మరిన్ని కొత్త శీర్షికలు మీ కోసం!

మీరు రచనలు చదవడంతో పాటు వాటి మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను అక్కడే రాయడం మరచిపోకండి. మీ అభిప్రాయం అటు రచయితలకూ ఇటు మాకూ ఎంతో విలువైనది.

1

న ఊళ్ళు, మన నగరాలు ఇవే  మన ఉనికి. మనల్ని పరిచయం చేసే గుర్తులు. ఇప్పుడు ఆ గుర్తులు వేగంగా మారిపోతున్నాయి, మనమే గుర్తు పట్టలేనంతగా! వాటి ఊసులన్నీ నిజంగా జ్ఞాపకాలే అవుతున్నాయి.

అది నిన్నటి జ్ఞాపకం కాదు, ఇప్పటి వర్తమానం, రేపటి భవిష్యత్తు కూడా అని మనం ఇకనైనా గుర్తించాలి. స్థానిక ఉనికి అనేది బలమైన భావనగా రూపొందాల్సిన అవసరం ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో మొన్నటికి మొన్న జరిగిన బహిష్కరణల అధ్యాయం మన సాంస్కృతిక అజ్ఞానాన్ని చాటి చెప్తోంది. అంతకంటే ఎక్కువగా స్థానిక చరిత్రలూ, సంస్కృతుల పట్ల మన నిర్లక్ష్యాన్ని చెప్తోంది. రాజ్యం బలపడే కొద్దీ రాజకీయ వ్యవస్థ మాత్రమే నిర్ణాయక శక్తిగా మారడం విషాదకరమైన కుట్ర. కొత్త రాజకీయ వ్యవస్థలు రాజకీయ ఉనికి కోసం దేన్నయినా ధ్వంసం చేస్తాయి. అందులో మొదటగా బలయ్యేది సాంస్కృతిక చరిత్ర! హైదరాబాద్ కాని, మన తెలుగు రాష్ట్రాల్లో వున్న ఏ వొక్క ఊరూ, నగరమూ వెలివాడ కావడానికి వీల్లేదని  మనం గట్టిగా గొంతెత్తి చెప్పాల్సిన అవసరం వుంది. అన్నిటికీ మించి ఏ వొక్క మనిషీ వెలి అనే దుర్మార్గానికి గురి కాకూడదనీ మాటిచ్చుకుందాం.

అందుకే, సాంస్కృతిక చరిత్రల్ని గుర్తు చేసే రచనలకు “సారంగ” పెద్ద పీట వేస్తోంది. ఈ పక్షం నుంచి ప్రసిద్ధ రచయిత అట్టాడ అప్పల్నాయుడు  రాస్తున్న “ఉత్తరాంధ్ర ఊసులు” వినండి. సాంస్కృతిక చరిత్ర రచనల్లో కూడా ఎంతో కొంత వివక్ష వుంది. ఈ మొత్తం చరిత్ర రచనా క్రమంలో ఉత్తరాంధ్ర కి దక్కాల్సిన వాటా ఎప్పుడూ దక్కడం లేదు. అక్కడి ప్రజలు గాని, అక్కడి కళా రూపాలు గాని, అక్కడి రచయితలు కాని మన దృష్టి పథంలో పెద్దగా మెదలరు. ఇక అక్కడి భాష అంటారా, ఇంకా అది మన సాహిత్యానికి అలవాటు కానే లేదు. మహాకవులు, మహారచయితలు పుట్టిన నేల అది. అటు కవిత్వ శిల్పానికీ, ఇటు వచన రచనకీ కొత్త సోయగాలు అద్దిన ఇంటి భాష అది. అంతకంటే, వర్తమానం కొత్త ఓనమాలతో లిఖితమవుతున్న  ఒరవడి అది. ఆ ప్రాంతం నుంచి వచ్చే రచనలకు సారంగ మనఃస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది.

2

మధ్య తెలుగు సినిమా బాగుపడుతోందని ప్రముఖంగానే వినవస్తోంది. సినిమా అనే వాహిక  నెమ్మదిగా కొత్తతరం దర్శకులూ, కళాకారుల చేతుల్లోకి వెళ్తోందన్న నమ్మకమూ కలుగుతోంది. సారంగలో “తెరచాప” శీర్షికకి ఇప్పటికీ విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే, ఈ శీర్షికని మరింత విస్తృత పరచి, చక్కని చర్చా వేదికగా మలచాలన్నది మా ఉద్దేశం. కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, కొత్త దర్శకులతో, కొత్త రచయితలతో ఇంటర్వ్యూలు పంపిస్తే, తప్పకుండా ప్రచురిస్తాం.

అయితే, మా మటుకు మాకు ఈ శీర్షికని తెలుగు భాషకే పరిమితం చేయాలని లేదు. మిగిలిన భాషల్లో వస్తున్న సినిమాల గురించీ, ప్రపంచ సినిమా గురించి కూడా రాయండి. అవి సమీక్షలు కావచ్చు, ఆ సినిమా మీలో కలిగించిన భావ ప్రకంపనల మ్యూజింగ్స్ కూడా కావచ్చు. వచ్చే సంచిక నుంచి కేవలం సినిమా పాటల సాహిత్యం గురించి అవినేని భాస్కర్ “వేయి పాటలు” అనే శీర్షిక రాస్తున్నారు. అవినేని భాస్కర్ కి  పాట అంటే ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు. బహుశా, పాటల గురించి ఎంతో ఇష్టంగానే కాకుండా, లోతుగా కూడా మాట్లాడగలిగే అతికొద్ది మందిలో భాస్కర్ వొకరు. ఆ శీర్షిక మొదలు కాబోతున్నందుకు “సారంగ” సంతోషిస్తోంది.

సారంగలో సమీక్ష కోసం పుస్తకాలు ఎలా పంపించాలి అని చాలా మంది అడుగుతున్నారు. సారంగలో ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాల కబుర్లు అందించాలని మేమూ అనుకుంటున్నాం. ఇక నుంచి కొత్త పుస్తకాల సమాచారం తగినంత సారంగలో దొరుకుతుంది. ఈ శీర్షిక కింద తొలి సమీక్ష ప్రసిద్ధ కథకుడు డాక్టర్ వి. చంద్రశేఖర రావు చివరి కథల సంపుటి గురించి ప్రముఖ కవి, విమర్శకుడు దేశరాజు రాసిన సమీక్షని ప్రచురిస్తున్నాం. ఈ శీర్షిక కింద ప్రచురణకి మీ పుస్తకాల వివరాలు ముఖ చిత్రంతో సహా  editor@saarangabooks.com కి ఈమెయిలు చేయండి. వివరమైన సమీక్షలు కోరుకుంటున్న వారు మాత్రం పుస్తకాలు పంపించాల్సి వుంటుంది. వివరాలకు ఈమెయిలు రాయండి. అయితే, సమీక్షల విషయంలో పూర్తి నిర్ణయాధికారం సారంగ సంపాదక వర్గానిదే!

 

చదువరులకు మనవి: 

సారంగలో వెలువడే  ప్రతి రచన వెనకా, ప్రతి శీర్షిక వెనకా ఎంతో ఆలోచనా, శ్రమా వున్నాయి. మీరు రచనలు చదవడంతో పాటు వాటి మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను అక్కడే రాయడం మరచిపోకండి. మీ అభిప్రాయం  అటు రచయితలకూ ఇటు మాకూ ఎంతో విలువైనది.  మీరు వాటిని చదువుతున్నారనీ, వాటి గురించి ఆలోచిస్తున్నారనీ అర్థమవుతుంది. అన్నిటికీ మించి, పరస్పరం వొకరి నించి ఇంకొకరు నేర్చుకునే వీలూ వుంటుంది.

సారంగ మీ పత్రిక, మీ వేదిక!

సారంగ చదవండి, చదివించండి!

సారంగలో రాయండి, రాయించండి!

*

ఎడిటర్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగ మీ పత్రిక, మీ వేదిక!

    సారంగ చదవండి, చదివించండి!

    సారంగలో రాయండి, రాయించండి!

    Claps for these words

  • మంచి ఆలోచన…కొత్తతరానికి…సాహితీ విందు..

  • సారంగతో ఇదీ నా సమస్య. ఇది ఇలా ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే, ఇది నా ఒక్కడిదేనా? మిగిలినవారికి బానే ఉందా? తెలుసుకుందామని.
    సారంగ ఓపెన్ చేస్తే మొదటి ఫొటోలోలా ఓపెన్ అవుతుంది. ఆ నీలి రంగు డబ్బాల్లో ఏవి కొత్తవో, ఏవి పాతవో తొందరగా అర్థం కాదు. శీర్షికలు క్లిక్ చేస్తే (రెండో ఫొటో) కొన్నే వస్తాయి. అన్నీ రావు. కొన్నిసార్లు మూడో ఫొటోలోలా ఓపెన్ అవుతుంది. అక్కడా వెతుకులాటే.
    వారి సాధకబాధకాలు నాకు తెలీవుగానీ, నా ఉద్దేశం ఏమిటంటే.. సైట్ ఓపెన్ కాగానే తాజా సంచిక ఏదైతే ఉందో, అది స్పష్టంగా ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేస్తే బావుంటుందిగా? దాన్ని క్లిక్ చేసుకుని ఎవరికి కావాల్సిన శీర్షికల్లోకి వాళ్లు వెళతారు. అలాగే పాత సంచికలను కూడా తేదీల వారీగా ఓ దగ్గర పడేస్తే వెతుకులాట సులువుగా ఉంటుంది కదా.
    హోం పేజీ లో.. అన్ని శీర్షికలు రావడం లేదు. అంతేగాక, కొన్నిటికి శీర్షికల ఫొటో ఉంటుంది. మరికొన్నింటికి ఆయా అంశాలకు సంబంధించిన ఫొటో ఉంటుంది. దీంతో ఈ మెయిల్ కు వచ్చిన లింకులు వెతుక్కుని సారంగలోకి ప్రవేశించాల్సి వస్తోంది.

    • దేశరాజు గారు – థాంక్స్! The specific details in your comment are helpful. We will look into it soon.

      Raj

      • సారంగ నేను ఎంతో ఇష్టంగా చదివే పత్రిక. అది ఆగిపోయినప్పుడు ఎంత విచారించానో మళ్ళీ మొదలైనప్పుడు అంత సంతోషించాను. కాని దేశిరాజుగారు వ్రాసినట్లుగా శీర్షికలు చాలా కలగాపులగంగా ఉంటున్నాయి. నాకు చాలా ఇస్టమైన శీర్షికలు ఎక్కడో మరుగునపడి పోయి అకస్మాత్తుగా కనిపించాయి. దానితో వెతుకులాట మొదలయింది కాని ఇంకా ఏమైనా మిస్స్ అయ్యానేమోనని బాధ వదలలేదు. మునుపటి సారంగ లాగా సంచిక తెరవగానే అన్ని శీర్షికలు చూసేలా వుంటే బావుంటుంది. సారంగ మళ్ళీ మొదలుపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు.

  • subha, and others~ ఈ శీర్షికలన్నీ గందరగోళంగా ఉన్నాయి అన్న మాట నాకర్థం కావడం లేదు. పైన మెనూ ఐటెం “శీర్షికలు” అని ఉందిగా, మరి అక్కడ క్లిక్ చేస్తే అన్ని శీర్షికలు కనిపిస్తాయిగా? Am I missing your point? కాకపొతె కేవలం శీర్షికల పేర్లు మాత్రమే పెడితే ఏది కథో ఏది విమర్శనో ఏది కవిత్వమో క్లియర్ గా ఉండదు కాబట్టి అదే శీర్షికలు మెనూ లోనే అనువాదాలు, కాలమ్స్, విమర్శ … అని కూడా పెట్టాము. Is that not helping, and causing more confusion? Thanks!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు