తెలంగాణ కథల దావత్

తెలంగాణ సోయి, సంస్కృతి, జీవితాలను చాటే కథలతో ప్రతి ఏటా తెలంగాణ కథా సంకలనం తీసుకొస్తున్నారు సంగిశెట్టి శ్రీనివాస్ , వెల్డండి శ్రీధర్ లు. 2013 కథా సంకలనాన్ని రంది, 2014 తన్లాట, 2015 అలుగు, 2016 కూరాడు పేరిట సంకలనాలు … 2017 సంవత్సరపు ఉత్తమ కథల సంకలనాన్ని దావత్ గా వెలువరిస్తున్నారు. ఈ సంకలనం ఆవిష్కరణ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన మందిరంలో జరగనుంది. ఈ సందర్భంగా దావత్ సంకలనానికి ఎంపికైన కథా  రచయితలు తమ మనోభావాలు, కథల వెనక నేపథ్యాలను  సారంగతో పంచుకున్నారు.

  

పూడూరి రాజిరెడ్డి

రచయిత నేపథ్యం అంటే– రాయడానికి ఉపకరించిన పరిస్థితులు ఏమిటీ అని నేను అర్థం చేసుకుంటున్నా. మామూలు పల్లెటూరు(వేములవాడ దగ్గరి నర్సింగాపురం) కాబట్టీ, వ్యవసాయ కుటుంబం కాబట్టీ, చుట్టూ పుస్తకాలతో పెరగలేదు కాబట్టీ, నేను సాహిత్య వాతావరణం ఉన్న ఇంట్లో పెరగలేదని మొన్నమొన్నటిదాకా నమ్మాను.

కానీ పెద్దబాపు, బాపు– ఇంకా నేను భూమ్మీద పడనప్పుడూ, నేను చూడలేనంత చిన్నగా ఉన్నప్పుడూ, నాటకాలు ఆడేవాళ్లంట. శశిరేఖా పరిణయంలో అభిమన్యుడిగా, అల్లిరాణిలో అర్జునుడిగా, మదన విజయలో కుశాగ్రబుద్ధిగా, భట్టి విక్రమార్కలో విక్రమార్కుడిగా పెద్దబాపు నాయక పాత్రలు వేస్తే, బాపేమో విరాట పర్వంలో కీచకుడు, నాగార్జునుడులో శంకరుడిగా చేశాడట. కీచకుడు వేసిన తెల్లారినుంచీ కొన్ని రోజుల దాకా బాపు కనబడితే ఊరి ఆడవాళ్లంతా థూ థూ అని ఉమ్మడమట. ఈ సంగతి చిన్నప్పుడు విన్నప్పుడు ఏడుపొచ్చింది; కానీ అంత రక్తి కట్టించివుంటాడని ఇప్పుడు ముచ్చటేస్తోంది. బాపుతో పొలంకాడ పని చేస్తున్నప్పుడు పిల్లలం వెంటబడి కథలు చెప్పించుకునేవాళ్లం. పెద్దబాపైతే పాటలు కూడా పాడతాడు. ఇప్పటికీ బతుకమ్మను చెరువులో వేసిన తర్వాత ‘ఏమేమి పూవప్పుడే గౌరమ్మ’ పాట కోసం ‘హన్మన్న’ ఎక్కడున్నాడని వెతుకుతారు! ఇక పెద్దమ్మ మాట్లాడే మాటల్లో ఎన్నో సామెతలు, ఎన్నో పలుకుబడులు దొర్లిపోయేవి. ఎంతగా అంటే, నేను కనీసం వెయ్యి తెలంగాణ మాటల్ని ఆమె ప్రధాన ఆధారంగా నోట్‌ చేసిపెట్టాను, నలిమెల భాస్కర్‌ గారు తెలంగాణ పదకోశం వెలువరించకముందే. అసలు ముసలివాళ్లు ఏ పాత సంగతులు చెప్పినా నాకు గొప్పగా వినబుద్ధవుతుంది. ఇదంతా కూడా నాకు తెలియకుండానే నా రక్తంలో కలిసిపోయి ఉండవచ్చు. మొన్న దసరాకు ఊరికి పోయినప్పుడు– మర్రికాడ ఏదో చిన్న కొట్లాటయింది. ‘అరే నేను అక్కణ్నే ఉన్నా, గమనించలే’దని చెప్తే మా బంధువొకరు ‘నువ్వే ముసలోళ్లతో మాట్లాడుకుంట ఉన్నవో తియ్యి’ అని దెప్పడం!

రచనలోకి ఎలా రావడం అనే ప్రశ్న కూడా ఇంతకుముందైతే ఎలా చెప్పేవాడినో; కానీ ఇప్పుడనిపిస్తోంది– నేను మొదట్నుంచీ ఇందులోనే ఉన్నా. ఫలానాది చదివి ఇలా రాయాలనిగానీ, ఇలా కావాలనిగానీ నాకెప్పుడూ అనిపించలేదు. ఫలానా టెక్స్‌›్ట ప్రత్యేకంగా నన్ను ఇన్‌స్పైర్‌ చేయలేదు. నాకు ఆలోచన అంటూ ఉన్నప్పటినుంచీ ఏదో ఒకటి మనసులో అల్లుకుంటూనే ఉన్నా. అవి కాగితం మీదకు బదిలీ కాకపోయినా అదంతా రాయడమే నా వరకూ.

నిజంగా మొదటి కథ రాయడం అనేది ఒకటుంటుందా అని కూడా నాకు అనుమానమే. ఏవేవో రాస్తూ ఒక దరికి వస్తాం. నా వరకూ నా కౌమారపు ‘చెత్త’ను సందూకుడు తెల్ల కాగితాలు భరించాయి. ఒక లెక్క కోసం చెప్పమంటే మాత్రం ‘మరణ లేఖలు’ నా మొదటి కథ అంటాను.

రాయడానికి ప్రోద్బలం ఒకటే. నాలాంటి భయస్థుడు, నాలాంటి అల్పుడు, నాలాంటి దేనికీ కొరగానివాడు, నాలాంటి కొంత మంచివాడు, కొంత ప్రయోజకుడు, ఇంకా విడమరిచి చెప్పాలంటే పూడూరి రాజిరెడ్డి లాంటి వాడు ఒకడు ఈ భూమ్మీద బతికి వెళ్లాడని చెప్పడంలో ఉన్న ఉత్సాహమే!

 

చందు తులసి

నాకు కథలు రాయడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు మనిషిగా స్పందించి, నా ఆలోచనలను నలుగురితో పంచుకునేందుకు రాసేవే నా కథలు. మంచో, చెడో నేను నమ్ముకున్న భావాల్ని నా కథల్లో చూపడానికి ప్రయత్నిస్తుంటాను. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల పండుగ. ఈ పండగకు ప్రతి ఆడబిడ్డా తల్లిగారింటికి పోవాలని కోరుకుంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పుట్టింటికి పోలేని ఓ ఆడబిడ్డ కథే తల్లిగారిల్లు కథ. కథను చదివి తెలంగాణతో పాటూ, ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఆడపడుచులు కూడా ఫోన్ చేసి…తమ పుట్టినిల్లు గుర్తుచేసుకుని  కన్నీళ్లు పెట్టుకోవడం, తమ సొంత కథలా అనిపించింది అని చెప్పడం చాలా సంతృప్తినిచ్చింది. ఈ కథను రాయించిన గొరుసు జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పితీరాలి.

 ఏటా తెలంగాణ కథల సంకలనం తెస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్ , వెల్దండి శ్రీధర్  కి అభినందనలు తెలియజేస్తూ…ఈ కథల దావత్ లో నా కథకూ చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు.

 

సమ్మెట ఉమాదేవి

ఖమ్మం జిల్లా కామేపల్లి మండల్ భాసిత్ నగర్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యయనిగా పని చేస్తున్నాను. నాన్న సమ్మెట పోతరాజు గారు కార్మిఖశాఖలో చిన్న క్లార్క్ గా జీవితాన్ని ప్రారంభించి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ గా రిటైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రతీ మూడు సంవత్సరాలకు బదిలీ తప్పనిసరి అవ్వడంతో మేము నిజామాబాద్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని పలు ప్రాంతాలలో  పెరిగాము. మేము కరీంనగర్ లో ఉన్నప్పుడు స్వల్ప అనారోగ్య కారణంగా రెండేళ్లపాటు ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చినప్పుడు అనేకానేక పుస్తకాలు చదివాను. నవీన్ గారు రాసిన అంపశయ్య నవల నా టీన్ ఏజ్ లో యువతరాన్ని ఒక ఊపు ఉపింది.  అప్పుడు చదివిన అనేకానేక రచనలతో పాటు నవీన్ గారి రచనలవల్ల కూడా ప్రేరణ పొందాను. మంచేరియాల్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో ఉండగా బరోడా ఆంధ్ర సమితివారు వారు నిర్వహించిన జాతీయ కథల పోటీలో నా “కథ కూటికోసం” అన్న కథకు ద్వితీయ బహుమతి వచ్చి బరోడా ఆంధ్ర సమితివారి సావనీరులో ప్రచురించబడింది. అప్పటి ప్రధాన సమస్యయిన నిరుద్యోగ సమస్య పై రాసిన ఈ కథ నా తొలి కథ. ఆ తరువాత ఆంద్ర పత్రిక సచిత్ర వార పత్రికలో “పైలం కొడుకో” అన్నకథ ప్రచురించ బడింది. పత్రికల్లో వచ్చిన  తొలికథ ఇది.

తెలంగాణా పల్లె ప్రాంతాల్లో మా జీవితమంతా గడవడంతో నాకు నా ప్రజల భాషంటే చాలా ఆసక్తి. చాలా కథల్లో పాత్రోచితమయిన మాండలికాన్ని ఉపయోగించాను. 1998 లో ఉపాద్యాయినిగా ఉద్యోగం వచ్చాక 99 లో జిల్లా బాలికా విద్యాభివృద్ది అధికారిగా ఒక డిప్యుటేషన్ పోస్ట్ నిర్వహించవలసి వచ్చినప్పుడు అప్పటి ఖమ్మం జిల్లాలోని 48 మండలాల్లో దాదాపు 40 మండలాలు తిరిగాను. గిరిజనుల జీవన స్థితిగతులను చాలా దగ్గరనుండి పరిశీలించా ను. ఆ తరువాత తిరిగి నా పోస్ట్ లోకి వెళ్ళినా అప్పటి నుండీ నేటిదాకా మళ్ళీ గిరిజన ప్రాంతలోనే నా ఉద్యోగ జీవితం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో నాకు ఎదురయిన అనుభవాలెన్నో నా కథా రచనకు వస్తువులయినాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో రాజకీయాల్లో స్త్రీలను ఒక పావుల్లా ఉపయోగించుకుంటున్న పరిస్తితులను గమనించాను. విద్యా కమిటీలలో, వనరక్షణ సమితి చెక్ డాం కమిటీలలో, గ్రామ పంచయితీలల్లోనూ స్త్రీలు నామ మాత్రపు చైర్ పర్సన్స్ గా ఉంటూ పురుషులే అధికారం చెలాయిస్తున్న పరిస్తితి ఇప్పటికీ ఉన్నది. గిరిజనుల సామాజిక జీవనాన్నినా రచనల్లో ప్రతిబింబిస్తూ .. ఈ రాజకీయ పరిస్తితిని కూడా ఒక కథా వస్తువుగా ఎంచుకున్నాను.

వజ్జీర్ ప్రదీప్

నాకు చిన్నప్పటి నుండి సమాజంలోని సామాజిక సమస్యలను దగ్గరగా పరిశీలించడం అంటే ఇష్టం. అందుకే నేను ఎక్కువగా చిన్న చిన్న కుటుంబాలలోని సమస్యలను తీసుకొని కథలు రాయడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాను. సమాజంలో జరిగే విషయాలను పరిశీలించి కథా వస్తువును ఎన్నుకుంటాను. కథా రచనలోకి: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోని అనేక కారణాలు నన్ను ప్రభావితం చేశాయి. దాంతో స్పందించి కథలు రాయడం జరిగింది. సామాజిక సమస్యల ఇతివృత్తమే నా కథా వస్తువు. పతనమౌతున్న మానవ సంబంధాలు, ఆర్థికపరమైన వంటి వాటితో కథలు రాస్తుంటాను.

 

హుమాయున్ సంఘీర్.

ముస్లిం కుటుంబంలో పుట్టాను. బాల్యం, చదువు నిజామాబాద్ జిల్లా (ఇప్పుడు కామారెడ్డి జిల్లా) నాగిరెడ్డి పేట్ మండలం, గోపాల్ పేట్ గ్రామం మాది.  తల్లిదండ్రులు : ఖయ్యుం, తాహెరాబేగం, అన్న,అక్క తర్వాత నేను. ఇంటర్ తర్వాత హిందీ పండిట్ చదివాను. నా మూడవ ఏటే నాన్న చనిపోయారు. అమ్మ కూలీనాలీ చేసి మమ్మల్ని పోషించింది.

తిండికీ, బట్టకు ఏగాం. కడు పేదరికంలో పెరిగి పెద్దయ్యాను. మెకానిక్, వ్యవసాయ కూలీ పనులు చేశాను.

చిన్నప్పటి నుంచి కష్టాలను దగ్గరగా చూడటం, అమ్మ పడుతున్న పాట్లు చూశాను.  ఆ క్రమంలో దోస్తు చాయ్ హోటల్లో పాలు పొయ్యనీకి పోయేవాణ్ణి.  అట్ల పేపర్ చదవడం అలవాటైంది. సండే బుక్కులో కథలు, సీరియల్స్ చదవడం అలవాటైంది. కాలమేఘం, ఎచటకోయీ ఈ పయనం, ఎంతెంత దూరం, పొగడపూల దోసిలి వంటి నవలలు చదివాను.

2006లో ‘ఎటుపాయె’ కవిత ద్వారా నా ప్రస్థానం మొదలైంది. 2007లో ఆంధ్రప్రభలో ‘నమితామిత కామితం’ అనే కథ అచ్చయింది.  అప్పట్లో అమ్మాయిలపై ప్రేమోన్మాదుల యాసిడ్ దాడులు చాలా ఎక్కువయ్యాయి.

అలాంటి ఓ సంఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఆ కథ రాసిన.  ఆ తర్వాత కథలు రాయడం మీద ఎక్కువ దృష్ఠి పెట్టాను.

పుస్తకాలు చదవడం, రాయడమే పనిగా పెట్టుకున్నా. అలా ఇప్పటివరకు ఓ 30 కథలు రాశాను.

వివిధ దిన, వార, మాస పత్రికలలో కథలు అచ్చయ్యాయి. నా జీవితంలో ఎదురైన సంఘటనలు, నేను చూసిన జీవితాలే నా కథలకు వస్తువులు. కొన్ని పత్రికలలో పదబంధాలు కూడా నిర్వహించాను. సినిమా రంగానికి వచ్చాక రాయడం కాస్త తగ్గింది.

ప్రస్తుతం నటుడిగా, రచయితగా సినిమా రంగంలో కొనసాగుతున్నా. మైక్ టీవీలో రాణిస్తున్నాను.  భవిష్యత్తులో దర్శకత్వం వైపు నా అడుగులు.

 

నస్రీన్ ఖాన్.

  1. నేపథ్యం:- జర్నలిజం వృత్తి. 2003లో నుంచి విలేకరిగా పని చేస్తున్నారు. వార్త, సూర్య, సాక్షి దిన పత్రికలలో పని చేశాను.
  2. కథా రచనలోకి అడుగు పెట్టడం. మొదటి కథ వివరాలు, రాయడానికి గల ప్రోద్బలం:-

విధి నిర్వహణలో భాగంగా చాలామంది జీవితాల గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా  హైదరాబాద్ లోని పేద ముస్లిం బతుకులను దగ్గరగా చూడగలిగారు. వాటిపై ఎన్నో వార్తా కథనాలను రాసినప్పటికీ రాయాల్సిన ఘోషలెన్నో మిగిలే ఉన్నాయనే వెలితి వెంటాడుతూండేది. ఒక్కొక్కరి జీవితం ఒక్కో కథలా అనిపించడం మొదలయ్యాక 2011లో ‘హీనా’ పేరుతో తొలి కథ రాశారు. ఆ తరువాత సొంత పత్రికలైన ‘సమీక్ష’ తెలుగు మాస పత్రిక, ‘తెలంగాణా పవర్’ తెలుగు దిన పత్రికల నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో కథా రచనను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే కవితలు రాశారు. త్వరలోనే కవితా సంకలనం మన ముందుకు రాబోతోంది.

2016 నుంచి కథలను సీరియస్ గా రాస్తున్నారు. పురుషాధిక్యంతో పాటు మూడు నమ్మకాలు వేళ్ళూనుకున్న సమాజం ఒక స్త్రీ కి మూడు వివాహాలు చేయడం, ఆ ముగ్గురు భర్తలూ చనిపోయి.. ముగ్గురు పిల్లల పోషణకు ఆమె పడుతున్న ఆరాటంపై ‘ఖిస్మత్ కీ కహానీ’ పేరుతో ఒక కథ రాశారు. నలుపు రంగు పట్ల సమాజం చూపే వివక్ష నేపథ్యంలో ‘రంగీన్ దునియా’, చదువు లేని మహిళల్లో చైతన్య కొరవడిందంటే, చదువుకున్న వారు కూడా పురుషులు పెట్టే ఆంక్షలతో తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకోలేక ఎంతోమంది బతుకుల్లో స్తబ్దత ఆవరిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో, తెలంగాణా ఉద్యమం సీరియస్ గా ఉన్న సమయంలో ఒక ముస్లిం మహిళ జీవితాన్ని తనకున్న బంధనాలను తెంచుకుని ఉద్యమంలో ఎలా భాగస్వామ్యం తీసుకుందనే అంశంతో రాసిన కథ ‘పంఛీ ఔర్ పింజ్రా’. ఈ కథ ‘జ్యోతిష్యం మార్చుకున్న రామ చిలుక’ పేరుతో మన తెలంగాణా దిన పత్రికలో ప్రచురితమైంది. ఇంకా ‘దిగులు గొంతుక’ తో పాటు మరికొన్ని కథల సమాహారంగా పుస్తకం వేసే ఆలోచనలో ఉన్నాను .

కె. వి. మణ్ ప్రీతం

నేనొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ని. మా నాన్న గారు ప్రముఖ కథ రచయిత కె. వి. నరేందర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచే కథలంటే ఇష్టం పెరింగింది. నాకు మా నాన్నగారే స్పూర్తి. రచనల్లో మా నాన్న గారివే కాకుండా పెద్దింటి అశోక్ కుమార్, అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి గారల కథలు, నవలలు చదివాను. ఒక రోజు సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో ఉన్నప్పుడు అక్కడ గుండె మార్పిడి (Heart Transplantation) చికిత్స చూశాక, ప్రేరణ పొంది రాసిన కథే ‘దానం’. ఇదే నా మొదటి కథ. చనిపోతే ఆస్తులు పంచుమనే ఈ రోజుల్లో ఒక తండ్రి తన కొడుకు అవయవాలు దానం చేయడానికి ఒప్పుకొని, చివరికి తానూ తన దేహాన్ని ఎలా ‘దానం’ చేశాడో ఈ కథ చెప్తుంది.

ధీరజ్ కశ్యప్ వేముగంటి 

1993 సంవత్సరం లో కరీంనగర్ లో పుట్టాను. 2001 నుంచి హైదరాబాద్ లో మకాం.   ఒక అన్నయ్య. అందరి లాగే ఒక అమ్మ నాన్న.  అన్నయ అప్పుడప్పుడు  అంటూ ఉంటాడు ” నువ్వు ఎలా పెరిగేవో కూడా నాకు గుర్తులేదని”. అంత సైలెంట్ గానే అన్నిటిని  గమనిస్తూ పెరిగాను అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. నా తరం లో చాలా   మంది లాగే కార్పొరేట్ విద్యాభ్యాసం. అది ఇవ్వని వెసులుబాటే లోపల ఉన్న దాన్ని బయట పెట్టాలని తప్పనని పెంచింది అనుకుంటున్నాను.  అసలు లోపల ఏమి జరుగుతుందో తెలియని అమాయకత్వం కూడా . కానీ ఆ అయోమయం, కొంత శూన్యం  అన్ని కలిపి  చాలా తీవ్రంగా తోచేది.

అదే నన్ను రచన వైపు తోసింది అని అనిపిస్తుంది.

2015 లో మల్లారెడ్డి కాలేజీ లో ఫార్మసీ చదువుకొని అదే సంవత్సరం లో అమెరికా చదువని బయలుదేరి ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్న.

మొదటి కధ ఇదేనేమో. ఇది కూడా కాదేమో. ఎప్పుడు రెండు మూడు ట్రాక్స్ నడుస్తూనే ఉంటాయి. హైదరాబాద్ రోడ్ల మీద నైట్ ఔట్స్ చేస్తూ నడుస్తూ ఉంటె, లేదా, సాయంత్రం పూట కేఫ్ లో చాయ్ తాగుతుంటే  అనిపిస్తుంది ”ఇది కధ. ముందు ఇదే బయటకి వస్తుంది ” అని.

అలామొదట అచ్చయిన కథ మాత్రం  ”త్రేన్పు”. సారంగలో .  ఒకటిన్నర పేజీల కథ రాయడానికి 6 నెలలు తీసుకున్న. ఒక నిజమైన సందర్భం నుంచి రాసిన కథ. కాబట్టి నిజంగా జీవితాలు మార్పు చూసే రాయాలనుకుని నిశ్చయం చేసుకున్న కథ. కొన్ని అక్షరాలే రాసిన నిజాయతీగా నిలబడాలి అనే తత్వం ఉన్న మనిషినే అనుకుంట  నా గురించి నేను (ఇంకా రచయతని అని చెప్పుకునే అర్హత  లేదని ). ఎక్కడి నుంచి వీచింది ఈ గాలి అంటే మాత్రం కారణం  గురువు గారు శేషేంద్ర శర్మ గారు. గురుభ్యోనమః. స్వస్తి.

—***—

 

 

 

 

 

చందు తులసి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దావత్ పరిచయం మంచి పసందైన భోజనానికి ముందు చూపించిన స్టాటర్ లా బాగుంది. రచయితల పరిచయం మంచి ఆలోచన. అభినందనలు చందు తులసి గారు. అక్క ఉమ కథ ఉండడం మరో ఆనందం.

  • దావత్ కథా సంకలనం మాంఛి దావత్ . చిన్నప్పట్నుంచి కథలు వినుడంటే మస్తు ఖాయిసు.నాయినమ్మ రోజుకో కథ జెప్పేది. ఇప్పుడంటే పత్రికల్లోనో.. వొయిల్లోనో..సదువాల్సొత్తాంది.దావత్ లో వచ్చిన ఒక కథ “రంగుల గూడు” సదివిన.సంచార జాతుల జీవన స్థితిగతుల్ని తెలుసుకుంటానికి జయధీర్ తిరుమల్ రావు గారి గైడెన్స్ తో వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా మాట్లాడి , ఆ అనుభవంతో మా సాయితగాడు “వజ్జీరు ప్రదీప్ ” అల్లిన కథ .

    ప్రదీప్ అన్న కథలు చాలా సరళంగా,ఏకబిగిన సదివించేటట్టు ఉంటయి.వివిధ పత్రికల్లో పదికి పైగా కథలు అచ్చుకు నోసుకున్నయి.ఒకటి అరా కథలకైతే బెదిరింపు కాల్స్ అందుకున్న సంధర్భాలున్నయి.అంతలా ఇన్వాల్వ్ చేయగలిగినంత నిజ జీవిత సమస్యల్ని,మానవ సంబంధాల్ని కథలుగా రాత్తాండు.

    మిత్రుడు ప్రదీప్ కు శుభాకాంక్షలు. సంకలన కర్తలు సంగిశెట్టి శ్రీనివాస్ గారికి,వెల్ధండి శ్రీధర్ గారికి శనార్తులు

    బండారి రాజ్ కుమార్

  • సంకలనాన్ని కూర్చిన వారికి, అంత మంచి కథల పుస్తకాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు, చందు తులసి గారు! కథలు రాసినవారందరికీ పేరుపేరునా శుభాభినందనలు! తప్పక కొని చదువుతాను.

    • థాంక్యూ మేడం. చదివాక కథల గురించి కూడా నాలుగు మాటలు రాస్తే ఇంకా సంతోషం మేడం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు