మహానటి సరే…ఆ రెండు సినిమాలు మరి!?

 కళకే జీవితాలు అర్పించిన ఆ కళాకారుల తపనలు ఎలాంటివి? వేదనలు ఎలాంటివి? వారి జీవితాలు ఎందుకు సుగమాలు, సుగమ్యాలు కాలేదు. ఇంతటి శాపాలు వెంటపెట్టుకుని జన్మించిన గంధర్వాది దేవతలా వాళ్ళు !!! 

“అభీ న జావో ఛోడ్ కర్ – యే దిల్ అభీ భరా నహీ” అంటూ రఫీ ఎప్పుడు పాడినా…. అంటే ఆయన పాడిన ఆ పాట నేను ఎప్పుడు విన్నా కళ్ళలో నీళ్ళు తిరగకుండా ఉండవు. నాకే కాదు చాలామందికి, మరెంతో మందికి కూడా అంతేనేమో! ముఖ్యంగా అభీ-అభీ అంటూ రెండుసార్లు పలుకుతాడే అక్కడ మరీనూ..

నిజంగా కొద్ది సమయాల్లో గుండె నిండదు. దాని నిండా తపన, దాహం. విన్న మనకే ఇలా ఉంటే, వారి గానంతో, నటనతో రెక్కలు లేకుండానే మనని పై లోకాల్లోకి ఎగరేసి అక్కడే విహరింపజేసే ఆ గాయకులు, నటులు, కళాకారులు వాళ్ళ హృదయాలెంత మెత్తగా ఉంటాయి. వాటినిండా ఎన్ని ఉద్వేగాలుంటాయి. ఎంత తపన, ఎన్ని దాహాలు ఉంటాయి !!! మనం ఊహించలేము. మనకు వారు దారపోసిన వారి గానాల వెనక, సృజనాత్మకత వెనక తపన పడి నలిగేవారి ఎగుడుదిగుళ్ళ, ఎత్తుపల్లాల జీవితపు ఆటుపోట్లు మనం అంచనా వేయలేం. అర్థం చేసుకోలేం కూడా.

విన్న మాటలను బట్టి తక్కువరకం అంచనాలతో కొలవడానికి కూడా వెనకాడం.

అందుకే గొప్ప దర్శకులు, అటువంటివారి జీవిత కావ్యాలను కళారూపాలుగా మనకందించినప్పుడు ఏమరుపాటు లేని తాదాత్మ్యంతో వారి అంతరంగ ప్రపంచాలు దర్శించే పని చెయ్యాలి. చూడడం కళ్ళతో చెయ్యవచ్చేమోగాని దర్శించడం మనసు ద్వారానే సాధ్యం.

అలా చాలాసార్లు చూసి, అన్నిసార్లూ మనసు పారేసుకున్న రెండు సినిమాలను ఇలా చెప్పడం కోసం వారం రోజుల కాలంలో మళ్ళీ మళ్ళీ చూసాను. మళ్ళీ కొత్తగా, చూస్తున్నంతసేపూ ఒళ్ళు పులకించిపోతూ, మనసు ద్రవించిపోతూ శరీరానికి కొత్త నెత్తురు ఎక్కిన జలదరింపు.

హంసా వాడ్కర్ అనే మరాఠీ, హిందీ నటి. ఆమె రాసుకున్న ఆత్మకథ ఆధారంగా తీసిన ‌’భూమిక’ సినిమా మొదటిది.  శ్యాం బెనగళ్, వనరాజ్ భాటియా, గోవింద నిహలానీల సంగమంలో డెబ్భయిలలో వచ్చిన మణిరత్నాలలో ఇదొకటి. ‘సాంగ్టా ఐకా’ అనే మరాఠీ ఆత్మకథకు ‘ask who am I’ అనే ఆంగ్ల అనువాదం కూడా ఉందట. అవన్నీ నెట్ లో ఉన్నాయి. నేను ఆ వివరాల జోలికిపోను. 1971లో ఆమె చనిపోతే 77లో ఆమె జీవిత కథ అలా అని చెప్పకుండా అంత తొందరగా శ్యాం బెనగల్ ఎందుకు దృశ్య కావ్యం చేసాడు. మనం మహానటికి ఇంత ఆలస్యం చేసి ఇంత హడావిడి చేసామే!!

‘భూమిక’ హంసా వాడ్కర్ కోసం చూడాలి. స్మితాపాటిల్ కోసం చూడాలి. రెండు కళ్ళు చాలనే భగవంతుడు ఇచ్చినా, కొన్ని అపురూప సందర్భాలలో చాలవనే అనిపిస్తుంది. భూమిక సినిమా నిండా ప్రతీ ఫ్రేములోనూ నిండిపోయిన స్మితా మనోనేత్రాన్ని కూడా విప్పుకుని చూసే అవసరం కల్పించింది.

సంగీతంతో రాణించే దేవదాసీ కుటుంబం నుంచి వచ్చిన బాలిక కథ ఇది. తల్లి ఎలాగో కుటుంబజీవితం వేపుకి వచ్చినా కూతురికి కుటుంబ జీవన మాధుర్యం అలా ఉంచి భరోసా కూడా దక్కలేదు. అందం, కళాకౌశలం, కలగలిసిన స్త్రీ హృదయంలో ఎన్ని ఉద్వేగాలు చెలరేగవచ్చు!!! ఎంతమంది దానికి కారణం కావచ్చు!!!

ఆమె కుటుంబం అంటే తల్లి, అమ్మమ్మ. చిత్రరంగంలోకి గాయనిగా ప్రవేశించి వారి పోషణ కోసం నటిగా మారుతుంది అసమానమైన నటి. అపురూపంగా ప్రేమించే సహనటుడు. కానీ చిన్నప్పటినుంచి వెంట తిరిగే శ్రేయోభిలాషిని(అమోల్ పలేకర్) పెళ్ళాడుతుంది. కేవలం గృహజీవితం కోసం. యవ్వనోద్వేగం కొంత, తల్లి మీద కోపం కొంత. అతనికి దగ్గరయి పెళ్ళి కాకుండా గర్భవతి అయి పెళ్ళికి సిద్ధపడుతుంది. సినిమాలకు ఉద్వాసన చెప్పేసేననుకుంటుంది.

కానీ మొదటి రాత్రే భర్త ఒప్పుకోడు. మృదువుగానే తిరస్కరిస్తాడు. సినిమాల్లో కి ఆమెను అతనే తీసుకెళ్లాడు మొదట. రుచి మరిగాడు.అందుకే మాననివ్వడు

ఆమె మొహంలోంచి జారిపోయే సంతోషపు వెలుగుల వెనక నేపథ్యంలో అప్పటిదాకా సైగల్ పాడిన ‘ఏక్ బంగల బనేన్యారా’ గీతాన్ని ఆపెయ్యడం శ్యాంబెనగల్ కే చెల్లింది. ఆమె కలలు కన్న బంగలా మొదటి రాత్రే కూలిపోయింది.

సినిమాలు, కీర్తి, కుటుంబం, కూతురు, అనుమానపు భర్త. ఆమె వీటిమధ్య ఇమడాలని చూసింది. సహనటుడి (అనంతనాగ్) ఆరాధన అలాగే ఉంది.

కానీ అతని పట్ల ఆమెకు కలిగింది కేవలంస్నేహభావమే

మరొక దర్శకుడు(నసీరుద్దీన్ షా) జీవితంలోకి రాబోయాడు. ఆమె మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడింది. అన్నివిధాలా. కానీ అతను ఇటువంటి బంధాలకు కట్టుబడి ఉండే స్వభావం ఉన్నవాడు కాదు. మరొక ఆశాభంగం.

అంతకు ముందే రెండవసారి గర్భం ధరించింది. ఆమె దాన్ని ఆనందంగా ఆహ్వానించబోయింది. కానీ భర్త కేవలం తన అనంగీకారంతో తీయించేశాడు.  అయినాక హాస్పిటల్ మెట్ల మీంచి కిందకి ఆమెను దింపుకుంటూ వెళ్ళే సన్నివేశం దర్శకుడు చాలాసేపు మెట్లపైనుంచి చూపిస్తాడు. భర్త  ఆమెను పాతాళంలోకి తీసుకుపోతున్నట్టుంటుంది.

అనుమానించే భర్త నుంచి కూతుర్ని కూడా తప్పనిసరి పరిస్థితులలో వదిలేసి ఇల్లు వదిలి హోటల్ లో ఉంటుంది. అయినా వెంటపడే భర్త నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటుంది.

అక్కడ ఆ హోటల్ లో ఒక జమీందారు పరిచయం అవుతాడు. అతని గాంభీర్య మృదుత్వాల కలయిక ఆమెకు నచ్చుతుంది. అతని కోరిక మీద అతని రెండవ భార్యగా అతని ఊరికి పెద్ద దేవిడీ లాంటి ఇంటికి వెళ్ళిపోతుంది.

అక్కడ ఉత్తమ ఇల్లాలి భూమికలోకి ఒదిగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎన్ని ఉన్నా స్వేచ్ఛ లేదు. ఇల్లు దాటి చనిపోయిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళేనియమం అక్కడ. ప్రశ్నిస్తే అంత సున్నితమైన మనిషిలోంచీ కఠినమైన దౌర్జన్యం చూస్తుంది.

ఆమె అలాంటి శృంఖలాల్లో నలిగే మనిషి కాదు. ఆ ఇంట్లోంచి బయటపడింది. బయట ప్రపంచంలోనూ పడింది.

ఆమెకు ఒదగడానికి ఏ పాత్రా మిగలలేదు.కానీ ధరించడానికి, నటించడానికి లెక్కలేనన్ని పాత్రలు ఇంకా సినీరంగంలో ఎదురుచూస్తున్నాయి. అక్కడ సినిమా ఆగిపోయింది.

ఒక కళాకారిణి జీవితం సాధారణ గృహిణి జీవితంలా ఎందుకు సాగదో – మన బరువైన గుండెకు అందుతుంది.

ఆమె జీవితంలో కోరుకునే ఇల్లు గానీ, ఒక మంచి తోడు కానీ ఆమెదయిన పెద్ద ప్రపంచంలో దొరకవు. కానీ ప్రపంచం ఆమెలోని సృజనకు నీరాజనాలిస్తుంది. ఆమె వేదన ఏమిటి, ఆర్తి ఏమిటి, లోటు ఎక్కడ ఇవి మనం కొలవలేం. మరో కళాకారుడే చెప్పగలగాలి.

సినిమాలోంచి నేను ఏదో కొంత చేజిక్కించుకుని ఇలా అందివ్వాలనుకోవడం కంటె మళ్ళీ మళ్ళీ చూసి నేను పొందినది చాలా ఎక్కువ. అది నా లోపలి ప్రపంచంలోకి నిస్సందేహంగా మరికాస్త వెలుగునీ, ఆ కాంతిలో కొంచెం ఎరుకనీ కూడా పట్టుకొచ్చింది.

గొప్ప కళాకారులను విశేషంగా ఆరాధిస్తామేగాని వారిలో గాఢంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన సృజన దాహాలూ, ప్రేమదాహాల గురించి సహానుభూతి చెందలేం కదా! కానీ చెందాలి. అందుకు ఇలాంటి కళారూపాలు సహాయం చేస్తాయి.

లాంటిదే మరొక సినిమా. జి.వి. అయ్యర్ తీసిన ‘హంసగీతె’ కన్నడ సినిమా. ఇది భూమికకి కాస్త ముందు 75లో వచ్చింది. సంగీతాభిమానులయిన మా తరం వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. రెండు గంటల నిడివి కూడా లేని ఈ సినిమా అంతా సంగీతమయం. మొత్తం మీద సంభాషణలు పది నిముషాలకు మించి ఉండవు. బాలమురళీకృష్ణ సంగీత నిర్వహణలో బి.వి. కారంతో, ఎం.ఎల్. వసంతకుమారి, పి.బి. శ్రీనివాస్, బెంగుళూరు లతలతో మొత్తం అంతా సంగీతపు ముద్ద. రెండుగంటలూ అవిరామంగా కరిగి ప్రవహించిన పాదరస ప్రవాహం.

18వ శతాబ్దిలో కర్ణాటకలోని చిత్రదుర్గానికి చెందిన కర్ణాటక సంగీత గాయకుడు కల్లు వెంకట సుబ్బయ్య జీవితమే ఈ చిత్రం. 1952లో ఇది కన్నడం లో నవలగా వచ్చింది. గ్యాడ్యుయేషన్ కోర్స్ లో పాఠ్యభాగంగా కూడా ఉందట. 56లో బసంత బహార్ పేరుతో హిందీలోనూ తర్వాత హంసగీతగా కన్నడంలోనూ ఆయన జీవనసారాన్ని గానం చేసి సినీ దర్శకుల స్థాయిని మించిన కళాతపస్వులు (కె.విశ్వనాథ్ కాదు) నిజమయిన తపస్సు చేసినవారు – వెండితెర విలువ పెంచారు. దాన్ని వెన్నెల తెర చేశారు.

వెంకట సుబ్బయ్యని అతని జీవితం కేవలం సంగీత తృష్ణ, ప్రతిభల కారణంగా గగనానికెగయజేసి, లోయలలో దూకించి అతనిని అతలాకుతలం చేసింది.

అతనికి పరీక్ష పెట్టిన గురువు అతని ప్రతిభ ముందు ఆగలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకయ్యను గురుద్రోహిగా నిందిస్తూ సమాజం మరో గురువును ఇవ్వలేదు. అన్వేషణే ప్రాణంగా కొండకోనల్లో తిరిగి అక్కడే ఒక దేశదిమ్మరిని గురువుగా కనుగొన్నాడు. ఆ గురువు ఒకపట్టాన లొంగలేదు. శిష్యుడి ని తీవ్రమయిన పరీక్షలకు గురిచేసి చివరికి స్వంతరాగాన్ని కనుగొనమని సాధనలోకి దింపి ప్రాణాలు వదిలాడు.

వెంకన్న మళ్ళీ లోయల్లో పడిపోయాడు. ఈసారి చిత్రదుర్గ నాయకరాజు ఆదరించి గౌరవించాడు. ఆస్థాన గాయకుడయ్యాడు. సాక్షాత్తూ రాజుకే ఆంతరంగిక గాయకుడయ్యాడు.

మిన్నుముట్టే గర్వంతో ఒళ్ళు మరిచిపోయాడు.గర్వం విద్యను హరిస్తుంది. ప్రజలు చాటుగా విమర్శించుకునే సమయంలో ఒక కచేరీలో బాలమార్దంగికుడి దగ్గర తాళం తప్పేడు. ఘోరావమానం.

గర్వం దిగిపోయింది. రాజును వేడుకుని కొలువు వదిలేసాడు. మళ్ళీ చిత్రదుర్గ కొండలు, సాధన. ఈసారి నాట్యగత్తె, కళాకారిణి అయిన స్త్రీ జీవితంలోకి వచ్చింది. ఆమె కోసం వేశ్యమాతకు వెయ్యి వరహాలు సమర్పించడానికి భైరవి రాగం అమ్ముకున్నాడు. కానీ ఈ సంగతి ప్రేయసి కి తెలియదు. ఆమెకు అతన్ని భక్తితో ఆరాధిస్తూ ఉంటుంది

ఆమెతో అతని జీవితమంతా జయదేవుడి అష్టపదులమయం.

అతని అన్ని అవస్థలలోనూ అండగా ఉండే మేనమామ ఆమెకు ఈ రహస్యం చెప్పి, ఆ రాగాలను విడిపించేలా చేస్తాడు.

ఆమె నన్నయినా వదిలిపెట్టుగానీ – సంగీతం వదలవద్దని ఏడుస్తుంది. తల్లి దగ్గరకు వెళ్ళమంటుంది. మొహం చెల్లక వెళ్ళడు.

ప్రేయసి ని వదిలి మళ్ళీ చిత్రదుర్గ – అమ్మ కోసం అంబ కోసం అనుగ్రహం కోసం సాధన.

ఏళ్ళు గడిచాయి. టిప్పుసుల్తాన్ చిత్రదుర్గ ఆక్రమించుకున్నాడు. తన ఎదురుగా వెంకన్నని పాడమని అడిగాడు. వెంకన్న తిరస్కరించారు. నాలుక కత్తిరించమని రాజాజ్ఞ. ఇదీ కథ.

ఇది జి.వి. అయ్యర్ సంగీతాన్ని ఫోటోగ్రఫీ తో కలగలిపి దృశ్యమానం చేస్తుంటే ఒళ్ళు నిముషనిముషమూ గగుర్పాటుకు గురవుతూనే ఉంటుంది.

ప్రతి భావమూ సంగీతంలోంచే చెప్పేరు బాలమురళీ, అయ్యరూ ఏకమై. అన్ని రసాలూ సంగీత వాయిద్యాల ద్వారా సరిగమల ద్వారా ఒలికించి వరదలు కట్టించారు. గగుర్పాటు, పులకింత, జలదరింత అన్నీ ఏకకాలంలో శరీరం, మనసూ, హృదయమూ అనుభవించేలా వెంకట సుబ్బయ్య జీవితసారాన్ని మన లోపలికీ పారబోసారు.

వెంకటసుబ్బయ్య తో పాటు అనంతనాగ్ అనే కళాకారుడి విశ్వరూపమూ చూస్తాం.

ఇక ఈ రెండు సినిమాల నిర్మాణ ప్రతిభల గురించి మాట్లాడవలసి వస్తే అవి మళ్ళీ అనేక శేఫాలికలవుతాయి. కనుక నేను వాటి జోలికి పోవడం లేదు.

ఇద్దరు కళాకారుల జీవిత కథల వరకే నేను వీటిని పరిమితం చేశాను. నిజానికి హంసగీతె సినిమాలో ఆ చిత్రదుర్గ కొండలమీది గాలులు మనకు కూడా తగిలేనా అనిపించేలా షూట్ చెయ్యడమే ఎంతో అద్భుతం.

మనం విని పరవశించే గొప్ప గొప్ప సంగీతాలు, చూసి మనసు పాడుచేసుకునే శిల్పాలు, చిత్రాలు, నాట్యాలు, నటనలు, మానవ జీవితాలను సంస్కృతీమయం, సంస్కారవంతం చేయగల దివ్య సాధనాలు.

వాటికి జీవితాలు అర్పించిన ఆ కళాకారుల తపనలు ఎలాంటివి? వేదనలు ఎలాంటివి? వారి జీవితాలు ఎందుకు సుగమాలు, సుగమ్యాలు కాలేదు. ఇంతటి శాపాలు వెంటపెట్టుకుని జన్మించిన గంధర్వాది దేవతలా వాళ్ళు !!!

ఇలా మనసు వేసే ప్రశ్నలకు జవాబులు లాంటి చిత్రాలివి. ఆ జవాబులు మనని వారి కళలముందే కాకుండా జీవితాల ముందు కూడా మోకరిల్లేలా చేస్తాయి. వారితో మమేకమైపోతాము. అందుకే వారు స్త్రీలయినా, పురుషులయినా మరీ ముఖ్యంగా స్త్రీల గురించి వారి ప్రేమ సంబంధాల గురించి, లేదా మోహసంబంధాల గురించి ఎంత తక్కువ విని, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

మనం ఇలాంటి సినిమాలు చూసి అంతటి యోగ్యులుగా మారడమే వాటికి ఫలశ్రుతి లేదా ఫలదర్శనం అనుకుంటాను.

*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

17 comments

Leave a Reply to కోడూరి విజయకుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కె. విశ్వనాథ్ ని కళాతపస్విగా భావించే తెలుగువాళ్లకి ఈ సినిమాలు అర్థంకావటం కష్టమే.

  • ఈ వ్యాసం ఆరంభం ఒక్కటి చాలండి …. పాఠకులకు , ప్రేక్షకులకు కల పరిమితులను దాటి ఒక కళారూపాన్ని అవగతం చేసుకొమ్మని ప్రబోధించే లాగ ఉంది . రెండు సార్లు చదివాకా మీ వాక్యాలు లోతు తెలిసింది … మీ వ్యాసాలు చదవడం మనోవికాసం వీరలక్ష్మి దేవి గారు … ధన్యవాదాలు …

  • Lakshmi! చదివి మనసు పులకించిపోయింది. బరువెక్కిపోయింది. ఏమి రాశారు లక్ష్మీ!! ఆ చేతికి కంకణం తొడగాలి! చదివి మనసు నిండిపోయింది.movies చూశాను. ఇప్పుడు చూస్తె కనిపించే అందాలు వేరు! ఆ అనుభూతి వేరు.మరొక్కసారి నేను movies చూడాలి. నాకు అంతగా గుర్తులేదు..విందుభోజనం పెట్టారు. ఎంతో తృప్తి కలిగింది. అందరి నటీనటులను , photography లోని వెలుగునీడలను, అందరి కళా కౌశల్యాన్ని కళ్ళముందు రంగరించేశారు! ఎన్నో అందాల్ని చూపించారు కళ్ళకు , పాటల్లోని మాధుర్యాన్ని చెవులకు, మనసుకు వినిపించారు. అభినందనలు.!!

  • భూమిక చూసా గానీ – అప్పట్లో హంసగీతే కొద్దిగా చూసి, ముందుకు కదలలేక పోయాను – మీ వ్యాసం చదివేక ఆసక్తి కలిగింది మళ్ళీ!

  • బహు సున్నితమైన పరిశీలన, ఆర్ద్రత, కళారాధన కలగలసిన అనుభూతి మీది.

  • అంతా సంగీతపు ముద్ద. రెండుగంటలూ అవిరామంగా కరిగి ప్రవహించిన పాదరస ప్రవాహం.
    … మంచి కవితాత్మక వ్యక్తీకరణ .. మంచి వ్యాసం.
    – రామా చంద్రమౌళి

  • చాలా బాగా రాసారు. మీ వచనంలోని సొగసు, ఆ సినిమాలకి మరింత వన్నె తెచ్చినట్టుంది

  • very well written. reminds me of many of irving stone’s celebrates biographical novels, especially lust for love (vincent van gogh), agony and ecstacy (michelangelo), and depths of glory ( camille pissarro). powerful stories of what makes a true artist.

  • రెంటికి రెండూ గొప్పచిత్రాలండి . చక్కటి పరిచయానికి ధన్యవాదాలు.

  • చాల మంచి వ్యాసం. రెండు గొప్ప సినిమాలను పరిచయం చేసిన లక్ష్మి గారికి అభినందనలు.
    హంసగీతి యూట్యూబ్ లో ఉంది –

    https://www.youtube.com/watch?v=OwZu9W2qemU

    భూమిక కూడా :

  • చాలా గొప్పగా విశ్లేషించారు అక్కా!
    భూమిక ఒకసారే చూసి ఆ గాఢతను తట్టుకోలేకపోయాను. మీ విశ్లేషణ మళ్ళీ మళ్ళీ చూడమంటోంది. స్మితా పాటిల్ ను చూసి తట్టుకోగలనా? హంసగీతె చాలాసార్లు చూసాను. మద్రాస్ వెళ్ళినప్పుడు మానాన్నగారు shop లన్నీ తిరిగి నా కోసం l.p. record కొన్న దృశ్యం కళ్ళముందు కదులుతూ అస్పష్టమవుతూంది. మీకు????????????

  • చాలాగొప్పసమీక్ష.చదివిమనసునిండిపోయి మూగబోయింది.భూమికచూసినేనుచాలా ఉద్విగ్నతకు గురి అయాను.ఆమె మనపక్కింటి పొరుగింటిమనిషాఅని.జమిందారు తోజీవితంనన్ను అలాగే కదిలించింది.హంసగీతెచూడలేదు కానిమీసమీక్షతో చూడటానికి గట్టిసంకల్పం .ఏర్పడింది.అవి సాహబీబీగులాంలా అపురూప కళాఖండాలు.దర్శకులునిర్మాతలవిశ్వరూపాలు.నేటి వానితో పోల్చలేము.ఇపుడు అంతా పబ్లిసిటీ మయం కమర్షియల్ పరిధిదాటరు. మంచిచిత్రసమీక్ష ధన్యవాదాలమ్మా.

  • రెండూ నాకూ చాలా నచ్చిన సినిమాలు .హంసగీతె నవల కూడా అంతే అద్భుతంగా ఉంటుంది .వెంకటసుబ్బయ్య పాత్ర పూర్తిగా కల్పితం కాదని కూడా అంటారు .రెండు సినిమాలు కూడా పూర్తిగా డైరెక్టర్ల సినిమాలు .ఇంకెవ్వరూ ఇలా తీయలేరు అనిపించే సినిమాలు

  • కళాకారుల కళ గురించే ముచ్చటించు కోవాలి.కాని వ్యక్తిగత భావోద్వేగాల గురించి అర్థం చేసుకోకుండా వారి ప్రేమలు,పెళ్లిళ్లు,సఫలతలు,వైఫల్యాలు
    గురించి మాట్లాడుకోవడం,అందునా వక్రీకరించి మాట్లాడటం వారిని చిన్న బుచ్చడమే కాదు,మనల్ని మనం చిన్నబుచ్చుకున్నట్టే.
    పాపం సావిత్రి, శ్రీదేవి గార్లది దయనీయమైన పరిస్థితి.
    నటనకు సంబంధించి హిమగిరి శిఖరాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు