రహస్యం వీడిపోయాక… 

అక్షరానికున్న శక్తి అనుభవపూర్వకంగా తెలుస్తున్న కొద్దీ రాయాలన్న తపన పెరుగుతోంది. కవిత్వం చదివేటపుడూ, ఒక విషయాన్ని కవితాత్మకంగా అనుభూతి చెందినపుడూ అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నాను. దానికోసమే రాయాలనుకుంటున్నాను.

1

వొట్టి వెలుతుర్ని

ఇంద్రధనసుగా మార్చిన నీటిబుడగ

‘టప్’మంటూ పగిలిపోయింది

 

2

వణుకుతున్న చేతుల్ని చెంతకు లాక్కొని

యింత వెచ్చదనాన్నిచ్చిన చలిమంట

బూడిదలోకానికి తరలిపోయింది

 

3

మండుటెండకు పాదాలు అంటుకుపోయినపుడు

కాసిని ఆకుల నీడలు రాల్చిన చెట్టు

ఉన్నచోటునే నిలువునా చీలిపోయింది

 

4

నదిని మోసీమోసీ అలసిపోయిందేమో

పడవ

రాత్రికిరాత్రి తల్లకిందులైంది

 

5

ఎప్పటికప్పుడు ఖాళీలను పూరించిన

ఒక రహస్యం

అనివార్యంగా వీడిపోయింది

 

యిప్పుడిక

ప్రాణమేమవుతుందో!

 

తోడు

 

పుట్టే చుక్కలు పుట్టాయి

రాలే చుక్కలు రాలాయి

ఎక్కడో నక్కిన కీచురాయి

గుర్తున్న పాటలన్నీ గొంతరిగేలా పాడేసింది

 

తలుపులింకా తెరవబడే ఉన్నాయి

 

పొద్దున

కొండవాలుపై జారిపోతున్న చూపును

ఎగరేసుకుపోయిన

లేత ప్రేమరంగు రెక్కలున్న పిట్ట మాత్రం

తలపుల భుజాలపై వాలి

కూ..కూ.. అంటోంది.

*

నా గురించి:

ఆనందమొచ్చినా దుఃఖమొచ్చినా పాట పాడుకోవడమే తెలుసు చిన్నప్పట్నుంచి. పాట ద్వారా పరిచయమైన తెలుగుభాషలోని మాధుర్యం నన్ను సాహిత్యంవైపు నడిపించింది. అదికూడా కాలేజీ చదువు అయ్యాకనే. శ్రీశ్రీ నన్ను పట్టి ఊపేశాడు. చలం నా ఆలోచనను మార్చాడు. బుచ్చిబాబు నా లోపలికి తొంగిచూసుకోవడం నేర్పాడు.

గత మూణ్ణాలుగేళ్లుగా చిన్నచిన్నగా కవితలు రాస్తున్నాను. అక్షరానికున్న శక్తి అనుభవపూర్వకంగా తెలుస్తున్న కొద్దీ రాయాలన్న తపన పెరుగుతోంది. కవిత్వం చదివేటపుడూ, ఒక విషయాన్ని కవితాత్మకంగా అనుభూతి చెందినపుడూ అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నాను. దానికోసమే రాయాలనుకుంటున్నాను.

పెయింటింగ్: సత్యా సూఫీ

నవీన్ కుమార్

నవీన్ కుమార్

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)