అదే కథ…చెప్తూ…చెప్తూ..!

కథలు చెప్పటం, విషయాలను కథలుగా చెప్పుకోవటం మానవుడి లక్షణం.ఇది చాలా పురాతనమైన విశిష్టమైన లక్షణం.

థ ఎంత పాతదో ఒక ప్రక్రియగా అంత కొత్తది.

పాతది ఎందుకూ అంటే కథ మూలాలు వెతకబోయిన వారందరూ మానవ సమాజ పరిణామ మూలాలలోకి వెళ్లటం దాదాపు అన్ని భాషలలోనూ జరిగింది.  కొందరు ‘జరిగింది’ చెప్పటం కథ అంటారు.  ‘జరిగిందానికి కారణాలు ఊహించి చెప్పటం’ కథ అనీ కొందరంటారు.  ‘ఒక జరిగిన దానిని బట్టి మరేదో జరగబోతోందని చెప్పటం’ కథ అనీవారున్నారు.  ఇవన్నీ ఇటీవలివారి ఆలోచనలు.  వాటిని కాస్త పక్కనపెట్టి చూసినా పిల్లలు కథలంటే చెవికోసుకోటం మనకి అనుభవమే.  అంటే కథలు చెప్పటం, చెప్పమనటం ఈనాడు కూడా మనచుట్టూ జరుగుతూనే ఉంది.

కథాతరంగాలు అనే కథాసంకలనానికి ముందుమాట రాస్తూ నేనిలా రాసాను,

“కథలు చెప్పటం, విషయాలను కథలుగా చెప్పుకోవటం మానవుడి లక్షణం.

ఇది చాలా పురాతనమైన విశిష్టమైన లక్షణం.

ఇది మానవ ప్రవృత్తిలో కీలకమైన అంశానికి బాహ్యరూపం.

ఆ కీలకాంశం ఏమిటీ- అంటే

నాకు వచ్చిన ఆపద మరొకరికి రాకూడదు.

నేను నేర్చిన మెలుకువ మరొకరికి ఉపయోగపడాలి.

నాకు కలిగిననొప్పి  మరొకరికి కలగరాదు.

నేను పొందిన ఆనందం మరొకరు పొందాలి.

ఈ కీలకమే, దీని బాహ్యరూపమే సైన్స్ కీ, తత్వ శాస్త్రాలకి, సాహిత్యానికి పునాది.

మాట నేర్వకముందే తాను ఎదుర్కొన్న జంతువుల గురించి కొండగుహలలో బొమ్మలు వేసాడు మనిషి.

భాష ఏర్పడకముందే ఆడాడు, పాడాడు మనిషి”

మాట నేర్వకముందే బొమ్మలలో చూపిన కథ, రాత నేర్వకముందే కథగా చెప్పటం అయింది.

మానవజాతిలో తొలి కథకుడు తనకి తెలియకుండానే ఒక పని చేసాడు.  గతాన్ని నమోదు చేయటం.  అంటే అతను కాలానికి ప్రాతినిధ్యం వహించాడన్నమాట. ఈయన తను చెపుతున్నదానిని మనసులో పునర్నిర్మించుకోవాలి.  దానిని గుర్తుంచుకొనేందుకు వీలుగా పద్దతులు తయారు చేసుకోవాలి.  పక్కనే కూర్చుని వింటుంటాడు శ్రోత.  కథ మొదలెట్టగానే అతనిలో కుతూహలం కలిగించాలి. చెపుతుంటే దానిలో నిమగ్నమైపోవాలి.  తాను అందులో మునిగిపోకుండా శ్రోత మునిగిపోయేందుకు ఎప్పటికపుడు మెలకువలు అలవరచుకోవాలి.  అరేబియన్ నైట్స్ కథలు గుర్తు చేసుకోండి.  శుకసప్తతి గుర్తు చేసుకోండి.  కథ చెప్పి ఉరిని వాయిదా వేయిస్తుందే వేయిన్నొక్కరాత్రుల కథకురాలు.  కథ చెప్పి పరపురుషుని కోసం వెళ్లటాన్ని వాయిదా వేయిస్తుంది ఒక చిలక శుకసప్తతిలో.  మా చిన్నపుడు కొండతాత అని మామామ్మ తమ్ముడుండేవాడు.  ఆయన కథ చెప్పటం మొదలుపెట్టి మధ్యలో ఆపి అందరిచేతా పనులు చేయించుకునేవాడు.  ఇలా ఈ కథ రంజుగా చెప్పటం అనేది చతుష్షష్టి కళలలో నేరుగా లేకపోయినా దీనినుంచే పుట్టిన కవిత్వం వేదాలు వంటివన్నీ కూడా అందులోకి చేరిపోయాయి.

ఈ కథలు ఒకచోటే పుట్టి ప్రపంచమంతా వ్యాపించాయా అనిపించేంత పోలికలు కనిపిస్తాయి.

ఉదాహరణకి పాతనిబంధనలోని మోజెస్ కి మహాభారతంలోని కథకి పోలిక.  రామాయణంలోని భార్యపహరణం వంటివి గ్రీకు కథలలోనూ కనిపిస్తాయి.  ఆప్రికన్ కథలలో కనిపిస్తాయి.  గ్రీకు దేవుడు క్రూనోస్ లాగే మన కంసుడు శిశువులని చంపుతాడు.  దేవుళ్లంటే చావులేని వాళ్లు.  సరే పెద్ద గాలివాన, వరద మనం ప్రళయం అనే పేరుతో గుర్తించేది అన్నిచోట్లా ఏదో రూపంలో తారసపడుతూనే ఉంటుంది.

ఇవి ఒకచోట పుట్టి మరోచోటుకి వ్యాపించి ఉంటాయన్న ఆలోచన ప్రాశ్చాత్య మేధావులది.  మానవ సమాజ పరిణామం ప్రపంచమంతా చిన్నిచిన్ని తేడాలతో ఒకేలా సాగిందన్నది చాలామంది అంగీకరిస్తున్న విషయం.  కనక కథ చెప్పుకోటం లేదా గతాన్ని గుర్తుంచుకోటం అనేది ఒకదానితో ఒకటి భౌగోళికంగా సంబంధంలేని ప్రాంతాలలో దేనికదిగానే పుట్టిఉండాలని నేను అనుకుంటాను.  నిప్పు వాడకం ఒకచోట ఆరంభమై వ్యాపించే అవకాశం కన్న అనేక చోట్ల విడివిడిగానే జరిగుండ వచ్చని నాకు అనిపిస్తుంది.

ఎందుకంటే-

అన్నిచోట్లా మనిషి ఎదుర్కొన్న పరిస్థితులు ఒకటే.  తనకి ముప్పు కలిగించే ప్రకృతి మార్పులు, రాత్రుళ్లు, పగళ్లు, వానలు, వరదలు, ఎండలు, చలులు, దాడిచేసే జంతువులు, కాటువేసే పాములు .. ఇవి కలిగించే భయాలు, వాటిని ప్రసన్నం చేసుకోవాలనిపించటం, అవే తొలి దైవాలు అంటే తన జీవితాన్ని శాసించే శక్తులు.  ఈ పరిస్థితులనుంచే తనకన్న శక్తివంతమైనవి తనకన్న ఎక్కువ తలలు, చేతులూ, కాళ్లూ కలిగింటాయనే ఊహ పుట్టటానికి అవకాశం ఉంది.  ఒక ప్రాంతపు ఊహ కొంతకాలానికి సుదూరాలకి వ్యాపించటానికి ఎంత అవకాశం ఉందో వివిధ ప్రాంతాలలో ఒకేరకమైన ఊహలు కలగటానికీ అంతే అవకాశం ఉంది.

కథ మూలాల గురించి మాటాడుకునేటపుడు ఈమాత్రం చెప్పుకోవాలి.  దీనిని మానవప్రవృత్తి అనే పదంతో గుర్తించితే మానవజాతి అంతటికీ వర్తించే సాధారణాంశం మనకి కొంత అందుతుంది.  తన జీవితాన్ని శాసించేవాటిని గురించి ఆలోచనా, భయం, ప్రసన్నం చేసుకోవాలనే ఊహా, వాటిని అధీనం చేసుకోవాలనే ఆకాంక్ష వెరసి ప్రకృతితో మానవుని పోరాటం అనే తాత్విక భావనకి దారితీసింది.  ఈ పోరాటంలో చేతుల వాడకం ఎంత ప్రధానమయిందో కారణాలు ఊహించి కథలు చెప్పుకునే లక్షణం కూడా అంతే ప్రధానమయింది.

ఈ చెప్పుకునే కథలు ఒకవిధమైన తూగు, లయ, కొన్ని పదేపదే వాడే పదాలతో ఒక విధమైన పాట లేదా పద్యం రూపంలో(verse) ఉండేదనే ఆలోచన దాదాపు అందరూ అంగీకరించే విషయం.  వచనం కన్న పద్యమూ లేదా పాట జ్ఞాపకముంచుకోటానికి వీలైన రూపం.

ఈరూపంలో ఉన్న పురాగాధలను, ఊహలను, ప్రార్ధనలను కంఠోపాఠం గానే గ్రంధస్తం చేసారు.  వేదాలలో ఉండే వీటినన్నింటినీ వ్యాసుడు ఒక క్రమంలో ఉంచినట్లు మన పూర్వగ్రంధాలు చెపుతాయి.  అంటే గ్రంధస్తం అవటం అనే ప్రక్రియ లిపి పుట్టక ముందే జరిగింది.  మనం వేదాలను శబ్దంతో సహా భద్రంగా ఉండేటట్లు ఉంచుకున్న విధానం చాలా విశిష్టమైనది.

లిపి దూరప్రాంతాలకు వర్తకం కోసం వెళ్లేవారి అవసరాల నుంచి పుట్టిందంటారు.  అక్షరమాల(alphabet) వ్యాప్తిలోకి వచ్చాక కంఠోపాఠం రూపంలో గ్రంధస్తమైన గాధలను లిఖితరూపంలోకి తీసుకువచ్చారు.

అలా మనకి లభించిన అతి పురాతనమైన లిఖిత గాధ గిల్గమెష్ కథ.  ఈ అవశేషం క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దులనాటిదని శాస్త్రజ్ఞులు చెపుతారు. ఈ కథ గురించి రాంభట్ల కృష్ణమూర్తి వేల్పుల కథలో ప్రస్తావించారు.

ఇప్పటికీ జనం నోటిద్వారా బ్రతికి, వ్యాపించి కాగితాల మీదనూ కంప్యూటర్ల మీదనూ  భద్రపరచబడిన కథలు అరేబియన్ వేయిన్నోక్క రాత్రుళ్లు, పంచతంత్రం, ఈసఫ్ కథలు, కాశీమజిలీలు, నిజమైన కాశీమజిలీలు, కథా సరిత్సాగరం, మదనకామరాజు కథలు, చార్ దర్వేష్ కథలు, మర్యాదరామన్న తెనాలిరామకృష్ణ, బీర్బల్ ఇలా ఎన్నెన్నో కథలు, కథామాలికలూ ఉన్నాయి.

లిపి వచ్చాక కథలు రాయటం వెంటనే జరిగిందా? లేదు.

చెప్పుకునే కథలను గ్రంధస్తం చేసుకోటానికే అవకాశం ఉంది.  ఇలా రాతలోకి వచ్చిన గాధలు ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లటం చెప్పేవాళ్ల కల్పనాచాతుర్యంతో, సమకాలీన సందర్భాల అవసరాలకోసం నూతన కల్పనలతో మార్పులూ చేర్పులూ కూర్చుకున్నాయి.  మన రామాయణ, భారతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతిహాసాలు(Epics) ఈ పరిణామంలోనే రూపొందాయి.  ఒకే మూలం నుంచి అనేక రూపాలూ వచ్చాయి. వివిధ మూలాలు కూర్చుకుని ఒకే రూపంగానూ ఏర్పడ్డాయి.  ఇదంతా మానవుని ఉమ్మడి సృష్టి.

ఇలా లక్ష సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆదిమ మానవుడు కథలు చెప్పుకోటం ఆరంభించాడు.  తన వాస్తవానుభవాలకు కారణాలను ఊహించి చెప్పుకునే లక్షణం మానవ ప్రవృత్తిలో ఒక ముఖ్యాంశం అయింది.  దాని నుంచే ఒక తరం మరో తరానికి తన స్మృతులనూ, శృతులనూ అందించుకుంది.  చిత్రం, మాట  రూపాలలో మనిషి కథలు చెప్పుకున్నాడు.  రాత రూపంలో భద్రపరుచుకున్నాడు. తర్వాత వాటినే రాతలోనూ విస్తరించుకున్నాడు.  ఈ క్రమమే మనం ఈరోజు గుర్తించుతున్న నాగరికతలకి  పునాది అయింది.

ఇంత పురాతనమైన కథ ప్రక్రియగా కొత్తది ఎలా అయింది? చెప్పటం-వినటం నుంచి రాయటం-చదువుకోటంగా ఎప్పుడు మారింది? ఈ రెండూ ఒకటే అని ఎలా అనగలం? పోలికలేంటి? తేడాలేంటి?

తర్వాత మాటాడుకుందాం.

*

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా నిశితమైన వివరణ. కానీ నాకు ఒక సందేహం. లిపి అనేది రాకముందే అంత భాషా జ్ఞానం ఎలాగ సాధ్యం? కష్టం కదా. నాకు అది అసాధ్యమేమో అనిపిస్తుంది.

    • భాషాజ్ఞానం అనటంలో మీ అభిప్రాయం నాకు అర్ధం కాలేదు. బహుశా విషయ పరిజ్ఞానం అన్నది మీ అభిప్రాయం కావచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలపాటు మౌఖికంగానే జరిగిందని శాస్త్రజ్ఞుల పరిశీలన. వర్తమానంలో కూడా లక్షలాదిమంది రాయలేరు. కాని వారికి చాలా విషయ పరిజ్ఞానం ఉంది.