ఎప్పుడు చదివినా అదే అనుభూతి!

ఏ కథకైనా “మెలోడ్రామా” కొసమెరుపై కథకు బలం చేకూరుతుంది. కానీ, అదే మెలోడ్రామా తెచ్చిపెట్టుకున్నట్టనిపిస్తే మాత్రం నూనెలో బూరె చీదేసినట్టు కథ సాంతం దెబ్బతింటుంది.

థను “ఫ్రేం” కట్టినట్టు ఒక్క అక్షరం అటు ఇటు కాకుండా, సున్నితపు త్రాసులో అక్షరాలన్ని తూచి “చాసో” కథలా రాయాలంటారు కొందరు. “కథారంభం పాఠకుడి పిలకట్టుకుని చివరదాకా ఈడ్చుకుపోవాలంటారు” బీనాదేవి. కథ చదువరి “గుండె పెంకులెగరగొట్టి, లోపలి “వ్యాక్యూమ్‌”ని తిలక్‌ కథలమల్లే వెలికి తీయాలంటారు వాకాటి పాండురంగరావు. పద్మరాజుకి మల్లే కథను పూర్తయ్యేలోపు రచయిత అడ్డు దూరకుండా, పాత్రలు వాటి స్వభావరీత్యా అవి ముందుకు సాగితే అదే మంచి కథనేది మరో వాదన.

పై లక్షణాలన్నీ ఒకే కథకుడిలో ఇమిడి ఉండటం అసాధ్యం. కాకపోతే, ఒక్కోసారి ఒక్కో కథలో అవన్నీ అతికినట్టు భలే సరిపోతాయి. సరిగ్గా అలాంటిదే ఒమ్మి రమేష్‌బాబు రాసిన “కుట్టుకూలి” కథ. సరిగ్గా 20 ఏళ్ల క్రితం “సుప్రభాతం”లో వచ్చినప్పుడు చదివినా, మళ్లీ ఇప్పుడు చదివినా ఒకే అనుభూతి.

కథకుడికి కాలస్పృహ ఉండాలి. అలాగే పరిసరాలపైన కూడా. ఒక దగ్గర “మధ్యాహ్నం ఎండని చల్లబరుస్తూ గోదావరి గాలులు వీస్తున్న సమయం” అంటాడు కాబట్టి అటుఇటుగా కథ జరిగిన ప్రాంతం రాజమండ్రి లాంటి టౌను అనుకోవాలి. మధ్యాహ్నం నుండి మసక చీకటి ఆవరించేలోపు… అంటే, సరిగ్గా కథ నడిచిన ఆ ఆరుగంటల్లోపే మనుషుల్లోని లోపలి మనుషుల్ని బయటికి లాగి మనకు పరిచయం చేస్తాడు రచయిత.

గొరుసు

టూకీగా కథ చెప్పాల్సివస్తే-

కథలో హీరో, విలనూ ఒకడే.. విష్ణు! “గిరీశం” డిఎన్‌ఎకి సాపత్యమున్న పాత్ర! పాతికేళ్ల కుర్రాడు. డిగ్రీ పూర్తిచేసినా సరైన ఉద్యోగం లేక జులాయిగా తిరుగుతూ తొట్టి గ్యాంగుతో కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడూ సిగరెట్‌ పొగలతో, చిల్డ్‌ బీర్లతో కైపెక్కీ, అడ్డమైన వాగుడూ వాగడం- డబ్బులు ఎరవేసి “సుఖాన్ని” కొనుక్కోవడం అతగాడి వ్యాపకాలు. తండ్రి రైల్వే ఉద్యోగి. తనతోపాటు ఇంట్లో ఉండేది అమ్మ, నానమ్మ, అన్నయ్య, వదిన, చెల్లి. కథ ప్రారంభమయ్యేసరికి ఇంట్లో ఉన్నది విష్ణుతోపాటు నానమ్మ, అమ్మ, వదిన మాత్రమే! వీళ్లందరితోపాటు కథకు కీలకమైన మరో పాత్ర బొంతలు కట్టే ముప్పై ఏళ్ల ఫ్రౌడ- వసారా బయట, మెట్ల నీడన!

విష్ణు ఆ రోజు మధ్యాహ్నం నిద్రలేచే సరికి బొంతలు కట్టే ఆవిడ ముందు పాతబట్టలన్నీ కుప్పగా పోసి “కుట్టుకూలి”ని బేరసారాలాడుతోంది నాన్నమ్మ. ఆ కొత్త మనిషిని చూడగానే అతగాడికి “ఆ సుఖం”లోని సుఖం గుర్తుకొచ్చింది. వెన్నెముక జలదరించింది. లాలాజలం స్రవించింది. ఆమెనే గమనిస్తూ ఆలోచనల్ని గుణిస్తున్నాడు. తల్లి, వదిన వంటింట్లో ఉంటే, బొంతలావిడకి కాపలాగా గడప మీద కునికిపాట్లు పడుతూ నాన్నమ్మ.. కళ్లు తిప్పకుండా ఆమెనే గమనిస్తున్న విష్ణు. పేదరికం మనిషి బుద్ధిని “దొంగ”ని చేసినట్టే ఆమెనీ చేసింది. అటూఇటూ చూసి బట్టల్లోంచి సరిగ్గా తనకి సరిపోయే జాకెట్‌ని తీసి.. రెప్పపాటు కాలంలో తన ఒంటిపై ఉన్న జాకెట్‌పైనే తొడుక్కుని ఏమీ ఎరగనట్టు బొంతలు కుట్టే పనిలో నిమగ్నమైంది.

దొంగని దొంగే పట్టుకోగలడన్నట్టు.. అద్దాల్లోంచి ఆమెనే గమనిస్తున్న విష్ణుకి అదొక గొప్ప అవకాశం. బొంతలు కుట్టడమైపోయాక తనకు రావల్సిన మజూరి అందుకుని ఆమె వెళ్లిపోతుంది. మామూలుగా అయితే డబ్బులు ఎరవేసి “సుఖాన్ని” కొనుక్కునే విష్ణుకి ఇప్పుడు డబ్బుతో అవసరం లేదు. ఆ సుఖాన్ని అందుకోవడానికి ఆమె “దొంగ బుద్ధి” ఒక ఆసరా. అదనంగా ట్రంకు పెట్టెలోని ఒక చీరని కడుపులో దాచుకుని ఆమెను వెంబడిచ్చాడు. మసక చీకటిలో ఆమెకు అడ్డు తగిలాడు. ఆమె అతగాడి వాలకం గమనించింది. ముఖం చిట్లించింది. అదనంగా చీరను ఎర చూపాడు. ఛీకొట్టింది. వేసుకున్న జాకెట్టుని చిటికెలో విప్పేసి అతగాడి మొహాన విసిరికొట్టి ముందుకు విసవిసా వెళ్లింది. విఠలాచార్య సినిమాలో మాంత్రికుడి మంత్రదండం తలపై తగలగానే ఏనుగులాంటి మనిషి ఎలుకలా మారిపోయినట్టు ఆమె వ్యక్తిత్వం ముందు అతడు మరుగుజ్జయ్యాడు. పిపీలికం అయ్యాడు. వెనుదిరిగి ఇంటికి చేరాడు. చేతిలోని చీరని ఇంట్లోవాళ్లకు చూపించి “బొంతలు కట్టే మనిషి తీసుకుపోతుంటే వెంబడించి లాక్కొచ్చాన”ని బొంకాడు. నాన్నమ్మ బొంతలు కుట్టే ఆవిడ్ని దుమ్మెత్తిపోసింది.

ఇదీ “కుట్టుకూలి” కథ!

పేరులో రంగు రుచి వాసన లేనట్టు ఏ సొగసూ లేదు. వినడానికి సాదాసీదా పేరది. అయినా కథ మొదలుపెట్టగానే.. స్టేషన్లో జనాల్ని ఎక్కించుకుని కుదుపుల్తో కదిలి ఆనక కూతలేస్తూ స్పీడందుకునే రైలల్లే సాగుతూ, మనలో ఉత్కంఠకి తెరతీస్తుంది. కథల్లోని పాత్రలు ఎక్కడా వాటి హద్దులు దాటవు. నిజానికి ప్రథమ పురుషలో కథ రాయడం చాలా కష్టం. ఉత్తమపురుషలో రాసినంత సులువు కాదు. ఏ వాక్యం ఎక్కడ ముగించాలో అక్కడే ముగిస్తాడు. ఏ మేరకు చెప్పాలో.. అంతకంటే ఒక్క అక్షరం ఎక్కువ చెప్పడు.

ఏ కథకైనా “మెలోడ్రామా” కొసమెరుపై కథకు బలం చేకూరుతుంది. కానీ, అదే మెలోడ్రామా తెచ్చిపెట్టుకున్నట్టనిపిస్తే మాత్రం నూనెలో బూరె చీదేసినట్టు కథ సాంతం దెబ్బతింటుంది. చివర్లో బొంతలావిడ్ని అనుసరించి, ముగ్గులోకి దింపాలనుకోవడం, ఆమె అతగాడ్ని ఆ రోడ్డుపైన ఛీకొట్టడం ఈ కథలోని ముగింపు ఘట్టమే అయినా.. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న నాటకీయత కన్పించదు. రచయిత స్వీయ అనుభవంలో బొంతలు కుట్టే ప్రక్రియ చూసి ఉండకపోతే ఇంత వివరంగా, విపులంగా రాయడం అసంభవం. కథ కోసం రకరకాల పాత్రల్ని సృష్టించే రచయిత ఆయా పాత్రల్లో ఏదో ఒక పాత్రలో దాగి ఉంటాడనేది నమ్ముతాను. ఈ కథలో బొంతలు కుట్టే ఆవిడలో రచయిత అంతర్లీనంగా దాగున్నాడనేది నా దృష్టి కోణం.

కథను రాయడం కంటే కథను విశ్లేషించడం కత్తిమీద సామే. అది అందరికీ పట్టుబడే విద్య కాదు. దీని బదులు ఎంచక్కా కథ రాసుకోవడం ఉత్తమం. అయినా సరే, “కుట్టుకూలి” కథను మీకు పరిచయం చేయాలన్న ఉత్సుకతతో ఈ నాలుగు మాటల్ని రాయడానికి సాహసించాను.

కుట్టుకూలి

ఒమ్మి రమేష్‌బాబు

 

మధ్యాహ్నపు నిద్ర నుంచి అప్పుడే మెలుకువొచ్చింది విష్ణుకి.
కళ్లు తెరిచే సరికి ఎదురుగా ఆమె కూర్చొని వుంది.
అతని నిద్రమత్తు వదిలిపోయింది.
వీధిగదిలో వాకిలివేపుగా వేసిన మంచం మీద పడుకొని వున్నాడు విష్ణు. వాకిట్లో మెట్ల వరస పక్కన నీడలో ఆమె కూర్చునుంది.
విష్ణు విలాసంగా ఒళ్లు విరుచుకుని, చెదిరిన జుట్టుని చేతివేళ్లతో దువ్వుకున్నాడు. దీర్ఘంగా ఆమెవైపు మరోసారి చూశాడు.
ఆమె నల్లగా వుంది. అయితే ఆ నల్లదనంలో ఒక మెరుపుంది. ముఖం కళగా వుంది. అవయవ పుష్టి వల్ల కావొచ్చు- ఆమె కూర్చోవడంలో సొగసైన పొందిక వుంది.
“ఎవరీవిడ?” అన్న సందేహంతో విష్ణు కళ్లు విచ్చుకున్నాయి.
“అమ్మా! టీ పెట్టవే” అన్నాడు రోజూ కన్నా కాస్త గొంతు పెంచి. ఊహించినట్టుగానే ఆమె చూపు క్షణకాలం అతని వైపు తిరిగింది. ఆ చూపునే తొలి పరిచయంగా జమ చేసుకున్నాడు.
ఇంతలో శారదమ్మ ఇంట్లోంచి గంపెడు పాతబట్టల్ని మోసుకొచ్చి ఆమె ముందు కుప్పపోసింది. శారదమ్మ విష్ణు నాయనమ్మ. “ఇంకా వున్నాయి, తెస్తానుండు” అని చెప్పి మరోమారు ట్రంకు పెట్టెల్ని గాలించి మరికొన్ని బట్టలు తీసుకొచ్చింది. అవన్నీ ఇంటందరూ వాడి వదిలేసినవి. చీరలు, జాకెట్లు, చొక్కాలు, ఫేంటులు, లుంగీలు, దుప్పట్లు, కర్టెన్లు- వగైరా వగైరా.
శారదమ్మ కనిపెట్టుకుని వుండగా ఆమె ఆ బట్టల్ని పరిశీలనగా సర్దింది. అనంతరం అన్నది:
“అమ్మా! వీటితో చక్కటి బొంతలు రెండవుతాయి”
“రెండే కుడతావో మూడే కుడతావో నీ ఇష్టం. కానీ బొంతలు మాత్రం కంటికి నదరుగా ఆనాలి. పడుకోవడానికి సదుపాయంగా వుండాలి” అన్నది శారదమ్మ.
“అమ్మా మీరే దగ్గరుండి చూస్తారుగా. నా పనితనానికి పేరెట్టలేరు. నేను బొంత కుడితే మెచ్చకుండా వుండలేరంటే నమ్మండి”
“సరిసర్లే, కబుర్లకేం గానీ కుట్టుకూలి ఎంతిమ్మంటావో చెప్పు”
శారదమ్మ బేరసారాలు చేస్తుండగా విష్ణు వదిన సౌమ్య టీ తీసుకొచ్చింది. విష్ణు తన దృష్టిని ఎటూ చెరదనీయకుండా వాళ్ల మాటలే వింటున్నాడు. ఆ మాటల సారాంశాన్ని బట్టి వాకిట్లోని మహిళెవరో అర్థమైంది అతనికి.
ఆమె బొంతలు కుట్టే కూలిమనిషి.
ఆమె ఎవరో, ఎందుకొచ్చిందో తెల్సిన తర్వాత తేలికగా ఊపిరి తీశాడు విష్ణు. తేలికపాటి చూపులతో ఆమెని శల్యపరీక్ష చేశాడు. మధ్యాహ్నపు ఎండని చల్లబరుస్తూ గోదావరి గాలులు వీస్తున్న ఆ సమయాన అతనిలో చిత్రమైన కదలిక వచ్చింది.
“ఒక్కో బొంతకీ యాభై రూపాయలు మజూరీ ఇప్పించండమ్మా” అన్నది కుట్టుకూలి.
“నోటికొచ్చినంత అడుగుతున్నావు. నీకేవన్నా న్యాయంగా వుందా” శారదమ్మ వాదానికి దిగింది.
“నోటికొచ్చినంత ఎలా అడుగుతాను తల్లీ! పని దొరికితే పోగొట్టుకుంటామా చెప్పండి. ఇప్పుడు కూర్చుంటే చీకటిపడే వేళగ్గానీ పని పూర్తవదండీ”
“నువ్వు ఎంత సేపట్లో కుడితే నాకేంటి? రెంటికీ కలిపి అరవై రూపాయలు తీసుకో”
“బొత్తిగా అరవయ్యేంటి తల్లీ! అన్యాయం కాకపోతే!! ఇందులో బేరవాడ్డానికే వుందీ. నా పనితనం చూసిన తర్వాతే నచ్చినంత కూలి ఇప్పించండి”
“చివరగా చెప్తున్నాను. నేను అరవయ్యే ఇస్తాను. అంతకంటే ఐదు పైసలు కూడా ఎక్కువిచ్చేది లేదు”
“కుదరదమ్మా! మీ బట్టలు మీరే వుంచుకోండి. నా తోవన నేపోతాను”
బేరం కుదరక తెగదెంపులు జరిగిపోతున్న ఆ సమయంలో విష్ణు తల్లి సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య వాకిట్లోకి వచ్చారు. పెద్దావిడని అలాగే వదిలిపెడితే బేరం కుదరదు. శారదమ్మ అరవై సంవత్సరాల్ని దాటేసింది. పొదుపరి. పైసా ఖర్చుపెట్టాలంటే ప్రాణాలు పోయినంత బాధ పడుతుంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వరి కల్పించుకోక తప్పలేదు. తన అత్తగార్ని వారించీ, “ఇంక బేరాలు ఎందుగ్గానీ, ఎనభై తీసుకో. బొంతలు మాత్రం బాగా కుట్టాలి సుమా..” అని వ్యవహారాన్ని చక్కబెట్టింది. ఆ పూట ఆ రకంగా పని మొదలవడానికి కుట్టుకూలికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.
విష్ణు మంచం దిగి పక్క సర్దేడు. మొహాన్ని చన్నీళ్లతో కడుక్కున్నాడు. డ్రెస్సింగు రూమ్‌లో ఫ్యాను గాలిని ఆస్వాదిస్తూ తల దువ్వుకున్నాడు. పౌడర్‌ అద్దుకున్నాడు. ఎందుకనో చన్నీళ్లతో ముఖం కడిగినప్పుడు చెంపలు అదిరాయి. తల దువ్వుకుని అద్దం ముందు నిల్చున్నప్పుడు పెదాలు చిలిపిగా విచ్చుకున్నాయి. ముస్తాబు పూర్తయ్యాక తిరిగొచ్చి మంచం మీద స్థిరంగా కూర్చున్నాడు. వాకిట్లోకి స్థిరంగా చూశాడు. మనసులోపల ఆలోచనల అలజడి.. గజిబిజి.
శారదమ్మ వాకిలి గుమ్మానికి జారగిలింది. ఎవరేనా పనిచేస్తుంటే కాపలా కాయటం ఆమెకి అలవాటే. కుట్టుకూలి తన పని చకచకా చేసుకుపోతోంది. ఆమె దగ్గర వెదురుతో అల్లిన చిన్న బుట్ట వుంది. దానిలో అరడజను బొంతసూదులూ, నాలుగు పెద్ద దారపు కండెలూ, కత్తెర వున్నాయి. ఆమె కత్తెరతో బట్టలకున్న బొత్తాలు, హుక్స్‌ వంటివి ఒడుపుగా తెంచింది. తర్వాత చీరలు, దుప్పట్లు మినహా మిగతా వాటిని కత్తిరించడం మొదలుపెట్టింది. ఆమె చేతులు అత్యంత వేగంగానూ, నైపుణ్యంగానూ కదులుతున్నాయి. ఆమె చక్కని పనిమంతురాలని చెప్పడానికి అంతకంటే వేరే సాక్ష్యం అక్కరలేదు.
సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య వంటావర్పుల పనితో తీరక లేకుండా వున్నారు. విష్ణు చెల్లి సాగరిక స్నేహితులతో టూర్‌కి వెళ్లింది. అతని తండ్రి మాధవరావు రైల్వే ఉద్యోగి. అన్న రామకృష్ణ ప్రైవేట్‌ కాలేజీలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌. ప్రస్తుతం ఇద్దరూ ఇంట్లో లేరు.
విష్ణు పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. పాతికేళ్లు నిండినా సరైన ఉద్యోగం లేదు. లోపల్లోపల ఏదో అసంతృప్తి. అతని మావయ్య కూతురు నీరజ. అందీ అందని సౌందర్యరేఖ. తరచూ గుర్తొస్తోంది. పగలే కలల్లోకొస్తోంది. తీరని కోరికల వేడి గుండెలో. నిరుద్యోగమూ, పెళ్ళికాని జీవితమూ- రెండూ అతనిలో అసహనాన్ని పెంచుతున్నాయి.
తన గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలీదు విష్ణుకి. ఎప్పుడేనా మిత్రులతో చెప్పినా, వాళ్లూ ఆటపట్టిస్తుంటారు. అప్పుడప్పుడూ సిగరెట్‌ పొగలతో, చిల్డ్‌బీర్లతో కైపెక్కీ అడ్డమైన వాగుడూ వాగటం, డబ్బులు ఎరవేసి సుఖాన్ని కొనుక్కోవటం- ఇవీ ఇటీవలి అతని వ్యాపకాలు.
మనిషిలోపలి ఈ కనిపించని రూపం ఈ రోజెందుకో కల్లోల పెడ్తున్నట్టుగా వుంది. ఒకటే కలవరంగా వుంది. అతని కళ్లకి వాకిట్లోని కుట్టుకూలి జీవం వున్న శిల్పంలా అందంగా దగ్గరగా కనిపిస్తోంది.
ఆమెకి ముప్పయేళ్ల వయసుండొచ్చు. శరీరపు ఒంపులు ఎక్కడా చెదరలేదు. వంగపండు రంగు అంచున్న పసుప్పచ్చని చీర, వంగపండు రంగు జాకెట్‌ వేసుకుంది. చీర, జాకెట్టు అక్కడక్కడా చిరుగులు పట్టి వున్నా అవి ఆమె ఒంటి మీద అలంకారంగానే అమిరిపోయాయి.
విష్ణు చూపు నేరుగా ఆమెనే గురిచూస్తోంది.
ఆమె మాత్రం ఎవర్నీ పట్టించుకోవడం లేదు. ఒక్కో బట్టనీ బొంతలో ఇమిడ్చేందుకు వీలుగా కత్తిరిస్తోంది. శారదమ్మ వేసిన బట్టలన్నీ ఆమె చేతిలోని కత్తెర వేటుకి ముక్కలవుతున్నాయి. ఒకటొకటే ముందటి రూపాన్ని కోల్పోతున్నాయి. అలా గడిచిపోతున్న ఆ సన్నివేశం వున్నట్టుండీ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. శారదమ్మ అక్కడే కూర్చున్నా చిన్నగా కునుకులోకి జారుకుంది.
కుట్టుకూలి బట్టల్ని కత్తిరించేందుకు ఎంచుకుంటుండగా ఆమె చేతికి వంగపండు రంగు జాకెట్టు అందింది. అది అచ్చంగా ఆమె ధరించిన జాకెట్టులానే వుంది. అయితే ఎక్కడా రంగు మాయలేదు. కుట్లు చెదరలేదు. ఆ జాకెట్టు చేతికందగానే ఆమె ఇష్టంగా అటూఇటూ తిప్పి చూసింది. దాన్ని మిగతా బట్టల్లో కలపకుండా పక్కకి తప్పించింది.
ఈ దృశ్యం కళ్లబడగానే విష్ణు ఒక్కసారే అప్రమత్తమయ్యాడు.
కత్తెర పట్టిన ఆమె చేయి యంత్రం మాదిరే కదుల్తోంది. అప్పటికి కత్తిరించవలసిన బట్టలన్నీ పూర్తయ్యాయి. వాటినుంచి వంగపండు రంగు జాకెట్‌ మినహాయింపు పొందింది.
పని మధ్యలో ఆమె విరామం తీసుకుంటున్నా అది చాలా కొద్దే. కత్తెర ఉపయోగం తీరిపోగానే బుట్టలోంచి సూదీ, దారం బయటికి తీసింది. అంటే- కుట్టుపని మొదలైందన్న మాట! ముందుగా కత్తిరించి పెట్టుకున్న ముక్కల్ని ఒక దానికొకటి కలిపి కుట్టింది. ఎక్కడా వరుస తప్పకుండా ఓపికతో దగ్గర దగ్గరగా కుట్లు వేసింది. ఈ పనంతా పూర్తయ్యేసరికి సగం దారపు ఉండ తరిగిపోయింది. గంట సమయం ఇట్టే గడిచిపోయింది.
ఆమె బట్టల్ని కుడుతున్నట్టు విష్ణు కూడా ఒకదానికొకటిగా ఆలోచనల్ని కలిపి కుడుతున్నాడు. ఆమె దాచిపెట్టిన వంగపండు రంగు జాకెట్‌ అతని పాలిట ఒక పజిల్‌గా తయారయింది. పైగా ఆమె కూర్చున్న భంగిమ కూడా అతన్ని కదలనీయడం లేదు.
పని చేస్తున్న క్రమంలో ఆమె చీర కుచ్చెళ్లు మోకాళ్ల పైకి జరిగాయి.
పొట్ట మీద కప్పిన పమిట మెల్లమెల్లగా చెదిరిపోయింది.
గుండెల మీద ఆచ్ఛాదన సగం తొలగిపోయింది. నడుం ఒంపు మీద చెమట బిందువులు కూడుకొని మెరుస్తున్నాయి.
ఈ పరిణామం అతని ఉద్రేకాన్ని గుణకారం చేస్తోంది. అప్పటికి కుట్టుపని సగం పూర్తవడంతో కాస్తంత రిలీఫ్‌ కనిపించిందామెలో. అలసట తీరిన ముఖాన్ని అరచేత్తో తడుముకుంటూ-
“అమ్మా! దాహమవుతోంది. గుక్కెడు మంచినీళ్లు పోద్దురూ” అని శారదమ్మని అడిగింది. ఆ పలకరింపుతో శారదమ్మ కునికిపాట్ల నుంచి మేలుకొంది.
“మంచినీళ్లు పట్టుకొస్తాను కానీ నువ్వు పని ఆపి కూర్చోకు” అని పురమాయింపు చేసి లోనికెళ్లింది. అప్పుడు సావకాశంగా కుట్టుకూలి తనని ఎవరేనా గమనిస్తున్నారేమోనని వెతికింది. వీధి గదిలోంచి కదలకుండా మెదలకుండా చూస్తున్న విష్ణు కనిపించాడు. అంతే! సెకనులో వెయ్యోవంతు సమయంలో ఒంటి మీది బట్టని సరిచేసుకుంది. ఆమె కలవరపడ్డ తీరు చూసి, విష్ణు ముసిముసిగా నవ్వుకున్నాడు.
శారదమ్మ అందించిన మంచినీళ్లు తాగుతూ నెమ్మదిగా విష్ణుని చూసింది.
ఆమె చూపు అతన్నీ, అతని చూపు ఆమెనీ పరామర్శించుకున్నాయి.
ఆమె మళ్లీ కుట్టుపని మొదలుపెట్టింది. కత్తిరించకుండా అట్టేపెట్టిన బట్టల్లోంచి రెండు కాటన్‌ చీరలు ఎంపిక చేసింది. ఒక్కో చీరని రెండు మడతలుగా పరిచీ- అటూ ఇటూ రెండు అంచుల్నీ కుట్టుకొచ్చింది. కుట్టడం పూర్తయ్యేసరికి రెండు చీరలు బొంతలకి సరిపడే వైశాల్యం కలిగిన సంచుల్లా తయారయ్యాయి.
ఆమె వేగంగానే పనిచేస్తున్నప్పటికీ ముందటి ఏకాగ్రత కొంత చెదిరింది.
శారదమ్మ యథాప్రకారం గడపని ఆనుకుని కునికిపాట్లలోకి జారుకుంది.
తన ఆచూకీ ఆమెకి తెల్సిపోయిన తర్వాత అక్కడే కూర్చోలేదు విష్ణు. వాకిలివైపే వీధిగదికి ఒక అద్దాల కిటికీ వుంది. అయితే అవి మామూలు అద్దాలు కావు. పాలియెస్టర్‌ ఫిల్మ్‌ అంటించిన అద్దాలు. బయటికి కన్పించకుండానే వాటిలోంచి అంతటినీ స్పష్టంగా చూడొచ్చు. సందర్భం చూసుకుని విష్ణు నిశ్శబ్దంగా మంచం దిగి కిటికీ దగ్గరకి చేరుకున్నాడు. అక్కడి సోఫాలో కూర్చుంటే ఎదుటి దృశ్యం ఫ్రేమ్‌ కట్టినట్టు కన్పించింది. “ముందే ఈ ప్రదేశాన్ని ఎంచుకోవలసింది” అనుకున్నాడు.
కొంత సేపటికి తనని కాపలా కాస్తున్న అపరిచిత మగకళ్లు తన ఎదుటి నుంచి తప్పుకున్న సంగతిని కుట్టుకూలి గ్రహించింది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది.
సాయంత్రం ఆరోగంట పూర్తవడంతో వెలుతురు సన్నగిల్లుతోంది. సన్నని ఆ వెలుతుర్లో జరిగిన సంఘటన విష్ణుని మరింత అప్రమత్తుణ్ని చేసింది. శారదమ్మ కనులు మగతగా మూతపడి వున్న సమయంలో-
కుట్టుకూలి వంగపండు రంగు జాకెట్‌ని అందుకుని దాని కొలతల్ని కళ్లతోనే అంచనా వేసింది. మరుక్షణంలో గుండెల మీంచి పైటని తొలగించింది. తన ఒంటి మీది జాకెట్‌ని విప్పకుండానే రెండో జాకెట్‌ని తొడిగి హుక్స్‌ పెట్టింది. త్వరత్వరగా పైటని సర్దుకుని జాకెట్ కనిపించనీయకుండా భుజాల చుట్టూ ముసుగు కప్పింది.
ఒక్క నిముషం వ్యవధిలో జరిగిన ఈ సంఘటనతో విష్ణు విస్తుపోయాడు. అతని గుండె చప్పుడు అతనికే “దబ్‌దబ్‌”మని చెవుల్లోకి వినిపించింది. “ఎంత ధైర్యం..” అనుకున్నాడు పళ్లబిగువున.
ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేదు. మళ్లీ పనిలోకి దృష్టి మరల్చింది. సంచుల మాదిరి కుట్టిన చీరల్ని కింద అరుగుమీద విశాలంగా పరిచింది. వాటిలోకి ముందే కత్తిరించి అట్టేపెట్టిన బట్టల్ని సర్దింది. రద్దుగా మిగిలిన బట్టని కూడా కూర్చింది. లోపల సర్దిన బట్టలు చెదిరిపోకుండా ఎక్కడికక్కడ దారంతో టాకాలు వేసింది. ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా బొంతల్ని సవరించింది. ఇదంతా పూర్తయ్యాక వాటికి నాలుగోవైపున్న అంచుని ఒద్దికగా మడిచి కుట్టుకొచ్చింది. అంతటితో బొంతల పని తొంబయి శాతం పూర్తయినట్టే!
విష్ణుకి ఇప్పుడు బొల్డంత అవకాశం చిక్కింది. దొరికిపోయిన దొంగతో ఎన్ని చెలగాటాలైనా ఆడొచ్చు. అయినా, పాత జాకెట్‌ కోసమే అంత ఆత్రపడ్డ మనిషి- దానికన్నా పెద్ద బహుమతే దక్కితే ఇంకేం చేస్తుందో! ఈ ఆలోచనలతో అతనికి ఒళ్లంతా వెచ్చదనం పాకింది.
దాదాపు చీకటి పడుతుండగా వీధిగదిలోనూ, వాకిట్లోనూ లైట్లు వెలిగించి వీధిగుమ్మం దగ్గరకొచ్చాడు విష్ణు. బొంతల పైన నలుచదరపు గడులుగా డిజైన్లు కుడుతున్న ఆమె తలెత్తింది. విష్ణు నవ్వాడు. ఆమె నవ్వలేదు. అతను కనుబొమలు ఎగరేస్తూ “నాకంతా తెల్సునన్నట్టు” సైగజేశాడు. ఆమె, విషయం పూర్తిగా అర్థంగాక ప్రశ్నార్థకంగా రెట్టించింది. అతను తన చొక్కాని సంకేతంగా చూపుతూ “నువ్వు జాకెట్‌ తస్కరించడం చూశాలే” అన్నట్టు చూపుడు వేలితో హెచ్చరించాడు. ఆ హెచ్చరికతో ఆమె ముఖం పాలిపోయింది.
పైకి నవ్వుని నటించినా లోలోపల బెంగటిల్లింది. ఇప్పుడు గనుక అల్లరి జరిగితే కూలి డబ్బులు దక్కకపోగా తన్నులో తిట్లో కాయాల్సి వస్తుంది. “ఛీ! జాకెట్‌ కోసం కక్కుర్తి పడకుండా వుండాల్సింది” అని తిట్టుకుంది. అయితే- విష్ణు అస్సలు గోల చేయలేదు. రెండో కంటికి ఆ విషయం తెలియనివ్వలేదు.
ఆమెకు మాత్రం ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోతే బావుణ్ణనిపిస్తోంది.
వంట పనులు ముగించుకుని సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య వాకిట్లోకి వచ్చేసరికి తుది మెరుగులతో సహా బొంతల పని పూర్తయింది. రాత్రి ఏడు కావొస్తుండగా ఆమె కూలి డబ్బులు తీసుకొని బయల్దేరింది.
శారదమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య బొంతల్ని గదిలో పరిచి పరిశీలించారు. ఆమె పనితనాన్ని మెచ్చుకున్నారు. ముచ్చట్లకు దిగారు.
అదే మంచి సందర్భమని, విష్ణు అక్కడినుంచి నిష్క్రమించాడు. బట్టలు మార్చుకున్నాడు. ట్రంకు పెట్టిని శబ్దం రాకుండా తెరిచి అందులో ఇంకా మిగిలిన పాత బట్టల్లోంచి చేతికందిన చీరనొకదాన్ని తీసుకున్నాడు. అది ఏ రంగుదో, ఎవరి చీరో అన్న పట్టింపు లేదు. దాన్ని ఎవరికంటా పడకుండా దాచిపెట్టి రోడ్డుమీద కొచ్చాడు.
దూరంగా వీధి మలుపులో వడివడిగా నడుస్తోంది కుట్టుకూలి.
ఆమెని పోల్చుకుని విష్ణు కూడా అటువైపే వేగంగా అడుగులేశాడు.
సరిగ్గా రెండు వీధులు దాటిన తర్వాత విష్ణు ఆమెని కలుసుకుని మాట కలిపాడు-
“ఇదిగో ఆగు, నిన్నే”
ఆమె ఆగలేదు. పట్టించుకోలేదు.
“నువ్వు జాకెట్‌ తీసుకోడం చూశాన్లే. అది అడగడానికి కాదు. ఆగు, వెళ్లిపోకు. నీ పేరేంటీ?”
ఆమె పలకలేదు. పేరూ చెప్పలేదు.
“ఇష్టం లేకపోతే సరే, నీ కోసం ఏం తెచ్చానో తెల్సా- ఇదిగో ఈ చీర”
అప్పటిదాకా చొక్కా కింద దాచిపెట్టిన చీరని ఆమెకి చూపించాడు.
“చీరా, నాకెందుకూ? నేనేం అడగలేదే, వొద్దొద్దు”- అతని వంక చూడనైనా చూడకుండా జవాబిచ్చింది. నడక మాత్రం ఆపలేదు.
“నువ్వు అడిగావని కాదు, నేనే తెచ్చాను నీ కోసం”
“చీరా వద్దు. సారె వద్దు. నా వెనకెనక రావద్దు. అలా నాకిష్టం వుండదు. నేనసలే మంచిదాన్ని కాదు”
“అలాగయితే నేనూ మంచోణ్ణి కాదులే” అని వెటకారంగా నవ్వేడు విష్ణు.
“నువ్వు జాకెట్‌ దొంగచాటుగా తీసినప్పుడు నేను గొడవ చెయ్యలేదు. ఎందుకంటే నిన్ను అందర్లోనూ తిట్టించడం ఇష్టంలేకే”
“సరేలే, మంచిపనే చేసేవు. ఇంక రాకు, వెళ్లిపో”
దాదాపు ఆమెకి నడవటం కష్టంగా వుంది. విష్ణు ఆమెకి చేరువగా నడుస్తూ మాటిమాటికి తోవకి అడ్డు పడుతున్నాడు. తప్పించుకోవడం కష్టంగా వుంది. అతను చీర ఎందుకు ఇవ్వజూపుతున్నాడో ఆమెకి అర్థమైంది.
విసుగొచ్చింది. విసుగుతోపాటు బాధ కలిగింది. బాధ నుంచి అసహ్యం, అసహ్యం నుంచి కోపం, కోపం నుంచి అసహనం- అన్నీ ఒకదాని తర్వాత మరొకటి చుట్టుకున్నాయి. పాదాలు తడబడ్డాయి.
విష్ణూలోనూ అసహనం పెరిగింది. తనకి అందకుండా ఆమె తప్పించుకుపోతుందేమోనన్న కంగారు అతనిలో.
జన సంచారం లేకుండా చూసి,
విద్యుద్దీపాల వెలుతురు పల్చబడ్డ చోట-
విష్ణు ఆమె చేతిని బలంగా పట్టుకొని ఆపేడు. “ఆగమంటుంటే నీక్కాదూ! ఇదుగో దీన్ని తీసుకో” అని బలవంతంగా చీరని అందివ్వబోయాడు. ఆమె అందుకోలేదు. ఆ తిరస్కారాన్ని అతను భరించలేకపోయాడు. ఒక చేత్తో బలంగా ఆమె భుజాన్ని తనవైపుకి తిప్పుకొని రెండో చేత్తో ఆమె గుండెల్ని కసిగా అదిమిపట్టి వదిలాడు.
క్షణంలో జరిగిన ఆ ఘటనకి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒంట్లోని సర్వశక్తుల్నీ కూడగట్టుకొని ఎదురు తిరిగింది.
“ఏరా చచ్చినోడా! చెప్తుంటే నీక్కాదురా. ఇంకోసారి నా ఒంటిమీద చెయ్యేస్తే చంపుతాను జాగ్రత్త. వెనకెనక పడివస్తే, బెదిరిపోతాననుకున్నావురా! మీక్కాలిసినట్టు బొంతలు కుట్టిచ్చానే, నేను అడిగినంత కూలిచ్చారా? ఇవ్వరు మీరు. మా జీవితాలతో బేరాలాడి మా ఉసురోసుకుంటారు. నేను జాకెట్టే దొబ్బుకొచ్చాను. ఎందుకంటే నీలాంటి కాట్లకుక్కల్నించి వొల్లు దాచుకోవడానికి. మరి నువ్వేం చేశావూ.., ఈ చీరని ఎలా తెచ్చావో చెప్పు? మీ అమ్మాబాబుల్ని అడిగే తెచ్చావా దాన్ని? నడు మీ ఇంటికి, ముందా విషయం తేల్చుకుందాం…”
గొంతుని తారస్థాయికి పెంచి చుట్టుపక్కల ఇళ్లవాళ్లకి ఫిర్యాదు చేస్తున్నట్టే ఆమె చెడ తిట్టింది. చివరి మాటలంటున్నప్పుడు ఏడుపొచ్చి వెక్కిళ్లుపడింది.
ఆమె ఉగ్రరూపం దాల్చగానే విష్ణు గాలితీసేసిన బెలూన్‌లా చప్పబడిపోయాడు. ఇంటిదాకా తిరిగొచ్చి ఆమె గొడవ చేస్తుందేమోనని బెదురు కలిగింది.
దూరంగా రోడ్డుమీద ఎవరెవరో వస్తున్నారు అటే. కుట్టుకూలి ఎక్కువసేపు నిల్చోలేదక్కడ. నడివీధిన మరోసారి ఆమె తన గుండెల మీంచి పైటని తొలగించి, లోపలి జాకెట్‌ మీద తొడిగిన రెండో జాకెట్‌ని విప్పి విష్ణు ముఖానికి విసిరికొట్టింది. వెనుదిరిగి చూడనైనా చూడకుండా విసవిసా వెళ్లిపోయింది.
ఇదంతా ఎవరైనా చూస్తున్నారేమోనని విష్ణు దిక్కులు చూశాడు.
ఆమె విసిరికొట్టిన వంగపండు రంగు జాకెట్‌ ఆ వెలుతుర్లో గడ్డకట్టిన నల్లని రక్తంముద్దలా పడివుంది. దాన్ని తప్పించుకొని భారమైన అడుగులతో ఇంటికెళ్లాడు.
అతను ఇల్లు చేరేసరికీ ఇంకా వీధిగదిలోనే వున్నారు సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య, శారదమ్మ. విష్ణు వాలకాన్నీ, అతని చేతిలోని చీరని చూసి ఆశ్చర్యపోయారు.
“ఏరా చేతిలో ఆ చీరేంటీ?”
సుబ్రహ్మణ్యేశ్వరీ, శారదా ఒకేసారి ప్రశ్నించారు.
“ఏం జరిగిందా? దొంగతనం జరిగింది. కుట్టుకూలిది మన కళ్లుగప్పి ఈ చీరని ఎత్తుకెళ్లింది. దాని దొంగచూపులూ, చేష్టలూ చూసీ అనుమానించాను. వెంబడిస్తే నిజం బయటపడింది. అదక్కడ వెదురుబుట్టని సర్దుతుంటే చీర కన్పించింది. నాలుగు చీవాట్లేసి లాక్కొచ్చాను”
ఎక్కడా తడబడకుండా చెప్పాడు విష్ణు.
అతికినట్టే అంతా సరిపోయింది.
ఎక్కువసేపు వాళ్ల ముందు నిలబడకుండా మెల్లగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి జారుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరి, సౌమ్య, శారదమ్మ- ముగ్గురికీ కుట్టుకూలి మీద వెర్రికోపం వచ్చింది. ముగ్గురిలోనూ శారదమ్మకి కోపం మరీ ఎక్కువ.
“చెట్టంత మనిషిని ఎదురుగా వుండగానే దొంగతనం జేసిందంటే అది మామూలు దొంగ కాదురో, మహా మాయలాడి. నన్నే మోసం చేస్తుందా… దొంగముండ.. దెష్టముండ.. ముష్టిముండ.. పాపిష్టిముండ… దానికి పుట్టగతులు వుండవుగాక వుండవు. అది మళ్లీ ఈ వీధిన రాకపోతుందా, దాని కాళ్లు విరగ్గొట్టకపోతానా..” శారదమ్మ తిట్ల దండకాన్ని విప్పింది. బొంతమీద సౌకర్యంగా కూర్చొని కుట్టుకూలిని తీవ్రంగా శాపనార్థాలు పెట్టింది.

(2007 డిసెంబర్‌లో వెలువడిన “మంచులోయ” కథాసంపుటి నుంచి. ఈ కథ 1998లో “సుప్రభాతం”లో తొలుత అచ్చయ్యింది. 1999లో వెలువడిన తెలుగు విశ్వవిద్యాలయం వారి “తెలుగు కథ- 98” సంకలనంలో ప్రచురితమైంది.)

[చదువరులకు గమనిక: “అనగనగా మంచి కథ” శీర్షికకి ఎవరైనా రాయవచ్చు. మీకు నచ్చిన కథని పరిచయం చేస్తూ ఇదే పద్ధతిలో రాసి పంపించండి]

గొరుసు

కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది
    =====================
    బుచ్చి రెడ్డి గంగుల

  • ఒమ్మి రమేష్ బాబు కథ ఇదివరకే చదివినా ఇప్పుడు మళ్ళీ గొరుసు ఇంట్రో ,విశ్లేషణ తరువాత చదవడం మరీ బాగుంది . కథ లోపలి స్వరాన్ని గొరుసు బాగా పట్టుకున్నారు . ఇలాంటి విశ్లేషణలు కధలు మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్త్తాయి . గొరుసు కి రమేష్ బాబు కీ అభినందనలు

  • కథ, కథనం బాగున్నాయి. మంచి కథను పరిచయం చేసినందుకు గొరుసు గారికి ధన్యవాదాలు. ఇటువంటివి చదివినప్పుడు వెంటనే పెన్ను అందుకుని ఏదైనా రాయాలనిపిస్తుంది.

  • పిసినిగొట్టు గొరుసు కి అభినందనలు

    • అనుకున్నా తల్లీ ! ఎవరి కంట్లో అయితే పడకూడదనుకుని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నానో వారి కంట్లోనే పడింది. ఒక్క దిక్కుమాలిన దేవుడైనా నా మొరాలకించలేదు కదా 🙂 సంపాదకులవారు నాకిచ్చిన కితాబు “పిసినిగొట్టు ” – ధన్యవాదాలు మేడం 🙂

  • ఈ రోజుల్లో ఎంతమంది వాడుతున్నారు ఈ పదాల్నిః
    వంగపండు రంగు
    ధరించిన
    గుణకారం
    రద్దుగా
    నిజమే! గొరుసు అన్నట్టు, “రచయిత స్వీయ అనుభవంలో బొంతలు కుట్టే ప్రక్రియ చూసి ఉండకపోతే ఇంత వివరంగా, విపులంగా రాయడం” అసంభవం. ప్రతి రచయితకి కావల్సిందదే! తెలుసుకోవడం. మరీ ముఖ్యంగా కొత్త అంశం కాని వస్తువు కాని తీసుకున్నప్పుడు దాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. అది లేనప్పుడు కధ పేలవంగా తయారవుతుంది. కధ కోసం కధకుడు రమేష్ బాబుకి అంత పరిశ్రమ చేయకపోతే గొరుసుకి ఈ కధ రెండు దశాబ్దాల తరువాత కూడ గుర్తుండే అవకాశమే లేదు.

    పిసినిగొట్టు గొరుసు సాహసానికి, కధకుడు ఒమ్మి రమేష్ బాబుకి అభినందనలు.

    • ధన్యవాదాలు అనిల్ గారు ???? చివరికి మీరంతా కలిసి నా ఇంటి పేరు ” పి సి ని గొ ట్టు” గా … మార్చి వేశారు ????????????

      • నేను / మేము కాదు గొరుసు. సారంగ సంపాదకుల వారు ఆ బిరుదుని ప్రదానం చేసింది. ఇకనైనా కలానికి కధకోసం ఝళిపిస్తే బాగుంటుంది. చి న

  • శమీ వృక్షం మీద దాచిన శస్త్రాలను మరచిన సవ్యచాచి లాంటి వోడు కూడా ఈ పిసినారి గొరుసన్న

    ( తన చీడ కథతో ఆంద్రజ్యోతి వారపత్రిక సంపాదక వర్గం మనసు దోచుకున్నాడని గొరుసన్న గురించి చెప్పారు త్రిపుర గారి ఆప్తమిత్ర, సత్తెకాలపు శ్రీ రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు )

    కుట్టుకూలి కధ ఒమ్మి రమేష్ బాబుకి అభినందనలు.

  • ఇంత మంచి కథని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గొరుసు గారు. ఒక మనవి- మీరు కథా విశ్లేషణ ముందు కాక తరవాత చేస్తే బాగుండేది. మీరు కథా సారాంశం ముందే చెప్పేయటం వల్ల కథ చదువుతునప్పుడు sense of discovery లేకుండా పోయింది. మీరింకా మంచి కథలను తిరిగి ఆవిష్కరిస్తారని ఆశిస్తూ..

    • ధన్యవాదాలు ఆదిత్య గారూ 🙂 విశ్లేషణ ముందు కాక తరవాత చేస్తే బాగుండేది అన్నారు – సంపాదకులు మీ సలహాని ఇకముందు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది రెగ్యులర్ గా నా శీర్షిక కాదండి. ఎవరైనా రాయవచ్చు .. మీరు సైతం 🙂

  • ఒమ్మి కథల దగ్గరకి చివరికి చేరుకున్నాను . మంచు లోయ. మీలో కథకుడు రెక్క చాచాడు.

  • గొరుసు గారూ.. మంచులోయ కథల పుస్తకం దొరికింది. కుట్టుకూలి మీకు ఎందుకు నచ్చిందో నాకర్థమయింది. గొప్ప పరిణామశీలత, హృదయాన్ని పిండే పాత్ర వుండటం కథ ని గొప్పగా రూపొందించాయి. కథకులు గొప్ప మానవులు.
    జలజల కారిపోయే నదులు.

    సాల్యూట్ టూ ఒమ్మి.

  • బావుందండీ… కథని చదవలేదు ఇంతకుముందు. మంచి కథని పరిచయం చేశారు. ఆమె దొంగబుద్ధిని ఆసరా చేసుకుని ఆవిడని ఏదో చేద్దామనుకోవడం, ఆవిడ నిరాకరించిందని చీర దొంగతనం నెత్తినేసి కక్ష తీర్చుకోవడం, ఇతరుల మీద పడి తిని తొంగునే బుద్ధీ అన్ని అవలక్షణాలూ ఒక పాత్రలో చిన్న కథలో చొప్పించేశారు రచయిత. అభినందనలు – రచయితకీ మీకూ కూడా

    • ఆలస్యంగా స్పందించినా .. స్పందించి నందుకు ధన్యవాదాలు రాధ గారు. పాత్రలను అంత పకడ్బందీగా మలచడం – ఒమ్మి రమేష్ బాబు గొప్పదనం. కీర్తికై వెంపర్లాడక అనంత సాహితీ నిధిని పొట్టలో దాచుకుని పైకి అసలు నాకేం తెలియదు అన్నట్టు ఉంటాడాయన.

  • మొదటిసారి, చదవడం, ఈ కథ,గోరుసు గారు గురించి, కూడా!నిజంగా, చాలా మంచి కధ, మాకు బాగా నచ్చింది.. కథ విశ్లేషకులు రమేష్ సర్ కి,రచయిత కు, ధన్యవాదాలు, అభివందనలు💐💐👌!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు