నిత్యగాయాల నెలవంక

నాటా–సారంగ కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.

1.

ఆకుపచ్చనిదీపం కింద

అలుముకున్న చీకటిసముద్రం – అడవి !

బతుకుపచ్చనిఅడవి బహుళజాతి సంతయ్యాక

అభివృద్ధివధ్యశిల మీద ఆదివాసీయే తొలి బలిపశువు !

 

2.

శాటిలైట్ కళ్లతో  అడవిని తోడిపోసీ

కార్పోరేట్ భూతాలకు కుంభాలుగా పెట్టేందుకు

బంగారుకడియం ఆశపెడుతోంది  పెద్దపులి !

తుపాకీనీడలో….తెగిన బొటనవేళ్లు

బలవంతపు ప్రజాభిప్రాయాలయ్యాక

సహజ కవచకుండలాలను చీకటిగోళ్లతో చీల్చేసి

నెత్తురోడుతున్న దేహాలమీద లేపనం పూస్తోంది !

 

3.

ఒకచోట జలసమాధి జేసి

మరోచోట కొండదేహాన్నొక ఖనిజంగా తవ్విపోసి

కాళ్లకింద నేలను తన్నుకుపోతున్న గండభేరుండాలు !

తునాతునకలై…. గుదిగుచ్చిన కొండల పూదండలు !

కన్నీటిధారలై…. తెగిపోతున్న సెలయేటిపాయలు !

నిత్యగాయాల నెలవంకయ్యింది – అడవి

నిఘాకళ్ల పహారాలో నెత్తుటివాగయ్యింది – అడవి !

 

4.

ఒక పరాయికరణ !

సంస్కృతిమీదా….సాంప్రదాయాలమీదా….ఒకదాడి !

గూడెంమధ్యలో  కొలువైన

జాకరమ్మను మింగేస్తోంది  కొండ’శిలువ’ !

సమస్తప్రకృతిని పూజస్తూ….వేపమండలాలతో ఊరేగే

జాతరల్ని  మాయంచేస్తోంది గిరిజనగోవిందం !

యిపుడీ వెన్నెలకొమ్మల మీద

పిలనగర్ర పాటా లేదు ! కిన్నెరమోతా లేదు !

తీరొక్కరీతుల తుడుందెబ్బల్లేవు ! టిల్లకాయ సవ్వళ్లూ లేవు !

పదం పదం కలిపిఆడే నెమలిపిట్టల థింసానాట్యాల్లేవు !

చీకటికొమ్మమీద వెలుతురుపూల నెగళ్లచుట్టూ

తుమ్మెదలై మూగే బృందగానాల్లేవు !

అడవిపుడొక మూగవోయిన జీవనగీతం !

పుట్టిననేలకు పరాయిగామారి

పుట్టెడుదుఃఖంతో బతుకును ముక్కున కరచుకొని

ఎగిరిపోతున్న వలసపావురం !

 

5.

ఎంతకాలమీ నేలూనని నడకలు ? ఏ వెలుగులకీ పరుగులు ?

విచ్చుకున్న విప్పపూవుల్లాంటి గూడలిపుడు విహారకేంద్రాలు !

ఆకుపచ్చని ఆకాశానపూసే చుక్కలిపుడు పడుపుగత్తెలు !

కల్చర్ వలలో చిక్కిపోతున్న కుందేటికూనలు !

అడవితనాన్ని మింగేసిన అభివృద్ధి –  ఒక చిల్లుల కడవ !

 

6.

ఒంటరిగా నడచీ నడచీ….విరిగినగీతాలై నేలకూలీ….

ప్రతి దుఃఖపుసందర్భాన్ని దిగమింగిందిక చాలు !

కాలం కదలమంటోంది కోనమ్మా….దారివిడు !

కొండవాలులోంచి పల్లానికి వెల్లువెత్తే  వాగమ్మా….

పోరునాదాల గొంతుతడుపు !

యుద్ధారావాల తుడుంకొడుతూ వెదురువనమా….విల్లమ్ములు  కా….!

యిది మరో సాయుధ గిరిజన రైతాంగపోరాటం !

అడవిపుడొక అనివార్య యుద్ధరంగం !!

 

 

పెయింటింగ్: సత్యా బిరుదరాజు 

సిరికి స్వామినాయుడు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును అడవిపుడొక అనివార్య యుద్ధరంగం
    మంచి కవితకు అభినందనలు మీకు

    • ధన్యవాదాలమ్మా….నమస్తే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు