ప్రాంతాల్లోని హింస ఈ స్ఠాయిలో చరిత్రకెక్కలేదా? ఆయా నాయకుల వీరత్వాన్ని శ్లాఘించడం, కీర్తించడం వెనుక అక్కడి చరిత్రకారులు ఆ భయకంరమైన హింసను మరుగుపరిచారా? వక్రీకరించారా? లేదంటే ఈ నవలలోనే అతిశ యోక్తులు చోటుచేసుకున్నాయా? అనే ప్రశ్నలకు చరిత్రకారులు మాత్రమే సమాధానం చెప్పగలరేమో! అప్పుడుగానీ, ఇప్పుడుగానీ సీమ దుస్థితికి కారణాలను విశ్లేషించాల్సిందే. రక్త కేతనాన్ని అవనతం చేసి.. ఈ నేలకు శాప విముక్తి కలిగించాల్సిందే.

(శప్తభూమి-బండి నారాయణ స్వామి, వెల: 125/- $10 , ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్)

దేశరాజు

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకు చదవడం తెలిసాక వచ్చిన అతి చక్కటి విభిన్న చారిత్రిక నవల . మంచి పరిచయం . అక్కడి వెనుకబడిన , నీటి ఆధరువులు లేనిచోట బతకాలంటే బలాన్ని నమ్ముకోవసిందే . ఒక్కసారి బలాన్ని నమ్మాకా బలహీనులు పీడితులు కావడం , తర్వాత అది ఆచారంగా మారడం తప్పదు .

  • దేశిరాజు గారూ
    చివరి పేరా లో ప్రశ్నలన్నీ నావికూడా. ఇవాళ ఆ నవల ఏం నేర్చుకోమంటోంది. దానిప్రయోజనం ఏమిటి. మనం చరిత్ర తెలుసుకోవడానికి చదవడం కాక ఏదైనా నేర్చుకోడానికి కూడా చదువుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ నవల ఏ ప్రయోజనం నెరవేరుస్తోంది. రాయలసీమ ప్రజలు తమ వారసత్వాన్ని గుర్తించి మరింత రక్తసిక్తం గా తమ నేలను మార్చుకోవచ్చని అనుకోరా
    నవలా రచన లో ఎంత చెయ్య తిరిగిన తనం ఉన్నా. ఎంత పరిశోధన చేసినా ఇలాంటి నవల ఇప్పుడు ఎందుకు
    మరొక సందేహం
    రాజ దండనలు అంత కఠినంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అన్ని తప్పులు ఇప్పటిలా ఎలా చేస్తూ వచ్చారు
    ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. స్వామి గారు నాకు మంచి మిత్రులే. కానీ ఈ భయానక భీభత్సాలతో నిండిన రచనను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. ఇంకా నేను రాయక్కరలేకుండా మీరు రాసేసినందుకు థాంక్స్

  • బాగా రాసారు సర్, మీరు ప్రస్తావించిన చారిత్రకపరమైన అంశాల మీద పెద్దగా అవగాహన లేదు కనుక ఏమీ చెప్పలేను గానీ, నాకు మాత్రం నవల బాగా నచ్చింది. చదివాకా నే రాసుకున్న నాలుగు మాటలు ———

    శపించబడిన భూమిగా రచయిత పేరుపెట్టిన ఈ చారిత్రక కాల్పనిక నవలను నేను, తెలుగు శివా ట్రయాలజీగా, గేమ్ అఫ్ థ్రోన్స్ గా అభివర్ణిస్తాను.(నేను చదివిన పుస్తకాల ప్రామాణికతతో). ఇలా పోల్చడానికి కారణం, కథాంశమో, మరోటో కాదు. నేర్పరి అయిన ఈ రచయిత, తన అత్యున్నతమైన శైలి అనే ఉలిని వాడి, ఈ నవలను సజీవమైన శిల్పంలా చెక్కడం; ప్రామాణికత సడలని చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని గొప్ప ఆసక్తికరమైన కాల్పనికతను సృష్టించగలగడం; ముఖ్యంగా ప్రకృతి స్వభావాన్నీ, మానవ ప్రవృత్తినీ, సమాజపు అంతర్ముఖాన్నీ, నిర్మోహంగా, నిస్పక్షపాతంగా, నిజాయితీగా వివరించడం వంటి అంశాలు, నాకటువంటి అభిప్రాయాన్ని కలిగించాయి. గుంపులో నిలబడి, అదే గుంపును అంతఃదృష్టితోనూ, బాహ్య పరిశీలనతోనూ కూడా రచయిత చూడగలిగినట్టుగా నాకు తోచింది.

    పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఎన్నో చారిత్రకాంశాలను ప్రస్తావిస్తూ, అప్పటి సామాజిక, ఆర్థిక స్థితిగతులనూ, భిన్నమైన పోకడలనూ, అసమానతలనూ,అంధ విశ్వాసాలనూ – నిజస్వరూపాన వివరిస్తూ కూడా; రచయిత, మనసు తత్వాన్ని తప్ప మనిషిని నిందించకపోవడం నాకు బాగా నచ్చింది. చారిత్రకమైన కొన్ని పాత్రలను కథలోకి తీసుకొచ్చి, వాటికి మరిన్ని కాల్పనిక పాత్రలను జోడించి కథను నడిపించడం, అందులోనూ ఆసక్తికరంగా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. భాషలోని సౌందర్యం; భావంలోని తీవ్రతా, ఉండుండీ తళుకు తళుకున మెరుస్తూ, కథ చుట్టూ వింత వింత కాంతుల్ని వెదజల్లాయి. ఎప్పుడో, వందల సంవత్సరాల క్రిందటి కాలాన్ని తెచ్చి కళ్ళముందు నిలబెట్టడంలో ఇంతటి సహజత్వాన్ని సాధించడానికి ఉపయోగపడినవి, ఆయన అనుభవమో, పరిశీలనో, పరిశోధనో లేక ఇవన్నీ కలిపిన ఇంకేదో తెలియదు గానీ, దానికి నా జోహార్లు.

  • బండి నారాయణ స్వామి ఒక్ రొమాంటిక్ నవల రాయాలనుకొంటే బహుశా చారిత్రక నెపథ్యంతో కూడా. ఏ అన్నమయ్యనో, వేమననో, వీరబ్రహ్మంగారినో ఆధారం చేసుకొని మంచి నవలే రాసి ఉండవచ్చు. కానీ గత శతబ్దాల దళిత బహుజన చరిత్రని చెప్పాలంటే అది శప్తభూమే అవుతుంది. దౌష్ట్యం హింసాత్మకమే కదా. ఇప్పుటి హింసనించి బయటపడ్డానికి ఎదురు నిలవడానికి కూడా ఈ చారిత్రక నేపధ్యం పనికి వస్తుంది.

  • విలియం బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ల విషయములో కొంత క్లారిటీ లోపించినట్లు అనిపించింది.. అయినా అద్భుతమైన నవల దేశరాజు గారికి అభినందనలు..

  • తెలుగులో వచ్చిన గొప్ప నవలల్లో ఇది ఒకటి. Great story telling by Swamy గారు.
    మనముందు కూచుని చెప్తున్నట్టే ఉంటుంది. పుస్తకం చదివిన తర్వాత కొన్ని రోజులపాటు ఒక వాతావరణంలో ఉంచేసే నవల. అందరూ తప్పకుండా చదవాల్సిన నవల.

    పుస్తకం గురించి మంచి పరామర్శ చేసిన దేశరాజు చివర్లో వేసిన ప్రశ్నలతో నాకు ఏకీభావం లేదు.
    “సాటి మనిషిపట్ల దయ, జాలి లేకపోవడం…” — ఈ పుస్తకంలో కరుణవున్నది, అనురాగం వున్నది, త్యాగం, దయ వున్నది. మనుషుల పట్ల ఆపేక్ష వున్నది. దుర్భరమైన హింసకు బలవుతున్న ప్రజలపట్ల స్వామి చూపించిన అవాచ్యమైన ప్రేమ, కరుణ, దయ, జాలి వున్నది.

  • MONOTONY. అంతా monotonous. ‘ సూర్యుడూ monotonous ఉదయం ఉదయించాల. సాయంత్రం అస్తమించాల. … మా కరువూ అంతే. కాటకము అంతే. … ఎలా చెప్పాము. ఎన్ని సార్లు అదే చెప్పాము. . …. అలా అని చెప్పకుండా ఉరుకోలేం. మాకు ఉన్నది అదే. అందుకని ఆ కాలాన్ని, ఆ రూపాన్ని ఎంచుకున్నాను. ‘ అన్నారు స్వామి TANA నవలల ఆవిష్కరణల సభలో. మాటలు కొంచెం డిఫరెన్స్ ఉండచ్చు. ఎందుకంటే, అయన ఆర్తిని, force ని నేను పట్టుకోవటం కష్టం. నాకు అర్థం అయిందది.

    ఆయన కరువు కాటకాలు జీవితాలను ఎంత హింసాత్మకంగా తయారు చేస్తాయో చూపించారు. May be magnificient level. (magnificient అనే పదం వాడకూడదు అనుకుంట. నాకు వేరే పదం గుర్తు రావటం లేదు.) అలా చెపితేనే కానీ, జనానికి అర్థం కాని స్థాయి వచ్చేసిందేమో! చర్చ జరగాలి అనుకున్నారేమో!

    కాళీపట్నం రామారావు గారి ‘యజ్ఞం’ లో హింస ఎంత చర్చని రేపింది.! (చర్చ ఆ కథ విషయంలో మాత్రమే నడవలేదు. అక్కడ సామజిక పరిస్థితుల మీదకు కూడా focus అయింది.) ఇంకో విషయం ఏమిటంటే కొన్ని హింసలు పైకి కనబడవు. చాప కింద నీరు లాగా విధ్వంసం సృష్టిస్తాయి. కుప్పిలి పద్మ ‘సాలభంజిక ‘ కథ మొదటి సారి చదివినపుడు అంత అనిపించదు. కానీ, చదివినపుడల్లా ఆ ఆడపిల్లల బతుకు చదివి ఏడుపు వస్తుంది కదా!.ఆ హింసని ఎంత బాగా చెప్పింది కథలో. అంత వరకు ఎందుకు ఇదే magazine లో ‘అరణ్యకృష్ణ ‘ focus చేసినది హింస గురించే. హింసే ఎక్కువగా ఉన్నపుడు feel అయినవాళ్ళు దాని గురించే రాస్తారు కదా! హింస తక్కువగా ఉన్న (లేకుండా ఉండటము అనేది కలే కాబట్టి.) విషయాలు కళ్ళ బడితే hope ఇవ్వటం కోసమైనా రచయితలు వాటి గురించి రాస్తారు కదా! హింస ఎవరికి బాగుంటుంది కనుక.

    ఇంక కళలు etc ఉండకుండా ఎక్కడ ఉంటాయి కానీ, వాటిని కరువుకాటకాలు dominate చేస్తున్నాయేమో! ‘పప్పు రామాచార్యులు’ గారు రాయలసీమ legend అట. పాతికేళ్ళ క్రితం ఎప్పుడో ఆయన పేరు వినటమే కానీ, 10 రోజుల క్రితం దాక ఆయన వాళ్ళ legend అని తెలీదు.

    ప్రేమ, ఆప్యాయతలు etc. ‘ saptabhoomi ‘ లో ఉన్నాయి కానీ, నేను ‘హింస ‘ విషయానికే పరిమితం అవుతున్నాను.

    • ఆయన కరువు గురించి మళ్లీ మళ్లీ చెప్పాల్సి రావడాన్ని మొనాటనీ అని అనివుంటారు. గానీ, నవలలో ఎక్కడా అలా అనిపించదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు