బంగారం కంటే విలువైనవి…. !

నా జన్మలో మొదటి సారి చూసిన కంప్యూటర్ ఎటువంటిది అనగా… నమ్మండి, నమ్మక పొండి. ఆ రోజుల్లో..అంటే కేవలం యాభై ఏళ్ల క్రితం యావత్ భారత దేశంలోనే ఎంతో ఉన్నత స్థాయి విద్యాలయంగా పేరు పొందిన మా బొంబాయి ఐ ఐ టి ప్రాంగణం మొత్తానికీ “మిన్స్ క్” అనే ఏకైక రష్యన్ కంప్యూటర్ ఉండేది.

1966 జులై లో….

నేనూ, బివై మూర్తీ, పి ఆర్ కె రావూ…ముగ్గురం బొంబాయి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీకి చేరి, మొదటి రోజే ఆత్మీయ స్నేహితులం అయిపోయి, అందుకు తగ్గట్టుగానే హాస్టల్ వన్ లో నేల..అంటే క్రింద అంతస్తులో ఆఖరి వరండాలో పక్క పక్క గదుల్లో మేం తెచ్చుకున్న సామాను..నా విషయంలో ఒక సూట్ కేసూ…బెడ్డింగూ సద్దేసుకున్నాం…..ఆ బెడ్డింగులో ఒక రొజాయి (ఎన్నాళ్ళయిందో ఆ మాట విని), ఒక తలగడా అనగా దిండు, నాలుగు దుప్పట్లు, రెండు నూలు తువ్వాళ్ళు, సబ్బులు.. ఒకటేమిటి అందులో ఏది పడితే అది కుక్కేసి ఘాట్టిగా బెల్టులు చుట్టేసి కట్టేసి కాకినాడ – హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, అక్కడ నుంచి బొంబాయి ఎక్స్ ప్రెస్…మొత్తం 40 గంటల ప్రయాణం లో ఒక రేకుల పెట్టె తో సహా  నేను తెచ్చుకున్న సామాగ్రి… అన్నింటి లోకీ మా అమ్మ ఇచ్చిన ఆవకాయ, కంది పొడి, గోంగూర … బంగారం కంటే విలువైనవి అని తర్వాత మా బొంబాయి జీవితంలో కరువు రోజుల్లో మాకు తెలిసి వచ్చింది.

మొదటి రోజు మా డిపార్ట్ మెంట్ లో అన్నీ విభాగాలూ, ఇతర డిపార్ట్ మెంట్లు, లైబ్రరీ, వగైరాలు చూడడంతో సరిపోయింది. కేంపస్ లో ప్రతీ డిపార్ట్ మెంట్ కీ విడి విడిగా ఒక్కొక్క చొప్పున సుమారు మూడంస్తుల భవనాలు పది హేను, పెద్ద లేబొరేటరీస్ కి మరో పది, అన్నింటినీ కలుపుతూ అక్కడ నిరంతరం కురిసే వర్షంలో తడవకుండా ఒక పొడుగాటి వరండా….అనగా కారిడార్ ఉంటాయి. మా కేంపస్ అందమైన పవయ్ సరస్సుకి  ఒక పక్కన ఉంటే అవతలి పక్క స్వామి చిన్మయానంద సాందీపని ఆశ్రమం, ఇక్కడ నుంచీ కనపడే అతి పెద్ద శివ లింగం, ఆ ఆశ్రమానికి పక్కన   విహార్ లేక్, లార్సన్ & టూబ్రో సంస్థ ఉంటాయి. ఆ వంద ఎకరాల ప్రాంగణం ఉన్నత విద్యాభ్యాసానికి కావలసిన చాలా ఆహ్లాదకరమైన వాతావరణం.  బొంబాయి ఐ ఐ టి రష్యా వారి సాంకేతిక పరిజ్ఞానంతో నెహ్రూ గారు నెలకొల్పిన రెండవ ఐ ఐ టి.

అయితే…నా జన్మలో మొదటి సారి చూసిన కంప్యూటర్ ఎటువంటిది అనగా…

వాక్యూమ్ ట్యూబ్ మిన్స్క్ కంప్యూటర్

నమ్మండి, నమ్మక పొండి. ఆ రోజుల్లో..అంటే కేవలం యాభై ఏళ్ల క్రితం యావత్ భారత దేశంలోనే ఎంతో ఉన్నత స్థాయి విద్యాలయంగా పేరు పొందిన మా బొంబాయి ఐ ఐ టి ప్రాంగణం మొత్తానికీ “మిన్స్ క్” అనే ఏకైక రష్యన్ కంప్యూటర్ ఉండేది.. నమ్మినా, నమ్మకపోయినా …నవ్వకండి. ఎందుకంటే ఆ కంప్యూటర్ ఒక 20’ x 20’..అంటే 400 చదరపు అడుగుల పూర్తి ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉండేది. ఆ గది లోపలకి వెళ్ళాలంటే….దేవుడి గుడిలోకి వెళ్తున్నట్టు పైన చెప్పులు విప్పేసి వెళ్ళాలి…. లేక పొతే మా పాద ఢూళి సోకి ఆ ఐదు బీరువాల కంప్యూటర్ లో మిల మిలా మెరుస్తూ ఉండే వేక్యూమ్ ట్యూబులు పనిచెయ్యడం మానేసేవి. గుమ్మం మీద వినాయకుడి బొమ్మ ఉండేదేమో గుర్తు లేదు.

ఇక ఎవరైనా కోబాల్ లాంగ్వేజ్ లోనో. మెషీన్ భాషలో వ్రాసిన ప్రోగ్రాములు అరంగుళం వెడల్పు పేపర్ టేప్ లోనో, సుమారు వంద పోస్ట్  కార్డుల లాంటి వాటిల్లోనో ప్రత్యేక టైప్ రైటర్ లో కొట్టి ఇవ్వడానికి ప్రత్యేక నిపుణులు పక్క గదిలో ఉండేవారు. వీరి కొట్టిన ఆ ప్రోగ్రాం అంతా లైనుకి ఒకటి నుంచి పది కన్నాల రూపంలో ఉన్న ఆ టేపులు, కార్డులు ఇన్ పుట్ లా ఆ కంప్యూటర్ లోకి ఎక్కించడానికి మరొక తరహా నిపుణులు ఉండేవారు. వీరిలో చాలా మంది రష్యా వెళ్లి శిక్షణ పొందే వారు. ఇక వినియోగ దారులు…..అంటే ఆ కంప్యూటర్ వాడుకునే నా బోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు…

ఆ గది లోకి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇక నిజంగా ఈ నాడు పక పకా నవ్వాలి అనుకుంటే….ఆ గదిలో ఒక్కొక్క బీరువా కంప్యూటర్ జ్ఞాపక శక్తి..మెమొరీ ఏకంగా 8 KB…అలా ఏకంగా ఐదు ఉన్నాయి. ఇక యావత్ బొంబాయిలో అంత కన్నా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉన్న కంప్యూటర్ కావాలంటే ..బొంబాయిలో అవతలి వేపు  రెండు గంటల దూరంలో కొలాబా లో ఉన్న T I F R ..టాటా ఇన్స్ టిట్యూట్ ఆప్జ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో పి.డి.పి. కంప్యూటర్ వాడుకోవలసినదే.. చాలా మంది ఆ వంక పెట్టుకుని రోజూ మా ఎడారి నుంచి  కొలాబా వెళ్ళడానికి ప్రధానమైన కారణం అక్కడ కనపడే పార్సీ అందగత్తెల ఒయాసిస్సులు అని వేరే చెప్పక్కర లేదు. ఆ నాటి ఆ కంప్యూటర్లన్నింటినీ కలిపిన జ్ఞాపక శక్తికి వేల రెట్లు ఈ నాటి పసి వాడి బొమ్మలో ఉన్న కంప్యూటర్ లో ఉంటుంది అంటే ఆశ్చర్యం లేదు.

అలాగే .. కాపీయింగ్…అంటే పరీక్షలలో పక్క వాడి నుంచి కొట్టే కాపీయింగ్ కాదు. కార్బన్ కాపీయింగ్…అంటే.. ఏదో మహా అయితే మూడు, నాలుగు కాపీలు తీయడానికి కార్బన్ పేపర్లు పెట్టి పై కాగితం మీద గట్టిగా నొక్కుతూ వ్రాస్తే సరి పోయే పద్దతి ఇప్పుడు కూడా ఇంకా వాడకం లోనే ఉంది. కానీ అంత కంటే క్లాస్ మొత్తం అందరికీ పరీక్ష ప్రశ్నాపత్రాల లాంటివి పది కాపీలో, యాభై కాపీలకి వాడిన  సైక్లో స్టైల్ మెషీన్ అనే యంత్రాన్ని తలచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది.  ఈ స్పెషల్ సైక్లోస్టైల్ పేపర్ల మీద టైప్ కొట్టి, ఈ మెషీన్ లో పెట్టి కావలినన్ని కాపీలు తీసే వారు. మా ఐ ఐ టి లో ప్రతీ డిపార్ట్ మెంట్ కీ ఒక్కొక్క మెషీనూ, ఆ స్పెషల్ టైపిస్టూ ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆధీనంలో ఉండే వారు. లెక్చరర్లు వారం ముందు ప్రశ్నాపత్రాలు వ్రాసి ఇస్తే అవి లీక్ అవకుండా రహస్యంగా టైప్ చేసి, ఆ మెషీన్ మీద కాపీలు తీసి అంతే రహస్యంగా ఆయా లెక్చరర్లకి ఇచ్చే వారు. ఆ నాటి సైక్లోస్టైల్ మెషీన్ ఫోటో ఇక్కడ జతపరిచాను.  మా డిపార్ట్ మెంట్ లో ఆ యంత్రాన్ని వాడడం ఒక మలయాళీ అమ్మాయికి మాత్రమే వచ్చును. అంచేత మనం, మనం సౌత్ వాళ్ళం అని ఆ అమ్మాయికి మస్కా కొట్టి, అప్పుడప్పుడు చాక్ లెట్లు కొనిపెట్టి తొందరగా పని చేయించుకునే వాళ్ళం.

ఇక లైబ్రరీ లో ఉన్న రిసెర్చ్ పేపర్ల కీ, పుస్తకాలలో పేజీలకీ యదాతధంగా కాపీలు కావాలంటే అప్పటికి ఇంకా క్సీరాక్స్ మెషీన్స్ యుగం రాలేదు కాబట్టి నోట్ బుక్ లో దస్తాల కొద్దీ రాసేసుకోడం ఒక మార్గం. కానీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో  కాపీయింగ్ సెక్షన్ అని ఒక ప్రత్యేక విభాగం ఉండేది. అక్కడ ఉన్న ఒకే ఒక్క యంత్రంలో రెండు పెద్ద రోలర్లు, వాటిల్లో కార్బన్ పౌడర్ వేసి పోలో మని తిప్పి మధ్యలో పేపర్ పెట్టడం ఒక పద్దతి అయితే డార్క్ రూమ్ లో కెమేరాతో ఏకంగా ఫోటో తియ్యడం మరొక పద్ధతి. ఈ ఫోటో కాపీలలో తమాషా ఏమిటంటే ..ఒరిజినల్ సైజు ఏదయినా సరే, కాపే మటుకు ఒకే సైజువి వచ్చేవి. నేను అమెరికా వచ్చే ముందు..అంటే అక్కడ చేరిన ఎనిమిదేళ్ళకి నా డిగ్రీలకీ, మార్క్ షీట్లకీ తీయించుకున్న ఒకే సైజు కాపీలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఆ సైజు 4 x 6 అంగుళాలు.

ఈ కాపీయింగ్ సెక్షన్ కి గోవిందరాజన్ అనే తమిళ తెలుగు ప్రొఫెసర్ గారు ఇన్ ఛార్జ్ అయితే ఆ కాపీలు, ఫోటోలు తీసేది కాశీపతి గారు అనే బందరు ఆయన. ఆ గోవింద రాజన్ గారే మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ హాస్టల్ కి వార్డెన్ కూడాను. అంచేత వాళ్ళిద్దరి తోటీ హాయిగా తెలుగులో మాట్లాడుకునే వాళ్ళం. ఎటొచ్చీ కాశీపతి గారితో అంతా వన్ వే ట్రాఫిక్కే. ఆయన  అత్యంత మిత భాషి. ఏదైనా కాపీ కావాలంటే ఆయనకి ఒరిజినల్ తో సహా ఆ విద్యార్థి పని చేస్తున్న ప్రొఫెసర్ గారి అనుమతి పత్రం కూడా కాశీపతి గారికి ఇవ్వాలి. ఇచ్చి “కాపీకి ఎప్పుడు రమ్మంటారు సార్” అని ఏ భాషలో అడిగినా ఆయన ఒక  నవ్వు నవ్వేవాడు. అంతే…ఎన్ని సార్లు ఎవరు అడిగినా అదే సమాధానం. ఏం చెయ్యాలో తెలీక చచ్చి పోయేవాళ్ళం.

ఆయన దగ్గర మరో గొప్ప విషయం ఏమిటంటే ఆయనే ఎనిమిదేళ్ళు నా డ్రామాలలో అందరు నటులకీ అస్సలు ఒక్క మాట మాట్లాడకుండా, ఆ పాత్ర ఎలా ఉండాలో చెప్తే విని, నవ్వేసి అధ్బుతంగా మేకప్ చేసే వారు. నా డాక్టరేట్ కి అర్థ రాత్రి మాత్రమే తీయగలిగే టెక్నికల్ ఫోటోలు ఆయనే నేల మీద పడుకునీ, నిచ్చెనల మీద నుంచినీ తీసి ఎంతో సహాయం చేశారు…నవ్వుతూనే…నేను అమెరికా వచ్చాక గత 45 ఏళ్లలో ఆయన్ని కానీ, గోవింద రాజన్ గారిని కానీ మళ్ళీ చూసే అవకాశం రాలేదు. అది నా దురదృష్టం.  ఆయన రిటరై అయి మచిలీ పట్నం వెళ్లి పోయారు అని విన్నాను. ఎనిమిదేళ్ళలో ఆయన గొంతు ఎనిమిది సార్లు కూడా విన లేదు కానీ వందలాది గంటల పని చేసి పెట్టారు ఆ మహానుభావుడు.  అందుకే ఐ ఐ టి లో నా ఆఖరి నాటకానికి..1974 లో… నా సర్వర్ సుందరం పాత్రకి మేకప్ చేస్తున్న కాశీపతి గారి ఫోటో ఇక్కడ జతపరిచాను.

ఇక రెండో రోజు మా క్లాసులు ఒక చిన్న తమాషాతో ప్రారంభం అయ్యాయి. మా ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఐదారుగు  కంటే ఎక్కువ లేరు అని ముందే తెలిసినా వందేసి విద్యార్థుల మధ్య చదువుకుని వచ్చిన నాకు గోడ మీద నల్ల బోర్డు, పట్టుమని ఐదు బెంచీలు కూడా లేని ఆ చిన్న  క్లాస్ రూమ్ లో కూచోడం ఇరుగ్గా, ఇబ్బందిగానే ఉంది. అప్పటికే స్నేహితులం అయిపోయాం కాబట్టి, మా ఇద్దరిదీ అదే బ్రాంచ్ కాబట్టి నేనూ మూర్తీ మాట్లాడుకుంటూ ఉంటే మరొక ముగ్గురు లోపలికి వచ్చారు. ఒకతను త్రివేండ్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ ట. పై డిగ్రీ కోసం టీచర్స్ ట్రైనింగ్ స్కీమ్ అనే దాంట్లో ఎంపిక అయి ఇక్కడ చేరాడు. వయసులో కాస్త పెద్ద వాడే అయిన అతని పేరు శ్రీనివాసన్ పోటి అనే మలయాళీ. మరొకతను భట్ అని హుబ్లీ నుంచి వచ్చిన కన్నడం కుర్రాడు. ఇతనికి కాస్త నత్తి ఉంది. మేం ఒకళ్ళకి ఒకళ్ళం పరిచయాలు చేసుకుంటూ ఉండగా మరొకతను టై కట్టుకుని ఠీవిగా లోపలికికి వచ్చి “హలో. మై నేమ్ ఈజ్ సచ్ దేవ్. నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యు” అని దర్జాగా మాట్లాడడం మొదలు పెడితే ఆయనే ఆ రోజు మా లెక్చరర్ అనుకున్నాం. ఈ లోగా ఒక భారీ పెద్దాయన లోపలకి రాగానే ఆయనే మా ప్రొఫెసర్ అని గుర్తుపట్టేసి నమస్కారం పెట్టాం. ఎందుకంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఆయనే. ఈ సచ్ దేవ్ కూడా ఆయనకీ నమస్కారం పెట్టి నా పక్కన చతికిల పడగానే ఇతను కూడా మాలాగే స్టూడెంట్ అని తెలిసిపోయి అందరం ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే మా ప్రొఫెసర్ గారు విషయం కనుక్కుని పెడీ పెడీ నవ్వేశారు.

మా గురువు గారిది ట్రేడ్ మార్క్ నవ్వు. రెండు మైళ్ళ దాకా అంచెలంచెలుగా వినపడుతుంది. అడ్డం సైజులో నాకు రెట్టింపు. నిలువులో మా అందరి కంటే ఐదారు అంగుళాలు ఎక్కువే. అస్సాంలో చిట్టగాంగ్ నుంచి వచ్చిన అసలు సిసలు బెంగాలీ బాబు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మేడిసన్ లో డాక్టరేట్ చేసి ఇక్కడ ఈ డిపార్ట్ మెంట్ మొదలుపెట్టారు నాలుగేళ్ల క్రితం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన రబీంద్ర సంగీత్ అద్భుతంగా పాడే రేడియో  ఆర్టిస్ట్. అన్ని చోట్లా కచేరీలు చేసీ వారు. ఇంకా ఆసక్తి కరం ఏమిటంటే మేడిసన్, విస్కాన్సిన్ లో చదువుకునేటప్పుడు అక్కడ ఎవరో రావు గారు అనే తెలుగాయన దగ్గర ఎంకి పాటలు నేర్చుకుని బెంగాలీ యాసతో చాలా బాగా పాడే వారు. అందులో ఒక పాట.

“పాడ లేనే ఎంకీ, నా ఎంకీ పాడ లేనే యెంకీ..చిటి చిటి చిటి దానా, పొటి, పొటి పొటి దానా, పట్టితినే నిను యెంకే.. .నే పాడ లేనే యెంకే..,ఓ,ఓ,ఓ..యెంకే.”…ఇలా సాగేది యెంకీ బదులు యెంకే అనుకుంటూ ఒక పాట. నాకు ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను ఆ పాట పాడుకుంటూ ఉంటాను. నవ్వుకుంటూ ఉంటాను. ఆ రావు గారు అబ్బూరి వరద రాజేశ్వర రావు గారేమో అని నా అనుమానం కానీ అది నివృత్తి చేసుకునే అవకాశం రాలేదు.

మా ప్రొఫెసర్ గారి అసలు పేరు సుబీర్ కార్. కానీ నేనూ, మూర్తీ ఆయనకి పెట్టుకున్న పేరు “గండర గండడు”..ఈ పేరే మా తర్వాత వచ్చిన తెలుగు వారందరి దగ్గరా శాశ్వతంగా నిలిచి పోయింది. మనిషి ఎంతో గంభీరమైన వాడే కానీ చాలా మంచి వాడు. మమ్మల్ని బాధించకుండా సహాయకారిగా ఉండేవాడు. తన భారీ శరీరాన్ని విపరీతంగా కష్ట పెట్టే వాడు కాదు. మమ్మల్నీ అంత కష్ట పెట్టేవాడు కాదు. ఆయన తో నేను విద్యార్థిగా, సహ అధ్యాపకుడిగా మొత్తం ఎనిమిదేళ్ళు పని చేశాను. ఆయనే నా డాక్టరేట్ సలహాదారు. ఆయన సతీమణి నీనా గారు కూడా సాత్వికురాలు.  మమ్మల్ని బాగా చూసుకునే వారు. అందుకు బహుశా వారికి పిల్లలు లేక పోవడం ఒక కారణం కావచ్చును. ఆఫ్ కోర్స్. మేం అందరం రాత్రి పది గంటలకి కూడా లేబొరేటరీలో కష్టపడి పని చేస్తూ ఉంటే ఆయనా, ఆవిడా  కిళ్ళీలు వేసుకుని వాళ్ళ కుక్క తో సహా షికారుకి వచ్చి మమ్మల్ని పలకరించి కబుర్లు చెప్పినప్పుడల్లా “ఇక్కడ మన ఒళ్ళు హూనం అవుతుంటే గండడు పెళ్ళాంతోకిళ్ళీ వేసుకుని పరామర్శ కొచ్చాడు గురూ” అని చచ్చేటట్టు తిట్టుకునే వాళ్ళం అనుకోండి..అది వేరే సంగతి. మా గురువు గారూ, ఆయన సతీమణి ఫోటోలు రెండు ఇక్కడ జతపరిచాను.

మరో సరదా సంగతి. ఐ ఐ టి మొత్తం మీద ఐదారుమందికి మాత్రమే కార్లు ఉండేవి. వారిలో మా గురువు గారికి లాండ్ మాస్టర్ కారు ఉందోచ్ అని ఎంత గర్వ పడేవాళ్ళమో, అది కొండలు ఎక్కలేనప్పుడు అంత భారీ గండడు గారు అందులో కూచుని మా చేత ఆ కారు తోయించుకున్నప్పుడు అంత తిట్టుకునే వాళ్ళం. కావాలంటే ఇక్కడి ఫోటో చూడండి… ఇరవై ఏళ్ల తరవాత అమెరికా నుంచి ఒక సారి గురువు గారిని చూడ్డానికి బొంబాయి వెళ్ళినప్పుడు మా మైన్ బిల్డింగ్ ముందు ఆ కారు తోస్తున్నట్టు సరదాగా తీయించుకున్న ఫోటో…

ప్రొఫెసర్ ఎమిరిటస్ గా సుబీర్ కార్ గారు రిటైర్ అయి ఈ మే నెల 26, 2001 నాడు మరణించారు.

ఇక నా  జీవితాన్ని మార్చిన “ఆ నలుగురి” గురించీ వచ్చే నెల సంచికలో….

*

 

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Leave a Reply to వంగూరి చిట్టెన్ రాజు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు