అస్తిత్వ కథ అంటే దినచర్యేనా?!

అస్తిత్వ కథల దగ్గరకి వచ్చే టప్పటికి ఓ వింత పరిస్థితి ఎదుర్కొన్నాం.   పాత్రలూ, సంఘటనలూ చెప్పటమే లక్ష్యంగా మారింది.  

డచిన ఒకటిన్నర, రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సాహిత్యంలో అస్తిత్వ కథలు సంఖ్యా పరంగా పెరుగుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.   ఏ సామాజిక పరిణామం కూడా         యాదృచ్ఛికంగా జరగదు.  సాహిత్యం సమాజ పరిణామాలకి అద్దం అనుకుంటే, దాని పరిణామం కూడా   యాదృచ్ఛికం ఎంత మాత్రం కాబోదు.  అయితే ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవడంలోనూ తద్వారా ఆ కథల్ని ఆదరించడంలోనూ తెలుగు సాహితీ సమాజం గొప్ప పరిణతినే సాధించిందని గర్వంగా చెప్పుకోవచ్చు.  ఒకళ్ళ నొకళ్ళం తిట్టుకోవడానికే అలవాటు పడ్డ   తెలుగు సాహితీ కులం అప్పుడప్పుడూ కలిసి కట్టుగా సాధించిన కొన్ని మంచి సంగతుల్ని నెమరు వేసుకోవటం పండగ చేసుకోవటం తక్కువ.  సాహితీ చర్చలు ఎప్పుడూ ఎందుకు అంత నిరాశా జనకంగా ఉండాలో తెలీదు.

అస్తిత్వ సాహిత్యం ప్రబలంగా రావడానికి కారణాలు కనిపెట్టడానికి పెద్ద సామాజిక సామాజిక శాస్త్రవేత్తల అవసరం లేదు.   ప్రధానంగా రెండు కారణాలు.  ఒకటి, చాలా కాలంగా నోరు లేకుండా ఉన్న సమూహాలు చదువుకొని  ప్రధాన స్రవంతి లో తమకి దక్కాల్సిన స్థానాన్ని ప్రశ్నించడం.  మైనారిటీ, దళిత, స్త్రీ అస్తిత్వాలు ప్రధానంగా కనపడే మూడు ఇందులో.   రెండవ కారణం, అదే సమూహాలు అకస్మాత్తుగా మరింత ప్రమాదాన్ని రిఫార్మ్ ల భారతంలో ఎదుర్కోవడం.  సాంప్రదాయక వృత్తులు, వ్యవసాయం పూర్తిగా నాశనమయి పోవడం, ప్రత్యామ్నాయాలు ఏర్పడకపోవడం మరో కారణం.  ఈ పరిస్థితిలో అందరికన్నా ఎక్కువగా దెబ్బతిన్నవి ఆ మార్జినలైజ్డ్ సమూహలు.   ఆ విధ్వంసమూ, ఆ గోస సాహిత్యంలో ప్రబలంగా కనపడింది.  ఇది తెలుగు సాహిత్యం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే.

అయితే, అస్తిత్వ సాహిత్యం వల్ల సాహిత్యపు స్థాయి పడిపోయిందనేది కూడా ఓ వాదం వినపడుతుంది.  “రామయ్య నిద్రలేచాడు.  ఎండిపోయిన నేల వంకా, పిసరంత మబ్బుజాడలేని నింగి వంకా చూశాడు” లాంటి కథల్ని ఇక చదివే స్థితిలో పాఠకులు లేరు అనేది నిజమే.  ఈ స్థితిలో మళ్ళీ కథల్లో వస్తు, శిల్పాల ప్రాధాన్యత గురించిన చర్చలు ముందుకు రావడం సహజం.  ఈ వ్యాసంకూడా అందులో భాగంగానే భావించాలి.

వస్తువు, శిల్పం అనేకన్నా శ్రీశ్రీ  చెప్పినట్టు  లక్ష్యం, లక్షణం ఉంటాయని చెప్పటం సబబు గా తోస్తుంది. ప్రతికథకీ ఓలక్ష్యం ఉంటుంది. లక్ష్యం అన్నపదం వస్తువు అన్న పదం కన్న విస్తృతంగా  తోస్తుంది.  అయినా రెండు పదాలనీ కలివిడిగా కావాలని ఈ వ్యాసంలో వాడటం జరిగింది.   లక్ష్య సాధన కోసం రచయితలు తమ రచనలు చేస్తారు.  అందుకోసం కొన్ని పాత్రలు ఏర్పడతాయి. వాటికి అభిప్రాయాలు, కొన్ని బలాలూ, బలహీనతలూ ఆపాదించబడతాయి.  కొన్ని సంఘటనలు, ఆ పాత్రల విచక్షణకి పరీక్ష పెట్టేలా పనికట్టుకుని రచయిత తయారు చేస్తాడు.  ఆ పాత్రల్ని ఆ సంఘటనల్లోంచి నడిపిస్తాడు.  అంటే కథ లక్ష్యం ఈ పాత్రలకీ, సంఘటనలకీ కూడా అతీతంగా ఉంటుంది.  కొన్ని సార్లు   ఇది కాలానికీ, స్థలానికీ కూడా అతీతంగా ఉండగలదు.

ఉదాహరణకి మధురాంతకం నరేంద్ర రాసిన ”అస్తిత్వానికి  అటూ ఇటూ”  అనే కథ తీసుకోవచ్చు.  ఇందులో ఓ హిందూ, ముస్లిం యువకులు ప్రధాన పాత్రలు.  హిందూ యువకుడు ఆస్తికుడిగా, ముస్లిం యువకుడు నాస్తికుడిగా కథ ప్రారంభ మవుతుంది.  కథ చివరికి వచ్చే సరికి ఓ బలమయిన సంఘటన, ప్రాణాంతమయిన సంఘటన లోంచి ఈ రెండు పాత్రలు బయట పడతాయి.  ఆ సంఘటన ప్రభావంతో ఆస్తికుడు నాస్తికుడి గాను, నాస్తికుడు ఆస్తికుడు గానూ మారినట్టుగా సూచించి కథ ముగిస్తాడు రచయిత.    మన నిబద్ధతలు, నమ్మకాలూ వాటి పట్ల మన చుట్టూ ఉండే ప్రపంచం ప్రభావం ఎంత,   మన ఎదుర్కొంటున్న సంఘటనల ప్రభావం ఎంత అని రచయిత మనని అలోచింప చేస్తాడు ఈ కథద్వారా.  ఇదీ కథ లక్ష్యం, వస్తువు.   ఈ లక్ష్యం నెరవేరడానికి ఓ హిందువూ, ఓ ముస్లిమ్ యువకులే కావాలా?  కథ   అలహాబాదులోనే జరగాలా?  అసలు ఆస్తికత్వం  (దేవుడి మీద నమ్మకం) మీదనే ఈ కథ చెప్పాలా?  మరో సిద్ధాంతం మీద నమ్మకమో, ఓ నాయకుడి మీద నమ్మకమో ప్రధానంగా ఈ లక్ష్య సాధన చేయవచ్చునా? ఈ కథ ఈ శతాబ్దంలోనే జరగాలా?  నమ్మకాలు 15 వ శతాబ్దంలో లేవా?

ఇలాటి కథల్లో పాత్రలూ సంఘటనలూ అంత ప్రధానం కాదు అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు.  కానీ రచయిత తన పరిథిలోంచీ, తనకి తెలిసిన ప్రపంచంలోంచీ పాత్రల్ని, సంఘటనలనీ ఎన్నుకుంటాడు.  అలాకాకుండా తనకి తెలియని ప్రపంచంలోంచి పాత్రల్నీ, సంఘటనలనీ ఎన్నుకుంటే రచయిత న్యాయం చేయలేక పూర్తి లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

అస్తిత్వ కథల దగ్గరకి వచ్చే టప్పటికి ఓ వింత పరిస్థితి ఎదుర్కొన్నాం. పాత్రలూ, సంఘటనలూ చెప్పటమే లక్ష్యంగా మారింది.   కోఠీ దాటి ఒక్క కిలోమీటర్ లోపలికి వెళితే పాతబస్తీ జీవితాలెలా ఉంటాయో చాలా మందికి తెలీదు.   అనేక ఊహాగానాలు.  ఊరి చివర ఉండే గూడేల్లో ఉండే మనుషుల జీవన సరళి గురించి ఆ ఊరిలోనే పుట్టి, పెరిగి, జీవనం వెళ్ళ మార్చిన ఆసాములకు తెలీదు.  వంట గదుల్లో, మడుల్లో పొగజూరిపోయిన అగ్ర వర్ణ స్త్రీల మనోగతాల గురించి చాలాకాలం దాకా బయటికి తెలిసిందికాదు.   ఈ మనుషుల కథ చెప్పాలన్నప్పుడు, ఆ మనుషులే పాత్రలు.   వాళ్ళ రోజువారీ జీవిత చక్రం లోంచే సంఘటనలు ఏరుకోవాలి.

శిల్పంలో భాగమవ్వాల్సిన పాత్రలూ, సంఘటనలూ వస్తువులో, లక్ష్యంలో భాగమయ్యారు.  ఇదో ప్రధానంగా గుర్తించాల్సిన విషయం.   ఇదో చారిత్రక అవసరం కూడా.

ఉదాహరణకి జాజుల గౌరి రాసిన నీళ్ళబాయి కథ అస్తిత్వ సాహిత్యం అందించిన గొప్ప కథలకి ఓ మచ్చు తునక.   దాదాపు సొంత కథలాగా సాగే కథ, కథనం ఇందులో కనిపిస్తుంది.   ఇంతకుముందు తెలియని చదువు సంధ్యలు లేని కుటుంబాల్లోని ఓ చిన్న అమ్మాయి ఎంత నిరాడంబరంగా ప్రారంభించి, చదువుకున్న మొదటితరం వైపు పయనించిందో ఈ చిన్న కథ చెప్తుంది.  నాస్టాల్జిక్ గా కనపడుతూ, ఆ కుటుంబాల్లో ఉండే ఆత్మీయత, ఆపేక్షలు, ఆ పిల్లల్లో ఉండే తెంపరితనం, అతి సహజమయిన భాష కలగలిపి అదో అక్షరాలతో వేసిన ఓ చక్కటి తైలవర్ణ చిత్రంలా తోస్తుంది.    ఈ కథ చెప్పడానికి వేరే పాత్రలూ, సంఘటనలూ, స్థలమూ, కాలమూ ఊహించలేం.  ఎందుకంటే, ఈ కథ లక్ష్యమే ఇవి!

ఓ కథని అర్థం చేసుకునే టప్పుడు ఈ వ్యత్యాసాన్ని చూడలేనప్పుడే వింత వింత సందేహాలూ వాదాలూ వస్తాయి.  ఉదాహరణకి  “చలం ఒక్క బ్రాహ్మణ  స్త్రీల గురించే రాశాడు మేమెందుకు మోయాలీ”  లాంటి వాదాలు.  చలాన్ని బ్రాహ్మణ స్త్రీల  అస్తిత్వ రచయితగా చూడ్డం చలానికి అన్యాయం చెయ్యడమే అవుతుంది.  చలం తన చుట్టూ ఉన్న, తనకి తెలిసిన పాత్రల్ని ఎన్నుకున్నా, వాటి అస్తిత్వ ప్రకటన మాత్రమే తన లక్ష్యం గా చూడలేం.    కథ లక్ష్యం అస్తిత్వ ప్రకటనా లేక మరేదన్నా ఉందా అనే ప్రశ్నకి మొదట సమాధానం చెప్పకుండా చేసే సాహిత్య విమర్శల్లో   ఈ తికమక (కన్ఫ్యూజన్) ప్రస్ఫుటంగా కనపడుతుంది.

అస్తిత్వ సాహిత్యం ద్వారా చాలా మంచి కథలే వచ్చాయి.  అయితే ఈ క్రమంలో ఏ సృజనాత్మకత లేని పేలవమయిన కథలూ వచ్చాయి.  ఓ మనిషి దినచర్య రాసేసి అస్తిత్వ కథ అనేసే కథకులు కొందరు. ఫలానా సమూహం పట్ల రాజకీయంగా, సామాజికంగా సానుభూతి ఎక్కువవుంది కాబట్టి నేను కూడా ఓ కథ రాసి పడేస్తే పోలా అని రాసే కథకులు కొందరు.  పోనీ వీళ్ళు ఆ సమూహాల గురించి నిజంగా తెలుసుకుని లోపలినించి (ఇన్సైడర్ గా) రాసినా కాస్త బాగుంటుంది.  వీటిని కథలు అనకూడదూ అని చెప్పలేని దుర్బల సంపాదకులూ, విమర్శకులూ ఈ పరిస్థితిని జటిలం చేసి చివరికి అస్తిత్వ కథల పట్ల గౌరవం పోయేలా చేశారు.  ఏ సమూహాల పట్ల గౌరవం ఏర్పడాలని ప్రధాన లక్ష్యంగా ఈ అస్తిత్వ సాహిత్యం ప్రారంభ మయిందో, ఈ రచయితలూ పేలవమయిన కథలతో దానికి పూర్తి విరుద్ధమయిన ప్రయోజనాన్ని సాధించడం బాధించే విషయం.

అస్తిత్వ కథ అవునా కాదా, అందులో ఉండే పాత్రల కుల మతాల మాటా ముందుగా చూట్టం మానేసి, కథ యొక్క ముఖ్య లక్ష్యమూ, లక్షణమూ ఏమిటనే ఆలోచనతో కథా విమర్శలు రావాలని కోరటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

*

అక్కిరాజు భట్టిప్రోలు

3 comments

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వ్యాసం నిండా అచ్చు తప్పులు కోకొల్లలు. “అస్తిత్వ కథ” అంటూ రాస్తూ “ఆస్థికుడు” “నాస్థికుడు” అన్న పదాలేమిటీ? సంస్కృతంలో “అస్తి” అంటే “ఉండు” అన్న అర్థం, “అస్థి” అంటే ఎముక (bone).

    స్వస్తి అంటే సు + అస్తి = “మంచి ఉండుగాక!”
    “ఆస్తికుడు” అంటే ఉన్నాడు అని నమ్మేవాడు.
    “నాస్తికుడు” అంటే ఉన్నాడు అని నమ్మని వాడు.

    “జాజుల గొరి” ఎవరు? మహ్మద్ గోరి చుట్టమా? “వ్రర్ణ స్త్రీలు” ఎవరు? “శ్రీ,శ్రీ” ఎవరు? “శ్రీ&శ్రీ” అని ఒక కవుల జంట ఉన్నట్టుగా, “శ్రీ,శ్రీ” అన్న పేరుతో జంటకవులు ఉన్నారా? యాదృచ్చికం ఏమిటీ? వస్థువు అంటే ఏమిటీ?

    ఈ రచన చూసిన మొదటిరోజు నాడే ఇన్ని అచ్చు తప్పులతో ఉన్న ఈ వ్యాసాన్ని చదవలేక వెంటనే 20కి పైగా అచ్చు తప్పులు ఎత్తిచూపిస్తూ, వాటి సవరణలను రచయితకు ఆ రోజు రాత్రే పంపించాను. ఇప్పటికి 15 రోజులైనా ఇంతవరకూ ఒక్క అచ్చుతప్పు కూడా సవరించలేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు