ఇది ఎన్ని రెట్ల మోసం?

అదేదో సినిమాలో అసలు బట్టల్లేకపోవడం కళ అయితే ఒక నటి అర్ధనగ్న  నిరసన ఆమోదయోగ్యం ఎందుకు  కాదు అనే కదా,   అబ్బో అది కూడా ఓ సమస్యేనా ? అందుకే కదా ఆ సినిమాకి సకల జన ఆమోద ముద్ర లాంటి  “దేవుడు , శృంగారం , సత్యం”  అనే పేరు పెట్టింది.

వరి జుట్టు వాళ్ళు పీక్కుని, ఎవరి ముక్కు చీదుకుని, ఎవరి బట్టలు వాళ్ళు  చి౦పుకోవడం లేదా విప్పుకోవడం నేరం తెలుసా ? ఆ పనిచెయ్యడానికి ఎంతమందిలేరు? దేశం గొడ్డుపోయిందా ఏమిటి ?

చిత్రసీమలో అయితే  దర్శక నిర్మాతలున్నారు, సహ నటులున్నారు, ఏజెంట్లు, మేనేజర్లు , లైట్ బాయ్స్ ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు బామ్మరుదులు అనేక మ౦ది వున్నారు. తెరవెనకా ముందూ కూడా కళాత్మకంగా ఈ జుట్టు పీకడం , బట్టలు విప్పడం, అనే పన్లు చేస్తారు.  పురాణాల్లో అయితే గుడ్డిమారాజులు కొలువున్న  కౌరవ సభలున్నాయి. సామ౦త రాజ్యాల అంతపురాలన్నిటి మీదా పడి  కొల్లగొట్టుకునే సదుపాయం వు౦టుంది . మరి ఇప్పటి మంత్రుల కాలంలో అయితే అసెంబ్లీతో మొదలుకొని , బడి, గుడి , కళాశాల, పని ప్రదేశం లాంటి ఎరీనాలు బోలెడున్నాయి . ఇంకా పబ్లిక్ ప్రవేట్ ట్రాన్స్ పోర్ట్  వాహనాలున్నాయి. ఎంత బాగా జుట్టు పట్టుకుని లాగాలో, బట్టలు ఊడదీయ్యాలో చెప్పడానికి ఉత్ప్రేరక వీడియోలు కుప్పతెప్పలుగా వున్నాయి.

అత్యాచారం పురుష ధ్యేయమై , పాతివ్రత్యం స్త్రీల కర్తవ్యమైపోయినచోట ఇంత బలగం వుండి కూడా ఎవరి జుట్టు వాళ్ళే పీక్కుని, ఎవరి  బట్ట వాళ్ళే విప్పుకోవడం తగదు కదా. శ్రీరెడ్డి అటువంటి పనికి తెగబడ్డది . తెగబడినా సరే వూరుకోవచ్చు ఇటువంటి నిరసనలు సామూహికంగానే అనేకం జరిగాయి కదా , ఎవరి ముల్లె  పోయిందని ? ఇప్పుడిక్కడ సినిమాల్లో హీరోలందరూ బయట ప్రేక్షకులే కదా. హాయిగా  అలా అలవోగ్గా ఎవరి పని వాళ్ళు చేసుకునేందుకు వీల్లేకుండా మధ్యలో మహిళా  సంఘాలు , మీడియాలు, మానవహక్కులు ఏమిటి ? ఏమంటారు వీళ్ళు ?

అదేదో సినిమాలో అసలు బట్టల్లేకపోవడం కళ అయితే ఒక నటి అర్ధనగ్న  నిరసన ఆమోదయోగ్యం ఎందుకు  కాదు అనే కదా,   అబ్బో అది కూడా ఓ సమస్యేనా ? అందుకే కదా ఆ సినిమాకి సకల జన ఆమోద ముద్ర లాంటి  “దేవుడు , శృంగారం , సత్యం”  అనే పేరు పెట్టింది. దేవుడిమీద నమ్మకంలేనివాళ్లు దెయ్యం అని దిద్దుకోవచ్చు. దెయ్యాలు మాత్రం వున్నాయా ఏమిటి ? అనుకుంటే దర్శకుడు వున్నాడు కదా కాబట్టి దెయ్యం ఉరఫ్ దర్శకుడు అనుకోవచ్చు. శృంగారం, సత్యం లాంటి మాటల మాటున వున్నదేమిటి ? అంటే దానికీ  జవాబుంది .  అసలు  సత్యదర్శనం కోసమే కదా నటీమణికి దిశమొల మ౦జూరు చెయ్యడం జరిగి౦ది. చివరికి ఆమె దిశమొల కూడా ఆమెది కాదా  అది ఇంకోళ్ళ ఖాతా లో వుందా లేకపోతే  మంజూరు చెయ్యడమేమిటనే వాదన మీరు చేయతగదు. అది ఆమె స్వేచ్ఛకు కూడా నిదర్శనమని విజ్ణులు చెబుతున్నారు.

శృంగారమే కాదు హావభావాలు కూడా  కూడా ఏక పక్షమే.

ఉదాహరణకి శ్రీరెడ్డి బైటపెట్టిన లీక్స్ లో ఒక నిర్మాత కొడుకుతో దిగిన సెల్ఫీ నవ్వుతూ వుండటం వల్ల నిజ నిరూపణకు పనికి రానిదై పోయింది అది స్వయం కృతాపరాధమని తెచ్చేశారు . ఒకవేళ ఏడుస్తూ వుంటే కూడా స్పందనలో తేడా వు౦టుందని నేను అనుకొను. ఆమాటకొస్తే అందులో వున్న యువకుడు ఏడుస్తూ ఏమీ లేడు నవ్వుతూనే వున్నాడు కదా.

రుజువర్తన లేని  చోట రుజువులు చూపాలా ?

జూనియర్ ఆర్టిస్టుల మీద జరిగిన అత్యాచారాలకు రుజువులు ఏమిటి ? అనే మాట అడుగుతున్నారు.

“అసలెందుకు మీరు ఆ రొచ్చులో కి వెళ్లారు” అని రొచ్చు నిర్వాహకులు, రొచ్చు బాధ్యులు, రొచ్చు పుట్టు పూర్వోత్తరాల గురించి ఉపన్యాసాలిచ్చేవాళ్లు బలహీనుల్ని   బాధితుల్ని  అడుగుతున్నారు. నిజానికి బాధితులు బాధపడుతున్నది అత్యాచారాల గురించి కూడా కాదు . అలా “వాడుకుని” కూడా (ఈ మాట వాడ్డం నాకు చాలా అసహ్యం. ఎందుకంటే ఇది  సరుకుని గుర్తుచేస్తుంది.) వేషాలివ్వకుండా మోసగించడం గురించి మాట్లాడ్తున్నారు. అంటే డబుల్ ఎక్స్ ప్లాయిటేషన్ . ఇంత జరిగినా సరే  మన పవిత్ర రొచ్చు పరువు కాపాడాలి అంటు వాళ్ళ వ్యక్తీకరణ శక్తిని  ని అదుపు చేస్తున్నారు చూడ౦డి అది త్రిబుల్ ఎక్స్ ప్లాయిటేషన్ .

*

పెయింటింగ్: సత్య బిరుదరాజు 

 

 

కొండేపూడి నిర్మల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావుంది. ఇంకాస్త సూటిగా చితక్కొట్టొచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు