నోస్టాల్జియా క్లబ్ కాదు!

ఇక్కడ పుస్తకాలు ఎంత బాగా చదివి వస్తారంటే, వారి విశ్లేషణ వింటే, నేను పుస్తకం చదవని లోటు కనబడదు.

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ మొదలై ఇరవై ఏళ్లయింది. ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ ఆగకుండా ప్రతినెలా  ఒక పుస్తకాన్ని సమీక్షించడం, అందునా అమెరికా లో ఈ పని చెయ్యడం విశిష్టంగా చెప్పుకోవచ్చు. నేను గత ఇరవై ఒక్క ఏళ్లుగా డిట్రాయిట్ వాస్తవ్యుడినయినా, ఉద్యోగరీత్యా అరుదుగా ఈ సమావేశాలకు వెళుతూ ఉంటాను. అయినప్పటికీ, నేను మొదటి సమావేశంలో ఉన్నాను; మా ఊరి క్లబ్; అనేక మిత్రులున్న క్లబ్, అందుకని ఈ క్లబ్ నా సొంతంగా భావిస్తాను. నా జ్ఞాపకాల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి, ఎవరి పేరూ ప్రస్తావించకుండా, నా అనుభవాలకంటే, అనుభూతులని మీతో కాసేపు ముచ్చటిస్తాను.

నేను ఈ దేశానికి వస్తూ పది పుస్తకాలు నా మిత్రుడు హనుమంతరావు దగ్గర “అరువు” తీసుకొని వచ్చాను. నేను వెంటనే గమనించింది ఏమిటంటే పుస్తకాలయితే పట్టుకొచ్చుకోవచ్చు గానీ, వాటిని గురించి మాట్లాడటానికి మనుషుల్ని పట్టుకొచ్చుకోలేం. అప్పుడప్పుడూ నా జర్మన్ మిత్రులతో నేను రిల్కే తెలుగులో చదివాను అని కాస్త పంచుకోవడానికి ప్రయత్నించాను కానీ,  వివరంగా తెలుగు గురించి మాట్లాడుకోవడానికి పుస్తకాల మిత్రులు దొరకడం కష్టమైంది. ఏ పార్టీలో ఎవరైనా దొరికినా, పచ్చడికీ, పప్పుచారు కీ మధ్యలో “ఫలాని రచయిత పుస్తకాలు మీకు కూడా నచ్చుతాయా” అనే అంతవరకూ, లేదా మిగతా వాళ్లకి బోరు కొడుతుందా అని భయపడుతూ కాసింత కవిత్వం నెమరుకి తెచ్చుకోవడం వరకూ మాత్రమే ఈ సంభాషణలు పరిమితమయ్యాయి.

ఈ దేశంలో అనేక ముఖాలతో బ్రతుకుతుంటాం. పాఠాలు చెప్పుకుంటూ ఒక ప్రొఫెసర్ లాగ, వారాంతాల్లో క్లబ్బులో టెన్నిస్ ఆటగాడి లాగా, ఆఫీస్ లో పది మందికీ పని చెబుతూ ఒక లీడర్ లాగ, పిల్లల్ని ఐస్ స్కేటింగ్ కి తీసుకువెళ్లే తల్లి లాగ, గార్డెన్లో మొక్కలు పెంచుకుంటూ ఉండే ఒక తోటమాలి లాగ, ధైర్యంచేసి ప్రయోగాత్మక ఓపెరా చూసే ప్రేక్షకురాలి లాగ, పిల్లలు ఎదిగి పోయిన తర్వాత అప్పుడు ఆన్ లైన్ లో ఫిలాసఫీ నేర్చుకునే ఇల్లాలి లాగ, ఎన్నెన్ని ముఖాలు?

ఇన్ని ముఖాలూ మనకి సంతృప్తి నిచ్చినా, అప్పుడప్పుడూ ఏదో తొలుస్తోంది, బుర్రలో చేరిన పురుగులా. పోనీ, మరీ అంత బాధ వెయ్యక పోయినా, అప్పుడప్పుడూ కొంచెం వెలితిగా అనిపిస్తుంది. కొన్ని పదాలు (పద్మ పత్ర మివంభసా ) మన నోటి మీద ఆడి అందీ అందకుండా, చిక్కీ చిక్కకుండా పోతాయి మన బాల్యం లాగ. చిన్నపుడు మనకి తోడున్న కొన్ని పాత్రలు (హలో కమలా — శేష ప్రశ్న నుంచి), ఇప్పుడు పరాయి అయి పోయి ఉంటాయి. కొన్ని కొన్ని మనో చిత్రాలు ఊహకి అంచుల దగ్గర  తారాడతాయి (బాతురెక్కల నీడ, రాబందుల రెక్కల రావం). కొన్ని కొన్ని కథలు మన వెంటే, అప్పుడప్పుడూ హఠాత్తుగా గుర్తుకు వస్తాయి. మనల్ని మనలాగా మలిచిన ఆ పుస్తకాల గురించి ఆలోచనలు ఇలా మొదలవుతాయి.

మరి ఏ ముఖంతో వీటి గురించి తలుచుకుంటాం? ఎలాగ నిర్లజ్జగా మన మనసులో మాట, మన చిన్నప్పటి బాధ, మనం చదువుకున్నప్పటి అనుభవం, మనం ఎదిగిన తీరు, ఎవరితో చెప్పుకోగలం? ఒక్కొక్క ప్రపంచం , ఒక్కొక్క విషయం –పిల్లల చదువులూ, రీసెర్చ్ గ్రాంట్ లూ, వడ్డీ శాతాలు, యుద్ధాలూ, గుడీ గోపురాలు, పాత తెలుగు సినిమాలు — చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి  మనకి నచ్చిన, మనకి నచ్చబోయే తెలుగు పుస్తకాల చుట్టూ తిరిగే ప్రపంచమేమన్నా ఉందా? మన భాష, మన గొడవ అర్థమయే చోటు ఎక్కడ?

నాకు డిట్రాయిట్ పుస్తకాల క్లబ్ అటువంటి ప్రపంచం. నెలకి ఒక ఆదివారం మధ్యాహ్నం మిగతా అన్ని విషయాలూ మర్చి పోయి, తెలుగు లో తెలుగుతో గడపవచ్చు. ప్రతి సంవత్సరం ముందే ఏ పుస్తకాలు చదువబోతున్నారో చెబుతారు. సంభాషణ లో ముందు చెప్పటానికి ప్రతి సారీ ఒక నిర్దేశించబడ్డ పాఠకుడు ఉంటాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు చెబుతారు. అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళూ తెలుగు పుస్తకాలు చదివిన వాళ్ళు. తెలుగు పుస్తకాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు. తెలుగు పుస్తకాల గురించి మాట్లాడటమన్నా ఆసక్తి ఉన్నవాళ్ళు. మరీ ముఖ్యంగా, తెలుగు పుస్తకాల గురించి వినడం ఇష్టమైన వాళ్ళు. ఇంతమందిలో మనం మిస్సవుతున్న మనల్ని వెతుక్కోగలం. మనం సూట్ కేసు అడుగున పడివేసిన ముఖం, బయటకి తీసి, ఆ మధ్యాహ్నం వేసుకోగలం.

అయితే ఇంత మాత్రమే అయితే, ఇది ఒక నోస్టాల్జియా క్లబ్ మాత్రమే అవుతుంది. కానీ, ఈ క్లబ్ అది కాదు.

అప్పుడప్పుడూ మాతృదేశానికి వెళ్ళినపుడు మాకు ఆనందం లాంటి బాధ కలుగుతుంది. చిన్నప్పటినుంచీ తెలిసిన నేల, మనుషులు, భాష అన్నీ కనిపించి ఆనందం కలుగుతుంది. కానీ, మేము లేకుండానే ఈ ప్రపంచం ముందుకు వెళ్లిపోయిందని కించిత్తు బాధ కలుగుతుంది. అంటే, మనం వచ్చే వరకు కాలం ఆగిపోయి, అప్పటి ప్రపంచాన్ని డీప్ ఫ్రీజ్ లో ఉండి, మనకోసం ఎదురు చూస్తుందనుకొని వెళితే, మరొకరితో ప్రేమలో పడి పెళ్లయిన ప్రియురాలు ఇద్దరు పిల్లలతో కళకళలాడుతూ, బట్ట తలతో, చిరుబొజ్జ తో  ఉన్న మనల్ని పలకరించినట్లు ఉంటుంది.

1999: చేరాకి వీడ్కోలు

మా పుస్తకాల క్లబ్ పుణ్యమా అంటూ, ఈ బాధ తప్పించుకున్నాం. చిన్నప్పటి పుస్తకాలే కాక, సమకాలీన సాహిత్యమూ పది మందితో కలిసి చదివి చర్చించుకోవడం ద్వారా, కొత్త పుస్తకాలే కాదు, ఆ పుస్తకాలు పుట్టించిన కొత్త సమాజం కూడా తెలిసి వచ్చింది. మాతృ దేశంలో ఉన్నవాళ్ళకి తెలియని, తెలియటానికి ఆస్కారం లేని కోణాలు దూరం నుండి చదివే మాకు కనబడతాయి. అలాగే, ఈ కథలు, నవలలు, కవితలు సృష్టించిన లోకంలో ఉన్న వాళ్లకు కనబడే విషయాలు దూరం నుండి చూసే మాకు సరిగా అవగాహన కావు.  ఇది పరిపూర్ణ చిత్రం కాకపోయినా, అన్ని పార్శ్వాలు స్పృశించక పోయినా, దూరం నుండి చూడబట్టి ఒక విన్నూతం దృక్పథం కలుగుతుంది.

ఉదాహరణకి, ఇక్కడ, ఈ దేశంలో, ఇక్కడ పుస్తకాలు చదవడం మూలాన మాకు శైలి పట్ల, తెలుగు దేశాలకంటే ఎక్కువ స్పృహ ఉంటుంది. ఈ దేశంలో సరళత్వానికి, క్లుప్తతకీ ఇచ్చే ప్రాధాన్యం మా పుస్తక పఠనంలో కనబడుతుంది. అలాగే తెలుగు దేశంలో ఉన్న అస్తిత్వ రూపాలు ఇక్కడ ఉన్న మాకు బాగా అర్థం కావు. ఇక మార్క్సిజం ప్రధానాంశం గా తెలుగులో అనేక రచనలు కనబడతాయి. ఈ దేశంలో ప్రగతిశీల వాదాలు అనేక రూపాల్లో, కొన్ని మార్క్సిజంకు వ్యతిరేకంగా, అతీతంగా కూడా, కనబడతాయి. భావ బాహుళ్యం, వాస్తు వైవిధ్యం ఉండే ఈ దేశపు రచనలు చదివి అదే దృష్టితో తెలుగు రచనలు కూడా చూస్తాము.

ముఖ్యంగా కనబడేదేమిటంటే, ఇక్కడ మేము చేసే వృత్తి ప్రభావం మామీద ఎక్కువగా ఉంటుంది. నేను సాహిత్యావలోకనం గణిత ప్రాంగణం నుంచి చేస్తుంటాను. మరొకరు సైన్స్ సిద్ధాంతాలతో సాహిత్యం చదువుతుంటారు. తెలుగు దేశాల్లో, వృత్తికీ, అభిరుచికి మధ్యన దూరం ఎక్కువ. దీని మూలంగా కూడానూ, ఇక్కడ సాహిత్య చర్చలు తేడా గా ఉంటాయి. అయితే, ఇక్కడ సాహిత్యాభిరుచి ఉన్నవారు ఎక్కువైనా, దానికోసం కృషి చేసేవారు తక్కువ. ఇండియాలో రచయితలే సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఇక్కడకన్నా ఎక్కువ. అందుచేత, ఇండియాలో (ఉదాహరణకి బెంగుళూరులో) జరిగే చర్చలంత లోతైన అవగాహన ఇక్కడ కనబడదు.

ఇంతవరకూ చదివితే మీకు మా క్లబ్ కేవలం మా ఆత్మానందం కోసమే అనుకోగలరు. కానీ, మా క్లబ్ మూలాన, నేను తెలుగు సాహితీ ప్రపంచానికి మూడు ఉపయోగాలు గమనించాను. మొదటిది, మేము ఎంచుకున్న పుస్తకాల మీద తెలుగు దేశాల్లో చర్చ జరగడం నేనెరుగుదును. ఇన్నేళ్ళుగా జరుగుతున్న ఈ చర్చ, ఖండాంతరాలలో సంభాషణ సృష్టించింది.

రెండవది, ఏది ఏమనుకున్నా, డాలర్ బలం మూలాన, డిట్రాయిట్ క్లబ్ ఎంచుకున్న పుస్తకాల యొక్క ప్రచురణ కర్తలకు బాగానే ఆర్థిక లాభం వస్తుంది. ఇక్కడ డిట్రాయిట్ క్లబ్ తో ఈ దేశంలో మరి కొంతమంది కూడా కలిసి అందరూ మూకుమ్మడి గా డాలర్ ఖరీదు పెట్టి కొనడం కొన్ని పుస్తకాల మనుగడ కి సాధ్యం అయింది.

మూడవది, పూనుకొని డిట్రాయిట్ క్లబ్ వారు కొన్ని పుస్తకాలు వేయించారు. ఉదాహరణకి చేకూరి రామారావు రచనలు ముద్రణ వేయడానికి ఆర్ధిక సహాయం చేశారు. ఇంకా డిట్రాయిట్ క్లబ్ వారి పుణ్యమా అంటూ కొన్ని పుస్తకాలు పునర్ముద్రణ కూడా నోచుకొన్నాయి.

చివరిగా, రెండు పిట్టకథలు చెప్పి ముగిస్తాను. మొదటిది స్వానుభవం. అనేక సార్లు నేను పుస్తకం చదవకుండా మీటింగ్ కి వెళ్లాను. అయినా సంభాషణలో సరసంగా పాల్గొనగలిగాను. అది ఈ క్లబ్ లోని పాఠకులకి నేనివ్వగలిగే కితాబు! ఇక్కడ పుస్తకాలు ఎంత బాగా చదివి వస్తారంటే, వారి విశ్లేషణ వింటే, నేను పుస్తకం చదవని లోటు కనబడదు. పది మంది తమ అభిప్రాయం చెబితే, వాటి నుంచి పుస్తకం సాకృతంగా నిర్మించుకోవచ్చు! అనేకసార్లు అదే చేసేవాడిని. మరి రచయిత కాదు, చదువరులే కదా పుస్తకం రాసేది?

చివరిగా, నేను 1990ల లో ఈ ముచ్చట చదివాను.  సైమన్ వించెస్టెర్ అనే రచయిత ఒకసారి పశ్చిమ చైనాలో ఎడారి ప్రాంతం మధ్యగా రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైలు ఇసుకతిన్నెల మధ్య ఒక చిన్న ఊరులో నీళ్లకోసం ఒక అరగంట ఆగుతుంది. అప్పుడు, ప్లాట్ ఫారం కి దిగిన సైమన్ భుజంమీద తట్టి ఒక యువతి, “మీకు ఇంగ్లిష్ వచ్చునా” అని అడుగుతుంది. వచ్చు అని అనగానే, “మీరు ఆంథోనీ ట్రాలప్ చదివారా” అని అడుగుతుంది. చదివానని సైమన్ అనగానే, “ఈ రైలు ఇక్కడ ఇంకొక 27 నిమిషాలు ఆగుతుంది. మీకు అభ్యంతరం కాకపొతే మనం, ది యూస్టేస్ డైమండ్స్ లో లేడీ గ్లేన్కారా పాత్ర చిత్రణ మీద అంతవరకూ చర్చించుకోవచ్చా?” అని అడుగుతుంది. ఆ మారుమూల చైనా ఎడారి ప్రాంతంలో ఇంగ్లీష్ వచ్చిన వారు ఉండరు. ఆ రచయితను చదివిన వారు ఇంకా అరుదు. ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోవాలని ఆవిడ మనసు ఎంత ఆవురావురంటుందో? రోజుకొక్క సారి వచ్చే రైల్లో తనకి నచ్చిన రచయిత చదివిన వారెవరైనా ఉంటారని, ఎంత మందిని అడిగి ఉంటుందో ఆవిడ? అంత పరాయి మనుషుల ముందు మనసు విప్పి చూపడానికి ఎంత ధైర్యం చేసిందో ఆవిడ? ఆ ఎడారిలో ఆవిడ ఈ అభిరుచిని ఎపుడూ చిగుర్లు వేసేలా ఎలా చూసుకుంటుందో?

అదృష్ట వశాత్తూ, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుణ్యమా అంటూ, మా ఊరి పుస్తక ప్రియులు ఆవిడ లాగ ట్రైన్ స్టేషన్ దగ్గర  పడిగాపులు కాయక్కర లేదు. కొత్తవారి ముందు సందేహించక్కర లేదు. ప్రజాస్వామిక పద్ధతిలో ప్రతి ఒక్కరి గొంతు వినిపిస్తూ, అందరినీ కలుపు కొంటూ, దేశం కాని ఈ దేశంలో, ఇన్నేళ్లు ఉన్న ఈ క్లబ్ కి ఇరవై పుట్టిన రోజు శుభాకాంక్షలు.

*

రామారావు కన్నెగంటి

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ రెండు దశాబ్దాల డిటిఎల్‌సి కి శుభాకాంక్షలు.

    మీ డిటిఎల్‌సియే నాకు ప్రధానమైన ప్రేరణ, వేదిక ని రూపొందించడానికి.

    ఇదివరలో చాలా సార్లు చెప్పాను. నాస్టాల్జియా నుంచి విడిపోయి తమదంటూ ఒక శైలి, తమకంటూ ఒక వస్తువు, మరీ ముఖ్యంగా తమకంటూ ఒక ‘స్వతంత్రత’ ఏర్పరుచుకున్నారు, తెలుగు రాష్త్రాల వెలుపలున్న తెలుగు రచయితలు. వారిదే ది సోకాల్డ్ ‘డయాస్పొర సాహిత్యం’ .
    From strength to strength it is growing up to be a beautiful tree.

    ఈమాట 1998 లో మొదలైనది అని సురేష్ కొలిచాల మొన్న హైద్రాబాదులో వేదిక సమావేశంలో చెప్పునట్టు గుర్తు. అంటే దాదాపు రెండు దశాబ్దాలు. DTLC తో పాటు, ఈమాట కూడ ఉంది, ఈ రెండు దశాబ్దాలు. చాలా సంతోషం.

    తెలంగాణా ప్రభుత్వం నుండి ఆహ్వనం అందుకుని అమెరికా నుండి బ్రహ్మానందం, చంద్ర, అఫ్సర్, కల్పన తో పాటు మరికొందరు రచయితలు కూడా మొన్న జరిగిన ‘ప్రపంచ’ తెలుగు మహా సభలకి హైద్రాబాదు కి వచ్చారు. వారే కాకుండా ఇతర దేశాల నుంచి కూడ సాహితీవేత్తలు వచ్చారు. స్థానిక రచయితలు సరే, సరి.

    బహుశ రామారావు అన్నట్టు, “మాతృ దేశంలో ఉన్నవాళ్ళకి తెలియని, తెలియటానికి ఆస్కారం లేని కోణాలు దూరం నుండి చదివే మాకు కనబడతాయి. అలాగే, ఈ కథలు, నవలలు, కవితలు సృష్టించిన లోకంలో ఉన్న వాళ్లకు కనబడే విషయాలు దూరం నుండి చూసే మాకు సరిగా అవగాహన కావు. ” నిజమే. అందుకనే నేను అనేది, తెలుగు కథ, తెలుగు నేలని విడిచి వెళ్లిపోయి, డయస్పోరా కథ అయ్యింది. తనకంటూ తన ఉనికిని చాటుకుంది. రానున్న తరం (బహుశ, నాలుగో తరం?) కి వచ్చేటప్పడికి, తెలుగు నేలల నుండి వెలువడే, అచ్చు పత్రికలలో ఇక ఈ డయాస్పోరా రచనలు చెదురు మదురుగానే కనపడవచ్చు. జాల పత్రికలు, కౌముది, ఈమాట, సారంగ, రస్తా, సంచిక లాంటివాటిల్లో భౌగోళిక సరిహద్దులని చెరిపేసే డయాస్పోరా సాహిత్యమే వచ్చే అవకాశం ఉంది. అలాగే DTLC లాంటి సమూహాలే ఎక్కడికక్కడ మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సాహిత్యం మీద ఈ ప్రపంచ పాఠకుల ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉంది. ఉండాలి కూడా!

    ఒక్క బెంగుళూరులోనే కాదు, అటు చెన్నైలోను, ముంబైలో కూడా ఇళ్లల్లో సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నారు. స్త్రీలు, మరీ ముఖ్యంగా గృహిణులు వీటిలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. మా అమ్మ చౌదరాణి ఉన్నంత కాలం, (’96 వరకు), దాదాపు ప్రతి నెలా తన నేతృత్వంలో సాహితీ సమావేశాలు జరిగేవి.

    ఇక హైద్రాబాదులో వేదిక మొదలుపెట్టి, దాదాపు 4 సంవత్సరాలయ్యిందనుకుంటాను. విదేశాలనుండి వచ్చిన సాహితీవేత్తలు కూడా వేదికని పలకరించారు. వేదికతో పాటు మరికొన్ని సాహితీ సమావేశాలు కూడా జరుగుతున్నవి.

    మళ్ళీ మరో మారు, మీ రెండు దశాబ్దాల డిటిఎల్‌సి కి శుభాకాంక్షలు.

    రామా,

    you seem to be a part Telugu, part Indian and an other third, American in your writings.

    చి న

  • చాలా బావుంది రామా.
    రెండవ ప్రయోజనం నిజంగా సమకూరిందా అని నాకు కొంచెం అనుమానమే.
    నువ్వు చెప్పని ఇంకో ప్రయోజనం మట్టుకు తప్పక సమకూరింది. టొరంతో నగరంలోనూ, అమెరికాలో సుమారు ఇంకో పది నగరాల్లోనూ ఈ క్లబ్ స్ఫూర్తితో తెలుగు సాహిత్య వేదికలు వెలిశాయి, విజయవంతంగా నడుస్తున్నాయి.

  • ఈ క్లబ్ లో చర్చించిన వ్యాసాలు కొన్ని pustakam.net లో చదివాను. చాలా బాగున్నాయి. ప్రతినెలా చర్చను పుస్తకం.నెట్ లోనో లేదా క్లబ్ వెబ్సైట్ లోనో పెడితే బాగుంటుంది. ఒకవేళ వ్యాసం రాయడం కుదరకపోతే చర్చ ఆడియో లేదా వీడియోను youtube లో పెడితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

  • మీ అనుభవాలూ, భావాలూ బావున్నాయి.
    ఇన్నేళ్ళ నుండి పుస్తకాలు సమీక్ష చేస్తున్నాం అంటూ గొప్పగా చెప్పుకునే ఈ క్లబ్బు, అమెరికా రచయితల్ని పూర్తిగా విస్మరించింది.
    ఇక్కడ ఎంతో మంది కొత్త రచయితలు కథల పుస్తకాలు వచ్చాయి.
    వాటి గురించి కనీసం ఒక్కసారి కూడా సమీక్షలు లేవు. ఎక్కడో వారికి నచ్చిన మిత్రులవి ఒకటీ అరా తప్పించి.
    ఇరవయ్యేళ్ళుగా వీరు చేసింది డిట్రాయిట్ దాటి వెళ్ళింది ఏమీ లేదు. అక్కడే తిరుగాడింది, ఇప్పటికీ.
    మీరు చెప్పినట్లు ఇండియాలో వారికి పుస్తక ప్రచురణ సాయం తప్పించి.
    ఇప్పుడు కూడా చూడండి ఈ క్లబ్బు ఇరవయ్యేళ్ళ సమ్రంభంలో “తెలుగు డయాస్పోరా” వీళ్ళకి స్ఫురించలేదు.
    బహుశా ఇరవయ్యేళ్ళ క్రితం మొదలెట్టినట్లు అక్కడే ఉన్నాయేమో ఆలోచన్లూ, సంబరాలూ.

    • బాగుందండి బ్రహ్మానందం గారు! ఏదో తెలుగు పుస్తకం మీద ప్రేమ చావక చదువుదామని మొదలెట్టాం. చర్చలోకొచ్చిన అభిప్రాయాలు వీలైనంతలో (అంటే బతుకుదెరువు పని వెనక్కు లాగనప్పుడు) సమీక్షలుగా వ్రాస్తున్నాం. నాకు తెలిసి వాటిని మేమే గొప్పలుగా చెప్పుకున్న దాఖలాలు లేవు. వేరే ఎవరైనా ఆ భుజకీర్తి మాకంటగడితే మేమేం చెయ్యగలం చెప్పండి? రాముడు ‘నేను మానవుణ్ణి బాబోయ్’ అని మొత్తుకున్నా, నువ్వు దేవుడివని గుడి కట్టేస్తే ఆయన మాత్రం ఏం చెయ్యగలిగాడు లెండి!

      • నేను చెప్పిందీ అదే కృష్ణారావు గారూ:

        మీ పుస్తక ప్రేమ organized గా, orchestrated గా వుందనీ.
        బ్రతుకు తెరువు లేనిదెవరికట? రాసేవాళ్ళకి మాత్రం ఉండదా?

        రాజు గొప్పదనం స్వయంగా డప్పుకొట్టుకోడు.
        ఆస్థానంలో చాలామంది ఉంటారు.

  • డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితే.. రెండేళ్ళ క్రితం మేము ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ప్రారంబించిన సాహితీ సమితికి ప్రేరణ!

  • I believe we the DTLC members should pay attention to the following comments and make attempts at improving the quality of our discussions and the frequency of writing and posting discussion reviews.

    ఇండియాలో రచయితలే సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు
    ఇక్కడకన్నా ఎక్కువ. అందుచేత, ఇండియాలో (ఉదాహరణకి బెంగుళూరులో) జరిగే చర్చలంత లోతైన అవగాహన ఇక్కడ కనబడదు. (Rama Rao garu)

    ఇక్కడ ఎంతో మంది కొత్త రచయితలు కథల పుస్తకాలు వచ్చాయి.
    వాటి గురించి కనీసం ఒక్కసారి కూడా సమీక్షలు లేవు. (Brahmanandam garu)

  • DTLC నాకు తారసపడడం నా జీవితంలో ఒక మంచి మలుపు. ఇక్కడ చాలా మంచి పుస్తకాలు చదివాము. డాలస్ కి వచ్చాక నెలనెలా తెలుగు వెన్నెలతో DTLC లోటు తీరింది.

  • చాలా బాగా రాశారు రామా! అమెరికా లో ఒక పుస్తక పఠన సమూహంగా మొదలై ఒక సాహిత్య సంస్థగా ఇరవై యేండ్లు కొనసాగడం, ప్రతిసారీ నవనవోన్మేషంగా ఎదగడం ఒక అద్వితీయమైన విషయం. మంచి సాహిత్యం పట్ల నిబద్దత గల నిజాయితీ సాహితీ ప్రియులు, సాహిత్య కారులు చేసిన చేస్తున్న అద్భుత కృషి వల్లనే ఇది సాధ్యమైందని చాలా స్పష్టం. చాలా సార్లు నేను డిట్రాయిట్ లో ఎందుకు లేనా అని చింతిస్తూ ఉంటాను. డీ టీ ఎల్ సీ కు మనఃపూర్వక అభినందనలు.

  • Chukkalni vethike naaku chukkanivy,
    Chuutu unnavariki chuttanivy,
    telugu lo unna madhuryanivy,
    manasulo unna gnynathrusnavy,
    manchumukkalanti maatavy,
    panchadharalanti patavy,
    ghonthu vippi pade koyalammavy,
    garghinchi ventade simhanivy,
    ra ra antu ramantu rasinaave……
    chadhiveddham, vivariddham, vethikedham,
    annita ardham,
    lekunte jivitham vyrdham,
    telugu pusthakammu,
    nidralepunammo,
    ninnu nannu inkendirinoo………..

    Regards

  • ప్రియమైన కన్నెగంటి రామారావు గారూ!

    ప్రపంచ ఉత్తమ సాహిత్యంతో సరితూగగల మన తెలుగు సాహితీ ప్రముఖులను ( గురజాడ, శ్రీపాద, చాసో, చలం, మల్లాది రామకృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, తిలక్, కొడవటిగంటి కుటుంబరావు కొ.కు. నాయన, రావిశాస్త్రి, బీనాదేవి, నీలికధ పురాణం, కాళీపట్నం రామారావు మాస్టారు, త్రిపుర తండ్రి, వడ్డెర చండీదాస్, బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారాం,అంపసయ్య నవీన్, రంగనాయకమ్మ, పి.సత్యవతి, వోల్గా, బాపు-రమణలు, పజంజలి, అమరావతి కధల సత్యం శంకరమంచి, కేశవరెడ్డి, నామిని, శ్రీశ్రీ, విశ్వనాథ అని అనకుండా, నేటి తరం ప్రతిభావంతులైన అనేకమంది రచయితలు, రచయిత్రులను స్థలాభావం వల్ల ఇక్కడ స్మరించకున్నా ) వారి రచనలను మీ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సమావేశాల్లో స్మరించండి.

    వీలైనంతమంది అక్కడి తెలుగు పాఠకులకి వారిని పరిచయం చెయ్యండి.

    డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ కి ఇరవైవ సంవత్సర పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  • రెండు అభినందనలు రామారావు గారూ
    ఒకటి 20 సంవత్సరాలు విడవకుండా సమావేశాలు జరపటం అందునా పరాయిగడ్డ మీద, చాలాచాలా గొప్ప achievement.
    రెండవది మీరు రాసిన ఈ రచనలో మీ మనసంతా నింపి రాసారు.
    రెంటికీ నా మనఃపూర్వకమైన అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు