అందాల సీతాకోక వ్యధ!

ఒక సౌందర్యాత్మకమైన పాపతో కలయిక చివరికి అవమానంగా పరిణమించినా చొరబాటుతో యెవర్నీ నిందించదు. కథంతా అందమైన మెలోడ్రామా. కాకపోతే విషాదాంతం.

స్తుశిల్పాల సమన్వయం కథను మంచికథగా మార్చుతుంది. కథా ప్రయోజనం ఆశించేవారు, చెప్పిన విషయం మీద పాఠకులు దృష్టి పెట్టేలా చేసేదే మంచి కథంటారు. కథల్లో కవిత్వ వచనాన్ని ఆశించేవారు, అందమైన పొందికైన పదాలతో ప్రతీకలతో కథా వాతావరణాన్ని సుసంపన్నం చేసే రచయిత తను చెప్పదలచిన విషయాన్ని పాఠకులకు సులభంగా చేరవేస్తాడని భావిస్తారు.

ఏ కథైనా కథ కాగలిగేది శిల్పంతో నే కదా. ఏ శిల్పమైనా పొందికగా తూగేది economy of words and thought తోనే కదా! ఏ కథైనా కాలాన్ని, అందులోనూ కల్లోల కాలాన్ని పట్టుకోగలిగినప్పుడే పది కాలాల పాటు నిలబడుతుంది. అనాది కాలంగా భారతీయ సమాజంలో వేళ్లూనుకున్న కులం యిప్పటి కాలాన్నీ కల్లోలపరుస్తున్నది. ఆ కాలమరకలనూ, ఆ చిచ్చు పెడుతున్న అనుభవాన్నీ పట్టుకున్న కథ  వినోదిని

.

ఒక నిష్ఠుర సత్యం. ఆ సత్యాన్ని ఆవిష్కరించడానికి పసి పాపను తీసుకోవడం మనం కాస్తా నిష్టూరం చేయదగ్గదే అయినా, ఇన్ని వేల సంవత్సరాలుగా కులసమస్య యెందుకు, యెలా యీ దేశంలో పచ్చగా పరిఢవిల్లుతూందో, ఆలోచిస్తే మొక్క దశ నుండే భావజాల జలం అందించబడుతోందనీ , దానికి కుటుంబమే కార్యశాలనీ మనం గుర్తించాల్సి వుంటుంది. అందువల్లే రచయిత్రి తన కథకు కేంద్ర బిందువు గా ఎనిమిదేళ్ల పాపను తీసుకుంది. కుల సమస్య ఎంత సున్నితపు మూలాల్లో సైతం ఎలా తన దుర్మార్గాన్ని ప్రదర్శిస్తుందో చూడమని మనల్ని వొప్పిస్తుంది.

రచయిత్రి చాలా వొడుపుగా మనల్ని కథలోకి తీసుకొని పోతుంది. ఆద్యంతమూ అందమైన కవితా వాక్యాలతో వొడిసి పట్టుకొని తన అనుభవాన్ని పంచుకుంటుంది. ఒక సౌందర్యాత్మకమైన పాపతో కలయిక చివరికి అవమానంగా పరిణమించినా చొరబాటుతో యెవర్నీ నిందించదు. కథంతా అందమైన మెలోడ్రామా. కాకపోతే విషాదాంతం.

ఒక సెలవు దినం వుదయం పదకొండు గంటల తర్వాత కథ ప్రారంభమయి, రాత్రి ఎనిమిది గంటల లోపు ముగుస్తుంది. ఒక నగరపు అపార్ట్ మెంట్ ప్లాట్లో వుంటున్న మధ్యతరగతి మహిళ వద్దకు ఎనిమిదేళ్ల ఆరింది పిల్ల చేరి, తాను నేర్చిన మాటలతో,చేష్టలతో ఆమె హృదయంలోకి దారిచేసుకొని తియ్యటి అనుభూతి కలిగిస్తున్న క్షణాన , ఆ పాపలోకి చేరివున్న కులతారతమ్యత ఆమె నుండి పాపను లాగిపారవేస్తుంది. ఆమె గుండెల మీద భూతద్దం నుండి కేంద్రీకరించిన సూర్య రశ్మి కాల్చిన అనుభవం మిగులుతుంది.

ఆమె చదువుకున్న, పిల్లల పట్ల ప్రేమ కల్గిన దళిత స్త్రీ. హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పాప మనసులో యితర శూద్ర కులాల పట్ల కొంత అనుకూలత వుంది గానీ, ‘హరిజన్స్’ పట్ల లేదు. ఎవరింట్లో అన్నం తినవచ్చో ఎవరింట్లో తినకూడదో ఇంటిబడి నేర్పుతుంది. కథలో పాపే చెప్పినట్టు, గుర్తు పెట్టుకోదగిన అనుభవాలని డైరీలో రాసుకునే అలవాటుంది తనకు. మంచి పనులు అనుకుంటే, బ్లూయింకు తోనూ, చెడ్డపనులైతే బ్లాక్ ఇంక్ తోనూ రాసుకుంటుంది. బురదలో పొర్లిన పందిపిల్లను బైక్ చెక్రాల కింద పడకుండా కాపాడిన పనిని బ్లూయింక్ లో రాసుకోగల్గిన పాప, మహిత అనే (హరిజన) క్లాస్ మేట్ యింట్లో పొరబాటున టిఫిన్ తిన్న అనుభవాన్ని బ్లాక్ యింక్ లో రాసుకున్నానని చెబుతుంది. అలాంటి దుర్విచక్షణను యెవరు నేర్పుతారో మనకు తెలిసిందే. పసిపాపైనా వ్యవస్థ చేతిలో పనిముట్టేనని యీ కథ చెబుతుంది.

ఈ కథా నిర్మాణంలో పొయిటిక్ జస్టీస్ యిమిడివుంది. పాపను పరిచయం చేయడమే, ‘సీతాకోక రెక్కల్తో నేసిన ఫ్రాకేసుకున్న పువ్వులా- పాప, అని పరిచయం చేస్తుంది, కథకురాలు. పాప పాదాల గురించి, ‘పూరేకుల పాదాలకు చుట్టిన పట్టీలు కూడా మెత్తగా మోగుతున్నాయి.’ అంటుంది. పాప మాట్లాడితే, ‘నోటిపూలగంప లోంచీ ఓ నవ్వు పువ్వు తుల్లి పడింది ‘ అనుకుంటుంది. పాప మంచి నీరడిగితే, కూచొన్నచోటుకి దూరంగా, వున్న, కుండలో నీళ్ళు అడిగితే, ‘నాకూ కుండీకీ మధ్యా మైలుదూరముండి, ఆ మధ్యలో గులకరాళ్లుండి, నాకు చెప్పుల్లేకున్నా సరే- వెళ్లి నీళ్ళు తెచ్చుండేదాన్ని’ అనుకుంటుంది. ఆమె పగటిలోకి నడిచొచ్చిన పాపను అంతిష్టపడుతుంది . పాప, ‘ఆంటీ మీతో కాసేపు వుండొచ్చా ‘ అనడిగితే , ‘వూర్లో ,మా తాటాకు బాత్రూం దడిమీద అల్లుకున్న బీరతీగ- సాయంకాలం పూసిన పసుపుపచ్చని సోయగాల బీరపూవు – నడిచొచ్చి నా కాంక్రీటు కుటీరంలో తన పుప్పొడి చినుకుల నువ్వులతో నాతో గడుపుతానంటే వద్దనడం కూడానా’ అనుకుంటుంది.

రచయిత్రి ది, యెంతటి కథనచాతుర్యమంటే , ఆ దళిత మహిళ నేపథ్యాన్ని నేరుగా చెప్పడం కాకుండా యిలా పాపను గురించి హృద్యంగా చెప్పడంలోనే ఆమె యెవరో కూడా చెప్తూ పోతుంది. పాప ఆ మధ్యాహ్నం తన యింటిలో కలియదిరుగుతుంటే , ‘ చిన్నప్పుడు మా యింటి తాటాకు కప్పులోంచీ దూరొచ్చిన కాంతి కిరణం మట్టినేలమీద వెలుగు సున్నాలా పడి, కొంచెం కొంచెం జరుక్కుంటూ వెళ్లినట్లు యీ పాప తన వెలుగు పాదాలతో యిల్లంతా నా మనసంతా నులివెచ్చని వెలుతురు పూలు పూయిస్తోంది’అనడంలో పాపమీది యిష్టం , ఆమె నేపథ్యం రెండూ తెలుస్తాయి.

ఆమె పరవశానికి యెప్పుడు అఘాతం తగుల్తుందంటే , అన్నం కంచం చేతికి తీసుకున్నప్పుడు. పాపకు యిష్టమైనవన్నీ చేసి, వడ్డించి చేతికిచ్చి , తనకిష్టమైన చికెన్ ముక్కలూ కొరివి కారం కంచంలోకి వేసుకున్నప్పుడు , పాప అడిగే ప్రశ్న , ‘అదేంటాంటీ మీరు నాన్ వెజ్ తింటారా, మీరు బ్రామ్మిన్స్ కారా. ‘ ఆ తర్వాత పాప ఆమె వైపు యెలా చూస్తుందంటే , ‘లుక లుకమని కదులుతున్న పురుగుల్ని చూస్తున్నంత అసహ్యం ఆ పిల్ల కళ్లళ్లో కన్పిస్తుంది. ఆమె పరిస్థితి యెలా వుంటుందంటే, ఆకాశం అంచుల వరకూ ఎగిరిన రంగు రంగుల గాలిపటం పుటుక్కున తెగినట్లు. అన్నాన్ని నిరాకరించిన ఆరింది పాప,’ నానమ్మ పిలుస్తున్నట్లుంది’ అని బొంకి వెళ్లిపోయినప్పుడు ఆమె స్థితి , ‘ ఇందాకటి వెలుగు సున్నా భూతద్దంలోంచీ ఆమె గుండెల మీద నిలబడిపోయింది.’ భూతద్దంలో నుంచీ బయటికొచ్చే సూర్య రశ్మి పడిన ప్రదేశాన్ని కాలుస్తుంది. ఆమె అంతరంగం అవమానాగ్నితో దహింపబడుతుంది.

కథ ప్రారంభ వాక్యం , ‘సెల్లారంతా పిల్లలతో విరగబూసిన పూలతోటలా వుంది.’ ఆ పూలతోటలో నుండి ఓ పువ్వు లాంటి సీతాకోక చిలుక ఆమె యింటిలోనికొచ్చి కాసేపు గడిపి అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోయాక ,’ గది నిండా పేరుకుపోయిన సీతాకోకచిలుక లు బొచ్చు పురుగులై  నా మీదకు పాక్కుంటూ వస్తున్నా’యని ముగుస్తుంది కథ. అందమైన సీతాకోకచిలుక ను బొచ్చు పురుగులా మార్చుతున్నది యెవరు? పసిపిల్లల్లోకి కుల తారతమ్య విషం యెక్కిస్తున్నదెవరు ? అది యీ దేశానికి దాపురించిన వ్యవస్థాగత శాపం! నిష్టురమైన ప్రశ్నలతో పాటు మంచి కథా పఠనత్వం వున్న కథ బ్లాక్ ఇంక్.

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

15 comments

Leave a Reply to Aranya KriAranya Krishnashna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “బ్లాక్ ఇంక్” సాధారణమైన కథ కాదు. కంటెంట్ పరంగా గురి చూసి వదిలిన బాణంలాంటిది. క్రాఫ్ట్ పరంగా హృదయాన్ని ఎక్కడ మైమరిపించాలో అక్కడ మైమరిపించి, ఎక్కడ పిండాలో అక్కడ పిండిన కథ. చదివిన పాఠకుల్లో చాలామందిని డీకేస్టిఫై చేయగల సత్తా వున్న కథ. మీరు కూడా బాగా పరిచయం చేసారు. అభినందనలు.

  • కుల వ్యవస్థ దుర్మార్గాన్ని, అది పసిపిల్లల మెదళ్లను ఎలా విషపూరితం చేస్తుందో చూపుతూనే… కథాసౌందర్యాన్ని చిత్రించిన కథ బ్లాక్ ఇంక్.

    ఒక మౌచి కథను సునిశితంగా విమర్శించారు వెంకటకృష్ణ సార్.

  • కథను ఇంత అందంగా, గొప్పగా రాయగలినవాళ్లు ఈ కాలంలో కూడా వున్నట్టు తెలుసుకుని, నా మనసు చెప్పరానంత ఆనందంతో పొంగిపోయింది. ఇంత మంచి కథను చదివి కూడా స్పందించకపోతే, అంతకు మించిన పాపముంటుందా?

    ఇతివృత్తం, శిల్పం – ఈ రెండింటి మధ్య చక్కని సమన్వయం సంగతి సరే. అట్లాంటి విశేషం ఉన్న కథలెన్నిటినో చదువుతాం. కాని, అవన్నీ మనసును ఇట్లా ఇంత గట్టిగా హత్తుకోవు. ఇదే కథాంశాన్ని, కథాకథనాన్ని ఇదివరకే కథకులుగా ప్రతిష్ఠితులైన వారికి వివరణలతో విశదపరచినా, ఎవరో ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లు ఇంత బాగా రాయలేరు ఈ కథను. అంటే ఏమిటి? ఈ కథారచయిత్రిలో అంత గొప్ప craftsmanship ఉందన్నమాట. ఎంత అద్భుతమైన కవితాత్మక వాక్యాలను పొందుపరచారు వినోదిని గారు, ఈ కథలో! చివర్న వచ్చిన sudden turnaround కూడా సహజంగా వుండి, కథకు శోభనిచ్చింది. Madam ! Really hats off to you . పరిచయం చేసిన వెంకటకృష్ణ గారూ! మీకు కూడా నా కృతజ్ఞతలు.

  • కులవ్యవస్థకి విరుగుడుగా వేక్సిన్ లాంటి కథయిది. ఒకసారి చదివితే వస్తువు పాటకుల మనసులో ఇంకిపోయేలా చేయగల కథ. బహుశా ఇంటర్ స్థాయిలో విద్యార్థులకి వ్యవస్థ గురించిన అవగాహనకోసం పాఠంగా వుండవలసిన కథ.

    కథలోని అవసరమైన భాగాలన్నింటిపై చక్కటి ఫోకస్ వ్యక్తం చేసిన వెంకటకృష్ణ సమీక్ష బాగుంది. వర్తమానత గల పదేళ్ల లోపలి కథలను అలవాటుగా సమీక్షించుకోవలసిన తీరు అవసరం వుంది మనకి. అలాంటి కథలని విద్యారంగంలోకి కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం వుంది.

    కొత్త విలువల ఆవిష్కరించిన, పాత విలువలు తృణీకరించిన, రెంటిమధ్యన సంఘర్షణలు నెరిపిన కథలకి ఇలాంటి పునశ్చరణ అవసరం.

  • చాలా మంచి వ్యాసం. కానీ వ్యాస శీర్షిక తగింది కాదు. అందాల సీతాకోక వ్యధ – శీర్షిక అసంబద్ధంగా వుంది. ఇక, మిగతా వ్యాసమంతా బాగుంది. ఒక పాఠకుడిగా కథను అనుభవించిన తీరు నాకు నచ్చింది. వినోదిని కథలను విమర్శనాత్మకంగా లేదా విమర్శరహితంగా పఠించిన చాలా మంది ఎలా రాయాలో తెల్వక, ఎంత రాసినా సంపూర్ణంగా మిగిలిపోతుందనే నిస్సహాయత ఆవహిస్తుంది. వెంకట కృష్ణ ఆ స్థితిని అనుభవించారని అనిపిస్తుంది. ఆ స్థితి ని దాటే ప్రయత్నం చేశారు. అభినందనలు.

  • అద్భుతమైన కథ బ్లాంక్ ఇంక్.
    కులవివక్ష గురించి ఎంత సున్నితంగా , ఎంత కవితాత్మకంగా చెప్పారు..కథ అల్లిక కూడా అంతే బిగువుగా ాాాాచక్క గా
    చిక్కగా..అద్భుతంగా..ఈ వస్తువును ఇంత బాగా హృదయాల్లోకి చొచ్చుకుపోయేలా ఇంతబాగా చెప్పొచ్చా అనిపించింది. అది ఒక్క వినోదిని గారికే సాధ్యం.
    వెంకటకృష్ణ గారు చేసిన పరిచయం కూడా అంతే బాగుంది.
    పురిటి మొగ్గల చుట్టిన కులం, కుల వైషమ్యపు బొంతపురుగు
    ఆ మొగ్గల సహజ పరిమళాలు దోచేస్తున్నప్పుడు ఈ సమాజం ఇంతకు భిన్నంగా ఎలా కనిపిస్తుంది?

  • బ్లాక్ ఇంక్ కథలు వస్తు , శిల్ప సమన్వయంగా మలిచిన కథలు. కథలు కావివి, జీవితాలు. అనుభవాలు.

    బ్లాక్ ఇంక్ కథలు చదివినప్పుడు వొక్కో వాక్యం చాలాసేపు కదలనీయకుండా ఆపేసాయి. కదలలేదు. మళ్లీ మళ్లీ చదవమన్నాయి.

    జీవితవాస్తవాలు వాస్తవానుభవాలతో కథలుగా మారటం చూశాం గాని బ్లాక్ ఇంక్ కథలు ఇంకా ఇంకా లోతట్టు ప్రాంతాలకు పోయి గాఢమైన స్థితిలోకి తీసుకువెళ్తాయి.

    అన్నా! కథ వస్తువు , శిల్పాలను గురించి గొప్ప ప్రేమతో రాశారు.

    సాల్యూట్..

    – బాలసుధాకర్

    • నిత్య రాసిన ‘చాయ్ గ్లాస్’ , ఎండ్లూరి మానస రాసిన ‘బొట్టు కుక్క’ –

      వస్తువు, శిల్పం బట్టి నాకు బ్లాక్ ఇంక్ తీరుగా నచ్చాయి. వస్తువు ఎంతో, కథలో పరిపక్వత అంతే వున్న కథలివి.

  • మనసు కొంకర్లు పోయే …పూలకాడతో చెంప మీద కొట్టినట్టుండిన కథ… రచయిత్రి వినోదిని మీద అలవికాని అడ్మిరేషన్ కలిగించిన కథ… It’s a true combination of content and style.. వెంకటక్రిష్ణ అన్న పరిచయం బాగుంది..

  • ఈ కథను ఆంధ్రజ్యోతిలో చదివాక కొద్దిరోజులపాటు మనసుపడ్డకలవరాన్ని మరోసారి అనుభవంలోకి తేచ్చారు. ఆరోజు నుండి ఆ కలవరానికి కారణమయిన కథను విశ్లేషించుకునే ధైర్యం చేయలేదు. ఆ వెలుగు సున్నా కాల్చేస్తూనే ఉంది. సత్యమే సౌందర్యం అంటారు. వినోదిని నేర్పుగా నివురు ఊది నిప్పును చూపారు. ఇది ఒక బీభత్స సౌందర్యం . దీన్ని విశ్లేషించేందుకు ధైర్యం కావాలి. గాయపడినా ముందుకెళ్లే గుండె నిబ్బరం కావాలి. మీరాపని అత్యంత నిబ్బరంగా చేశారు. వందనాలు.

  • కథ వచనకవితలా లేతరంగుల్లో సాగింది. ఈ కథలో వున్న పాపాయి నిజం కాకూడదని నిజ్జంగా కోరుకుంటున్నాను.

  • కథ గురించి చాలా మంచి పరామర్శ సర్.. thank you.

  • కథ ఎంత ఒడుపుగా నడిపారంటే ఓ చిన్నారి అమాయకత్వం తెలుపుతూనే తన చిన్ని మనసును కలుషితం చేసిన తీరును సున్నితంగా చెప్పారు..ఓ మెత్తని గుణపాఠం లాంటిదే ఈ కథ..

  • మంచి కథకి మంచి పరిచయం. వినోదిని కథలు సుఖనిద్రలో వున్నవాళ్ళనీ నటిస్తున్న వాళ్ళనీ చెళ్ళున చరిచి లేపుతాయి. రచయిత వినోదినికీ సమీక్షకుడు వెంకటకృష్ణకీ అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు