పదాలకు చిత్రలిపి పసుపులేటి గీత కవిత

గీత కవిత్వశైలిలో జంటపదాలు ఎక్కువ. పదాలు వెంటవెంటనే అలా పడడంతో  ఆమె చెప్పదలచుకున్న విషయానికి ఒక ఫోర్స్ వస్తుంది.

 

సుపులేటి గీత ప్రసిద్ధ కవయిత్రి.చిత్రకారిణి. ఉత్తమజర్నలిస్ట్. ఆంధ్రజ్యోతిలో చాలాకాలం సబ్ఎడిటర్ గా పనిచేసింది. హైదరాబాద్ లో ప్రస్తుతం “మనం” పత్రికలో ‘ముద్ర’ పేజీ  చూస్తోంది తనదైన ముద్రతో. స్త్రీవాద సాహిత్యంలో పుట్టిన, నిగ్గుదేలిన కవయిత్రి గీత.  కవిత్వంలో గీతస్వరం ఉద్వేగభరితమైంది. ఆవేశంతో, ఆవేదనతో, ఆలోచనతో, అంతర్గత మథనంతో, ఆదర్శంతో  పెనవేసుకున్నగళం ఆమెది.

స్త్రీల అంతరంగ సంక్షుభిత విలయనృత్యాల వేదికలు ఆమె కవితాఖండికలు.

ఆదివాసీల మూలికాపరిజ్ఞానంపై జరుగుతున్న జన్యుదోపిడీని నిరసిస్తూ-

చుట్టమై వచ్చి

చట్టమై చుట్టుకునే చిలువ వాడు

నీ కన్నీటి చెలమలో చేరి

నీ జన్యుప్రాణాల్నే పీల్చే జలగ వాడు

జాగ్రత్త సుమా

-అంటూ ‘కాటు’ కవితలో హెచ్చరిస్తుంది.

చిన్నచిన్న పదాలు కూడా ఆటంబాంబు సృష్టించేంత అలజడి పుట్టించగలవు. చిన్నచిన్న ప్రశ్నలుకూడా విశ్వమంత చర్చించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పేవిగావుంటాయి. గాఢత, సాంద్రత,నిమగ్నత సామాజికబాధ్యతవున్న కవయిత్రి.  గీత కవిత్వం ఆలోచనలను రేకెత్తించేదిగా ఉంటుంది. ఆమె కవితను చూడగానే ఆమెతో సంభాషించినట్లుగా ఉంటుంది. ఆ దగ్గరితనం సామీప్యం, ఆమెలీనమై రాసే, ఉద్వేగభరితమైన శైలి వల్ల వచ్చింది. ఎంతో ఫీలైతేతప్ప, కదిలిపోతే తప్ప ఆమె రాసిన సందర్భాలు తక్కువ. ఒక విధంగాలేవనే చెప్పొచ్చు.

అందుకే , అప్పటికప్పుడు ఆమెను కలచివేసిన వార్తో, విషయమో, దృశ్యమో అల్లకల్లోలం చేసినప్పుడు అవి కవితాక్షరరూపాన్ని ధరించేదాకా శాంతించదు. ‘చమన్’ కవితా సంపుటిని ప్రచురించింది. అనుసృజనలు చేయడంలో తన ప్రతిభ స్పష్టంగా కనబడుతుంది. కథలు కూడా కొన్ని రాసింది. వ్యాసాలపరంపర ఇక సరేసరి. నిరాశానిస్పృహలు ఎక్కడా గీత కవిత్వంలో కన్పించవు. ఒక పదును, వాడి, వేడి, ధిక్కారస్వరం, ఒక తేజస్సు, కాంతి, ఆవేశం, ఒక ఆదర్శం, ఆలోచన, ఆచరణ, ఒక నిర్ణయప్రకటన – దానికై చేయాల్సిన పోరాటం – ఇవీ గీత కవితా ఛాయలు. ‘ తస్లీమా’ మీద అభిమానంతో ఆమె కవితల్ని అనువదించింది.

గీత కవిత్వంలో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. చక్కటి వ్యంగ్యోక్తికి  ఉదాహరణ ‘మోకాటి స్నేహం’ కవిత. గీత కవిత్వశైలిలో జంటపదాలు ఎక్కువ. పదాలు వెంటవెంటనే అలా పడడంతో  ఆమె చెప్పదలచుకున్న విషయానికి ఒక ఫోర్స్  వస్తుంది. స్వంత తండ్రే కూతురిపై  రాక్షసరతిని జరిపితే, సున్నితహృదయిని ఐన  ఈ కవయిత్రి భరించలేక పోయింది. జుగుప్సతో,ఏహ్యతతో ఆ పసిరూపాన్ని తలుచుకుంటూ రాసిన కవిత ‘నేనేనే…….’ పదాలకొక కొత్త అర్ధాన్నివ్వడం, పదాలతో ఆడుకోవడం గీతకు సరదా.

‘మా పెరట్లో మందారం’ పేరుతో వాణీరంగారావు, ‘నేనుఋతువునైనవేళ’ పేరుతో కె.గీత,  రజస్వలఅయిన స్థితిపై గతంలో కవితల్ని రాశారు. 94లోనే గీతకూడా ‘ముడుచుకున్న పువ్వు’ అనే కవితరాసింది. వాణీరంగారావు మార్మికతతో రాస్తే, కె.గీత ఆవేశ ప్రకటనగా రాస్తే, గీత ఆలోచనాత్మకంగా  వాస్తవానికి సన్నిహితంగా రాసింది.

చాలా తీవ్రమైన నిరసన స్వరంతో, ధిక్కారస్వరంతో, ఇన్నాళ్ళ స్త్రీల హింస ఇంకెన్నాళ్ళు అంటూ, ‘లోపలికి పో…పో… అనే మాటల్ని ఆడవాళ్ళు ఇంకెంతకాలం వినాలని కోపం వచ్చి రాసిన కవిత ‘లోపలికి పోను.’ మౌనంగా, మృదువుగా కన్పించే గీత కలంచేత ధరించగానే, వాక్పవాహంలా చాలా వేగంగా మాటల జలపాతాల్ని సృష్టిస్తుంది. చిత్రకారిణి ఐన ఈమె చిత్రాలు సైతం కవిత్వమై కన్పిస్తాయి.

ఇటీవల పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టింది. కవిత్వంలో ఏ గీతలకు ఒదగని గీత, గీతలతో భావగాఢతతో కూడిన చిత్రవిచిత్రమైన బొమ్మలు వేస్తోంది. జంతువుల బ్యాక్ గ్రౌండ్ ని ఎక్కువగా ఇష్టపడుతోంది. మంచి స్నేహశీలి. మృదుభాషిణి. కోపం వస్తే మాత్రం ప్రళయ కావేరి.

*

పసుపులేటి గీత కవిత

 

 

శిలాలోలిత

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Geetha gaari antharangaanni bayata pettadam bagundi.

    Shilaa lalitha mam Chinnaga raasinaa lothuga undi visleshana.

    Congratulations to both of you.

    Nasreen Khan

  • చాలా బాగా రాశారమ్మా…
    గీత గారు జర్నలిస్ట్..కవయిత్రి గా తెలుసు..చిత్రకారిణి అని మీద్వారా తెలుసుకున్నాను..
    మోకాటి స్నేహం తర్వాత తన రచనల కోసం వెతుకులాట మొదలైంది…
    అభినందనలు ఇద్దరికీనూ….

  • గీతగారి కవిత్వ విశ్లేషణతో పాటుగా సాగిన అవిడ పరిచయం బాగుంది. Book fair లో ఆవిడను మీరే పరిచయం చేశారు.
    తర్వాత పేపర్లో వచ్చిన ఆవిడ కవితల్ని కొన్నింటిని చదివాను.
    మీకు గీతగారికి అభినందనలు

  • పసుపులేటి గీత గారు కవితారచనలో ప్రతిభావంతురాలు అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అరుదుగా రాసినా నాణ్యత వుంటుంది ఆమె కవిత్వంలో. ప్రోజ్ పొయెమ్స్ రాయడంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారామె. ఆమెలోని ఈ కోణం గురించి కూడా తప్పక పేర్కొనాలి. కవులలోని, రచయితలలోని శిల్పనైపుణ్యం గురించి జరగాల్సినంత చర్చ జరగటం లేదన్నది నా అభిప్రాయం. చక్కని పరిచయం చేసిన శిలాలోలిత గారికి ధన్యవాదాలు.

  • శిలాలోలితగారు! పసుపులేటి గీత గురించి ఆమె కవితల గురించి చాలా మంచి పరిచయం చేశారు. గీత జంట పదాల . ఆ జంట పదాల ప్రయోగంతో ఆ పదాల బలం, ద్విగుణీకృతం అవుతుంది.ఆమె రాసిన కవితలు ఆ కవితల సృష్టి జరగాలంటే మనసును తాకాలి, కదిలించాలి, ఉద్వేగభరితం కావాలి. అప్పుడే లావా పొంగుతుంది! కాటు కవిత మనసును గుచ్చింది. చుట్టమై వచ్చి చట్టమై కూర్చొంది.
    Multi talented గీతగారికి ధన్యవాదాలు.మీరు పరిచయం చేసినందుకు మీకూ ధన్యవాదాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు