నీ కోసం ఈ ప్రేమ లేఖ!

ప్రయోగాత్మక ప్రేమ  కథల సంపుటికి  అపర్ణ, వెంకట్ సిధారెడ్డి రాసిన నాలుగు మాటలు

“I can’t write without a reader. It’s precisely like a kiss – you can’t do it alone.”
John Cheever

ప్రియమైన నీకు.

తెలుసు కదా! మనిషి ఆలోచనలు అక్షరరూపం దాల్చినప్పుడు మనిద్దరం పుట్టాం. జన్మమాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడదీసిఈ లోకంలో వదిలారు. అప్పట్నుంచీ మనం ఒకరికొకరం అన్నట్టు ఉంటూ వచ్చాం.

మనిద్దరం ఎక్కడెక్కడ కలిశామని చెప్పడానికి ఒక అంతంటూ ఉందా? చెరువుగట్ల పైనా, వెన్నెల రాత్రుల్లో. బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో కలిసాం. సముద్రపు ఒడ్డున, వేసవి సాయంత్రాలలో.

అంతేనా! మనం తిరగని చోటంటూ ఉందా? ఊర్లు దాటాం. పట్టణాలు తిరిగాం. దేశాలు విడిచాం. కొత్తలోకాల్లో రెక్కలు కట్టుకుని తిరిగాం. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు – మన ప్రయాణంలో మనం చూసిన చోట్లన్నీ లెక్కపెట్టగలమా?

మనుషుల మధ్య మనం కలిసి తిరిగాం. ఏకాంతంలోనూ నేను నీతో ఉన్నాను.

ఎన్ని వేల సంవత్సరాలదో కదా మన పరిచయం. నీకోసం ఎంతమంది కొత్తవాళ్లని తీసుకొచ్చి నీకు పరిచయం చేశానో గుర్తుందా? రాజేశ్వరి గుర్తుందా? అమీర్? మీరా? వీళ్లందరితోనే కదా మన సావాసం ఒకప్పుడు. వాళ్లతో స్నేహమొద్దని పెద్దవాళ్లు ఎంత వారించినా రహస్యంగా ఎలా కలిసేవాళ్లమో గుర్తులేదా? పాపం దయానిధి గుర్తున్నాడా? కోమలి, అమృతం గుర్తున్నారా? వెన్నెల్లో ఆడపిల్ల ఎలావుందో! తనకోసం ఎంత వెతికించుకుందో గుర్తుందా? వీళ్లందరినీ నీకు పరిచయం చేసింది నేనే కదా! వీళ్లేనా? ఊర్వశి-పురూరవుడు, లైలా-మజ్ను, రోమియో-జూలియట్ వీళ్లంతా నీకు పరిచయమే కదా!  నేనింత చేసినప్పటికీ  నేనెప్పుడూ నీతో అనలేదు – నువ్వు నాకు ఋణపడ్డావని. ఎందుకంటే నేనే నీకు ఎక్కువ ఋణపడిఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నువ్వులేకుండా నేను లేనుగా!

నేను రాయడం. నువ్వు చదవడం.

నా కోసం చిరిగిన చొక్కాలు తొడుక్కున్నావు. కానీ పుస్తకాలు కొనడం మానలేదు.

అసలు నువ్వూ, నేను లేకుంటే ఈ చరిత్రే ఉండేదా?

కానీ నువ్వు ఈ మధ్య నువ్వు మారిపోయావ్. నేను రాసిందేదీ నీకు నచ్చడం లేదు. నీకు నచ్చేలా నేను రాయడం లేదు. నేనంటే కోపమొచ్చిందో ఏమో పుస్తకాలన్నీ విసిరేసి వెళ్లిపోయావు. మనిద్దరి మధ్యా ఒక అగాధమే ఏర్పడింది.

ఎందుకు నన్నిలా హఠాత్తుగా వదిలేసి వెళ్లావు? నీకేం కావాలో నాకు తెలియడం లేదు. నీకు కావాల్సినట్టు నేను ఉండలేకపోతున్నాను. నాకు కావాల్సినట్టు నిన్ను మలుచుకోవడం కూడా నీకు తెలియదు. ఒక్కసారి కనిపిస్తే మనం మాట్లాడుకుందాం. కలలో ఏదో స్ఫురిస్తుంది. అందమైన స్వప్నాలేవో ప్రతి రాత్రి నన్ను వేధిస్తాయి. నన్ను వెతుకుతూ వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ధ్వనిస్తుంది. కళ్లు తెరుస్తాను. వాటన్నింటినీ అక్షరాలను చేయడంలో విఫలమవుతాను. నువ్వు మాయమవుతావు.

ఎంత రాసాను నీ కోసం. ఒకచోట విప్లవం, ఒకచోట భయం, ఒకచోట విధ్వంసం. ఒకచోట శృంగారం మరోచోట విషాదం. బాధలు రాసాను. కష్టాలు రాసాను. కానీ అన్నంటికంటే నేను రాసిన ప్రేమే నాకు చాలా ఇష్టం. చలం అన్నట్టు – “ప్రేమ తేజస్సుతో ప్రపంచం వెలిగిందనీ, ప్రేమ రూపాలతో దిక్కులు మారుమోగుతున్నాయని, రాసుకున్న ప్రేమ సంగతి బైటపడుతుందేమోనని అమిత భయం.” అందుకేనేమో నేను ప్రేమ సాహిత్యానికి దూరమయ్యాను.

నీవుండబట్టి, ఈ సాహితీ ప్రపంచమింత సుందరం, హృదయాకర్షమూనూ నాకు. చదివే నువ్వు లేకపోతే నాకు ఈ రాసే పనేమిటి? ఎవరికోసమో రాయడమేంటి? నీకోసం నువ్వు రాసుకోమని చెప్పే ఎంతోమందిని చూశాను. వారితో నాకు పనేమిటి? వీరెవరో నాకు తెలియదు. నేను వీరికర్థం కాను, నేనిట్లా యెందుకు వెతుకుతున్నానో ఊహించలేరు.

నేను నీ కోసం వెతుకుతున్నాను. నేను చదువుకున్న పుస్తకాల్లో నీ గురించి రాసారేమోనని చూశాను. గొప్ప రచయితలెవరైనా నీ జాడ తెలుపుతారేమోనని అడిగాను. నీవెక్కడైనా కనపడతావేమోనని మొహాలు వెతుకుతూ దేశమంతా తిరిగాను. ఎవరెవరినో అడిగాను నీ గురించి. నువ్వు లేవనే బాధకంటే భయం ఎక్కువైంది నాకు.

“Let us read, and let us dance; these two amusements will never do any harm to the world.”  అని చెప్పిన ఫ్రెంచి రచయిత వోల్టైర్‌ మాటలు మనం చదువుకున్నాం కదా. నువ్వు మళ్లీ తిరిగొస్తే మనం కలిసి చదువుకుందాం.

నువ్వు వస్తే మళ్లీ మనం కాలువ గట్టుపైన చలిమంట వేసుకుందాం ఇద్దరం పలవల్లో, వట్టి గడ్డిమీద పడుకుందాం. సత్యవేణిని కలుద్దాం. మురళికృష్ణతో కలిసి రావులపాలెం వంతెన మీదుగా ప్రయాణం చేసి హైదరాబాద్ వద్దాం. శ్వేతని కలుద్దాం. తనతో కలిసి పబ్ కి వెళ్దాం. స్కూటీపై హైదరాబాద్ మొత్తం తిరుగుదాం. కృష్ణ ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం. శ్వేతని కృష్ణకి పరిచయం చేద్దాం. ప్రేమంటే చెస్ గేమ్ కాదని వాళ్లకి చెప్దాం.

వస్తావా మరి?

వస్తే నీకు పాత డైరీలు చదివి వినిపిస్తాను. సీతాకోకచిలుకకు అన్ని రంగులు ఎలావచ్చాయో కథలు కథలుగా చెప్తాను. నల్ల అంటే తమిళంలో మంచి అని కొంత తమిళం నేర్పిస్తాను. అళగి అనే తమిళ్ అమ్మాయిని పరిచయం చేస్తాను. నీకు పామా అంటే ఏంటో చెప్తాను. వయసుమించినా ప్రేమ తగ్గదనే ఒక పెద్దాయన్ని పరిచయం చేస్తాను. మూవాన్ అంటే ఏంటో ఆ వయసు వాళ్లకి తెలియదుగా పాపం. ప్రేమించడం విడిపోవడం చాలా సాధారణం అనుకుని మూవాన్ అయిపోవాలనుకునే ఈ తరం వాళ్లని కూడా నీకు పరిచయం చేస్తాను. మూవాన్ అవడమంటే, తనలోనుంచి తనని పెకిలించుకుని – అడ్డొచ్చే జ్ఞాపకాల్ని చిత్తుగా తొక్కెయ్యలేక సతమతమయ్యే వాళ్లూ ఉన్నారిక్కడ. వాళ్లందరినీ నువ్వు కలవాలి.

మనం ఇంకా చాలామందిని కలవాలి. శరావతి బ్యాక్వాటర్స్ కి వీకెండ్లో ట్రిప్ కి వెళ్దాం. అక్కడ శరత్, ఉష ఇంకా చాలామందిని కలవొచ్చు. తిరిగొచ్చి యూనివర్శిటీలో రేఖ, జూలియా, సందీప్ ని కలిపిస్తాను. వాళ్లతో మాట్లాడితే నీకన్నీ తెలిసిన అనుభూతులే అయినా మళ్లీ కొత్తగా ప్రేమలో పడడం ఎంత బావుంటుందో తెలుస్తుంది కదా!

ప్రేమంటే గుర్తొచ్చింది. నువ్వు రీనాని కలవాలి. మేఘని కలవాలి. నిలాని కలవాలి. వీళ్లందరికీ  ప్రేమని పరిచయం చేసిన జార్జ్ ఎవరో తెలుస్తాడు. కానీ జార్జ్ ఎవరో తెలుసుకోవాలంటే మనం శ్రీలంక వెళ్లాలి. కిలినోచ్చి, మాన్కులం, పులియాన్కులం మీదుగా జాఫ్నా-కాండీ హైవేలో మనం ప్రయాణించాలి. అక్కడి వర్షంలో మనం తడిసిముద్దైపోతాం.

వర్షంలోనే కాదు ప్రేమలోకూడా తడిసిముద్దైపోవచ్చని నీకు తెలియాలంటే మళ్లీ మనం ఇండియా రావాలి. విజయనగరం జిల్లాకి వెళ్లాలి. అక్కడ రామిని కలవాలి. ఆమె మాటలు, వూసులు వినాలి. ఈ భూమి పుట్టిందీ, నీరు పారేదీ ఆమె కోసమూ, బైరి కోసమేనట. వాళ్ల తిరుగుల్లు, పెమానకాలు వినాలి నువ్వు.

ప్రేమంటే ఇంతేనా అని నువ్వాన్నావనుకో, మోహావేశాన్ని మాటల్లో చెప్పలేని ఒకమ్మాయిని పరిచయం చేస్తాను. దేహసౌఖ్యంలో దైవత్వాన్ని అనుభవించలేని వాళ్లని ప్రేమే కాదు, ఏ భావావేశమూ తాకలేదేమో! అని చెప్తే నిజమే కదా అనిపిస్తుంది.

నేను కూడా ఈ సారి నీకోసం కొత్త కొత్త కథలు రాస్తాను. నాకూ రాయడమంటే ఇష్టమే. కానీ పదాలు మనసులో ఉన్నంతవరకే ధైర్యంగా ఉంటాయి. కాగితం మీద రాసేటప్పటికి అవి పిరికిగా జర్రున జారిపోతున్నాయి, అర్థాలు కోల్పోతున్నాయి, నువ్వొస్తే నాకు ధైర్యమొస్తుంది. జారిపోయే నా పదాలకూ ధైర్యం నేర్పిస్తాను.

నన్ను నమ్ము. నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఎంత ప్రేమగా అంటే, కూతుర్నేమైనా అంటే వాడిని చంపేద్దామనుకునే తండ్రంతా ప్రేమగా నిన్ను చూసుకుంటాను.

న్యూ ఇయర్ తో మొదలై, సంక్రాంతి, వేలంటైన్స్ డే, రంజాన్, దీపావళి, వినాయక చవితి, దసరా, క్రిస్మస్ వరకూ – ఇలా సంవత్సరం మొత్తం నిన్ను పండగలా చూసుకుంటాను. ఎన్నో ప్రదేశాలు తిప్పుతాను. ఎండాకాలపు వేడిలో, వర్షాకాలపు తడిలో, సీతాకాలపు చలిలో – అన్ని కాలాల్లో నీ కోసం ఒక కథనై నీ తోడుంటాను.

నువ్వు మళ్లీ నా కోసం వస్తావు కదూ!

పాఠకుని అన్వేషణలో

కథ

 

అపర్ణ తోట

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thank you!

    ప్రేమకథలనేపధ్యాన్ని ప్రేమలేఖగా మార్చవచ్చనే off the beat ఆలోచన Venkat Sid కే స్వంతం. దీని పేటెంట్ రైట్స్ పూర్తిగా తనవే. సారంగతో సంభాషణ జరిపింది నేను కాబట్టి నా పేరు తో వచ్చింది.

    కొత్త ప్రయత్నాలను ప్రోత్సాహించే సారంగకు బోలెడంత ప్రేమ. 🙂

  • ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులులతో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను.” అన్న చిత్వాన్ ను “సోల్ సర్కస్” కధ ద్వారా పరిచయం చేసిన సిద్దా! ( వెంకట్ శిద్దారెడ్డా !! )

    “I don’t agree with what you say, but I will defend to the death your right to say it.” అన్న వోల్టైర్ కొటేషన్ ఆసరాతో ( తూచ్ అది ఎవెలిన్ బియాట్రిస్ హాల్ కొటేషన్ అని సరిచేస్తావా మిత్రమా శ్రీనివాసుడూ! సరే అలాక్కానీ ) .

    “నీ కోసం ఈ ప్రేమ లేఖ! “ బుక్కు కవర్ పేజీ బాగుండి ఉండవచ్చు. అంతార్జాతీయ ఆర్టిస్టిక్ లెవిల్లో ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ సంసార పక్షంగా లేదయ్యా. అంటే బాపు రమణలు చూపించిన తెలుగింటి వాతావరణానికి సరిపొయ్యే లెవిల్లో లేదయ్యా.

    బుక్కులో విషయాలు ( నేను వెళితే నాకోసం వెయ్యేళ్ళు వెదుకుతావ్ ! అని పురూరవుడిని హెచ్చరించిన చలం ఊర్వశి ) ఊర్వశి-పురూరవుడుల అమలిన శృంగార, అజరామర ప్రేమ లెవిల్లో ఉంటే రాజా రవివర్మ పెయింటింగే కవర్ పేజీగా వేస్తే పొయ్యేదిగా.

    ఎండాకాలపు వేడిలో, వర్షాకాలపు తడిలో, శీతాకాలపు చలిలో – అన్ని కాలాల్లో నీ కోసం ఒక కథనై నీ తోడుంటాను. నీ అన్వేషణలోనే పరిభ్రమిస్తుంటాను అన్నప్పుడు ( ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో, అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో. ఎక్కడివీ రాగాలు, చిక్కనివీ అరుణ రాగాలు – – – మరచి పోకుమా తోటమాలీ, పొరబడియైనా మతిమాలి!! అన్న కృష్ణశాస్త్రి గారి భావుతక ఉన్న విషయాలే అయితే ) బుక్కు కి కుదురైన కవర్ పేజీ వేసిపెట్టివ్వమని బాపూ గారిని అర్ధించరటండి.

    సమసమాజ నిర్మాణం కోసం విప్లవాన్ని ఆవాహన చేసిన కవులకు ( యుగ కవులు, మహా కవులు, ప్రజా కవులకు ) కూడా ప్రేమంటే ఏవిటో తెలుసు కదా సిద్దా! అది గిరిగీసుకున్న పరిమిత వలయంలోని వ్యక్తులు చూపు సారించిన దైవత్వం వైపు కాకపోవచ్చు. మానవత్వం వైపు కావచ్చు.

  • నీకై మోహవేశపు నిరీక్షణ, చేజ్ ద స్టాల్ ఇన్ HBF

  • నేతి బీరకాయలో నెయ్యి, ప్రేమ కథలలో ప్రేమ. చదివిన కొద్దీ “నేతి, నేతి” అనుకోవడమే అవుతోంది!
    వ్రాయడం ఒక సాహసం, చదివే వారిని అది ఎలా తాకుతుందో తెలియదు. చదవడం ఒక ప్రయోగం. ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. పాఠకులూ వ్రాయాలి కాబోలు ఒక ప్రేమ లేఖ.” రతీ దేవికి మాత్రమే కనిపించే మన్మథుడి లాగా రూపం లేని నువ్వు నిన్ను ఆరాధించే రచయితలకి మాత్రమే అగుపిస్తున్నావు. నీ బాణాలు పాఠకుల హృదయాలని తాకేదెప్పుడు, తెలుగు కథా వనానికి వసంతం ఎప్పుడు?” అని. “ఆ బాణాల గురి నీ మీద కాదు, నువ్వు ఆ దారిలో లేవు అంటారేమో. నీది హృదయం కాదు, ప్రేమని గుర్తించలేని పాషాణం” అంటారేమో. అదీ నిజమే కావచ్చు.
    పుస్తకం కినిగేలో కొని చదివాను. మరి నాకు మంచి కథలు చదివానన్న తృప్తి కలగలేదు. ఇది నా లోపమే కావచ్చు. కానీ చెప్పాలనిపించింది. ఎలాగైతేనేమి ఆలోచింపచేసే సన్నివేశాలు, ఇతివృత్తాలు ఉన్నాయి. కథనం (స్టొరీ టెల్లింగ్) చదివింప చేసేలా లేదు అని ఒక పాఠకురాలిగా నా అభిప్రాయం. ప్రేమ అనే అంశాన్ని పై పైనే తడిమినట్టు అనిపించింది నాకు. శృంగారం ప్రేమలో భాగం అని చెప్పే ప్రయత్నం మనసుని అంత తాకలేకపోయింది అని చెప్పాలనిపిస్తోంది. ఎందుకు చెప్పాలనిపిస్తోందంటే, వ్రాయగలిగిన వారు కాబట్టి, రచయిత, పాఠకులు కలిస్తేనే రచన అని చెప్తున్నారనిపిస్తోంది కాబట్టి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు