ఖాళీ పేజీలు -2

తర్కమూ, ప్రేమా విలోమాలు. మనిషికి తర్కం అర్థంకాదు. తర్కానికి మనిషి అందడు.

ఫ్లైట్ ఇంకో పావు గంటలో లాండ్ అవుతుందని  టీవీ మానిటర్లో చూసాడు శివ.

ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ తిరుగుతున్నాడు.

ఈ ఎయిర్‌పోర్ట్ లో పికప్‌కి వెళ్ళడం లాంటి దిక్కుమాలిన పని లేదని విసుక్కున్నాడు.  నిజానికి తను ఇలా పికప్‌కి రావడం మొదటి సారి.

తను ఇండియా వెళ్ళి వచ్చినప్పుడు కూడా శీను తనకోసం వచ్చేవాడు కదా? అని సర్దుకున్నాడు.

అటూ ఇటూ పచార్లు చేస్తూండగా సుధీర్ కనిపించాడు.  దూరాన్నుండి చూసాడు గానీ వెళ్ళి పలకరించలేదు.

సుధీర్ నేహ బాయ్ ఫ్రెండ్. ఇద్దరూ మూడేళ్ళుగా ఒక కంపెనీలో కలిసి పనిచేసారు.

ప్రేమించు కున్నారు కూడా.

శీనూ, నేహల ప్లానులో ఇతనూ ఒక భాగ స్వామే.

వీళ్ళ ముగ్గురి ఉచ్చులో నిరుపమ చిక్కుకుపోయింది.

సుధీర్ వస్తాడని శివ ఊహించ లేదు. శీను చెప్ప లేదు కూడా.

వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువగా ఉంటుందని వ్యాన్ తీసుకు రమ్మనమనే చెప్పాడు.

సుధీర్ కంట పడడం ఇష్టం లేక వేరే వైపు వచ్చేసాడు.

సుధీర్ అతనికి ఎందుకో నచ్చడు.

అలా అని సుధీర్ చెడ్డవాడేమీ కాదు. శివాకి నచ్చడంతే!

ఎవరు ఎప్పుడు ఎందుకు నచ్చుతారో చెప్పలేం. అందరూ అందరికీ నచ్చాలని లేదు.

సుధీర్ మామూలుగా మాట్లాడినా శివ మాత్రం అతన్ని భరించలేడు.

ఇమ్మిగ్రేషన్ చెక్స్ అయ్యి బయటకి వచ్చేసరికి కనీసం గంట పడుతుందని అనుకున్నాడు.

పైగా అందరికీ హెచ్. వన్ (H1) వీసాలు కూడా.

“ఇంకా ఎంత సేపు ఈ వెయిటింగ్ … దేవుడా! “అనుకున్నాడు.

కార్ పార్కింగ్ గరాజులో  కారు పెట్టి  టెర్మినల్ వైపు వెళుతూండగా “మామ్! ఫ్లైట్ నేనూ ఎక్కచ్చా? మా ఫ్రెండ్స్ అందరూ ఫ్లైట్ ఎక్కారట మామ్!” అని అడిగాడు నీహార్.

ఒక్కసారి ఉలిక్కి పడ్డాను.  పుట్టి బుద్దెరిగాక వాడెప్పుడూ ఫ్లైట్ ఎక్క లేదు.

వాడు పుట్టిన మూడు నెలలకి రాజు బావతో పిట్స్‌బర్గ్ వెళ్ళాను.

అది నీహార్‌కి తెలియదు.

రాజు బావ పోయాక బే ఏరియా దాటి బయటకి కదిలింది లేదు.

అమ్మా, నాన్న వచ్చారు కదా, వాళ్ళతో తీసుకెళ్ళాలని అనుకున్నాను.

“ష్యూర్ నాన్నా! తాతయ్య, అమ్మమ్మా అందరం లాసేంజిలిస్ ఫ్లైట్లో  వెళదాం!” అన్నాను.

అది విని వాడి మొహం విచ్చుకుంది.

రాజు బావ పోయి ఆరేళ్ళు కావస్తోంది. తనని మర్చిపోవడం కోసం పనిలో పడ్డాను.

మొదట్లో నీహార్ ఆలనా పాలనా ఉండేది.

వర్కు వలన వాణ్ణీ డేకేర్‌కి పంపే దాన్ని.

నిజానికి వాణ్ణి డిస్నీలాండ్ కూడా తీసుకెళ్ళ లేదు. వాడూ ఎప్పుడూ పేచీ పెట్ట లేదు.

మరలా వాడి చేత అడిగించుకో కూడదని అనుకున్నాను.

ఇమ్మిగ్రేషన్ దగ్గర అమ్మకి వీల్ చైర్ సహాయం తీసుకోమని చెప్పాను.

ఓ అరగంట తరువాత అమ్మా, నాన్నా బయటకి వచ్చారు.

నన్ను చూడగానే మొదట అమ్మ గుర్తు పట్ట లేదు.

ఓ క్షణం తేరపార చూసింది.

ఎప్పుడూ బిగుతుగా పైకి జడ వేసుకునే నేను ఇలా బాబ్డ్ హెయిర్‌లో కనిపించేసరికి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూనే ఉంది.

నాన్నా బాగా చిక్కి పోయాడు. అమ్మ మామూలు గానే ఉంది.

నీహార్‌ని పరిచయం చేసాను. నాన్న వాణ్ణి దగ్గరకి తీసుకున్నాడు.

నన్ను చూసి అమ్మ షాక్‌నుండి తేరుకున్నాక, నన్ను పట్టుకొని బావురుమంది.

నేనూ ఆవిణ్ణి ఆప లేదు.

ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న దుఃఖం. అది బయటికి రావాలి.

నవ్వడమే కాదు; ఒక్కోసారి ఏడవడం కూడా మనిషికి అవసరం.

నవ్వు సంతోషం ఇచ్చినా ఇవ్వకపోయినా దుఃఖం మాత్రం మనసుకి తెరిపినిస్తుంది.

అమ్మ అంతలా ఏడుస్తున్నా, నా కంట ఒక్క చుక్క రాల లేదు.

నాన్న ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.

చీటికీ మాటికీ ఏడ్చే నేను ఇలా పాషాణంలా తయారయ్యానేవిటా అన్న ఆశ్చర్యం ఆ కళ్ళల్లో కనిపించింది.

నాన్న స్వతహాగా మితభాషి. ఎప్పుడోకానీ బయట పడడు.

నన్ను వేరేలా చూసిన బాధలో అమ్మ నీహార్ని కూడా దగ్గరకి తీసుకో లేదు.

కోలుకున్న తరువాత అమ్మే వాణ్ణి గారాబం చేస్తుందని నాకు తెలుసు.

ఇంతలో ఫోన్ మ్రోగడంతో అమ్మ ఏడుపు ఆపింది.

ఫొన్ చేసింది కర్తార్. తను బయట వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.

లగేజ్ తీసుకొని బయటకి వచ్చాం. కర్తార్ లిమో బయటే ఉన్నాడు. మమ్మల్ని చూడగానే పరుగెత్తుకొచ్చి సామాను లిమోలో పెట్టాడు.

కర్తార్‌ని అమ్మా, నాన్నలకి పరిచయం చేసాను.

నీహార్ డోరు తెరుచుకొని ఎక్కేసాడు.

ఇంత పొడవాటి కారు చూసి అమ్మా, నాన్నా ఆశ్చర్యగా చూసారు.

వాళ్ళు కూర్చున్నాక, నేను డ్రైవర్ సీటులోకి వెళ్ళి కర్తార్‌కి నా వ్యాను తాళాలూ, పార్కింగ్ లాట్ టిక్కెట్టూ ఇచ్చాను.

లిమో స్టార్ట్ చేసిన వెంటనే పాసెంజర్ విండో తెరిచాను.

నేను ఇంత పెద్ద లిమో డ్రైవ్ చెయ్యడం చూసి నాన్న నోరెళ్ళ బెట్టి చూస్తూనే ఉన్నాడు.

“తాతయ్యా! మై మామ్ ఈజ్ ఎ షాఫర్! యు నో?” నీహార్ గట్టిగా అన్నాడు.

అమ్మకి అర్థం అయ్యుంటుందని అనుకోను. నాన్నా ఇది చూడడం మొదటి సారే.

అమ్మా, నాన్నని చూసాక మనసు స్థబ్ధుగా అయ్యింది.

ఏం మాట్లాడాలో తెలీని స్థితి.

మనస్ఫూర్తిగా నవ్వడం ఎప్పుడో పోయింది.

ఊహించని స్థితిలో వాళ్ళు నన్ను చూస్తున్నారు.

అమెరికా రావడం;  రాజు బావ పోవడం; నేను ఇండియా వెనక్కి రాననడం;

లంగా వోణీ  వేసుకున్న నన్ను ఇలా ప్యాంటూ షర్టుతో చూడ్డం; ఇలా లిమో నడపడం; ఇవన్నీ కొత్తే.

బొట్టు లేని నుదుటితో సహా!

శివని దేవుడు కరుణించాడో ఏమో,  శీనూ, నేహా త్వరగానే బయటకి వచ్చారు.

మానిటర్‌లో వాళ్ళ రాకని గుర్తించాడు శివ. మెల్లగా అటువైపు వెళ్ళాడు.

ఇంతలో ఎక్కడనుండి వచ్చి ఊడి పడ్డాడో తెలీదు సుధీర్ వచ్చాడు.

అతన్ని చూడగానే నేహ బ్యాగ్ పెట్టుకున్న కార్టు పక్కన పెట్టేసి అతన్ని హత్తుకుపోయింది.

శీనూ, శివా ఆశ్చర్యంగా చూసారు.

నేహా కార్ట్ శివ తోసుకుంటూ బయటకి వచ్చాడు. నేహ ప్రవర్తన ఎందుకో శీనుకు నచ్చినట్లు లేదని శివ గమనించాడు.

పార్కింగ్ గారజు వైపు వెళుతూండగా – “ఏరా! నీరు రాలేదేంట్రా….?” శివని అడిగాడు. తనే వద్దన్న విషయం చెప్పాడు.

వ్యానులో లగేజి పెడుతూండగా నేహ వచ్చింది.

“నేనూ సుధీర్ వేరే కారులో వస్తాం. యూ గైస్ కెన్ గో ఎహెడ్!” అనేసి శీను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ కుండా వెళ్లిపోయింది.

“మీరూ మన అపార్ట్‌మెంట్‌కే రండి…” అని శీను గట్టిగా అరిచాడు.

దారి మధ్యలో ఉండగా శివ శీనుని అడిగాడు – “ఏరా ఎంతకాలం రా ఈ నాటకం? నేహా, సుధీర్లని మనవాళ్ళు ఎవరైనా చూస్తే  ఏం తెలీనట్లు ఉంటారనుకుంటున్నావా? ఈ విషయం మీ వాళ్ళకి తెలిస్తే…?”

“నాదీ అదే భయం రా! నేహా ఎంత చెప్పినా వినడం లేదు. లైట్ తీసుకో!” అంటుంది.

“నా కెందుకో భయంగా ఉందిరా? మీరు చేసేది మాత్రం తప్పనిపిస్తోంది,” అని మాత్రం అన్నాడు.

“ఏం చేస్తాం! తప్పదురా. జాగ్రత్తగా ఉండమని నువ్వూ నేహకి చెప్పు,” అని మాత్రం అనగలిగాడు శీను. కానీ అతనికీ తెలుసు నేహా ఎవరి మాటా వినదని.

వెయ్యి అబద్ధాలు చెప్పి ఓ పెళ్ళి చేయాలంటారు.

అసలు వీళ్ళ పెళ్ళే పెద్ద అబద్ధం.

శీను ఆ సంభాషణ పొడిగించకుండా నీరుకి ఫోన్ చేసాడు.

ఓ నలభై నిమిషాల తరువాత దీప వాళ్ళమ్మ వచ్చింది.

వస్తూనే దీపని కావలించుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

దీప మాత్రం ఏమీ మాట్లాడ లేదు. దీప వాళ్ళమ్మ పేరు లక్ష్మి.

“నీ కోసం తెచ్చిన వెల్లుల్లి ఆవకాయ ఇమ్మిగ్రేషన్ దగ్గర లాగేసుకున్నాడే!” అంటూ దీపకి చెప్పింది.

“ఏవీ తీసుకు రావద్దని చెప్పానా? ఇక్కడ అన్నీ దొరుకుతాయి, చూద్దూవుగాని!” అంది దీప.  ఇంతలో స్వరూప్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.

“మా అమ్మ వచ్చింది, బయల్దేరాం,” అని చెప్పి ఫోన్ పెట్టేసింది దీప.

“ఎవరూ, ఫోన్? నీరజ్ గాడా…?” అడిగింది లక్ష్మి.

“అమ్మా! అమెరికాలో అడుగు పెట్టి ఒక గంట కూడా కాలేదు, అప్పుడే మొదలు పెట్టావా…?” విసుక్కుంది దీప.

“ఏమో, అతనేమోనని…” నసిగింది లక్ష్మి.

“అమ్మా, నీ కన్నీ తెలుసు.  మా మధ్య మాటల్లేవు.. చాలా…” విసుగ్గా అంది దీప.

“నీతో ప్రతీదీ చికాకేనే!   ఏమో మరలా ఇద్దరూ కలుస్తారేమోనన్న ఆశతో అడిగాను…”

“కల్లోకూడా జరగని పని…వదిలెయ్!” కోపంగా అంది దీప.

“మరలాంటప్పుడు ఆ విడాకులు తీసుకోవచ్చు కదా? ఇలా ఎన్నాళ్ళని…?”

“అమ్మా! నీకు చెప్పినా అర్థం కాదు. దయ చేసి ఈ ప్రస్తావన మరలా తీసుకు రావద్దు. ఇన్నాళ్ళూ నువ్వు వస్తావన్నా ఎందుకు రావద్దని చెప్పానో తెలుసా? ఇందుకే! నీ ప్రశ్నలు భరించే ఓపిక నాకు లేదు…”

లక్ష్మి అసహనంగా తల తిప్పుకొంది.

అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అనుకుంది దీప.

ఇక్కడి పరిస్థితులూ, ఈ దేశం గురించి వీళ్ళకి ఏమీ తెలీదు.

ఏదో న్యూస్ పేపర్లో చదివినవి విని అన్నీ నిజం అనుకుంటారు.

నీరజ్‌కీ, తనకీ చెడిందని తెలిసి ఉన్న పళంగా విడాకులు ఇచ్చేయమంటారు దీపా అమ్మా, నాన్నా.

“ఏమోనే! నీ జీవితాన్ని నరకం చేసిన వాణ్ణి తన్ని తగలేయాలి.  వాడి కోసం నువ్విలా అవడం…” విసుక్కుంటూ అంది లక్ష్మి.

“అమ్మా! నాకు జరిగింది అన్యాయం. ఒప్పుకుంటాను. మీరందరూ అనుకున్నట్టు నీరజ్ మరీ అంత చెడ్డవాడేమీ కాదు. ఇంకా చెప్పాలంటే  – మేమిద్దరం ప్రేమించుకొని, పెళ్ళి చేసుకున్నాం కూడా…”

“నేనడిగేదీ అదే! నిన్ను రాచి రంపాన పెట్టినవాణ్ణి ఇంకా వెనకేసుకోవడం ఏమిటని…” పళ్ళు కొరుక్కుంటూ అంది.

“అమ్మా! దయ చేసి నీరజ్ ప్రస్తావన తీసుకు రావద్దు.  నువ్వొస్తే నాకు తెరిపిగా ఉంటుందనుకుని సరే అన్నాను. ఉన్న తలనొప్పులు చాలు.  నువ్వు కొత్తవి సృష్టించద్దు!”  ప్రాధేయపడింది దీప.

ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు చూసి కూతురి భుజమ్మీద చెయ్యేసింది లక్ష్మి.

మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.  ఎలా ప్రవర్తిస్తారో కూడా.

తర్కమూ, ప్రేమా విలోమాలు.

మనిషికి తర్కం అర్థంకాదు.

తర్కానికి మనిషి అందడు.

ప్రేమ ఒక్కటే తర్కానికిఅతీతం.

కారు మెల్లగా మిల్‌పీటస్ వైపుగా వెళ్ళింది.

ఫ్లైట్ లాండయ్యి దాదాపు గంటన్నర కావస్తోంది.

దేవవ్రతకి కంగారు మొదలయ్యింది.

అనూ మాత్రం బయటకి రాలేదు.

ఇమ్మిగ్రేషన్‌లో చిక్కుకుందా అనుకున్నాడు.  ఎంత ఇమ్మిగ్రేషన్ అయినా కనీసం ఫోన్ చేస్తుంది కదా? కనీసం మెసేజ్ అయినా ఇవ్వాలి.

అంతకీ పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్లాక్‌బెర్రీ ఫోన్ కూడా కొని పట్టుకెళ్ళాడు.

ఫ్లైట్ ఎక్కే ముందు మేసేజ్ ఇచ్చింది కూడా.

అడగడానికి అక్కడ ఎవరూ లేరు. ఎవరో అమెరికన్ ఆఫీసర్ కనిపిస్తే అడిగాడు, కాథే పసిఫిక్  ఫ్లైట్ ఇమ్మిగ్రేషన్ అయ్యిందా అని. అయ్యిందని, ఇప్పుడు లండన్ ఫ్లైట్ నడుస్తోందని చెప్పాడు.

దేవవ్రతకి కంగారు ఎక్కువయ్యింది.

చెమటలు పట్టేసాయి.

వెంటనే  ఇంటికి కాల్ చేసాడు.

“ఒరేయ్! నేనూ ఎయిర్‌పోర్టుకి వెళ్ళానురా. ఎక్కడో మిస్ అయ్యుంటుంది,” తండ్రి నిద్ర చెడగొట్టినందుకు విసుక్కుంటూ సమాధానం ఇచ్చాడు.

వెంటనే  మావ గారికి కాల్ చేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారేమో  కాల్ వెళ్ళడం లేడు.

లాండ్ లైనుకి చేసాడు. అదీ ఔటాఫ్ ఆర్డర్ అని వచ్చింది.

పిచ్చెక్కి పోయింది దేవవ్రతకి.

సరిగ్గా అప్పుడే ఒక కాప్ కనిపిస్తే వెళ్ళి అడిగాడు, లోపలకి వెళ్ళచ్చా అని.

“వెళ్ళడం కుదరదు. ఒక పని చెయ్యి. డిపార్చర్ సెక్షన్‌లో  కాథే పసిఫిక్ కౌంటర్ వుంది. వాళ్ళ దగ్గర పాసెంజర్ లిస్టు ఉంటుంది. దే కెన్ హెల్ప్ యూ!” అని చెప్పాడు.

వెంటనే హుటా హుటిన డిపార్చర్ గేట్ వైపుగా పరిగెత్తాడు.

అక్కడ చూస్తే చచ్చేటంత లైన్ వుంది. వెళ్ళి అక్కడున్న ఆఫీసర్‌ని అడిగాడు.

అతను వేరే ఒక కౌంటర్ వైపు వెళ్ళ మన్నాడు. అక్కడ చిన్న లైనుంది. తన వంతు వచ్చాక వెళ్ళి విషయం చెప్పాడు.

పిడుగు లాంటి వార్త చెప్పింది ఆ ఆఫీసర్! అటువంటి పేరు గల వ్యక్తి ఈ ఫ్లైట్ పాసింజర్ లిస్టులో లేడని చెప్పింది.

వెంటనే  హైద్రాబాదు టికట్ వివరాలూ, ఇవన్నీ ఇచ్చాడు.

ఆమె కంప్యూటర్‌లో మెల్లగా చూస్తోంది.

దేవ వ్రతకి సహనం నశించింది.

“సార్! నేను కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ చెక్ చేసాను. హైద్రాబాదు నుండి హాంగ్ కాంగ్ వరకూ ఈ పాసెంజర్ లిస్టులో ఈ పేరుంది. హాంకాంగ్ పేసెంజర్ లిస్టులో లేదు.

బహుశా ఫ్లైట్ మిస్ అయ్యుండచ్చు,” అని చెప్పింది.

హాంకాంగ్‌లో ఫ్లైట్ మిస్ అయితే కనీసం ఈమెయిల్ అయినా ఇస్తుంది కదా?

ఏం చెయ్యాలో పాలు పోలేదు.

మరలా నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడని అడిగాడు. రేపటి ఫ్లైట్‌లో చూడమని చెప్పింది.

రేపటి ఫ్లైట్ పాసెంజర్ లిస్టు వివరాలు తెలియాలంటే రాత్రి పన్నెండు తరువాత తెలుస్తుందని చెప్పింది.

మరలా ఇంటికి కాల్ చేసాడు. షరా మామూలే. తండ్రి విసుక్కున్నాడు.

విషయం చెప్పాక – “ఉండు, మీ మావ గారికి ఫోన్ చేస్తాను,” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

ఓ అయిదు నిమిషాల తరువాత ఫోన్ చేస్తే – “ఏమోరా? మీ మావగారింటికి ఫోన్ వెళ్ళడం లేదు. ఓ పని చేస్తా తెల్లారగానే వెళ్ళి అడుగుతా!” అన్నాడు తండ్రి.

అనూ వాళ్ళ బాబయ్యదీ హైద్రాబాదే. వెంటనే – ఆయనకి ఫోన్ చేసాడు.

ఆయన ఫోన్ తీసాడు విసుక్కుంటూ.

“నేను ప్రస్తుతం ఆఫీసు పనిమీద గౌహాటి వచ్చాను. కాసేపయ్యాక మా అన్నకి కాల్ చేస్తాలే,” అంటూ విసుక్కున్నాడు.

సరేలే రాత్రి మరలా ఎయిర్‌పోర్టుకి వద్దామని ఇంటి ముఖం పట్టాడు.

ఇంటికొచ్చాకా కేథే పసిఫిక్ వాళ్ళకి హాంకాంగ్ కాల్ చేసి అడిగాడు.

అయినా ఫలితం లేకపోయింది.

ఇంటికొచ్చిన రెండు గంటల తరువాత దేవవ్రత తండ్రి ఫోన్ చేసాడు.

“ఓరేయ్! దేవా! పొలో మంటూ పొద్దున్నే ఈ సీ ఐ యెల్ వరకూ ఆటోలో వెళ్ళొచ్చా. తీరా చూస్తే వాళ్ళ మీ మావగారిల్లు  తాళం పెట్టి ఉందిరా? ఊరెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మొన్న ఎయిర్‌పోర్టులో కలిసినపుడు చెప్పుండేవాడు కదా…?

అంతకీ ఆయన చెల్లెలికీ కాల్ చేసి అడిగాను. ఆవిడకీ తెలీదంది. ఎక్కడికైనా వెళ్ళారేమో, తెలీదు…” అంటూ నిట్టూర్చాడు.

దేవవ్రతకి తల తిరిగిపోయింది.

హుతాశుడయ్యాడు.

బెడ్‌రూం వైపుగా వెళ్ళాడు.

గదంతా కమ్ముకున్న గులాబీ వాసన అతనికి ఎక్క లేదు.

ఒక పక్క కంగారు; మరో పక్క ఏమయ్యింటుందా అన్న భయం!

కసిగా కోపంతో దబుక్కున మంచం మీద వాలాడు.

గట్టిగా అరిచాడు.

ఒక గులాబీ ముల్లు చురుక్కున గుచ్చుకుంది.

 

 

 

 

గొర్తి సాయి బ్రహ్మానందం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు