కంచెలు తెంచిన కంచరపాలెం!

మనిషి మరో మనిషిని కులంతోనూ, మతంతోనూ తూచిన ప్రతిసారి మానవవాదం సంతలో సరుకులా అమ్ముడుపోతూనే ఉంటుంది.

జ్ఞాపకాల కాపరి నేర్పరితనంతో నేసిన అల్లరి అల్లిక!, మధురానుభూతులు ముమ్మరంగా పూసిన పూదోట!, జారవిడిచిన గుర్తులు పూలదండగా వలచి అలంకరించుకున్న పాత్రల కావ్యమాలిక ఈ కంచరపాలెం. ఈ సినిమాతో తెలుగు సినిమాకి నూతన శకారంభమని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో సినిమాలు మార్చలేని తెలుగు సినిమాకి ఓ కొత్త మార్గం చూపిన ఘనత కొన్ని సినిమాలకే దక్కుతుంది. అలా అప్పట్లో ‘శివ’. శివ సినిమాతో ముందు – తరువాత అని మాట్లాడుకున్నారు. మళ్ళీ చాలా కాలం తరువాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాని శివతో పోల్చడం జరిగింది కానీ, అర్జున్ రెడ్డి సినిమా ముందు – తరువాతని చెప్పుకొనే అంతేమీ కనిపించ లేదు. కొందరు RX100 అన్నారు గానీ, దానికీ – దీనికి సంబంధం లేదు. కానీ ‘కంచరపాలెం’ సినిమా తరువాత శివ సినిమా అంత ఇంప్యాక్ట్ సినీ పరిశ్రమ మీద కనిపిస్తుంది. అది ఇంకా పూర్తిగా అర్ధంకానీ వారికి ఇవి అతిశయోక్తి వాక్యాల్లా అనిపిస్తాయి. ఇంతకాలం తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకాలన్నింటినీ తుంగలో తొక్కి, తెలుగు సినిమాకి ఓ కొత్త ‘మహా’భాష్యం రాశాడు. నేల విడిచి సాముచేస్తున్న తెలుగు సినిమాని భూమార్గం పట్టించి మట్టి పరిమళాలు అద్దిన ఘనత ఈ నూనూగు మీసాలదే!.

ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉన్న వారికి ఏ యూనివర్సిటీ డిగ్రీలతో పనిలేదు. డిగ్రీలుండీ ప్రాపంచిక దృష్టి లేనప్పుడు ఆ డిగ్రీలు కూడా ఎందుకు పనికిరావు. అందుకే లోకాన్ని మించిన యూనివర్సీటి; మనుషుల్ని మించిన పుస్తకాలు లేవనిపిస్తుంది. అదే కంచరపాలెం సినిమాలో గమనించవచ్చు. సినిమాలు తియ్యడానికి సమాజాన్ని, మనుషుల్ని చదివి ఒక సామాజిక ఎరుకని కలిగివుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా విదేశాల్లో ఫిల్మ్ కోర్సులు చెయ్యడం వల్ల అందులోనుండి బయటపడలేక    ఆ సినిమాల అనుకరణ ఎక్కువైపోతుంది. మన నేటివిటి, భాషామాండలికాలు, సహజ జీవన విధానం మిస్ అవుతుంది. ఈ కంచరపాలెంలో అదే ప్లస్ అయ్యింది. ఈ సినిమా ఆద్యంతం సహజత్వంతో నిండిన మట్టికుండే. ఆ పాత్రల్ని చూస్తూ, మాట్లాడుతూ రాసుకున్న కథ కనుకే ఆ పాత్రలు, సన్నివేశాలు అంత నిజత్వాన్ని పుంజుకున్నాయి. ఈ కథ నాలుగు గోడల మధ్య రాసుంటే? ఈ పాటికి కుల, మత మనోభావాలు దెబ్బతినేసుండేవి. వాటి పై సుదీర్ఘ టీవీచర్చలు చేసి తద్వారా ఉపశమనం పొందుతుండేవారు. సినిమాలు చూస్తూ సినిమాల్ని రాసే హైబ్రిడ్ రచయితల వల్ల కుల, మత నాయకులకు మీడియా ఆఫీసులే మెడికల్ సెంటర్లుగా మారిపోయాయి.

ఇంతకాలం సినీ ఫ్యామిలీస్ నుండి వస్తున్న యువ హీరోలకి అసలు సినిమా అంటే ఏమిటో తెలుసా? వరల్డ్ సినిమాలు వీళ్ళు చూస్తారా? కనీసం మన పక్క భాషా చిత్రాలైనా చూస్తారా? అనే సందేహాలు వీళ్ళ స్టోరీ సెలక్షన్స్ చూస్తుంటే వస్తుంటాయి. ఇలాంటి హీరోలు కంచరపాలెం లాంటి సినిమాలు చెయ్యాలంటే ఇంకెంత కాలం పడుతుందో?. ఈ వారసుల గుంపులో తను ప్రత్యేకమైన వాడినని తన మొదటి సినిమా నుండి నిరూపించుకుంటు వస్తున్న యువ హీరో ‘రానా’. ఇతని స్టోరీ జడ్జ్ మెంట్లో ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఆ విషయం అతను సెలక్ట్ చేసుకుంటున్న సినిమాలు చూస్తుంటే మనకే అర్ధమౌతుంది.

కొంతమంది హీరోలు జీవితకాలం హీరోలుగానే మిగిలిపోతారు. వీళ్ళ వల్ల సినిమా పరిశ్రమకి ఒరిగేదేమి ఉండదు. సంవత్సరానికో సినిమా! అని కొన్ని గుడ్డి లెక్కలు వేసుకుంటూ మంచి ‘కథల్లేవంటూ’ కదలరు. ఆ ఫేక్ హీరో ఇమేజ్ ఛట్రంలో పడి కొట్టిమిట్టాడుతుంటారు. ఏమైనా ప్రయోగాత్మకమైన కథలో, మల్టీస్టార్ల సినిమాలో వస్తే చెయ్యరు. కానీ ప్రేక్షకులకు సినిమా చూడ్డం రాదనే భ్రమల్లో బతికేస్తుంటారు. ఇంకొంత మంది హీరోలైతే చక్కగా కథలు రాసుకుంటారు, సొంత డబ్బులు పెట్టి బయట సినిమాలు కూడా నిర్మిస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల వేల మందికి ఉపాధి దొరుకుతుంది. సినిమా కూడా ఒక పరిశ్రమగా గుర్తింపు పొందుతుంది.

ఈ కంచరపాలెం మన దాక రావడానికి మరొక ముఖ్య వ్యక్తి సురేష్ బాబు. ఈయనకున్న బిజినెస్ మైండ్ కి ఈ కంచరపాలెం చక్కని ఉదాహరణ. ఈ సినిమాని తీసుకొని తన దగ్గరే పెట్టుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి ఓపినింగ్స్ వచ్చెలా చేశారు. దానికి తోడు కంటెంట్ నచ్చేసరికి సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఎంతోమంది తెలుగు సినిమా మీద బతుకుతున్నారు. ఎంచక్కా సెలబ్రెటీ హోదాల్ని అనుభవిస్తున్నారు. మావి పెద్ద పెద్ద సినీ నిర్మాణ సంస్థలని గుండెలు బాదుకుంటుంటారు. కానీ ఇక్కడి వాళ్ళు ఎవ్వరూ ఈ కంచరపాలాన్ని నిర్మించలేకపోవడం అనేది అవి ఎంత గొప్ప నిర్మాణ సంస్థలో, వీళ్ళు ఎంత విశాల మనస్కులో మనకే అర్థమౌతుంది. ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థల మధ్యలో సినిమా విలువలు తెలిసిన ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘రానా’ లాంటి హీరోలు ఉన్నంత కాలం తెలుగు సినిమా మన సోదరభాషీయుల సినిమాల సరసన తలెత్తుకొనే ఉంటుంది.

నిజంగా నువ్వు డాక్టర్వే అమ్మా ప్రవీణ! సినిమా తీస్తే కేవలం డబ్బు సంపాదనకే తప్పా కనీస విలువలు పాటించడం మరిచారు. డబ్బు జబ్బు పట్టి జీవించడం మానేసి, బతికేస్తున్న తెలుగు సినిమాకి నీ చేతి వైద్యం అందించి, ఒక నవశకానికి నాందివయ్యావమ్మా. తెలుగు సినిమా నీకు ఏమి నేర్పించిందో తెలియదుగానీ, నువ్వు మాత్రం తెలుగు సినిమాకి ఒక కొత్త బంగారు బాట వేసావమ్మా. పేరులో ఉన్న విజయ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఈ కంచరపాలెంతో సినీ చరిత్రలో నీపేరు పదిలం చేసుకున్నావు.

దేశాల్ని, రాష్ట్రాల్ని మనుషులు పాలిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మనలో ఉన్న మూఢనమ్మకాలు పాలిస్తున్నాయన్నది ఈ జనాలకి అర్థంకాక మేమే అంటూ తొడలు కొడుతుంటారు. మనిషి మరో మనిషిని కులంతోనూ, మతంతోనూ తూచిన ప్రతిసారి మానవవాదం సంతలో సరుకులా అమ్ముడుపోతూనే ఉంటుంది. కులాలు, మతాలు మానవ స్వేచ్ఛని ఎన్ని విధాలుగా హరిస్తున్నాయో కళ్ళకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు వెంకటేష్ మహా. ఇది కేవలం హృదయంలో తడి ఉన్న వారు మాత్రమే గమనించగలరు. ఇలా అనేక సమస్యల్ని చర్చకు పెట్టిన ‘మహా’నేర్పరి. మొదటి సినిమాతోనే ఇలాంటి సంక్లిష్టమైన అంశాల్ని సమాజంలో తను చూడ్డం, ఈ సినిమా ద్వారా ప్రజలకు చూపించడం దర్శకుడిలోని సామాజిక స్పృహకి నిదర్శనం. ఈ కంచరపాలెం సినిమాలో స్ర్తీ స్వేచ్ఛని సమర్థిస్తూ, స్ర్తీల పక్షాన నిలిచి పోరాడిన ఒక ‘చలం’ కనిపిస్తాడు. కుల, మతాలకన్నా ‘మానవ వాదం’ గొప్పదని అనేక పుస్తకాలు రాసిన ‘మానవ తత్వవేత్త యం.యన్. రాయ్’ కనిపిస్తాడు. ఇలాంటి భౌతికవాదాంశాలు శాస్ర్తీయంగా చర్చించడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకులకు గౌరవం పెరిగింది. ఇలాంటి సినిమా సురేష్ బాబు వరకు వెళ్ళడానికి ముఖ్యపాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ శిద్దారెడ్డికి, అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన స్వీకర్ అగస్తికి, పల్లె అందాలు అచ్చం అలాగే చూపించిన కెమెరామేన్లకు ధన్యవాదాలు.

కంచరపాలెం తెంచిన కంచెలకు మరిన్ని పల్లె అందాలు వెండితెర మీద విరబూయడానికి అవకాశాలు విచ్చుకున్నాయి. ప్రతీ రచయిత, దర్శకుడు తన కథో, తన ఊరి కథో ఎందుకు చెప్పకూడదనే ఆలోచనలు రేకెత్తుతాయి. కథలు, పాత్రలకోసం సినిమాల్లో దేవులాడ్డం మానేసి సమాజంలో వెతకడం మొదలౌతుంది. కథాబలమున్న సినిమాలు నిర్మించడానికి భారీ సెట్లు, భారీ బడ్జెట్లు అవసరం లేదనే విషయం తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కంచరపాలెంలో అనేకం. ఒక్కమాటలో చెప్పాలంటే మహాకవి శ్రీశ్రీ మాటల్లోనే ‘‘కళ్లంటూ ఉంటే చూసి,/వాక్కుంటే వ్రాసి!/ ప్రపంచమొక పద్మవ్యూహం!/ కవిత్వమొక (సినిమా) తీరని దాహం!’’

*

 

 

 

 

ప్రవీణ్ యజ్జల

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు ప్రవీణ్. మీ విశ్లేషణ తో సినిమా పై మరింత ప్రేమ గౌరవం పెరిగాయి. మీ భాష బావుంది. శుభాకాంక్షలు.

  • మీ విశ్లేషణ పూల బాణాలు మెత్తగా హత్తుకుంటూనే… ఎలాంటి సినిమాలు పరిశ్రమకి అవసరం ఉందో చురకలతో చురుకుగా తెలియజేశారు.. చాలా బాగుంది సార్.. అభినందనలు…

  • కంచెరపాలం విశ్లేషణ బాగుంది .పల్లె జీవనం భాష …యాస చిత్రీకరణ సహజంగా అద్భుతంగా ఉన్న చిత్రం.

  • ఈ సినిమా మొదటి రోజు అనుకోకుండా చూసాను .వారం రోజులు మనిషి కాలేక పోయాను.ఎ పని చేస్తున్న ఆ సినిమా కళ్ళల్లో కనబడుతూ ఉంది .మీ సమీక్ష చదివిన తరువాత చాలా సంతోషంగా ఉంది

  • మీ అంతరంగాన్ని చాలా బాగా విప్పారు అన్న, ఈ కంచరపాలెంలో వేశ్యగా నటించిన స్త్రీ పాత్రపై ఆ యువకుడు చూపించిన ప్రేమ రాయప్రోలు అన్నట్టు అమలిన శృంగార ప్రేమ, ఆలాంటి మాటలను పలికే యువత ఇప్పుడు ఒక్కరైనా కనిపిస్తే ఒట్టు. ఏదేమైనా చక్కని సందేశం అందించిన మంచి చిత్రం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు