కవులు సందిగ్ధ సంధ్యలో వున్నారా?

న గతం ఎప్పుడూ మనను వెంటాడుతుంది. ..ఎందుకంటే గతం ఒక కాలం కాదు. అదొక రూపం. ఆ గతం మన బాల్యం కావచ్చు. మన యవ్వనం కావచ్చు. మనం కవిత్వం చదివిన రోజులు కావచ్చు. మనం తిరిగిన రహదారులు కావచ్చు. మనం నవ్విన నవ్వులు కావచ్చు. మన దుఃఖాలు కావచ్చు. మనం పంచుకున్న రోదనలు కావచ్చు.. ఇవన్నీ విశేషణాలు కాదు. ఇవన్నీ మన రూపాలు. మన ఏక వచనంలోని బహువచనాలు.

కాని ఇప్పుడు గతం లేదు. గతాన్ని సమాధి చేశామనుకుని బతుకున్నాం. అసలు మనకు గతం లేదేమో.. అన్నట్లు జీవిస్తున్నాం. అసలు మనం తల్లి గర్భంలో పుట్టలేదేమో, బాల్యాన్న చూడలేదేమో, యవ్వనం అసలు లేదేమో….

కరచాలనంలో ప్రసరించిన విద్యుత్ లో స్నేహపు లోతు ఏదీ?

మౌనంలో జ్ఞాపకం నగర యంత్రాలపై మీటే సంగీతం.. చెదలు పట్టిన పుట్టలో మట్టి వాసన. నిద్ర నిండిన చీకటి కనురెప్పల మధ్య కలాన్ని ప్రేమించే కాగితాల రెపరెపలు.. మౌనం నిద్దట్లో పలకరించే పసిపాప నవ్వు.. .

వారణాసిలో ప్రముఖ హిందీ కవి జ్ఞానేంద్ర పతి కూడా ట్రామ్ లో ఒక జ్ఞాపకం అనే శీర్షికతో.. గతాన్ని కళ్లముందుంచారు.

ఆ కవిత ఇలాసాగుతుంది..

చేతన్ పారిక్, ఎలా ఉన్నావు?

మునుపటి లాగే ఉన్నావా?

కొన్ని సార్లు సంతోషంగా,

కొన్ని సార్లు ఉదాసీనంగా

ఒకో సారి నక్షత్రాలను చూస్తూ

మరోసారి పచ్చగడ్డిని తడుముతూ..

చేతన్ పారిక్, ఎలా కనిపిస్తున్నావు?

ఇప్పటికీ కవితలు రాస్తున్నావా?

నీకు నేనంటే గుర్తుండకపోవచ్చు.

కాని నేను నిన్ను మరిచిపోలేదు.

నడుస్తున్న ఈ ట్రామ్ లో కళ్ల ముందు మళ్లీ కదులుతున్నావు

నీ అమాయక భౌతిక రూపం కళ్లాడుతోంది.

నీ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.

చేతనా పారీక్, ఎలా ఉన్నావు?

మునుపటి మాదిరే ఉన్నావా?

కళ్లలో ఇంకుతున్న పుస్తకాగ్నిలాగా ?

నాటకాల్లో ఇంకా నటిస్తున్నావా?

లైబ్రరీల చుట్టూ ఇంకా తిరుగుతున్నావా?

నా లాంటి దేశ దిమ్మరి కవులు ఎదురవుతున్నారా?

ఇంకా పాటలు పాడుతున్నావా, చిత్రాలు వేస్తున్నావా?

ఇంకా నీకు ఎందరో మిత్రులున్నారా?

ఇప్పటికీ పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నావా?

ఇంకా గడ్డం పెంచుకుని ఆమెనే ప్రేమిస్తున్నావా?

చేతనా పారిక్, ఇంకా బంతిలాగా ఉల్లాసంగా ఎగిరిపడుతున్నావా?

అప్పటిలాగానే పచ్చగా ఉన్నావా?

అప్పటిలాగే రణగొణ ద్వనులు, ట్రాఫిక్ జామ్ , రద్దీ, తోసుకోవడాలు

ఏమీ మారలేదు. ట్యూబ్ రైలు వేస్తున్నారు. ట్రామ్ సాగుతోంది

కలకత్తా వికలమైంది. పరిగెత్తుతూ నిరంతరం అవిరామంగా.

ఈ మహావనంలో ఇంకా ఒక పిచ్చుకకు స్థలం ఖాళీగా ఉన్నది.

మహానగరపు మహా వికటాట్టహాసంలో ఒక నవ్వు లేని లోపమే కనిపిస్తోంది

విరాట ప్రతిధ్వనుల్లో ఒక గుండె చప్పుడు లేదేమో అనిపిస్తోంది

బృందగానంలో ఒక కంఠం వినిపించడం లేదు.

నీ రెండు పాదాల చోటు ఇంకా ఖాళీగానే ఉంది.

అక్కడ పచ్చగడ్డి మొలిచింది. అక్కడ మంచుబిందువులు మెరుస్తున్నాయి

అక్కడెవరూ చూపు సారించలేదు.

మళ్లీ ఈ నగరానికి వచ్చాను. కళ్లద్దాలు తుడుస్తూ, తుడుస్తూ చూస్తాను

మనుషుల్నీ పుస్తకాల్నీ స్మరిస్తూ రాస్తాను

రంగరంగుల బస్సులు, ట్రామ్ లు, రంగురంగుల మనుషులు

రోగాల, శోకాల, నవ్వుల, సంతోషాల, యోగాల వియోగాలను చూస్తాను

ఈ నగరంలో రద్దీ అలుముకుంది.

నీ ఆకారం పట్టే స్థలం ఖాళీగా ఉన్నది.

చేతన్ పారిక్ ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?

చెప్పు, చెప్పు.. మునుపటిలాగా ఉన్నావా?

ఉత్తరాదిన ఉన్నా, దక్షిణాదిన ఉన్నా.. నేడు కవులు ఒక సంధిగ్ధ సంధ్యలో ఉన్నారేమో.

ఇది అన్వేషణా యుగం. ఇక్కడ సిద్దాంతాలకు తావు లేదు.

ఇక్కడ ప్రశ్నలకు తావుంది. ఇక్కడ గతంలోని మన రూపం కోసం అన్వేషణ ఉన్నది.

ఇప్పుడున్నది మనకు రెండవ జన్మ. రెండవ ఆకారం.

ప్రవాహం ఒకే చోట ఆగదు, ఆగితే కుళ్లిపోతుంది. దాన్ని ప్రవాహం అనరు.

ఇవాళ ఇనుపకంచెలు ఒక్క కాశ్మీర్ లోనే లేవు

దేశమంతా ఉన్నాయి. ప్రపంచమంతా ఉన్నాయి.

నీతో నీవు మాట్లాడుకుంటే కూడా అది స్వగతంగా మిగిలిపోవడం లేదు.

నిజానికి ఏదీ స్వగతం కాదు. వ్యక్తిగతం అసలేమీ కాదు.

నేటి కాలాన్నీ, ధ్వనినీ పట్టుకుని, విస్తృత జీవితంలో స్పృశించని అంశాల్నీ తాకడం సులభం కాదు.

చరిత్రలో కొట్టుకుపోయిన పేజీలను కనిపెట్టి పునర్లిఖించాలని నేటి తరం కోరుతోంది.

ఇవాళ చరిత్ర సంకెళ్లలో ఉంది.

గతం కొట్టుకుపోతోంది. దాన్ని వెంటబడి ఎండిన ఆకుల్నీ కొమ్మల్నీ పట్టుకుని చరిత్రను మళ్లీ లిఖించాలి. గతంలోని రూపాల్ని మళ్లీ చిత్రించుకోవాలి.

గతాన్ని తలుచుకున్నప్పుడల్లా అది ఆకారమై వెంటపడుతోంది

మరో హిందీ కవి కుంవర్ నారాయణ్ అంటాడు

కొన్ని సార్లు చరిత్ర

త్వరగానే పునరావృతమవుతుంది

దూరంలోని ధ్వని కూడా

మౌన రాత్రుల్లో సముద్ర తీరం వద్ద

స్పష్టంగా వినిపిస్తుంది

కొన్ని సార్లు నాణాల ధ్వని కావచ్చు

మరికొన్ని సార్లు మనుషుల రోదన కావచ్చు.

 

ఆయనే అంటాడు మరో కవితలో..

మనం భయపడిందే జరుగుతుందా?

మళ్లీ మన నమ్మకం విఫలమవుతుందా?

మళ్లీ మనం తెలివితక్కువవాళ్ల లాగా

బజార్లలో బానిసల్లాగా అమ్ముడుపోతామా?

మన పిల్లల్ని వాళ్లు కొని

దూర ప్రాంతాలకు తరలించి

తన భవనాలు నిర్మించుకుంటారా?

ఇలాగే

తరతరాలుగా,

మనం సగర్వంగా

వాళ్ల కోసం మన గుళ్లనీ, మసీదులనీ, మన గురుద్వారాల్నీ

మన కూలిపోయిన కోటల్నీ

గర్వంగా చూపిస్తూ బతుకుతామా?

పురాస్మృతులు తెరుచుకున్న అమరుడి కళ్లలా వెంటాడుతున్నాయి. సమాధులపై నుంచి సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. చల్లారిన చితిమంటల్లోంచి పక్షులు లేచి నీలి గగనాన్ని స్పృశిస్తున్నాయి

జ్ఞానేంద్రపతిలా ప్రశ్నించనా.. చేతనా పారిక్, ఎక్కడున్నావు? అని.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇప్పుడు అందరూ చదవాల్సిన అంశం ఇది.మంచి విశ్లేషణ. శుభాకాంక్షలు సార్.

  • oka manchi rachana. aksharanjali masapatrikalo prachurimchaalanukumtunnaam. kavi garini & saranga patrika vaaru anumatinchagalarani manavi. mee samadhananikai …
    …editor, aksharanjali masapatrika, wanaparthy Dist.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు